Previous Page Next Page 
రారామాఇంటిదాకా పేజి 2


    
    వింటున్న వంశీకి గొంతులో ఎలక్కాయ ఇరుక్కుపోయినట్లు ఊపిరాడలేదు. నెలరోజులు ముహూర్తం కోసం ఎదురు చూడడమంటే కనపడే చందమామ చేతికి దొరక్కపోవడమే కానీ అంతకంటే చేసేదీ ఏమీలేదు గనుక అలాగేనన్నట్లు బలవంతం మీద తల ఊపాడు.
    
    అందుకే గత నాలుగురోజులుగా అలా మంచం మీద అటూ ఇటూ దొర్లుతున్నాడే తప్ప అవతలి వీధిలో వున్న మామగారి ఇంటికి కూడా వెళ్ళలేదు. భార్య అయిన ప్రేయసిని చూడను కూడా లేదు.
    
    అవును! వాళ్ళిద్దరూ లవర్స్ సంవత్సరం క్రితమే యూనివర్శిటీలో వాళ్ళ పరిచయం చాలా గమ్మత్తుగా జరిగింది.
    
    అప్పుడతను యూనివర్శిటీలో ఎం.ఏ సోషియాలజీ ఫైనలియర్ చదువుతున్నాడు. ఓ తెలుగు ప్రొఫెసర్ ప్రోత్సాహంతో కొందరు స్టూడెంట్స్ కలిసి 'లిటరరీ సర్కిల్' అనే సాహితీ సంస్థను ఏర్పాటు చేశారు. దానికి వంశీ కార్యదర్శి. వెంటనే 'చలం నవలల్లో స్త్రీ పాత్ర' అనే అంశం మీద ఓ ఆదివారం సాయంకాలం మీటింగ్ ఏర్పాటు చేశారు.
    
    యూనివర్శిటీ ఆర్ట్స్ బ్లాక్ ఆడిటోరియంలో నాలుగు గంటలకు మీటింగ్ జరుగుతుందనీ, అందరూ రావాలనీ కరపత్రాలు ముద్రించి యూనివర్శిటీ అంతా పంచారు. ఆదివారం రానే వచ్చింది.
    
    మూడు గంటలకే నిర్వాహకులంతా ఆడిటోరియంకు చేరుకున్నారు. ఉపన్యాసకులంతా ఒక్కొక్కరే రావడం మొదలుపెట్టారు, రానిది స్టూడెంట్సే మూడు ముప్పావయినా ఒక్క స్టూడెంట్స్ కూడా అటు చూసిన పాపాన పోలేదు. నిర్వాహకులకు చెమటలు పడుతున్నాయి. ఏం చేయాలో పాలు పోవడంలేదు.
    
    "వ్వాట్ హేపెండ్? ఒక్కరూ రారేమిటి? శ్రోతల్లేకుండా మీటింగ్ ఎలా నడవడం?" సంస్థ అధ్యక్షుడు శర్మ నెర్వస్ గా అడిగాడు.
    
    "స్టూడెంట్స్ లో చాలామంది అడవిరాముడు బెన్ ఫిట్ షోకి వెళ్లిపోయారని వార్త చెప్పేవాడికి వినేవాడెప్పుడూ లోకువే అన్న సామెతను ఇప్పుడయినా రివర్స్ చేసుకోండి" వంశీ తనకు తెలిసిన సమాచారం చెప్పాడు.
    
    "అలాంటి అతితెలివి జోక్ లెయ్యకు ఇప్పుడు జరగాల్సింది చూడు. ఈ గండం నుండి బయటపడేందుకు నాకు ఒక్కటే మార్గం కనబడుతోంది ఎవరో ఒకరం లేడీస్ ని బ్రతిమిలాడో, ప్రాధేయపడో రమ్మని చెబుదాం!" స్వామినాధంతో అని వంశీ వైపు తిరిగి "మీ ఊరమ్మాయి ఈ మధ్యే ప్రీవియస్ లో చేరింది కదా ఆమెను కలిసి ఆమెతోపాటు కొందర్ని తీసుకొచ్చే ఏర్పాటు చేయ్ కమాన్ క్విక్" అని తొందరపెట్టేశాడు.
    
    "నేనా? నావల్ల కాదు సుజనది మా ఊరే కాని, చిన్నప్పట్నుంచీ మద్రాస్ లో చదువుకుంది. ఆమెను పెంచుకున్న మద్రాసు పిన్ని ఇటీవలే చనిపోవడంతో ఇక్కడకు వచ్చి చేరింది. ఎప్పుడో సంవత్సరం క్రితం మా ఊరి బస్ స్టాండ్ లో దూరం నుంచి చూడడం తప్ప ఎప్పుడూ పలకరించిన పాపాన పోలేదు. ఇక్కడ చేరాక కూడా ఎదురుపడి ఒకరికొకరు చూసుకోవడం లేదు" పోలేదు. ఇక్కడ చేరాక కూడా ఎదురుపడి ఒకరికొకరు చూసుకోవడం లేదు"
    
    కానీ శర్మ వినలేదు బలవంతాన హాస్టల్ కు అతన్ని తరిమాడు.
    
    హాస్టల్ గేటు తీసుకుని లోపలికి వెళుతుంటే అతని కాళ్ళు వణికాయి. కళ్ళు బైర్లు కమ్మాయి. కానీ తమాయించుకున్నాడు.
    
    సెంట్రీ కనపడగానే - "సుజన - సోషియాలజీ ప్రీవియస్ - ఈ మధ్యే  చేరింది. రూమ్ నెంబర్ తెలియదు" అని వినిపించీ వినిపించనట్టు చెప్పాడు.
    
    సెంట్రీ గుర్తుపట్టాడు. వరండాలోకి వెళ్లి - "రూమ్ నెంబర్ పదకొండూ సుజన-రూమ్ నెంబర్ పదకొండూ" అని గట్టిగా అరిచాడు.
    
    మరో నిముషానికి సుజన వచ్చింది. ఆమె రాగానే విజిటర్ ని చేత్తో చూపించాడు సెంట్రీ.
    
    ఆమెను చూడగానే చిన్న జర్క్ ఇచ్చాడతను.
    
    పౌర్ణమి రోజున సముద్రపు ఒడ్డున నిలబడి చూస్తే నీళ్ళల్లో చేపపిల్ల పొలుసులా మెరిసే వెన్నెల, లేత సువాసన తప్ప మరో అస్తిత్వంలేనట్టు ఆకుల మధ్య ముఖం చాటేసిన మొగలిరేకూ, సాయంకాలం పూట లోయలోకి యింకిపోయే సంధ్య కాంతీ, ఆకాశంలో దక్షిణం నుంచి ఉత్తరానికి కట్టిన తోరణం గాలికి ఎగిరిపోతున్నట్టు సాగే పక్షుల గుంపూ యిలా చాలా చాలా గుర్తొచ్చాయి అతనికి.
    
    ఆడపిల్ల ఎంత డిగ్నిఫైడ్ గా వుండడానికి వీలుందో అంత డిగ్నిఫైడ్ గా వుంటుందామె. చూడగానే ఏదో గౌరవభావం ఎదుటి వ్యక్తిలో గూడుకట్టుకు పోతుంది ఆమె అందం కూడా అలాంటిదే మీదపడి రక్కెయ్యాలని పించదు. పాదాల ముందు కూర్చుని ఆరాధనతో చూస్తూ తన్మయత్వం అనుభవించాలనిపిస్తుంది.
    
    అందుకే అతను భాష మరిచిపోయాడు. ఎవరన్నట్టు చూస్తూ ఆమె దగ్గరికి వచ్చి నిలబడ్డా నోరు పెగల్లేదు.
    
    "మీరు" అంటూ ఆగింది.
    
    అప్పటికి సర్దుకున్నాడు. "నా పేరు వంశీ. సోషియాలజీ ఫైనలియర్ మనది ఒకే ఊరు. అయినా పరిచయం లేదు" అన్నాడు.
    
    "మిమ్మల్ని ఎప్పుడూ ఊర్లో చూసినట్టు గుర్తులేదే"
    
    "మీరు ఎప్పుడు వూర్లో వున్నారు గనుక? మద్రాసులోనే వుండి, చుట్టం చూపుగా అప్పుడప్పుడూ వచ్చేవాళ్ళు. దిగువ వీధిలో మా ఇల్లు. మా నాన్న రామారావు. రెండేళ్ళ క్రితం చనిపోయారు.
    
    "ఆఁ గుర్తొచ్చారు?"
    
    ఇక ఫరవాలేదనిపించి అవీ ఇవీ ఓ ఐదు నిముషాలపాటు మాట్లాడి అసలు విషయం చెప్పాడు.
    
    "రాజకీయ నాయకులకే కాదు- మీకూ జనం పోగుచేసే బాధ తప్పడం లేదన్న మాట. అడవిరాముడు ధాటికి చలం నిలబడలేక పోయాడా?" అని నవ్వింది.
    
    అతనూ ఆమెతో శ్రుతి కలిపాడు.
    
    "అయితే మీరెళ్ళండి. ఇప్పుడు అందరి దగ్గరికి వెళ్లి చెప్పి తీసుకురావడం వీలుకాదు. కానీ చిన్న ట్రిక్ ప్లే చేస్తాను. మీ ఆడిటోరియం నిండిపోతుంది" అంది.
    
    ఆ ట్రిక్ ఏమిటో అతను అడగలేదు. ఆడిటోరియం నిండితే అదే చాలనుకుని ఆమె దగ్గర సెలవు తీసుకుని వచ్చేశాడు.
    
    నిర్వాహకులంతా ఆడిటోరియం మెట్లమీద నిలబడి జనం కోసం ఆత్రుతతో ఎదురుచూస్తున్నారు. ఐదు నిముషాల తర్వాత ఓ అమ్మాయిల గుంపు లైబ్రరీ వేపు నుంచి అటుకేసి రావడం కనిపించింది.
    
    "వాళ్ళంతా మీటింగ్ కేనా?" సందేహంగా అడిగాడు శర్మ.
    
    "ఆఁ మా ఊరమ్మాయి పిలుచుకొస్తోంది. కానీ ఆడిటోరియం నిండిపోతుందని చెప్పి - అదేమిటి ఓ పదిమందిని మాత్రమే వేసుకొస్తోంది" స్వగతంలా చెప్పాడు వంశీ.
    
    సుజన ఏమీ మాట్లాడకుండా అతనివేపు చూసి, పలకరింపుగా నవ్వి లోనికి కెళ్ళి కూర్చుంది.


 Previous Page Next Page 

  • WRITERS
    PUBLICATIONS