"ఆమె గదిలోనికి కన్న తండ్రి కూడా అడుగు పెట్టడు. ఆ విధంగా నేను చేసినది క్షమించరాని నేరం" అన్నాడు రాం కుమార్.
"నిజమే - కానీ సురేఖ కోపానికి అసలు కారణమది కాదు. అది నీ కర్ధం కావాలంటే ముందు నీవు స్త్రీ మనస్తత్వాన్ని అర్ధం చేసుకోవాలి" అన్నాడు వెంకటేశ్వర్లు.
స్త్రీ తన కోసం కాక, తన వారి కోసం జీవించే ఆదర్శ త్యాగమూర్తి. ఈ సృష్టి రహస్యమంతా స్త్రీ త్యాగంలోనే ఇమిడి ఉంది. ఇంతకాలం సురేఖ ఎవర్నీ ప్రేమించలేదు. ఇటీవల ఆమె ఎవరినో ప్రేమించింది. ఎప్పుడయితే ప్రేమలో పడిందో ఆమె తన శరీరం మీద ఎవరు వాంఛపెంచుకున్నా ఆమె సహించి క్షమించగలదు. తన ప్రియుడి శరీరం పై ఎవరు మోజు పడినా ఆమె భరించలేదు.
"నీ విషయంలో అదే జరిగింది" అన్నాడు వెంకటేశ్వర్లు.
'అతడెవరో మీకు తెలుసా?"
"తెలియదు....నువ్వు మాత్రం కాదని నాకు తెలుసు" అని "రాం కుమార్ ! సురేఖ ప్రియుడేవరో నువ్వు తెలుసుకుని నాకు చెప్పాలి" అన్నాడు వెంకటేశ్వర్లు.
"ఎందుకు?"
"సురేఖ తన ప్రేమను రహస్యంగా వుంచింది. అంటే ఆమె ప్రేమనందుకున్న యువకుడికి బహిరంగంగా ఆమెను ప్రేమించే అర్హత లేదు. ఆ ప్రేమికుడికి నా ఎదుట నిలబడి మాట్లాడే ధైర్యం లేదు."
"అతడెవరో తెలుసుకొనడం వల్ల మీకేం ప్రయోజనం."
"చాలా ప్రయోజన ముంది -" అన్నాడు వెంకటేశ్వర్లు "నా కూతుర్ని నాకు తెలీకుండా ప్రేమించడం వల్ల - ఎలాంటి పర్యవసాన ముంటుందో ప్రపంచానికి తెలియాలి ...."
"మీరు మీ అమ్మాయిని ప్రాణ ప్రదంగా ప్రేమిస్తున్నారు. ఆమె ప్రేమ నెలాగూ తిరస్కరించలేరు" అన్నాడు రాం కుమార్.
"ఆ పొరపాటు అభిప్రాయాన్ని తుడిచి పెట్టడం కోసం ఆ ప్రేమికుడిని కాలరాస్తాను" అన్నాడు వెంకటేశ్వర్లు.
"క్షమించాలి - ఇందుకు నేను సహకరించలేను."
"ఎందుకని ?"
"ఇతరులకు ప్రమాదం కలిగించే పనులు నేను చేయలేను...."
'అందువల్ల నీకే ప్రమాద మేర్పడితే ?"
"అంటే?" అన్నాడు రాం కుమార్ ఆశ్చర్యంగానూ భయంగానూ.
"నేను నీ తెలివిని పరీక్షించాలనుకుంటున్నాను. అందుకు సరిగ్గా వారం రోజులు టైమిస్తున్నాను. ఈ వారం రోజుల్లోనూ నువ్వు సురేఖ ప్రియుడెవరో తెలుసుకోవడమే కాక సురేఖ కతడి పై ద్వేష భావాన్ని కలిగించి నిన్ను ప్రేమించేలా చేసుకోవాలి. అప్పుడు నేను నిన్ను నా యింటల్లుడ్ని చేసుకుంటాను....నువ్వు సురేఖ ప్రియుడెవరో తెలుసుకొనక పొతే శాశ్వతంగా ఒక బంగారు అవకాశాన్ని పోగొట్టు కుంటావు. అది ప్రమాదమే కదా!" అన్నాడు వెంకటేశ్వర్లు.
రాం కుమార్ అయన కళ్ళలోకి సూటిగా చూశాడు. తన కిటువంటి సవాలేదురౌతుందని అతడనుకో లేదు.
"ప్రయత్నిస్తాను" అన్నాడతడు.
'ఆలోచించుకో - ఇది నీ తెలివికి పరీక్ష. వారం రోజుల్లో అనుకున్నది సాధించకపోయినా నీ వుర్యోగం వూడినట్లే....."
రాంకుమార్ తెల్లబోయి "ఈ సవాలుకూ నా వుద్యోగానికి ముడి పెడుతున్నారా ?' అన్నాడు.
"అవును - సురేఖ ను ప్రేమించే ముందు నీ అర్హత నీవు చూసుకోవాలి. అనాలోచితంగా వీరోచిత కార్యాలు చేయాలనుకునే వారికి నా వద్ద స్థానం లేదు. నీ అర్హతను నిరూపించుకునేందుకు నీకు వారం రోజులు టైము మాత్రమే కాదు - నీ ఖర్చుల కనవసరబడుతుందని కొంత డబ్బు కూడా యిస్తున్నాను" అన్నాడు వెంకటేశ్వర్లు.
అయన తన జేబులోంచి ఒక గోధమరంగు కవరు తీసి రాంకుమార్ కి అందించాడు. అతడది విప్పి చూశాడు. అందులో అరువేలున్నాయి.
"ఇప్పట్లో నాకు ఖర్చులే మున్నాయి ?' అన్నాడు రాంకుమార్.
"ఏమిటా ?" అని, "ఒక అజ్ఞాత వ్యక్తిని వెతికి పట్టుకోవాలి. అందుకు ఎల్లకాలం సురేఖను అంటి పెట్టుకుని ఉండాలి. వెతికి పట్టుకున్న వ్యక్తిపై సురేఖకు ద్వేషం కలిగించాలి. నీపై ప్రేమను పుట్టించాలి. వీటన్నింటికీ ఎన్నో ప్రాంతాలు తిరగాలి. ఎన్నో నాటకాలాడాలి. అందుకు బోలెడు ఖర్చవుతుంది. నిజానికి ఆరువేలు సరిపోతుందనుకొను. కానీ నేనంత మాత్రమె నీ కివ్వగలను. ఆ పైన నీ తెలివి ఉపయోగించాలి" అన్నాడు వెంకటేశ్వర్లు.
రాం కుమార్ వెంకటేశ్వర్లు దగ్గర సెలవు తీసుకున్నాడు.
2
జరిగిన విశేషాన్ని నెమరు వేసుకుంటూనే రాం కుమార్ తన గదిలోనికి వెళ్ళాడు. అప్పుడే ఒక పనివాడతడ్ని సమీపించి -- "సార్ -- టెలిగ్రాం వచ్చింది -- మీకు --" అన్నాడు.
రాం కుమార్ టెలిగ్రాం అందుకుని చదివాడు.
"మదర్ సీరియస్ . స్టార్ట్ ఇమ్మీడియేట్లీ...."
టెలిగ్రాం అతడి తండ్రి ఇచ్చాడు.
రాంకుమార్ కు కాళ్ళు చేతులూ ఆడలేదు. అతడు వెంటనే వెంకటేశ్వర్లును కలుసుకున్నాడు. అయన విషయం విని - "వారం రోజుల వరకూ నీకు సెలవు తీసుకోవాల్సిన అవసరం లేదు. నీ యిష్టం వచ్చిన చోటుకు వెళ్ళవచ్చు. అయితే సవాలుకు నేనిచ్చిన గడువులో ఒక్క రోజు కూడా నేను తగ్గించేది లేదు. ఆపైన నీ యిష్టం " అన్నాడు.
అతడు వెంకటేశ్వర్లు వద్ద సెలవు తీసుకుని మళ్ళీ తన గదికి వెళ్ళి కాసేపు నిదానంగా ఆలోచించాడు. ఆ టెలిగ్రాం వెంకటేశ్వర్లు -- సవాలులో తన్నోడించడానికి కాడుతున్న నాటకం కాదు గదా అని కూడా రాం కుమార్ కి అనుమానం వచ్చింది.
మరోసారి అతడు టెలిగ్రాం పరీక్షించాడు. దాని మీద వివరాలను బట్టి అది నిస్సెందేహంగా తన ఊరి పోస్టాఫీసు నుంచే వచ్చింది.
వెంకటేశ్వర్లు ఎవరికైనా ఫోన్ చేసి అక్కడ్నించి టెలిగ్రాం ఇప్పించాడేమో - అయన ఎంతకైనా సమర్ధుడు!
అయితే కన్న తల్లి విషయంలో రిస్కు తీసుకోదల్చలేదు రాంకుమార్ . ఉన్నపళంగా అతడు తన ఊరికి బయల్దేరాడు.
అక్కణ్ణించి ఎనిమిది గంటల బస్సు ప్రయాణం.
రాత్రి పదయ్యేసరికల్లా రాంకుమార్ తన ఇల్లు చేరాడు.
ఇంట్లో తల్లి నిక్షేపంలా ఉంది. అసలు గుమ్మంలో ఎదుట పడి అతణ్ణి పలకరించినదామె!
రాం కుమార్ తెల్లబోయి -- "నువ్వు క్షేమంగానే ఉన్నావా ?" అన్నాడు.
తల్లి ఆప్యాయంగా అతడి వంక చూసి - "ఓహో - అయితే టెలిగ్రాం అందిందన్న మాట -- 'అని -- "ఏమండోయ్ - మన రాంబాబు వచ్చాడు" అంటూ కేక పెట్టింది.
ఆ కేకకు బదులుగా లోపల్నుంచి ఇద్దరు చెల్లెళ్ళూ , ఒక తమ్ముడూ వచ్చారు. వారి వెనుక నెమ్మదిగా వచ్చాడు రాం కుమార్ తండ్రి.
ఈలోగా తల్లి అతణ్ణి కుశల ప్రశ్నలు వేసి కుర్చీలో కూర్చోపెట్టింది.'
"టెలిగ్రాం మీరే యిచ్చారా?" అన్నాడు రాం కుమార్ అందర్నీ ఉద్దేశించి.
"ఇచ్చింది నేను -- కానీ ఇవ్వమన్నది మీ అమ్మ -- " అన్నాడు తండ్రి.
"ఎందుకలా యిచ్చారు ? నేనెంత కంగారు పడతానో తెలియదా?" అన్నాడు రాం కుమార్ చిరాగ్గా.
"చూశారా -- వాడికి నేనంటే ఎంత ప్రేమో " అంది తల్లి.
"ప్రేమ సంగతి సరేనమ్మా . ఇలాంటి పనులు చేయడం వల్ల నిజమేదో అబద్దమేదో తెలియక - ఒకోసారి ఏదైనా అయినా కూడా నిర్లక్ష్యం చేసే పరిస్థితి ఏర్పడుతుంది." అన్నాడు రాంకుమార్.
"నాకు తెలుసురా -- కానీ ఎన్నుత్తరాలు రాసినా పెళ్ళి గురించి నువ్వేమీ మాట్లాడ్డం లేదు. ఇక్కడికి రావడం లేదు. అందుకని నేనే అలా టెలిగ్రాం ఇవ్వమన్నాను."
"చాలా పొరపాటు చేశానమ్మా -- అవతల కొంప మునిగే పనులున్నాయి. నీ టెలిగ్రాం చూసుకుని అన్నీ వదులుకుని ఉన్నపళంగా వచ్చాను. అయితే రేపోద్దున్నే ఫస్టు బస్సులో తిరిగి వెళ్ళిపోతాను " అన్నాడు రాం కుమార్.
"వీల్లేదు --- నువ్వు నాలుగు రోజులిక్కడే వుండాలి " అంది తల్లి.
"ఎందుకని ?"
"నీకు పెళ్లి చూపు లేర్పాటవుతున్నాయి."
"ఇవతల పెళ్ళి చూపులను కుంటే అవతల ఉద్యోగమే పోవచ్చు. నాకు ఆ విషయం ఆలోచించావా అమ్మా!"
తల్లి అతడి వంక నిర్లక్ష్యంగా చూసింది.
అక్కడున్న మిగతా నలుగురు మనుషులూ శిలాప్రతిమల్లా నిలబడి తల్లీ కొడుకుల సంభాషణ వింటున్నారు.
"అమ్మా - రేపోద్దున్నే నేను పోతున్నాను" అన్నాడు రాం కుమార్.
"వెళ్ళవు --"
"వెళ్ళకపోతే నా ఉద్యోగం పోతుంది...."
"పొతే పోనీ !"
