Previous Page Next Page 
వసుంధర కథలు-14 పేజి 28

 

                             తెలివైన వాడు

                                                            జొన్నలగడ్డ రామలక్ష్మీ
    
    గదిలో నేలనిండా పరచిన ఖరీదయిన కార్పెట్!
    మధ్య గదిలో ఖరీదయిన సోఫా!
    సోఫాలో లక్షాధికారి వెంకటేశ్వర్లు....!
    అయన కెదురుగా పాతికేళ్ళ యువకుడు రాం కుమార్. అతడు చేతులు కట్టుకుని నిలబడి వున్నాడు. అతడు కొద్దిగా వణుకుతున్నాడు.
    వెంకటేశ్వర్లు రాం కుమార్ వంక కఠినంగా చూస్తున్నాడు.
    గది గోడలకు మూడు ప్రక్కల పోస్టర్లు. ఆ పోస్టర్లలో తుపాకి యోధులు - తుపాకులు గురిపెట్టి లక్ష్యాన్ని చూస్తున్నారు.
    వెంకటేశ్వర్లు కళ్ళు గురిపెట్టిన తుపాకీల్లా వున్నాయి.
    "నేను నిన్నెందుకు పిలిచానో తెలుసా?" అన్నాడు వెంకటేశ్వర్లు.
    రాం కుమార్ అడ్డంగా తల వూపాడు.
    "ఉదయం ఏం జరిగిందో అమ్మాయి చెప్పింది ..."
    అప్పుడే స్నానం చేసి వచ్చి అడ్డం ముందు నిలబడి  బట్టలు మార్చుకుంటున్న సురేఖను -- ఆ గదిలోకి ప్రవేశించి చూశాడు రాం కుమార్. ఆమె అరిచినా వెంటనే అక్కణ్ణించి కదలలేదు.
    రాం కుమార్ తల వంచుకుని - "పోరపాటయింది" అన్నాడు.
    'పొరపాటు నీది కాదు- వయసుది !" అన్నాడు వెంకటేశ్వర్లు.
    రాం కుమార్ తలెత్తి వెంకటేశ్వర్లు ని చూశాడు. అతడి శరీరంలో వణుకు కొంత తగ్గింది.
    'అయినా నాది తప్పే!"
    సురేఖ గదిలోకి పురుషులకు ప్రవేశం లేదు. ఆఖరి కామే అన్నకు కూడా! తండ్రి కూడా ఆమెతో మాట్లాడాలను కుంటే ఇంటర్ కమ్ ద్వారా పిలుస్తాడు. అలాంటి గదిలోకి రాం కుమార్ ప్రవేశించాడు. అతడు వెంకటేశ్వర్లుతో పాటు ఆయనింట్లోనే ఓ గదిలో వుంటున్నాడు.
    "తప్పు నీది కాదు - నీ పేదరికానిది....' అన్నాడు వెంకటేశ్వర్లు.
    రాం కుమార్ కి తన యజామాని ఏం చెబుతున్నాడో అర్ధం కాక మళ్ళీ తల వంచుకున్నాడు.
    "నాకు సంబంధించినంత వరకూ సురేఖ నా కూతురు. నీకు సంబంధించినంత వరకూ వయసులో వున్న ఒక అందమైన అమ్మాయి. ఇద్దరూ ఒకే యింట్లో తిరుగుతున్నారు. ఆకర్షణ అసహజం కాదు. అయితే ఒక్క విషయం - నువ్వు సురేఖను ప్రేమిస్తున్నావా?"
    "తెలియదు" అన్నాడు రాం కుమార్.
    "ఊ అనడానికి భయపడుతున్నావు. తటపటాయిస్తున్నావు. నా ఎదురుగా నా కూతుర్ని ప్రేమిస్తున్నానని చెప్పే ధైర్యం కూడా నీకు లేదు. అయినా సరే - సురేఖను పెళ్ళి చేసుకోమని నేను నీకు చెబుతాను. ఒప్పుకుంటావా?"
    రాం కుమార్ తెల్లబోయి తలెత్తి వెంకటేశ్వర్లుని చూశాడు. ఆయనతో చూపులు కలపలేక మళ్ళీ తల దించుకున్నాడు. అయితే అతడి ఆశ్చర్యం ఆనందంగా మారింది.
    "చెప్పు - సురేఖతో పెళ్ళికి ఒప్పుకుంటావా?"
    "ఊ" అన్నాడు రాం కుమార్.
    "వెరీ గుడ్" అన్నాడు వెంకటేశ్వర్లు "ముందుగా ఒక విషయం నాకు చెప్పు. అసలు నువ్వు  సురేఖ గదికి ఏ ఉద్దేశ్యంతో వెళ్ళావు?"
    సురేఖ ప్రవర్తన సరైనది కాదని రాంకుమార్ విన్నాడు. ఆమె పురుషులతో విచ్చలవిడిగా తిరుగుతుందని శీలానికి ప్రాముఖ్యత నివ్వదనీ అనుకునేందుకు నిదర్శనా లున్నాయతడి వద్ద. రాం కుమార్ అందంగా ఆకర్షణీయంగా ఉంటాడు. అయినా సురేఖ ఎన్నడూ అతడ్ని కన్నెత్తి చూడలేదు. పన్నెత్తి పలకరించలేదు.
    రాం కుమార్ కి సురేఖ పై ఆశలు బయలుదేరాయి. ఆమె తనను పట్టించుకోవడం లేదని అతడికి బాధగా ఉంది. ఒకసారి ఆమె ప్రత్యేకంగా తన గురించి ఆలోచించే పరిస్థితి కల్పించాలని అతడను కున్నాడు. అందుకామె గదికి వెళ్లడ మొక్కటే మంచి ఉపాయమనిపించింది. ఎలాగూ వెడుతున్నప్పుడు మంచి సమయంలో వెళ్ళాలనుకున్నాడు. సురేఖ ఏ సమయంలో స్నానం చేస్తుందో అతడికి తెలుసు. అలాగే అనుకున్న సమయానికి వెళ్ళాడు.
    ఈ విషయం యజమాని కేలా చెప్పగలడు ?
    "ఆమె నాతొ ఎన్నడూ మాట్లాడదు. ఎందుకో అడిగి తెలుసుకోవాలని పించింది. " అన్నాడు రాం కుమార్.
    "ఆమె నీతో ఎందుకు మాట్లాడాలను కున్నావు?"
    'చెప్పలేను ....కానీ.... ఆమె అంటే నాకు ఆకర్షణ ఉంది" రాం కుమార్ కాస్త ధైర్యం చేశాడు.
    'ఆమె గదిలో అడుగు పెట్టె ముందు నీ అంతస్తేమిటో ఆలోచించావా?"
    "లేదు...."
    "మీ యిద్దరికీ పెళ్ళయ్యే అవకాశం లేదని ఊహించలేక పోయావా?"
    "సర్ - ఆకర్షణ తప్ప నా బుర్రలో మరేమీ లేదు. ఆమెతో మాట్లాడాలను కున్నాను తప్ప - నా మనసులో వేరే ఉద్దేశ్య మేమీ లేదు...." అన్నాడు రాం కుమార్.
    "నువ్వు నిజమే చెబుతున్నానని నమ్ముతున్నాను. అయితే నేనూ ఒక నిజం చెబుతున్నాను- జాగ్రత్తగా విను -" అన్నాడు వెంకటేశ్వర్లు.
    రాం కుమార్ మనసులో కుతూహలం రేగింది. యజమాని ఏం చెబుతాడో నని అతడు చెవులు రిక్కించాడు.
    "నేను ఐశ్వర్యం లో పుట్టి పెరిగాను. కాని నా తండ్రి అంతులేని పేదరికాన్ననుభావించినాకనే ఐశ్వర్యవంతుడయ్యాడు. అయన నాతొ - డబ్బును కాక తెలివిని నమ్ముకో . డబ్బు నిలబడుతుంది అంటుండేవాడు. ఆ మాటలు నాకు బాగా వంటబట్టాయి. నేనూ తెలివినే నమ్ముతాను. నీలో  తెలివి వుంటే నిన్ను నా యింటల్లుడ్ని చేసుకుంటాను. అయితే ఆ విషయం పరీక్షించాలి."
    రాం కుమార్ కి ఉత్సాహం వచ్చింది. "సార్ మీ పరీక్షకు తప్పక నిలబదతాను. నా తెలివి నిరూపించుకుంటాను" అన్నాడు.
    'అయితే ఒక విషయం ....సురేఖ కు నువ్వు ప్రేమిస్తున్నావు. ఆమె నిన్ను ప్రేమిస్తుందో లేదో తెలుసుకున్నావా?"
    "తెలుసుకోవాలనే ఆమె గదికి వెళ్ళాను ...."
    "పోనీ యిప్పుడయినా తెలుసుకున్నావా ?"
    "ఇంకా తెలియదు --"
    "నువ్వామే గదికి వెళ్ళావు. ఆమె నాకు ఫిర్యాదు చేసింది. అంటే ఆమెకు నీపైన ప్రేమ ఉన్నట్లా లేనట్లా?"
    రాం కుమార్ తడబడి - ముసలాడు చాలా తెలివిగా మాట్లాడుతున్నాడు. నేనూ జాగ్రత్తగా ఉండాలి" అనుకున్నాడు. పైకి మాత్రం "నా గురించి మీ అభిప్రాయం తెలుసుకునేందుకు -- ఆ పని చేసి వుండవచ్చు " అన్నాడు.
    "ఆమె నిన్ను వుద్యోగం లోంచి తీసేయమంది...." అన్నాడు వెంకటేశ్వర్లు.
    "మీరు నన్ను ఉద్యోగంలోంచి తీసేయకపోయినా ఆమె నొక్కించదు. తనా మాత్రం తీవ్రంగా రియాక్ట్ కాకపోతే బాగుండదు కదా!" అన్నాడు రాం కుమార్.
    "సురేఖ నటించిందని నువ్వనుకుంటే అది నీ భ్రమ. నీ విషయంలో ఆమె చాలా తీవ్రంగా రియాక్టయింది...." అన్నాడు వెంకటేశ్వర్లు.
    "ఎందుకని ?"
    "మన మోచేతి క్రింద నీళ్ళు తాగే మనిషి కెంత ధైర్యం అని ఆగ్రహించింది సురేఖ ' అన్నాడు వెంకటేశ్వర్లు.
    సురేఖ పేరు చెప్పి తననదల్చుకున్న మాటలు వెంకటేశ్వర్లు చెబుతున్నాడా అని రాం కుమార్ కి అనిపించింది. అయినప్పటికీ ధైర్యం చేసి - 'మీ అభిప్రాయం మీది - నా అభిప్రాయం నాది" అన్నాడు. వెంకటేశ్వర్లి చ్చిన చనువతడికా ధైర్యాన్నిచ్చింది.
    "నీ అభిప్రాయానికి నేను కారణం తెలుసుకోవచ్చా?"
    "మీరు సురేఖ మాటలకు చాలా విలువనిస్తాడు. అమెతీవ్రంగా రియాక్ట యి ఉంటె మీరు నాతొ యింత మృదువుగా మాట్లాడి వుండేవారు కాదు" అన్నాడు రాం కుమార్.
    "తెలివైనవాడివే .....' అన్నాడు వెంకటేశ్వర్లు.
    తానప్పుడే సురేఖ ను పెళ్ళాడేసినంత ఆనందం పొందాడు రాం కుమార్.
    "కానీ - నిజం చెబుతున్నాను. నీ విషయంలో సురేఖ చాలా తీవ్రంగా రియాక్టయింది. అయినా నేను నీతో మృదువుగా మాట్లాడడానికి వేరే కారణముంది" అని వెంకటేశ్వర్లు ఒక్క క్షణమాగి మళ్ళీ చెప్పడం ప్రారంభించాడు. "గతంలో కూడా ఇలాంటి సంఘటనలు ఒకటి రెండు జరిగాయి. ఎప్పుడూ ఆమె యింత తీవ్రంగా రియాక్టవ్వలేదు. ఇప్పుడింత తీవ్రంగా రియాక్టయిందంటే అందుకేదో కారణముండి వుండాలి . ఊహించగలవా?"


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS