ఆ వ్యక్తి పోలీస్ డ్రస్సులో వున్నాడు.
"ఇన్ స్పెక్టర్ ఈశ్వర్రావుని. చిన్న పని మీద మిమ్మల్ని డిస్టర్బ్ చెయ్యాల్సొచ్చింది-" అన్నాడా వ్యక్తి-"కొద్ది క్షణాలక్రితం-ఈ వీధిలోనే సందుచివర యాక్సిడెంటయింది. యాక్సిడెంటుకు గురైన వ్యక్తి పోలీస్ డ్రస్సులో వున్నాడు. అతఃది చేతిలో ఒక అరకేజీ గ్లాక్సోడబ్బావున్నది. పోలీసు మనిషివద్ద గ్లాక్సో డబ్బా - అందులోనూ రోడ్డు మీద యూనిఫాంలో తిరిగే సమయంలో ఉండడం మాకు చాలా ఆశ్చర్యాన్ని కలిగించింది. విచారించినమీదట-ఆ కాన్ స్టేబుల్ మీ యింట్లోకి వచ్చాడనీ-తన చేతిలోని గ్లాక్సో డబ్బాను మీ యింట్లోకి వచ్చాడనీ-తన చేతిలోని గ్లాక్సో డబ్బాను మీ యింట్లోంచే తీసుకువచ్చాడనీ తెలిసింది-ఈశ్వర్రావు క్షణం ఆగి-"మీ ఇంట్లో ఎవరో అతడికా గ్లాక్సో డబ్బాని అందజేశారు..." అన్నాడు.
"మీరు పొరబడ్డారనుకుంటాను-..." అన్నాడు సురేంద్ర.
"ఇందులో నా పొరపాటేమీలేదు-" అన్నాడు ఈశ్వర్రావు కఠినంగా-"అందుకు ఖచ్చితమైన సాక్ష్యముంది. మీ ఎదురింటాబ్బాయీరోజే జ్వరం తగ్గి పత్యం తిన్నాడట. నిద్రపోకూడదన్నారని వాళ్ళింటి కిటికీ దగ్గర కూర్చుని వీధివైపే చూస్తూ కాలక్షేపం చేశాడట. అతను చెప్పిన ప్రకారం ఈ రోజు మీ యింటినుంచి ముగ్గురికి గ్లాక్సో డబ్బాలు అందాయి. ఒకటి ముష్టి వాడికి..."
ఈశ్వర్రావింకా ఏదో చెప్పబోతూండగా - "సరే ననుకోండి. గ్లాక్సో డబ్బాలు ఇవ్వడంలో తప్పేముంది?" అందిసులోచన.
ఈశ్వర్రావు జవాబిచ్చేలోగా-"ముందు మేమిక్కన్నుంచి బయటపడే ఏర్పాటు చేయండి వదినగారూ- తర్వాత ఈయన సంగతి చూద్దురుగాని-" అంది మహలక్ష్మి.
"మన్నించాలి. నా ప్రశ్నలకు జవాబు దొరికేవరకూ ఈ ఇంట్లోంచి ఎవ్వరూ కదలడానికి వీల్లేదు. ఇది చాలా సీరియస్ విషయం. ఆ గ్లాక్సో డబ్బాలు వజ్రాల స్మగ్లింగ్ కుపయోగించబడుతున్నాయి...." అన్నాడు ఈశ్వర్రావు.
సురేంద్ర దెబ్బతిన్నట్లు-ఏమిటన్నారూ-కాస్త వివరంగా చెప్పండి" అన్నాడు.
"డబ్బాకు అడుగున కొన్ని లక్షలు విలువచేసే వజ్రాలుంటాయి. దానికిపైన చిన్న సీసారేకు మూత వుంటుంది. ఆపైన డబ్బాలో మామూలు నిత్యావసర వస్తువులుంటాయి. పోలీస్ కాన్ స్టేబుల్ వద్దనున్న డబ్బాలో పంచదార వుంది. అడుగున వజ్రాలున్నాయి. వాటి విలువ నాలుగు లక్షలు..." అన్నాడు ఈశ్వర్రావు.
15
మధ్యాహ్నం నిద్రపోకూడదని కిటికీ దగ్గర కూర్చున్న ఒక కుర్రవాడు- అనుకోకుండా జరిగిన యాక్సిడెంటు పోలీసులకు ఒక పెద్ద స్మగ్లింగ్ ముఠాని పట్టిచ్చాయి.
యాక్సిడెంట్ కు గురైన కాన్ స్టేబులు పోలీసు డిపార్టు మెంటుకు సంబంధించినవాడు కాదని తేలిపోయింది. అతడి దగ్గరున్న డబ్బాలో వజ్రాలు దొరికాయి. మహలక్ష్మి, అప్సరసలను దబాయించగా మరికొందరు వ్యక్తులు బయటపడ్డారు.
మహాలక్ష్మి, అప్సర ముఠా వ్యక్తులు కారు. తామేం చేస్తున్నదీ వాళ్ళకు తెలియదు. ప్రతిఫలాపేక్షతో ఆ కుటుంబ వ్యక్తులందుకు సిద్ధపడ్డారు.
కాన్ స్టేబుల్ వేషధారికీ ప్రాణ ప్రమాదం జరుగలేదు. అయిదారురోజుల్లో అతను కోలుకున్నాక-మరికొందరు వ్యక్తుల పేర్లు తెలిశాయి.
కేసు నెలరోజులకుపైగా నడిచేక - నగరంలోని పెద్ద వ్యాపారస్థులలో ఒకడైన రంగనాథ్ కు ఈ స్మగ్లింగ్ తో సంబంధముందనీ-అతడి స్నేహితుడు నాగరాజారావు ఈ విషయంలో అతనికి కుడి భుజంగా ఉంటున్నాడనీ కూడా బయటపడింది.
పటిష్టమైన పథకంతో కుటుంబపరంగా వ్యవహారం నడిపించడంవల్ల పోలీసులకు ఆచూకీలు దొరకడం లేదు. అదృష్టమే నేరస్థులను పోలీసులకు పట్టిచ్చింది.
అదృష్టం సుబ్బారావును వరించిందనాలి. ఆయన వద్దనుంచి లాకర్ తాళాలు తీసుకుపోయిన వ్యక్తి మర్నాడే ఆయనకు పోస్టులో అవి పంపించేశాడు. తన లాకర్లో ఉంచబడిన భరిణల్లో వున్నవి గాజుపూసలని తెలుసుకుందుకు సుబ్బారావుకు ఎన్నో రోజులు పట్టలేదు. అనుకోకుండా తనకు దొరికిన వజ్రాలు-అలాగే పోయినా-ఈ కేసులో తను ఇరుక్కోనందుకు ఆయన సంతోషించాడు.
ఇటు సుబ్బారావునుంచి వజ్రాల భరిణను సంపాదించడమూ-అటు తన స్మగ్లింగ్ కొనసాగించడమూ- రెండూ నెరవేరడంకోసం-ఒకప్పుడు కట్నం గురించి పెళ్ళి చెడిపోయిన వాసుదేవరావు బంధువులను పట్టాడు నాగరాజురావు. అతడి పథకం తెలివైనదే-కానీ విధి వక్రించింది!
ఏ ఉద్దేశ్యంతో నైతే నేం-నాగు-వాసుదేవరావు, దేవీ బాలలను ఒకటి చేద్దామనుకున్నాడు. అసలు ఉద్దేశ్యం నెరవేరినా-సురేంద్ర, అప్సర-దేవీబాల, వాసుదేవరావులకు కొన్ని నెలల తర్వాత వైభవంగా వివాహాలు జరిగాయి.
పాపం-కటకాల వెనకనున్న నాగరాజారావుకు తన పథకం సగభాగం నెరవేరిందని తెలియదు.
-:ఐపోయింది:-
