"నన్ను పెళ్ళి చేసుకోవా?" అన్నాడు.
"మా నాన్నగారిని అడుగు " అన్నాను.
"పెళ్ళి నీకు-- మీ నాన్నగారికి కాదు."
"మా నాన్న గారే సంబంధం చూసినా నా కిష్టమే! నీకిష్టం లేకపోతె నువ్వే వెళ్ళి మా నాన్నగారికి చెప్పుకోవాలి" అన్నాను.
"ఏం చూసి ఇష్టపడుతున్నావ్! వాడికి పదిరెట్లు ఆస్తి ఉంది నాకు. వాడికంటే లక్ష రేల్టు యెక్కువ ప్రేమ ఉంది" అన్నాడు రాజశేఖరం.
"ఆస్తి సంగతి నిజమే! ప్రేమ సంగతి యింకా తెలియదు."
"తెలుసుకోవాలనుకుంటున్నావా?" తెలిసుకోనివ్వను. నువ్వు నా ప్రేమను తప్ప మరొకరి ప్రేమను రుచి చూడడానికి వీల్లేదు. ఈ పెళ్ళి జరగనివ్వను."
"ఏం చేస్తావ్?"
"మీ నాన్నగారి దగ్గరకు వెడతాను....' అన్నాడు రాజశేఖరం.
రాజశేఖరం నాన్నగారి దగ్గరకు వెళ్ళలేదు కానీ అన్నయ్యకు చెప్పుకున్నాడు. అన్నయ్య నాన్నగారికి చెప్పాడు. నాన్నగారు ముందు మండి పడ్డాడు. మనది సంప్రదాయమయిన కుటుంబం. ఇంతవరకూ యెవ్వరూ తీసుకురాని మచ్చ తను తీసుకురాలేనన్నారు.
"చెల్లాయిక్కూడా ఇష్టం నాన్నా!" అన్నాడు అన్నయ్య.
ఈ విధంగా ఇందులో నన్ను కూడా యిరికిస్తాడని నే ననుకోలేదు.
"ఇలా రమ్మను దాన్ని!" అన్నాడు నాన్నగారు.
నేను వెళ్ళాను. నాకేమీ తెలుయదన్నాను.
"మొన్న నేను కుదిర్చిన సంబంధం నీ కిష్టం లేదా?" అన్నారు నాన్నగారు.
"అంతా మీ యిష్టం. నాకేమీ తెలియదు. అన్నయ్య చెప్పింది నిజం కాదు" అని అక్కడ్నించి వెంటనే వెళ్ళిపోయాను. రాజశేఖరాన్ని పెళ్ళి చేసుకోవాలని నాకు కోరికగా వుంది. ఆ విషయం నాన్నగారికి చెప్పడానికి భయం వేసింది. నాన్నగారితో నా ఇష్టం చెప్పడం కంటే అయన చెప్పినట్లు వినడమే మంచిదని నా పిరికితనం నాకు చెప్పింది.
నాన్నగారు అన్నయ్యను తిట్టారు. తర్వాత అన్నయ్య నా దగ్గరకు వచ్చి "రాజశేఖరం నా స్నేహితుడు . వాడు మంచివాడు. డబ్బుంది. వాడ్ని పెళ్ళి చేసుకుంటే అన్ని విధాలా నువ్వు సుఖపడగలవని నా నమ్మకం. నేను మీ పెళ్ళి జరిపిస్తే నీకు అభ్యంతరమా?" అన్నాడు.
"ఏమో నాకు తెలియదు. నాన్నగారి మాట కాదనడానికి నాకు భయం!" అన్నాను.
"పోనీ - రాజశేఖరం మంటే నీకు ఇష్టమేనా?" అని అడిగాడు అన్నయ్య.
నాసిగ్గు అన్నయ్యకు జవాబు చెప్పింది.
ఆ మర్నాడు సాయంత్రం అన్నయ్య మళ్ళీ నా దగ్గరకు వచ్చాడు. వాడు చాలా కోపంగా వున్నాడు. "చూడమ్మా -- మోహనా! నాన్నగారు చెప్పినట్లే చేయడం మంచిది. రాజశేఖరం గాడి మాట పూర్తిగా మరచిపోవాలి. వాడికీ మనకీ ఉన్న అంతస్తుల తేడా ఈరోజే నాకు తెలిసి వచ్చింది. వాళ్ళ నాన్న దగ్గరికి వెళ్ళాను వాడి మాట పట్టుకుని. అయన నానా మాటలు అన్నాడు. డబ్బు కోసం ఆడదాన్నెరగా చూపడం భోగం వాళ్ళలో గానీ ఎరగం అన్నాడు. అయన మాటలు విన్నాక ఈ పెళ్ళి జరగడానికి వీల్లేదని పించింది."
జరిగింది అర్ధం చేసుకోగలిగాను. అన్నయ్య బాగా దెబ్బతిన్నాడు. ఆతర్వాత రాజశేఖరం స్వయంగా క్షమార్పణ చెప్పుకున్నప్పటికీ -- "మా చెల్లెలి పెళ్ళి విషయం మాట్లాడి మా అహం మీద దెబ్బతీయకు" అనేశాడు అన్నయ్య.
ఆ తర్వాత కూడా రాజశేఖరం మా ఇంటికి వచ్చి వెడుతూనే వున్నాడు. అతన్ని చూసినప్పుడల్లా నా దురదృష్టానికి బాధ కలుగుతుండేది. నాక్కాబోయే వరుడు అతడి ముందు దివిటీలా వుంటాడు. రాజశేఖరం తో నా పెళ్ళి జరిగితే బాగుంటుందని మనసులో అనిపిస్తోంది నాకు. అప్పుడిందుకు వ్యతిరేకులు ఇంట్లో ఇద్దరున్నారు -- నాన్నగారు, అన్నయ్య !
రాజశేఖరం నాతొ ఏకాంతానికి ప్రయత్నిస్తూనే వున్నాడు. పెళ్లై పోయాక అతన్ని కలుసుకోవడం కుదరదని నాకు తెలుసు. అతను నాకు దూరమై పోతాడంటే మనసులో బాధగానే వుంది నాకు.
"నాకు మా నాన్నతో నిమిత్తం లేదు. నువ్వు కూడా మీ కుటుంబంతో నిమిత్తం పెట్టుకోకు. నాతొ వచ్చేసేయ్. మనమిద్దరం ఎక్కడి కైనా వెళ్ళి పోయి హాయిగా జీవితం గడుపుదాం" అన్నాడు రాజశేఖరం.
అలా నా కిష్టం లేదని చెప్పాను. అందుక్కారణం నాన్నగారి మీద ప్రేమ అని చెప్పలేను. రాజశేఖరాన్ని నమ్మమని ఏముంది? ఇలాంటి కధలు చాలా విన్నాం. ఇతగాడు నన్ను తీసుకెళ్ళి తర్వాత ఎక్కడైనా వదిలేస్తే?
ఈ సమాజంలో ఏ ఆసరా లేని ఆడదానికి రక్షణ లేదు. అందుకే ఆడపిల్లలు బుద్దిగా తల్లిదండ్రులు నిర్దేశించిన పెళ్ళిళ్ళు చేసుకుంటారు తప్పితే ప్రేమ పేరుతొ రిస్కు తీసుకోలేరు.
"నన్ను నమ్ము మోహనా! నువ్వు లేకుండా బ్రతకలేను. నాతొ వచ్చేసేయ్!"
ఇవే మాటలు కోరిక రూపంలో, ఆహ్వానం రూపంలో చాలాసార్లు నా దగ్గర అన్నాడతను. అతని కోరికను నేను లక్ష్య పెట్టలేదు. ఆహ్వానాన్ని మన్నించలేదు. వివాహం వీర్రాజుతో జరిగిపోయింది.
వీర్రాజు మనిషి మంచివాడే కానీ బొత్తిగా సంసార పక్షం మనిషి. ఆ తర్వాత కాస్త క్రమశిక్షణ పట్టింపు కూడా ఎక్కువ. ఇంట్లో అన్ని పనులూ ఒక్క పద్దతి ప్రకారం జరిగిపోవాలి. రాత్రి పక్కలో దగ్గరగా తీసుకోవడం మినహాయిస్తే పగటి పూట అతని వద్ద నుంచి ఓ ప్రేమ కబురు కానీ, సరసం కానీ వుండదు.
అతను చాలా తక్కువగా నవ్వుతాడు. నవ్వినపుడు చాలా బాగుంటాడు. అయితే అలా బాగున్న క్షణాలు చాలా తక్కువగా వుంటాయి. కోపం లేదు కానీ మనిషికి విసుగు ఎక్కువ. ఆ విసుగైనా క్రమశిక్షణ లో లోపాలు కనబద్దప్పుడే వస్తుంది.
క్రమశిక్షణ అంటే నాకు ఇష్టమే కానీ మనిషిని మనిషిలా వుంచక యంత్రంగా మార్చే క్రమశిక్షణ అంటే నాకు చిరాకు. క్రమశిక్షణ పట్టి కాక మూడ్ ను బట్టి మసలడం నాకు ఇష్టం . అతనికి కాదు.
ఏరోజు ఏవేం కూర చేయాలో , టిఫిన్ చేయాలో టైం టేబిల్ వుంటుంది. రుచులతో నిమిత్తం లేకుండా ఆ టైం టేబుల్ ఫాలో అవ్వాల్సిందే! అలాగే ప్రతి శనివారమూ సాయంత్రం మొదటి ఆటకు సినిమా చూడాలి. మూడో శనివారం నాడు హిందీ సినిమా.
సినిమాల మంచి చెడ్డలతో నిమిత్తం లేకుండా , మనిషి మూడ్ ప్రసక్తి లేకుండా వెళ్ళడం వల్ల నాకు సినిమా ఆసక్తి కాస్త తగ్గింది. అంతా రొటీన్ జీవితం!
వీర్రాజుతో కాపురం నాకు అనుక్షణం రాజశేఖరాన్ని గుర్తు తెస్తోంది. అతని మాట విని అతడితో వెళ్ళి పోవలసిందేమో అని అప్పుడప్పుడు అనిపిస్తూంటుంది. మొత్తం మీద రెండేళ్ళకు పైగా కాపురం చేస్తూ కూడా వీర్రాజు అలవాట్లకు అనుగుణంగా నా అలవాట్లు మార్చుకోగలిగాను కానీ అతణ్ణి ప్రేమించలేకపోయాను. నా మనిషి గా అభిమానించలేకపోయాను.
ఇప్పుడు రాజశేఖరాన్ని చూడగానే కలిగిన గగుర్పాటు లాంటిది వీర్రాజును చూసినప్పుడు ఒక్క పర్యాయం కూడా కలగలేదు నాకు.
ఇద్దరం పార్కులోకి వెళ్ళగానే -- "అలా కూర్చో" అన్నాడు రాజాశేఖరం.
నేను కూర్చున్నాను.
"నీతో చాలా మాట్లాడాలి!" అన్నాడు రాజశేఖరం.
"మాట్లాడు!" అన్నాను.
అతని నడక, మాట్లాడే పద్దతి నన్ను ముగ్దురాల్ని చేస్తున్నాయి. ఇన్నేళ్ళు వీర్రాజుతో కాపురం నాకు రాజశేఖరం పట్ల గల ఆకర్షణను రెట్టింపు చేసినట్లుంది.
"నేను చెప్పేదానికి నువ్వేమీ అనుకోకూడదు. నేను చెప్పేది నువ్వు పూర్తిగా వినాలి!" అన్నాడు రాజశేఖరం. అతను కాస్త తడబడుతున్నాడని అనిపించింది.
"వినడానికేమీ అభ్యంతరం లేదు " అన్నాను.
"నాకు నీమీద ప్రేమ ఏమాత్రం చావలేదు...." అన్నాడు రాజశేఖరం.
ఆ మాటలు నాకు చాలా సంతోషాన్ని కలిగించాయి. నా విషయంలోనూ అంతేనని చెప్పా లనిపించింది కానీ అందుకు అభిమానం అడ్డు వచ్చింది. మగవాడు చిన్న బుచ్చుకున్నంత త్వరగా ఆడదాన్ని నన్ను నేను చిన్నబుచ్చు కోలేకపోయాను . "ఊ" అన్నాను.
"ఊ - ఏమిటి - ఎలాగో అలా నిన్ను నాదాన్ని చేసుకోవాలను కుంటున్నాను " అన్నాడు.
'అదెలా సాధ్యం?" నా పెళ్ళి జరిగిపోయింది" అన్నాను అప్రయత్నంగా.
"నిజమే -- కానీ విధవా వివాహం అయితే నాకు చాలా సులువు. అప్పుడేవ్వరి అభ్యంతారాలు నేను లెక్క చేయనక్కర లేదు " అన్నాడు రాజశేఖరం.
2
ఉలిక్కిపడి "ఏమన్నావ్?" అన్నాను.
"తలిదండ్రుల చాటు బిడ్డ వుందనుకో. ఆమెను పెళ్ళాడాలంటే చాలా అడ్డంకులుంటాయి. ఆ అడ్డంకులు దాటి ముందుకు రావడానికి ఆ బిడ్డ అంగీకరించదు. భర్త చాటు భార్య వుందనుకో ఆమెకూ యింకో పురుషుడ్ని పెళ్ళి చేసుకోవడానికి కొన్ని అడ్డంకులుంటాయి. వాటిని అధిగమించడానికి సిద్దపడదు. విధవ విషయంలో యివన్నీ తారుమారు. ఆమెకు ఇష్ట మయినా ఆమెను వివాహం చేసుకునేందుకు ముందుకు వచ్చే పురుషులు చాలా తక్కువ . అవునంటావా?"
"ఏమో- నాకంతగా తెలియదు. కానీ నువ్వు నన్ను పెళ్ళి చేసుకోవాలనుకోడానికి దీనికీ సంబంధమేమిటి?" అన్నాను.
