నీడలోని ఆడది
వసుంధర
బజార్లో రాజశేఖరాన్ని చూడగానే ఆశ్చర్యం కంటే గగుర్పాటు ఎక్కువగా కలిగింది నాకు. అతను కూడా నన్ను చూసి ఆగాడు. గగుర్పాటు కంటే ఆశ్చర్యం అతని కళ్ళలో ఎక్కువగా వున్నట్టు కనబడుతోంది.
"నువ్వేమీ మారలేదు మోహనా!" అన్నాడతను.
"నువ్వు కూడా!" అన్నాను స్త్రీ సహజమైన సిగ్గుతో తలవంచుకుని.
"ఈరోజు చాలా సుదినం నాకు, నీ దర్శనమైంది."
నేను మరికాస్త సిగ్గుపడుతూ "ఎప్పుడొచ్చావిక్కడికి ?" అన్నాను.
"నిన్న వచ్చాను. నీ అడ్రసు వుంది. ఈవేళ సాయంత్రం వద్దామను కున్నాను. ఈలోగానే నీ దర్శన మైపోయింది. అలా పార్కులోకి వెళ్ళి మాట్లాడుకుందాం. వస్తావా?" అనడిగాడు రాజశేఖరం. నేను మౌనంగా తలూపి అతన్ని అనుసరించాను.
రాజశేఖరం మా అన్నయ్య స్నేహితుడు. మా ఇంటికి తరచుగా వచ్చి వెడుతుండేవాడు.
నాకు పదహారేళ్ళ వయసున్నప్పుడు అతనితో పరిచయమైంది. ఆడా, మగా , కొత్తా పాతా అని లేకుండా అందరితో సమానంగా చనువుగా మాట్లాడగల శక్తి నేర్పు రాజశేఖరాని కున్నాయి.
అందువల్ల అతను అన్నయ్య కోసమే వచ్చినా నాకీ సంభాషణ లలో నేనూ పాల్గొంటూ వుండేదాన్ని. అన్నయ్య తో ఉన్నంత చనువు గానూ అతనితో మసిలే దాన్ని కానీ అతన్నేప్పుడూ అన్నయ్య గా భావించలేదు. అందుకు కారణం అప్పుడప్పుడు అతను నావంక చూసే చూపులు.
ఎప్పుడైనా మా ఇద్దరికీ కొన్ని క్షణాల ఏకాంతం లభిస్తే చాలు -- అతడు నావంక అదోలా చూసేవాడు. ఆ చూపులు నాకు బాగుండేవి.
రాజశేఖరం అందంగా వుంటాడు. ఆకర్షణీయమైన పర్శనాలిటీ! ఊళ్ళో డబ్బున్న వాళ్ళబ్బాయి ని విన్నాను. నాకన్నే మనసుకు అతనిలో అన్నీ సుగుణాలే కనిపించాయి. నాకు తెలియకుండానే నేను అతని పట్ల ఆకర్షితురాలి నవ్వుతూ అతన్ని ప్రేమిస్తున్నాను. అన్నయ్యకోసం అతను మా ఇంటికి వస్తే నాకు చాలా సంతోషంగా వుండేది. అతడు రాని రోజున నాకు ఏదో వెలితి అనిపించేది.
ఒకరోజు అనుభవం మాత్రం నేను మరిచి పోలేదు. ఇంట్లో నేను ఒక్కర్తి నే వున్నాను. ఎవరో తలుపు తడితే తీశాను. రాజశేఖరం!
"ఇంట్లో ఎవరూ లేరండి !" అన్నాను.
రాజశేఖరం నిరుత్సాహంగా ముఖం పెట్టి -- "అయితే వెళ్ళి పోతాను కానీ నాకు దాహంగా వుంది. కాసిని మంచినీళ్ళు దొరుకుతాయా?" అనడిగాడు.
"ఎంతమాట? అలా కూర్చోండి -- నేను మంచినీళ్ళు తెచ్చి ఇస్తాను" అంటూ వంటింట్లో కి వెళ్ళాను. నేను మంచి నీళ్ళ గ్లాసుతో నడవలో కి వచ్చేసరికి అతను కనబడలేదు. చుట్టూ చూసి ఓసారి వీధిలోకి వెళ్ళాను. అతను లేడు. వెళ్ళిపోయాడని ఊహించుకుని వీధి తలుపులు వేసేసాను. అలా ఎందుకు చేశాడు చెప్మా అనుకుని గ్లాసు పెట్టడానికి వంటింట్లో కి వెళ్ళాను.
చటుక్కున తలుపు చాటు నుంచి రాజశేఖరం బయటకు వచ్చి నన్ను కౌగలించుకుని బలంగా ముద్దు పెట్టుకున్నాడు.
ఒక్క క్షణం పాటు ఏం జరిగింది నాకు తెలియలేదు. తెలిసేసరికి అంతా అయిపొయింది. విసురుగా అతన్ని వదిలించుకున్నాను.
అతను నన్ను వదిలి పెట్టి -- "దాహం తీరిపోయింది. చాలా థాంక్స్!" అన్నాడు.
ఏం మాట్లాడాలో నాకు తెలియలేదు. నన్ను నేను తమాయించుకుని -- "మీ రిక్కడే వున్నారా? మీరు వేల్లిపోయారనుకుని తలుపులు గడియ కూడా వేశాను. ఎవరైనా వస్తే ఏమనుకుంటారు?" అన్నాను.
"మీరేచేప్పండి!" అన్నాడు రాజశేఖరం.
నాకు అతని మీద కోపం రావడం లేదు. కానీ పరిస్థితికి చాలా భయంగా వుంది. అతన్ని అప్పటికప్పుడు అక్కణ్ణించి పంపెయకపోతే అతన్ని అదుపు చేయగల శక్తి నాకుండదేమో నన్న భయం కలిగింది. నేనింకా అటువంటి పరిస్థితిలో వుండగానే వీధి తలుపులు దడదడా మోగాయి.
నాకు చాలా భయం వేసింది -- "ఇప్పుడెలా?" అన్నాను.
రాజశేఖరం ఎక్కడా భయపడ్డట్లు కనబడలేదు. అయినా మగాడు. అతనికేం భయం? ఇల్లు కూడా మాది, మా ఇంట్లో నేనోక్కర్తినే వున్నప్పుడు ఓ మగవాడు తోడుండగా ఇంటి తలుపులు లోపల గడ వేసి వున్నాయంటే అన్ని విధాల నేనే దోషి నవుతాను.
"వెళ్ళి తలుపు తీయి" అన్నాడు రాజశేఖరం అజ్ఞాపిస్తున్నట్లు.
అతని ఏకవచన ప్రయోగం నాకు నచ్చలేదు. "నువ్వు తీయి" అన్నాను.
"నాకు అభ్యంతరం లేదు" అంటూ అతను కదిలాడు.
'అగు" అన్నాను. నిజంగానే వెళ్ళి తలుపులు తీసేస్తాడెమోనని భయం వేసింది. "నువ్విక్కడే వుండు. మళ్ళీ నేను పిలిచేదాకా కదలకు" అంటూ అక్కణ్ణించి బయల్దేరాను.
తలుపులు తీసేటప్పుడు మా ఇంట్లోని మనుషులేవ్వరూ రాకూడదని దేవుడికి దండం పెట్టుకున్నాను. అమ్మచుట్టా లింటికి వెళ్ళింది. తమ్ముడ్ని వెంట బెట్టుకుని, రాత్రి ఎనిమిది దాకా రాకూడదు. నాన్నగా రూళ్లో లేరు. అన్నయ్య ఆఫీసు వదిలినా ఇంటి కొచ్చే సమయమిది కాదు.
తలుపులు తీయగానే "ఏంటమ్మా -- యింతాలశ్యం చేశావ్!" అంటూ లోపల ప్రవేశించాడు అన్నయ్య.
ఏం చేయాలో తోయలేదు నాకు. అన్నయ్యను వారించే ఉపాయం తట్టడం లేదు.
క్షణాల మీద మెదడు పనిచేసింది. అన్నయ్య పట్ల నాకు చనువెక్కువ. వాడికి జరిగింది చెప్పెయడమే మంచిదని పించింది. ముద్దు విషయం మినహాయించి అన్ని చెప్పేసి , "మిస్టర్ రాజశేఖరం , ఇక యిలా రావచ్చు" అన్నాను.
నా మాటలు అన్నయ్య నమ్ముతాడన్న ఆశ లేకపోయినా అది నిజం కాబట్టి తడబడకుండా అంతా చెప్పగలిగాను. అబద్దాలు చెప్పడం ఇంకా లేనిపోని అనుమానాలకు దారి తీస్తుందని తోచింది నాకు.
రాజశేఖరం నవ్వుతూ లోపల్నుంచి వచ్చాడు. అతని ముఖంలో ఏ కోశానా భయం లేదు.
'అసాధ్యుడివిరా నువ్వు" అన్నాడు అన్నయ్య.
"నాకీ అవకాశం ఇప్పించిన నిన్ను మెచ్చుకోవాలి " అన్నాడు రాజశేఖరం.
అవకాశం అన్నయ్య ఇప్పించడమేమిటి? నేను అనుమానంగా అన్నయ్య వంక చూశాను.
నా కళ్ళలోని ప్రశ్నను చదివినట్లుగా అన్నయ్య ఇలా అన్నాడు. "కాస్త తెలిసిన అమ్మాయైతే అబ్బాయి కోరిక మీద ఏకాంతంలో వున్నప్పుడు తలుపులు గడియ వేసి రహస్యం మాట్లాడడానికి సంకోచించదు , ఎటొచ్చీ అందుకు అవలంభించాల్సిన పద్దతులు కొన్ని వున్నాయి అంటూ వీడు నాతో అంటే పందెం కాశాను. పందెపుటావేశంలో అది మనింట్లో నే అన్నా ఒప్పుకున్నాను. వీడి దగ్గర ఇలాంటి ట్రిక్కు లున్నాయని నాకు తెలియదు. బయటి నుండి రహస్యంగా గమనిస్తూ వీడ్ని లోపలకు రానిచ్చినందుకు , ఆ తర్వాత తలుపులు వేసినందుకు నీ గురించి చాలా ఆశ్చర్య పోయాను."
అన్నయ్య చెప్పినది వింటూ రాజశేఖరం చొరవకూ, ధైర్యానికి నేను ఆశ్చర్యపోయాను. అతను భయపడక పోవడానికి కారణం అర్ధం చేసుకో గలిగాను. అయితే అన్నయ్య ఇచ్చిన అవకాశాన్నతనెలా ఉపయోగించుకున్నాడో అన్నయ్య ఊహించుకోలేడు.
నవ్వడానికి ప్రయత్నిస్తూ "నీ స్నేహితుడు తెలివైన వాడని ఒప్పుకుంటాను కానీ అన్నయ్య ! ఎంత స్నేహితుడయినా ఇలాంటి పందేలు వేయకూడదు. ఏకాంతాలను దుర్వినియోగం చేసుకునే దుర్మార్గులు చాలామంది ఉంటారు" అన్నాను. నేను దుర్మార్గాలు అన్నప్పుడు రాజశేఖరం ముఖం అదోలాగయిపోవడం గమనించాను.
అన్నయ్య మాత్రం "మరొకడి తోటి మరొకడి తోటి అయితే పందెం ఎందుకు కాస్తానమ్మా! వీడు నా స్నేహితుడు, నా స్నేహితుడేలాంటి వాడో నీకువేరే చెప్పాలా ?" అన్నాడు గర్వంగా.
"నీ స్నేహితుడేలాంటి వాడో ఇప్పుడే తెలిసింది నాకు" అనుకున్నాను మనసులో.
ఆ తర్వాత నుంచి మా ఇద్దరి మధ్యనూ చనువు పెరిగింది. మళ్ళీ ఎన్నడూ ముద్దు పెట్టుకునేటంత దగ్గరగా రాకపోయినా చాలా చనువుగా మాట్లాడుకుంటుండేవాళ్ళం. అతను నన్ను ప్రేమిస్తున్నాననీ నేను లేకపోతె బ్రతకలేననీ కాస్త ఏకాంతం దొరికినప్పుడల్లా చెబుతుండేవాడు.
అతని మాటలు నాకు చాలా ఆనందాన్ని కలిగించేవి. ఆ ఆనందమే అతని మీద అభిమానాన్ని పెంచుతుండేది. ఇంట్లో పెద్దలు ఒప్పుకుంటే అతన్ని పెళ్ళి చేసుకునేందుకు నాకు అభుంతరం లేదు.
నాకు పెళ్ళి సంబంధాలు చూడడం ఆరంభమయింది. పదిహేడో ఏడు నడుస్తుండగా ఒక సంబంధం స్థిరపడింది. ఆ విషయము తెలిసిన రాజశేఖరం కంగారు పడ్డాడు.
