Previous Page Next Page 
వసుంధర కధలు-10 పేజి 30

 

    "ఇంకా అర్ధం కాలేదా? నీ కోసం నేను హంతకుడ్ని కాబోతున్నాను."
    'అంటే?" అన్నాను కంగారుగా.
    "నీ భర్తను చంపేసి -- విధవారాలినయిన నిన్ను పెళ్ళి చేసుకుంటాను."
    "చాలా బాగుంది " అన్నాను కంగారుగా. "హత్య చేస్తే పెళ్ళి మాట అటుంచి ముందు జైల్లో కేడతావ్! ఆ తర్వాత వురి తీసినా తీయవచ్చు ."
    "పోనీ మోహనా! నా తెలివి తేటల మీద నాకు చాలా నమ్మకముంది. పకడ్బందీగా పధకం వేసుకొని హత్య చేస్తాను. పట్టుబడనన్న విశ్వాసం నాకుంది. కర్మం చాలక పట్టుబడ్డానూ మరీ మంచిది. నిన్ను నాదాన్ని చేసుకోలేక పోయాక ఈ శరీరం ఉరికి గురయితే మాత్రం ఏం?" అన్నాడు రాజశేఖరం. అతని కళ్ళలో ఒకరకమైన దృడ నిశ్చయం , ఒక రకమైన నిస్పృహ కనబడుతున్నాయి.
    అతని మాటలు వింటుంటే , చూపులు చూస్తుంటే, ఇలాంటి వాడిని భాగస్వామిగా పొందే అదృష్టానికి దూరమయినానని బాధ కలిగింది. అయినప్పటికీ కూడా -- "జీవితం చాలా విలువయినది. నువ్వు తప్పుడు ఊహల్లో వున్నావు" అన్నాను అతనితో.
    "నువ్వులేని జీవితం గుడ్డి గవ్వ విలువ చేయదు నాకు" అన్నాడు రాజశేఖరం.
    'అందుకని హత్య చేస్తావా?" అటు నా భర్త ను హత్య చేసి, యిటు నువ్వు జైలు పాలయితే నాగతి ఏం కావాలో ఆలోచించేవా?" అన్నాను. నిజానికి నా గురించి స్వార్ధం నాచేత ఈమాట అనిపించలేదు. రాజశేఖరం మనసు మార్చాలనే అలాగన్నాను.
    "నా నిర్ణయం మారేది కాదు. నేను జైలు పాలు కానన్న నమ్మకం నాకుంది. ఒక వేళ జైలు పాలయితే నా కర్మ!" అన్నాడు రాజశేఖరం.
    "నాకోసం నీ మనస్సు మార్చుకోలేవా?" అన్నాను.
    "మార్చుకుంటాను కానీ నువ్వు నీ భర్త ను వదలి నాతొ వచ్చెయ్యాలి."
    పక్కన పిడుగు పడ్డట్లు అదిరి పడ్డాను. రాజశేఖరం మీద నాకు చాలా వ్యామోహమయితే వుంది గానీ సమాజానికి నచ్చని పని చేయలేను నేను. వీర్రాజు అంటే నా కిష్టం ఏర్పడలేదు గానీ నేనతన్ని వదిలి పెట్టలేను. అతడి నీడలో నేను బ్రతకాలని సమాకం శాసిస్తోంది. అ శాసనాన్ని వుల్లంగిస్తే సమాజం నన్ను క్షమించదు.
    "నువ్వడుగుతున్నది చాలా ఘోరంగా వుంది...." అన్నాను.
    "కన్నతండ్రి మాట కాదనలేక పోయావు. కానీ కట్టుకున్న భర్త ను వదిలి పెట్టడాని కేం?" అన్నాడు రాజశేఖరం సింపుల్ గా.
    "కట్టుకున్న భర్త కాబట్టే వదిలి పెట్టడం కష్టం !"
    "అయితే నేను హంతకుడ్ని కాక తప్పదు" అన్నాడు రాజశేఖరం.
    "వద్దు" అన్నాను.
    "నువ్వు నాతొ వచ్చేయడమా, నీ భర్త చావడమా?" ఈ రెండింట్లో కనీసం ఒక్కటయినా జరిగితీరాలి--" అన్నాడు రాజశేఖరం.
    "అయితే నాకు కాస్త ఆలోచించు కోవడానికి టైం యిస్తావా?"
    "ఇస్తాను కానీ ఇచ్చే ముందు ఒక చిన్న ప్రశ్న. నిర్మొహమాటంగా జవాబు చెప్పు. నేనంటే నీకు యిష్టమేనా?" అనడిగాడు రాజశేఖరం.
    అతని ప్రశ్నకు నా కనులలో నీళ్ళు తిరిగాయి. చీర కొంగుతో ఒత్తుకుంటూ -- "నా మనసులో ప్రేమంటూ వుంటే అది నీ ఒక్కడి కోసమే! ఈ ఒక్క ముక్క చెప్పడానికి నేను భయపడటం లేదు -- ఇక్కడెవ్వరూ లేరు కాబట్టి , నువ్వంటే నాకిష్టం లేకపోవడమేమిటి రాజా!" అన్నాను. అతన్ని నేను రాజా అని ఎప్పుడూ పిలవలేదు. ఇప్పుడు పిలవాలని పించింది.
    "నా ప్రశ్నకు జవాబు నీ పిలుపులోనే వుంది మోహనా! చాలా చాలా థాంక్స్. ఒకవారం రోజుల్లో నిన్ను మళ్ళీ కలుసుకుంటాను. అప్పటికి నీ నిర్ణయం అయిపోవాలి."

                                    3
    సాయంత్రం వీర్రాజు వచ్చేసరికి ఉప్మా టిఫిన్ చేసి సిద్దంగా వున్నాను. బుధవారం నాడు సాయంత్రానికి అతను నిర్దేశించిన టిఫిన్ అది.
    రోజూ మధ్యాహ్నం నిద్ర పోతుంటాను. ఈరోజు బజారుకు వెళ్ళినపుడు రాజశేఖరం తో మాట్లాడిన విషయం యీరోజు మధ్యాహ్నం నాకు నిద్ర రానివ్వలేదు. ఏం చేయాలో తోచకపోయినా రకరకాల ఆలోచనలు నా నిద్రను పాడుచేశాయి.
    సరయిన నిద్ర - అందులోనూ రోజూ అలవాటయినది లేకపోవడంతో సాయంత్రానికి కడుపులో కాస్త వికారంగా ఉంది. ఉప్మా తినాలని లేదు. నూనె లేకుండా ఏ ఇడ్లీ అయినా చేసుకుంటే బాగుండుననిపించింది. కానీ టైం టేబిల్ తప్పితే వీర్రాజు వూరు కోడు గదా!
    సరిగ్గా అనుకున్న టయిముకు వీర్రాజు ఇంట్లో అడుగు పెట్టి కుర్చీలో కూర్చున్నాడు. నేను వెళ్ళి బూట్లూ, సాక్సు విప్పాను. తర్వాత చేతులు కడుక్కొని ఇద్దరికీ చెరో ప్లేట్లో నూ టిఫినూ, రెండు గ్లాసులతో మంచినీళ్ళు తెచ్చాను.
    తనతో పాటే తనూ టిఫిన్ తినాలంటాడు వీర్రాజు. అది ప్రేమ పూర్వక మైన భర్త కోరిక కాక, బాలవంటంగా విధించిన మిలటరీ రూలులా వుండటం వల్ల కలసి టిఫిన్ తినే ఈ కార్యక్రమాన్ని నేను అనడించలేక పోతూన్నాను.
    టిఫిన్లో ఏమయినా లోపాలుంటే తప్ప అతను మాట్లాడడు. టిఫిన్ తిని మంచినీళ్ళు తాగేక, అప్పుడు మేము ఇద్దరమూ ఓ అరగంట ,మాట్లాడుకోవచ్చు. నేను చెప్పాదల్చుకున్నవన్నీ అ అరగంట లోనే ముగించేయాలి. అంతకుమించి ఒక్క క్షణం కూడా యెక్కువ వినడు వీర్రాజు. ఆ తర్వాత మళ్ళీ మాట్లాడుకునే అవకాశం మంచం మీదనే!
    "ఈరోజు మీతో చాలా మాట్లాడాలి!" అన్నాను.
    వీర్రాజు టైము చూసుకుని --" ఊ" అన్నాడు.
    "మీ క్రమశిక్షణ నాకు చాలా విసుగ్గా వుంది. అందరి లాగా జీవించాలని నాకు కోరికగా వుంది.,,," అన్నాను. ఈ మాటలు చెప్పాలని చాలా కాలంగా అనుకుంటున్నాను. ఆ ధైర్యం మాత్రం - ఈరోజే వచ్చింది. అందుకు రాజశేఖరం చాలా వరకూ కారణం కావచ్చు.
    "నాతొ కలిసి జీవిచాలను కుంటే ఈ పద్దతి తప్పదు" అన్నాడు వీర్రాజు.
    "మీతో కలిసి జీవిస్తూనే ఈ పద్దతి అనుసరించక పొతే?"
    "నిన్ను పుట్టింటికి పంపించేస్తాను" అన్నాడు వీర్రాజు చాలా మాములుగా.
    నాకు చాలా ఉక్రోషం వచ్చింది -- "నేను కూడా మనిషినే అని మీరు గుర్తించరా? నాకో కొన్ని ఆశలుంటాయని మీరూహించలేరా? మీ నియమాలతో నా కోరికలన్నీ నశించిపోతే అదే మీ కిష్టమా?"
    వీర్రాజు ఉదాసీనంగా నవ్వి -- "నీ ఆలోచనలకు అర్ధం లేదు. నేనెలా జీవిస్తూనానో అలాగే నిన్నూ జీవించమన్నాను. నేను మనిషినైతే నువ్వూ మనిషివే అవుతావు" అన్నాడు.
    అతను చెప్పింది నిజమే! అతను జీవితంలో ఆనందాన్ననుభవిస్తూ నన్ను దానికి దూరం చేస్తే నా ఆరోపణలకు అర్ధముండేది.
    "ఒకో మనిషికి ఒకో పద్దతి వుంటుంది. మీ పద్దతులు మీవి. నా పద్దతులు నావి. పెళ్ళి చేసుకున్నాను గదా అని అన్నీ మీ పద్దతులే అనుసరించమనడం అన్యాయం. నా పద్దతులు కొన్ని మీరు కూడా అనుసరిస్తే నాకూ తృప్తిగా వుంటుంది" అన్నాను.
    "నీ తృప్తితో నాకు నిమిత్తం లేదు. ఆడది నాకు అవసరం కాబట్టి పెళ్ళి చేసుకున్నాను. అందుకు బాధ్యతగా నీకు తిండి పెడుతున్నాను. బట్టలు కొంటున్నాను. సరదాలు తీరుస్తున్నాను. నీ ఇష్టం వచ్చినట్లు మసలు కొండుకు రోజూ ఉదయం పది గంటల నుంచి సాయంత్రం అయిదు వరకూ వదిలి పెడుతున్నాను. ఇంతకూ మించి నేనేమీ చేయలేను. ఇష్టమైతే నాతో వుండు. లేకపోతె వెళ్ళిపో!" అన్నాడు వీర్రాజు.
    అతని నిర్లిప్తతకు నాకు వళ్ళు మండింది. చాలా కాలంగా కాపురం చేస్తున్నా అతనంటే ప్రేమకలక్కపోవడానికి ఈ నిర్లిప్తతే కారణమేమోననుకున్నాను -- "సరేలెండి ! రోజూ ఉదయం పది నుంచి సాయంత్రం అయిదు వరకూ నాకు స్వతంత్ర్యమన్నారు గదా! ఆ సమయంలో పొరపాటు న కూడా మీరు ఇంటికి రాకూడదు . అది పూర్తిగా నా సమయం --"
    వీర్రాజు ముఖం అదోలాగై పోయింది -- "నువ్వు రమ్మన్నారాను. క్రమశిక్షణ అంటే క్రమశిక్షణే! ఎటొచ్చీ కానిపని ఏదైనా చేశావా భార్య అన్న కనికరం కూడా చూపను. క్రమశిక్షణ శరీరానికి, మనసు కు కూడా అవసరం --"
    కానిపని అంటే ఏమిటని నేనతన్ని అడగలేదు. అప్పటికే నేనో నిశ్చయానికి వచ్చేశాను. పర్యవసానం ఏమైనా భరించడానికి సిద్దంగా వున్నాను.
    "ఇంకా ఏమైనా చెప్పదల్చుకుంటే చెప్పు. అయిదు నిమిషాలు మాత్రమే వ్యవధి వుంది" అన్నాడు వీర్రాజు.
    నాకు చిరాకు వేసింది. "ఇంకేమీ లేవు. మీకు రెండు ఉత్తరాలు వచ్చాయి. తెచ్చి ఇస్తానుండండీ" అంటూ అక్కణ్ణించి లేచాను.
    వీర్రాజు పేరున ఎప్పుడూ కవర్లె వస్తాయి. అతని పేరున వచ్చిన వాటిని నేను చింపి చదవడానికి వీల్లేదు. నాకు పనికి వచ్చే సమాచారముంటే అతనే చదివి వినిపిస్తాడు. అందుకే అన్నయ్యనూ, వాళ్ళను నా పేరునే ఉత్తరాలూ వ్రాయమంటుంటాను.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS