Previous Page Next Page 
వసుంధర కధలు-8 పేజి 29

 

    "ఒరేయ్ - ఓ పావలా పకోడీలు తెచ్చి పెట్టారా భద్రం."
    గంగరాజు పకోడీలు తిని కొన్ని సంవత్సరాలై ఉంటుంది. మేనల్లుడు వర్ణిస్తూంటే - ఆయనకు జిహ్వా లేచివచ్చింది. తక్షణం అయన పకోడీలు కావాలన్నాడు. అయన నోటిలో మాట అలా ఊడి పడడమేమిటి - "ఏమిటన్నయ్యా - పకోడీ లంటున్నావ్ ?" అంటూ సుభద్రమ్మ వచ్చింది. గంగరాజు కోరిక విని - "కొనుక్కోవడ మెందుకూ -- చేసి పెట్టడానికి నేను లేనూ " అంటూ ఆవిడ ఉత్సాహంగా పకోడీలు చేసింది.
    గంగరాజు పకోడీలు తిన్నాడు. ఆయనతో పాటు ఇంటిల్లపాదీ తిన్నారు. చాలా ఎక్కువగా తిన్నాడేమో భాద్రానికి విరేచనాలు కూడా పట్టుకున్నాయి.
    గంగరాజు నిక్షేపంలా ఉన్నాడు. ఆయనకు మేనల్లుడి మీద అభిమానం పెరిగింది. "చాలా తృప్తిగా ఉందిరా. నామీద అపేక్షంటూ ఉంటె నీ ఒక్కడికే ఉందిరా . నువ్వు రాకపోతే ఎలాగుండేదో నా బ్రతుకు " అన్నాడాయన.
    అయన మాటలు వింటూ - హతవిధీ -- అనుకుంది సుభద్రమ్మ . గంగరాజు కేమైనా అయితే కుర్ర డాక్టరు కుద్వాసన చెప్పవచ్చు ననుకుందావిడ. ఆవిడ ఇంకా ఆలోచనలో ఉండగానే కడుపు పట్టుకుని పరుగెత్తాడు భద్రం. కుర్ర డాక్టరు వైద్యంతో - ఒక్క రోజులో నయమయింది భద్రానికి.

                                     3

    "మిస్టర్ బాబురావ్!" పిలిచాడు సైంటిస్టు రవి.
    "యస్ సార్."
    "ప్రయోగం ఎంతవరకూ వచ్చింది ?"
    "సగం దాకా."
    "హాట్ ప్లీట్ మీద పెట్టిన సొల్యూషన్ ఎంతవరకూ బాయిలయింది?"
    "సగం దాకా."
    "ఫర్నేస్ టెంపరేచర్ ఎంతవరకూ వచ్చింది?"
    "సగం దాకా."
    "వాటీజ్ దిస్ - " విసుగ్గా అన్నాడు సైంటిస్ట్ రవి. 'అన్నీ సగం దాకానే అయ్యా యంటున్నావు. పని పూర్తిగా అయిందేమైనా ఉందా?"
    "లేదు సార్!" అన్నాడు రవి అసిస్టెంట్ బాబూరావు.
    ఆ రీసెర్చి లాబొరేటరీలో అది రవి కోసం ప్రత్యేకించబడిన ప్రయోగశాల. దాన్నానుకునే ఉన్న ఒక చిన్న ఎయిర్ కండిషన్డ్ గదిలో రవి కూర్చుంటాడు. ఆ గదిలో కొన్ని లక్షలు ఖరీదు చేసే వైజ్ఞానిక యంత్ర సామాగ్రి ఉంది. వాటితో అతను ప్రయోగాలూ జరుపుతూ మిగతా పనులు అసిస్టెంట్ బాబూరావు చేత చేయించుకుంటాడు.
    రవి టైము చూసుకుని - "సరే, నీ దగ్గరున్న క్రోమియమ్ నైట్రేట్ సొల్యుషన్ ఓ ఇరవై సీసీలు తీసుకో. దానికి నిన్న చెప్పిన లిస్టు లోని సొల్యూషన్లన్నీ కలిపి వాటర్ బాత్ మీద పెట్టు. సరిగ్గా ఎంత సేపటికి ప్రెసిపిటేట్ వచ్చినదీ నాకు చెప్పు. టైము కరెక్టుగా చూడాలి సుమా" అన్నాడు.
    'ఒకే సార్ " అని బాబూరావన్నాడు. రవి వెళ్ళి తన గదిలో కూర్చున్నాడు.
    అలా ఓ అయిదు నిమిషాలు గడిచాక, తలుపు తోసుకుని  బాబూరావ్ వచ్చాడు , "వచ్చింది సార్!" అంటూ.
    'అరె- అప్పుడే ప్రెసిపిటేట్ వచ్చేసిందా ?" అన్నాడు రవి ఆశ్చర్యంగా టైము చూసుకుంటూ.
    'అబ్బే- ప్రెసిపిటేట్ కాదు సార్. ఆ ఎక్స్ పరిమింటింకా సగం దాకానే వచ్చింది. వచ్చినది ఓ ఆడమనిషి మీకోసం"
    "పేరు"
    "అప్పలమ్మ"
    రవి విసురుగా ముఖం పెట్టి , "అమ్మలమ్మేవరోయ్ . నా కోసమెందుకోచ్చింది ?" అన్నాడు.
    "ఎవరో పని మనిషి లాగుంది సార్ . "అన్నాడు బాబూ.
    "ఓహో" అంటూ లేచాడు రవి. అప్పలమ్మ ఎవరో అతనికి తెలిసింది. ఆమె పద్మావతీ వాళ్ళింట్లో పనిమనిషి. ఆమె ద్వారా పద్మావతి ఏదో కబురు పంపి వుంటుంది. పద్మావతీ ఇచ్చిందంటూ ఒక చీటీ ఇచ్చింది అప్పలమ్మ.
    పద్మావతీ రవి ప్రాణం కంటే మిన్నగా ప్రేమించాడు. రవి మినహా మరెవరితోనూ పని లేదంటుంది పద్మావతి. వీరిద్దరూ ఎముహూర్తన ప్రేమలో పడ్డారో గానీ అప్పట్నించీ వారికి సరైన ఏకాంతం లభించడం లేదు. ఏకంగా వివాహమే చేసుకోవచ్చు గానీ, పద్మావతి అక్కకింకా సంబంధమేదీ కుదరలేదు. అది అయ్యే వరకు పద్మావతి ఆగి తీరాలి.
    ఈ ప్రేమికులిద్దరికీ రోజుకు కనీసం ఓ రెండు మూడు గంటల సేపయినా ఏకాంతంగా గడపాలని వుంటుంది. కానీ కుదరడం లేదు. రవికీ, పద్మావతికీ కూడా బోలెడు మంది స్నేహితులున్నారు. ఎప్పుడు, ఎక్కడ వీరు కలుసుకున్నా ఎవరో ఒక తెలిసిన వ్యక్తీ తటస్థ పడడం జరుగుతోంది.
    రవి రూమ్ మేటు నిన్ననే ఊరికి వెళ్ళాడు. ఆ విషయన్నతను పద్మావతికి తెలియపర్చాడు. విషయం తెలుసుకున్న పద్మావతి ఇప్పుడు, అక్కడికి బయల్దేర బోతోందిట. కాబట్టి రవిని సెలవు పెట్టి వచ్చేయమని రాసింది.
    ఇది రవికి అపూర్వమైన అవకాశం. ఎంతో కాలంగా అటువంటి అవకాశం కోసమే అతను ఎదురు చూస్తున్నాడు. "నిజంగా నామీద పద్మావతికి ఎంత అభిమానం?" అనుకున్నాడతను. అభిమానంతో పాటు ఆమెకు నమ్మకం కూడా వుంది. లేకపోతె ఒంటరిగా తన గదికి రావాలంటుందా?
    'అలాగే అన్నారని చెప్పు" అన్నాడు రవి అప్పలమ్మతో. అప్పలమ్మ వెళ్ళిపోయేక అతను "మిస్టర్ బాబూరావ్ ఇందాక సగం దాకా వచ్చిన ప్రయోగాల్లో ఇప్పుడేన్ని పూర్తీ కాబోతున్నాయ్!" అన్నాడు.
    "సగం దాకా" అన్నాడు బాబూరావ్.
    రవి నవ్వి "సరేలే, పూర్తీ కాని పూర్తీ అయేలా పూర్తీ కాని వాటిని అక్కడితో ఆపేసి, లైబ్రరీ వర్కు చూసుకో. ఈరోజుకి నేను సెలవు" అంటూ అతడు అప్పటికప్పుడో చీటీ రాసి, బాబూరావ్ కిచ్చి , "మన బాస్ కందజెయ్ " అని లాబరేటరీ నుంచి బయటపడ్డాడు.

                          *    *    *    *

    రవి తన రూముకి వెళ్ళిన పదిహేను నిముషాలకు పద్మావతి వచ్చింది. ఆమె లోపలకు రాగానే తలుపులు వేసి, "నువ్వు లోపలకు రావడం ఎవరైనా చూశారా ఏమిటి?" అన్నాడతను తన్మయత్వంతో.
    "వీలైనంత జాగ్రత్త పడ్డాను. ఎవరూ చూసినట్లు లేదు"
    "ఎన్నాళ్ళకు మనకింత మంచి అవకాశం దొరికింది ?"
    "మనం మనసు విప్పి మాట్లాడుకునేందు కింతకంటే చక్కని అవకాశం మళ్ళీ రాదనుకుంటాను" అంది పద్మావతి.
    అంతలో ఎవరో తలుపు తట్టారు. పద్మావతి మంచం కింద దూరింది. రవి వెళ్ళి తలుపు తీశాడు. తలుపు తట్టినతను రవి కొలీగ్ నారాయణ. "ఈ వేళ పర్సనల్ వర్కుండి పోయి చాలా లేటై పోయాను. ఇప్పుడే బయల్దేరాను. తీరా చూస్తె మీరు మీ తలుపు తాళం వేసి ఉండక పోవడంతో మీరూ ఆఫీసుకి వెళ్ళలేదని గ్రహించాను. ఆఫీసుకు సెలవా ఏమిటి ఈ రోజున . అని అనుమానం వచ్చి...."
    "లేదండీ . నేను వెళ్ళి ఆరోగ్యం బాగుండ లేక తిరిగి వచ్చేశాను. విపరీతమైన తల నొప్పిగా ఉంది. కొంచెం ఫివరీష్ గా వుంది' అని రవి ఇంకా ఏదో అనబోతుండగానే నారాయణ చటుక్కున అతని చేయి పట్టుకుని చూసి , "అరె - ఫివరీష్ అని నెమ్మదిగా అంటారేమిటి? ఒళ్ళు వేడిగా ఉంటేనూ- డాక్టర్ని చూశారా, లేదా ?" అన్నాడు కంగారుగా.
    'అబ్బే - ఏం కంగారు లేదండీ. ఈ వేడి వేరు. రెండు మూడు గంటలు నిద్రపోతే నేను మళ్ళీ మామూలు మనిషి నై పోనూ" అని నారాయణకు సర్ది చెప్పి పంపించేసరికి రవికి తాతలు దిగి వచ్చారు. నారాయణ వెళ్ళిపోయాక రవి కింకో అయిడియా వచ్చింది. తలుపు తాళం తీసి వుండటం వల్లనే గదా. నారాయణ తలుపు తట్టెడు. తన గదికి రెండు గుమ్మాలున్నాయి. ఒక గుమ్మానికి తాళం వేసి రెండో గుమ్మం ద్వారా తను గదిలోకి వెళ్ళి పోవచ్చు. ఇంక అప్పుడు తమ ఏకాంతాన్ని కెవ్వరూ భంగం కలిగించ లేరు.
    ఈ ఉద్దేశ్యంతో అతను గది వీధి గుమ్మానికి తాళం వేసే ప్రయత్నంలో వుండగా "హో రవి! " అన్న పిలుపు వినిపించింది. తిరిగి చూస్తె స్నేహితుడు రామారావు.
    అప్పటి రవి అనుభూతి వర్ణించడం కష్టం. రామారావతని ప్రాణ మిత్రుడు. చాలా కాలం తర్వాత చూడ్డానికి వచ్చాడు. అదీ తనుత్తరం రాసేక. గది లోపల పద్మావతి. ఆమె తన ఆరో ప్రాణం. "నువ్వుత్తరంలా రాసేవ్. నేనిలా వచ్చేశాను" అన్నాడు రామారావు.
    "అవునవును . చాలా కాలం తర్వాత చూడ్డానికి వచ్చిన ప్రాణ మిత్రుడివి" అన్నాడు రవి కొంచెం గట్టిగా.
    "తాళం వేస్తున్నావ్ ఎక్కడికని బయల్దేరావ్?"
    కొంచెం తడపడినా రవి కాస్త మంచి సమాధానమే చెప్పగలిగాడు. "నువ్వోస్తావేమోనని అనుమానం వచ్చి ఆఫీసుకు సెలవు పెట్టి ఇంట్లో కూర్చున్నాను. ఇంత వరకూ రాక పోయేసరికి మరి రావేమో ననిపించి, మళ్ళీ ఆఫీసుకు బయల్దేరాను.
    "ఓహో " అన్నాడు రామారావు. చేతిలో ఉన్న సూట్ కేసు తో అతనింకా నిలబడే వున్నాడు. రవి గుమ్మానికి అడ్డంగా నిలబడి "ఒక్క నిముషం అగు. రాకరాక వచ్చిన ప్రాణ స్నేహితుడివి గదా. నీకు నివాళి ఇవ్వాలి" అంటూ లోపలికి వెళ్ళి తలుపులు వేసేశాడు.
    రామారావు ఆశ్చర్యంగా బయట నిలబడి పోయాడు.
    మళ్ళీ తలుపులు తెరుచుకునే;లోగా పద్మావతికి పలాయన మెలా చిత్తగించాలో బోధించాడు రవి. చిన్న ప్లేటులో హారతి కర్పూరం వెలిగించి అతను తలుపులు తీసేసరికి రెండో గుమ్మం తలుపులు తీసుకుని పద్మావతి పారిపోయింది.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS