4
మందు కోసమని డాక్టర్ మోహన్ ఎవర్నయినా తన యింటికి పంపించమన్నాడు. సమయానికి భద్రం ఇంట్లో లేడు. తను వెడతానని రంగమ్మ సిద్దపడితే సుభద్రమ్మ ఒప్పుకోలేదు. రోగిని చూసేకనే తనకా మందు అవసరం తెలిసిందని లేకపోతె కూడా తనా మందు తెచ్చి ఉండేవాడినీ చెప్పి, "మీకామందు అర్జంటుగా పంపాలి. లేకపోతె ఈ రాత్రి చాలా బాధపడతారు. నాకేమో అర్జంటు పని వుంది. ఇంటి నుంచి అలాగే మరో చోటికి వెళ్ళవలసి వుంది" అన్నాడు.
"డాక్టరు మనింట్లో మనిషి లాంటి వాడు, తప్పేం లేదు వెళ్ళి మందు తీసుకుని తొందరగా వచ్చేయ్ తల్లీ " అన్నాడు గంగరాజు. సుభద్రమ్మ ఎంత గొణుక్కున్నా , డాక్టర్ సైకిల్ వెనకాల ఎక్కి రంగమ్మ వెళ్ళిపోయింది.
"ముదనష్టపోడు . ఇదంతా కుర్రదాన్ని ఒంటరిగా తీసుకు వెళ్ళాలని వేసిన ప్లాను " అంది సుభద్రమ్మ.
"తప్పు సుభద్రా డాక్టరు చాలా మంచివాడు" అన్నాడు గంగరాజు. ఈలోగా రంగమ్మ డాక్టర్ ఇల్లు చేరింది. డాక్టరు ఆమెను ఎవరూ లేని ఒక గదిలోనికి తీసుకు వెళ్ళి "అలా కుర్చీలో కూర్చో ఇప్పుడే మందు తెచ్చి ఇస్తాను" అన్నాడు. ఆమె కూర్చుంది. అతను ఓ అయిదు నిమిషాల్లో వచ్చి మందు తెచ్చి రంగమ్మ చేతికిచ్చి "పాపం వచ్చేటప్పుడు నా సైకిల్ మీద వచ్చావు. ఇప్పుడు నడిచి వెళ్ళాలి. కాళ్ళు నొచ్చుతాయేమో " అన్నాడు.
"లేదండీ రిక్షాలో వెడతాను. నా దగ్గర డెబ్బై పైసలున్నాయి. నలబై పైసలు రిక్షా కు పొతే ఇంకా నేను శనక్కాయలు కొనుక్కుందుక్కూడా డబ్బులుంటాయి" అంది రంగమ్మ అమాయకంగా.
"నీకు వేరుశనక్కాయలంటే చాలా ఇష్టమా?"
'అవును" అంది రంగమ్మ.
"ఐతే మా ఇంట్లో బోలెడు కాయలున్నాయి కావాలా?
రంగమ్మ ఆశ్చర్యంగా డాక్టర్ని చూసి "డాక్టరు గారూ మీరు కూడా వేరు శనక్కాయలు అమ్ముతారా?" అంది.
'అమ్మను, కొంటాను " అని డాక్టరు కొంచెం స్వరం తగ్గ్గించి "నీకింకా ఏమేం ఇష్టమో చెప్పు !" అన్నాడు.
రంగమ్మ బాగా అలోచించి "ఎన్నని చెప్పను, తినే వాటిలో చాలావరకూ నాకు ఇష్టమే" అంది.
'అలాకాదు బాగా ఇష్టమైనవి వేరే వుంటాయి కదా ."
"ఆ ఆ బూరెలు, పులిహోర నాకు చాలా ఇష్టం "
"అది సరే , మరి నీకు మీ నాన్నంటే ఇష్టం లేదా. బావంటే ఇష్టం లేదా . అత్తయ్యంటే ఇష్టం లేదా" డాక్టరు కొంచెం వణుకుతూ "నేనంటే ఇష్టం లేదా ?" అన్నాడు.
రంగమ్మ చలించలేదు. "అందరూ నాకు ఇష్టమే. కానీ అందరి కంటే కూడా బూర్లూ, పులుహోరే నాకు ఇష్టం" అంటూ మందుతో సహా అక్కణ్ణించి లేచి వచ్చేసింది.
5
"ఒరేయ్ రవీ, నువ్వు సైంటిస్టువి గదా, మనిషి సులువుగా చచ్చిపోయే ఉపాయమేదైనా ఉంటే చెప్పవా?" అన్నాడు రామారావు.
"ఏం నాయనా , జీవితం మీద అంత విరక్తి కలిగిందా? నేను చనిపోవడానిక్కాదు , బ్రతకడాని కుపాయం చెప్పదల్చుకున్నాను" అన్నాడు రవి.
"బ్రతకడాని కుపాయం కూడా ఎందుకురా? ఏదో ఇంత తిండి లోపలికి పొతే చాలదూ?" అన్నాడు రామారావు.
"ఏమో అందరి సంగతీ నాకు తెలియదు గానీ నీలాంటి సెంటిమెంటల్ ఫెలో కి బ్రతకడాని క్కూడా ఉపాయం కావాలి. ఏ మాత్రం మనసుకు బాధకలిగినా చావు మీదకు దృష్టి పోతుంది నీకు. అలా దృష్టి పోకుండా చేయడమే బ్రతికించే ఉపాయం. అదిసరే గానీ నువ్వు మరీ ఇలా తయారయ్యేవేమిట్రా? మీ నాన్నగారుత్తరం రాస్తే ఇంకా ఏమిటో అనుకున్నాను , నిజమే!" అన్నాడు రవి.
"నాన్నగారు ఉత్తరం రాయడమేమిటి?" ఆశ్చర్యంగా అడిగాడు రామారావు.
"మా వాడుద్యోగం కోసం బెంగ పెట్టుకుని చిక్కి పోతున్నాడు. కొన్నాళ్ళు నీ సహచర్యంలో ఉంటె ఐనా బాగుంటుందేమోనని మీ నాన్నగారు నాకుత్తరం రాశారు. అందుకే నేనూ నీకుత్తరం రాసేను" రవి తర్వాత అన్నమాటలు రామారావుకి వినబడలేదు. అతని మనస్సు పాడయింది.
ఉద్యోగం ఉద్యోగం పాడుద్యోగం , ఎలా దొరుకుతుంది?
అదిలేక తన బ్రతుకే వేళాకోళమై పోయింది. ఉద్యోగంలో ఉన్న రవి కేం తెలుస్తుంది. నిరుద్యోగి బాధ! తను ఇలా వందేళ్ళు బ్రతికినా ఉద్యోగం దొరకదు. అందుకే చావడం మంచిది. అదీ ఇప్పుడే....అప్పుడు సుందరి....
సుందరి ఏడుస్తుంది.. 'పాపిష్టి దాన్ని . నా మాటలతో నిన్ను గాయపరచడం వల్లనే నువ్వీ అన్యాయానికి ఒడిగట్టావు" అని ఏడుస్తుంది.
రామారావులో ఒక రకమైన కసి బయల్దేరింది. చావాలి తను చావాలి! తన చావు పేపర్లో పడాలి. చచ్చేముందు నిరుద్యోగిగా తననుభవించిన క్షోభనంతా ఒక ఉత్తరంలో రాయాలి. ఆ ఉత్తరం కూడా పేపర్లో పడాలి. దాంతో ప్రభుత్వానికి బుద్ది రావాలి. తనలాగే ప్రతి నిరుద్యోగి కూడా ఆత్మహత్య చేసుకుంటే వాళ్ళు పడుతున్న బాధ ప్రభుత్వానికి అందరికీ తెలిసి అదెంత తీవ్రతరమైన సమస్యో అర్ధమవుతుంది. తన చావు మూలంగా ఈ సమస్య ఉదృతస్వరూపం అందరికీ గోచరిస్తే బ్రతికి సాధించలేనిది కనీసం చచ్చయినా సాధించిన ట్లవుతుంది.
ఆ రాత్రి రామారావు తన ఆత్మహత్య గురించీ, అనంతరం జరిగిన వాటి గురించి ఏవేవో కలలు కన్నాడు.
6
"గుమ్మడికాయ కూర ఎప్పుడైనా తిన్నావా మావయ్యా?" అన్నాడు భద్రం.
గంగారాజు నిట్టూర్చాడు. "ఎందుకురా భద్రం! తిండి గురించి నన్నడుగుతావు . ఈరోగం వచ్చేదాకా తిండి గొప్పదనాన్ని గురించి నే నాలోచించనే లేదు. చప్పిడి తిళ్ళతో జీవితాన్ని చప్పగా గడిపేశాను. డబ్బుంది ఏం లాభం సుఖపడక పోయేక! ఈ చివరి దశలో నాకు జ్ఞానోదయమైంది!"
"చివరి దశ అంటావేమిటి మావయ్యా. నువ్వు వెయ్యేళ్ళు వుంటావు. కావాలంటే నా ఆయుష్షు ధారపోస్తాను."
గంగరాజు ముఖం ఆనందంతో వెలిగింది. "నీ అభిమానం సంగతి నాకు తెలుసు గానీ ఏదో గుమ్మడికాయ సంగతి చెబుతున్నావ్ , చెప్పు !"
"ఆ గుమ్మడి కాయ ....ఆ కూర ఎంత బాగుంటుందంటే ఆ కాయలు కొనుక్కుని కూరోండుకోలేని వాళ్ళు దొంగ తనమైనా చేసి కాయలు సంపాదిస్తారుట. నీకు తెలుసుగా గుమ్మడి కాయల దొంగ సామెత కూడా వుంది" అని కొంచెం ఆగి ...."కూర భలే మజాగా వుంటుంది." అన్నాడు భద్రం.
"మన దొడ్లో పాదున పెందేలింకా ఎదిగి నట్లు లేదు. ఎదిగేక చేసుకోవచ్చునులే" అన్నాడు గంగరాజు.
"అదేంటి మావయ్యా అంతవరకూ ఆగా లేమిటి నీక్కావాలంటే ఈ పళంగా జజారు కెళ్ళి తేగలను. డబ్బులీలా పడేయ్ ."
"ఏమిట్రోయ్ . అంత హుషారుగా అడుగుతున్నావు! ఏమిటి నీ ఇంటరెస్టు " అన్నాడు గంగరాజు మర్మగర్భంగా.
"భలే వాడివి మావయ్యా. నేను కూరల్లో డబ్బులు కమీషన్ తీసేటంత కక్కుర్తి వాడిని అనుకున్నావా?"
"అలాగని నేననలేదే! గుమ్మడికాయల దొంగంటే నువ్వే భుజాలు తడుము కున్నావ్" అన్నాడు గంగరాజు నవ్వుతూ.
'చూశావా మావయ్యా, సామెత క్కూడా గుమ్మడికాయలే అందం. ఇంక గుమ్మడికి తిరుగు లేదనుకో" అంటూ భద్రం మేనమామ దగ్గర డబ్బులు తీసుకుని హుషారుగా వచ్చాడు. గుమ్మంలోనే రంగమ్మ ఎదురయింది.
"బావా, గుమ్మడి కాయల ధర నాకు తెలుసు?" అందామె.
"తెలిస్తే నాకేం భయం?"
"నీకు నాన్న రూపాయిచ్చాడు గదా. నాకో యాభై గ్రాముల వేరు శనక్కాయలు తెచ్చి పెట్టు. అప్పుడు నిజం గానే నీకు భయముండదు. లేకపోతె ముంతకింద పప్పు కొనుక్కునేందుకు నీకు డబ్బు మిగలకుండా చేయగలను నేను."
"సరెలేవే రంగమ్మా అలాగే తెస్తాను" అన్నాడు భద్రం.
"రంగమ్మేమిటి బావా, చక్కగా రంగా అని పిలవలేవు ?"
'అదేం పిలుపేవ్. అలా పిలవాలని ఎవరు చెప్పారు?"
"డాక్టరు చెప్పేడు. అయన నన్నలా పిలిచాడు కూడా. ఆ పిలుపు నాకు ఎంతో నచ్చింది. మగవాళ్ళు తన కిష్టమైన ఆడవాళ్ళని అలా పిలవాలిట. అందుకే నిన్నూ అలా పిలవమంతున్నాను."
"ఏమిటీ డాక్టరు నిన్ను రంగా అని పిలిచాడా? ఒంటి మీద చేయి కూడా వేశాడెమిటి ?"
"ఎందుకు ? నాకేం జబ్బు చేయలేడుగా " అంది రంగమ్మ అమాయకంగా.
"సరేలే" అని భద్రం బయటకు నడుస్తూ అనుకున్నాడు. "ఈ డాక్టర్ ని ఓ కంట కనిపెట్టాలి ?" అని.
"బావా!వేరుశనక్కాయలు మరిచిపోకు" అంటూ హెచ్చరించింది రంగమ్మ.
7
"ఇది సోడియం సయనైడ్ " అన్నాడు రవి.
రామారావు దానివంక పరీక్ష గా చూశాడు. అదొక చిన్న పోలితీన్ శాంపిల్ ట్యూబ్. దానికి స్క్రూ పద్దతి మూత వుంది. ఆ మూత తీసి లోన పదార్ధాన్ని చూపిస్తున్నాడు రవి.
రామారావోకసారి చుట్టూ చూశాడు. అది అందంగా కట్టబడిన లాబొరేటరీ భవనంలో ఒక చిన్న ప్రయోగశాల. అందులో పరిశోధనలు చేయడం రవి ఉద్యోగం. అతను నిజంగా అదృష్టవంతుడు.
"ఇది భయంకరమైన విషం. ఒక నిండు ప్రాణం తీయడానికి కొన్ని మిల్లీగ్రాముల పదార్ధమూ , కొనను సేకండ్లూ చాలు" అన్నాడు రవి.
రామారావు కళ్ళు మెరిశాయి. హటాత్తుగా అతని బుర్రలో ఏదో మెరిసింది. ఒక్క నిముషం సాలోచనగా దాని వంక చూసి "మరి దీన్ని నువ్వెందుకు ఉపయోగిస్తావ్?" అన్నాడు.
