Previous Page Next Page 
వసుంధర కధలు-8 పేజి 28

 

                                  మృత్యుదేవత

    పూర్వకాలంలో తపస్సు చేసుకునే ఋషులను రాక్షసులు పీడించేవారు. ఋషులకు తపోభంగం కావించడంలో రాక్షసుల ఉద్దేశం -- వారికీ తపో ఫలం దక్కరాదని, ఈనాడు యువకులను చదువే ఒక తపస్సునుకుంటే వారినో కొత్త రకం రాక్షసి పీడిస్తోంది. ఆ తపస్సయేవకూ ఆగి అప్పుడు తపో ఫలం మనుభవించదానికి వీల్లేని విధంగా నిరుద్యోగ రాక్షసి వారిని పీడిస్తోంది. అలా ఈ రాక్షసి చేత ప్రస్తుతం పీడించబడుతున్న వారిలో రామారావొకడు.
    రామారావు యమ్మే ఫస్టు క్లాసులో ప్యాసై రెండేళ్ళు దాటింది. ఈ రెండేళ్ళలోనూ అతను నలభై ఏడు అప్లికేషన్స్ పెట్టాడు. ఇరవై రెండు ఇంటర్వ్యూ లకు వెళ్ళాడు. ఇంతవరకు ఫలితమేమీ లేదు.
    రామారావుకు బాధా కారణం మరొకటుంది అతని తమ్ముడు క్రితం సంవత్సరమే యమ్మేస్సీ ప్యాసై - రీసెర్చి స్కాలర్ షిప్ సంపాదించుకున్నాడు. నెలకు మూడోందలోస్తున్నాయి. తన కింతవరకూ ఏమీ లేదు. అదృష్టవశాత్తూ అతని తలిదండ్రులు చాలా మంచివాళ్ళు. తొందరగా కొడుక్కుద్యోగం వస్తే తమని ఆడుకుంటే బాగానే ఉండునని వారికీ ఉన్నప్పటికీ -- అతను పడుతున్న మనోవ్యదను కూడా వారు గుర్తించారు. అందుకే అతని ఎదురుగా వారెప్పుడూ ఉద్యోగ ప్రసక్తి తీసుకొచ్చేవారు కాదు.
    తలిదండ్రుల ఈ మంచితనం అతనికి మరీ బాధాకరంగా వుండేది. అందులో అతను కొంచెం సెంటిమెంటల్ ఫెలో యేమో ఎప్పుడూ ఈ విషయమే ఆలోచిస్తూ అదోరకంగా ఉండేవాడు.
    ఇలా వుండగా ఒకరోజున రామారావు మేనత్త విమల తన పిల్లలతో సహా వచ్చి వాళ్ళింట్లో దిగింది. రామారావు మావయ్యకు ఉద్యోగరీత్యా రెండు నెల్ల క్యాంపు పడిందట. ఆ రెండు నెలలూ అన్నగారి దగ్గరుందామని ఆమె వచ్చింది.
    విమల కిద్దరు కూతూళ్ళు , ఒక కొడుకూను- పెద్ద కూతురు సుందరికి పంతొమ్మిడేళ్ళు , బియ్యే ఫైనలియర్ పరీక్షలు వ్రాసింది. రెండో వాడు శ్రీనివాస్ పదహారేళ్ళు. జూనియర్ ఇంటర్మీడియట్ చదువుతున్నాడు. మూడు అమ్మాయి పార్వతికి పదకొండేళ్ళు- ఫస్ట్ ఫారం చదువుతోంది. అందరికీ ఇప్పుడు సెలవులే!
    సుందరి చాలా అందంగా వుంటుంది. అందాన్ని మించిన చలాకీ గలది. ఎదుటివాళ్ళ నాటలు పట్టించడంలో అందే వేసిన చేయి. ఆమెను రామారావు కొచ్చి పెళ్ళి చెయాల నింట్లో అందరూ అనుకుంటున్నారు. రామారావు మాత్రం ఉద్యోగం దొరికేవరకూ పెళ్ళి సంగతి ఆలోచించ దల్చుకోలేదు.
    మరదలి రాక రామరావులో కొంత చైతన్యాన్ని తీసుకురావచ్చునని అతని తలిదండ్రులు ఆశించారు. అది కొంత వరకూ నిజమయింది కూడా. సుందరితో కాలక్షేపం చేస్తూ అతను ఒక వారం రోజుల పాటు తన విచారాన్ని మరిచిపోయి ఉత్సాహంగా కాలం గడిపేశాడు.
    ఒకరోజు సుందరి రామారావును చాలా దారుణంగా వేళాకోళం చేసింది. రామారావు స్పోర్టివ్ గానే తీసుకుని - "ఇప్పుడిలా ఎగురుతున్నావ్ -- మూడు ముళ్ళూ వేసి పెళ్ళి చేసుకున్నాక అమ్మాయి గారి రోగం కుదుర్తుంది -" అన్నాడు.
    సుందరి ఏ మాత్రమూ సిగ్గుపడకుండా - "షాదీ -ఔర్ తుమ్ సే ?" అంది.
    "ఏం- చేసుకోవా?"
    "ఎలా చేసుకుంటాను. ఆడపిల్లలా ఆర్ట్సు కోర్స్ చదివేవు. నీకు ఉద్యోగమేలా దొరుకుతుంది? ఉద్యోగం లేని మొగుడితో నేనేం సుఖపడతాను? చిన్న బావలా ఎంతో కొంత సంపాదించేవాడినే నేను పెళ్ళి చేసుకుంటాను -" అంది సుందరి. అలా అనడంలో ఆమె ఉద్దేశ్యం మరేమీ కాదు, కేవలం బావను రెచ్చగొట్టడం మాత్రమే! అయితే రామారావు మనస్సు చివుక్కుమంది. అయినా పైకి ఏ భావమూ కనిపించనీయకుండా -- 'అలాగే అనుకుంటుండు, నువ్వు చూస్తుండగానే ఈ వేళో రేపో పోస్టులో అపాయింట్ మెంట్ ఆర్డరు రాకపోదు -" అన్నాడతను.
    "అలాగే చూద్దాం -- నీకు పోస్టులో వచ్చేవి అపాయింట్ మెంట్ ఆర్డర్స్ కాదు. రిగ్రేట్ లేటర్సు -" అంది సుందరి వేళాకోళంగా.
    సరిగ్గా అదే సమయానికి "పోస్ట్ !" అంటూ పోస్టుమాన్ వచ్చాడు. రామారావుకి రెండు ఉత్తరాలు వచ్చాయి - ఒకటి - స్నేహితుడు రవి రాశాడు. అతగాడు దూరప్రాంతంలో ఓ రిసెర్చి లాబొరేటరీ లో పనిచేస్తున్నాడు. ఏమీ తోచడం లేదు - ఒక్క నాలుగు రోజులుండడానికి అక్కడకు రమ్మని రిక్వెస్టు . రెండవది - రెండవది ....రిగ్రేట్ లెటర్! ఒక కంపెనీ వారతన్ని ఉద్యోగంలోకి తీసుకోలేక పోతున్నందుకా లేఖలో విచారాన్ని వ్యక్తపరిచారు.
    "ఏమిటి బావా - ఉత్తరం " అని సుందరి అఫుగుతుంటే అతని గుండెలు పిండినట్లయింది. "నీ జోస్యం బాగా ఫలించిందిలే " అంటూ ఆ ఉత్తరాన్నామె మీదకు విసిరేశాడు.
    ఆ మర్నాటికతను ట్రయిన్ లో వున్నాడు.

                                     2
    "ఎలా వుంది మావయ్యా -" అన్నాడు భద్రం.
    'చాలా తృప్తిగా ఉందిరా . నా మీద అపెక్షంటూ ఉంటె నీ ఒక్కడికీ ఉందిరా. నువ్వు రాకపోతే ఎలాగుండేదో నా బ్రతుకు -" అన్నాడు భద్రం మావయ్య గంగరాజు.
    గంగరాజు ధనవంతుడు. ఆయనకు ఒక్కర్తే కూతురు.
    గంగరాజు డబ్బు సంపాదించడం కోసం జీవితంలో నానా కష్టాలూ పడ్డాడు. సంపాదించిన డబ్బును తన సుఖానికి వినియోగించుకోవాలన్న ఆలోచన అయన కెన్నడూ రాలేదు. ఎంతసేపూ డబ్బును పెంచడం గురించే ఆలోచించాడు. ఫలితంగా - అతి సామాన్యంగా జీవిస్తూ అయన నాలుగైదు లక్షల వరకూ కూడా బెట్టాడు. వైద్యం విషయంలో అయన చూపించిన కక్కుర్తి వల్ల భార్య ఓ అయిదేళ్ళ క్రితమే పోయింది. భార్య చనిపోయేక గంగరాజులో క్రమంగా మార్పు రాసాగింది. అయన మనసులో ఏదో మూల భార్య చావుకు తానే కారకుడన్న అనుమానం పీడిస్తోంది. అందువల్ల కనీసం తనకిప్పుడు మిగిలిన ఒక్క కూతురినైనా సుఖ పెట్టాలన్న భావం ఆయనకు కలిగింది.
    ఏ ముహూర్తాన గంగారాజుకీ అభిప్రాయం కలిగిందో కానీ అప్పట్నించీ అయన ఆరోగ్యం బాగోలేదు. అయన డబ్బు కక్కుర్తి వల్ల ఎవ్వరూ సరైన వైద్యం చేయలేదు. క్రమంగా అయన వ్యాధి మరింత ముదిరిపోసాగింది.
    ఆ పరిస్థితుల్లో గంగరాజుకి హటాత్తుగా ప్రాణాల మీద తీపి కలిగింది. తన వయసు నిండా నలబై అయిదేళ్ళు లేవు. జీవితంలో తను అనుబవించిన సుఖమంటూ లేదు. డబ్బు సంపాదించినందుకు - అనుభవించక పోయేక లాభమేమిటి ?
    ప్రాణాల మీద ఆశ పెరిగేక అయన తన కూతురికి శాశ్వత రక్షణ కల్పించాలని అభిప్రాయపడ్డాడు. అందుకే అయన తన చెల్లెలు సుభద్రమ్మను పిలిపించాడు. కొడుకు భద్రంతో సహా - పిలుపు అందగానే - వచ్చి పడింది సుభద్రమ్మ.
        సుభద్రమ్మ విధవరాలు. అత్తవారింట్లో ఆవిడ హీనంగా బ్రతుకుతోంది. ఆవిడకా పిలుపు ఆనందాన్ని కలిగించింది.
    సుభద్రమ్మకు అన్నగారి మీద ప్రేమ ఉంది. కానీ అంత కంటే ఎక్కువగా డబ్బుని ప్రేమిస్తోందావిడ. తన కష్టాలన్నీ డబ్బు లేకపోవడం వల్లనేననీ -- డబ్బుంటే అన్నీ పరిష్కారమయిపోతాయనీ ఆవిడ అనుకుంటోంది. ఆ డబ్బుండడం వల్లనే - అన్నగారి మీద ఆవిడకు మరింత అభిమానంగా ఉంటోంది. అంతే కాక - ఇరవయిఏళ్ళ - అన్నకూతురు రంగమ్మకు - భద్రం ఈడయినవాడు. వాళ్ళిద్దరికీ వివాహం నిర్ణయమయిపొతే చాలు- జీవితంలో మరేమీ అక్కర్లేదు.
    సుభద్రమ్మ వచ్చేక ఓ డాక్టరు కుదిరాడు. అతగాడు వైద్యం ప్రారంభించేక - కొంచెం గుణం కనిపించసాగింది.
    డాక్టర్ కుర్రవాడు - అందంగా ఉంటాడు. పేరు కూడా మోహన్. అతను గంగరాజు ఇంటి కొచ్చి నప్పుడల్లా రంగమ్మ కేసి అదోలా చూస్తాడు. ఆ చూపులు రంగమ్మకు ఇష్టంగానే ఉన్నట్లున్నాయి.
    ఇది తలచుకున్నప్పుడల్లా సుభద్రమ్మకు బెంగగా ఉండేది. ఎలాగో అలా ఆ కుర్ర డాక్టరు ని మానిపించి మరో ముసలి డాక్టర్ని కుదర్చాలని ఆవిడ ప్రయత్నించింది. అందుకోసం ఆవిడ అన్నగారికి నచ్చ కేప్పడానికి ప్రయత్నించింది.
    'అది కాదన్నయ్య -- నీ జబ్బు నాలుగైదేళ్ళుగా ముడురుతూ వచ్చింది. ఇంతలా ముదిరిన నీ రోగానికి కుర్ర డాక్టర్ ఏం వైద్యం చేయగలడు చెప్పు? అనుభవమున్నవాళ్ళేవరి చేతయినా ......"
    ఆవిడ మాట ఇంకా పూర్తీ కాకుండానే - "నీకు తెలియదే సుభద్రా -- ఈ డాక్టరు హస్తవాసి మంచిది. నా కితని మీద మంచి నమ్మకం కుదిరింది. ఇంతవరకు ఏ మందులు చూపించని గుణం - ఈయన చేత్తో ఇచ్చిన మందులు చూపించాయి. ఎప్పుడు గుణం కనిపించక పొతే అప్పుడే మానిపించేయేచ్చుగా -" అనేవాడు గంగరాజు.
    దాంతో సుభద్రమ్మకిది పని కాదనిపించింది. అన్నగారికి తెలియకుండా డాక్టరు తో మాట్లాడి - పద్యంగా ఏయే వంటకాలు వాడాలో , ఏవి వాడకూడదో కనుక్కుంది. ఆ తర్వాత డాక్టర్ వద్దన్న వాటి రుచుల గురించి అన్నగారిని రెచ్చ గొట్టమని కొడుకుని పంపించింది.
    మొదటి ప్రయత్నంగా భద్రం పకోడీల రుచి గురించి మావయ్య దగ్గర తెగ వర్ణించాడు. అవి తినని బ్రతుకు ఓ బ్రతుకు కాదన్నాడు. "మావయ్యా - ఒకసారి నాకు నీళ్ళ విరేచనాలు పట్టుకున్నాయి. నీరసంలో కదలలేని పరిస్థితిలో ఉండగా - హటాత్తుగా మధురమైన పరిమళం ముక్కుకు సోకింది. ఎక్కణ్ణించనుకున్నావ్ - వీధిలో ఒకడు బండిలో పకోడీలు వగైరాలు పెట్టి - ఆ బండి తోసుకుంటూ పోతున్నాడు. ఆ పకోడీల పరిమళం సమన్యమైందా? వీధిలో నుంచి వచ్చి నేనున్న గదిలోకి సోకింది. అంత నీరసంలో ఉన్న నాకు హటాత్తుగా బలం వచ్చి - లేచి పరుగెత్తు కెళ్ళి పకోడీలు కొడుక్కుని తినేశాను. విరేచనాలవుతున్నప్పుడు పకోడీలు తినకూడదని అమ్మ తిట్టింది. అయితేనేం ఆ పకోడీలు నన్నేమీ చేయలేదు. చేసినా నేమైపోయినా నాకు బాధలేదు."


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS