ఆకుపచ్చ చీర
--వసుంధర
అప్పటికే కవిత అక్కడ చాలా చీరలు చూసింది. ఆమెకు ఒక్కటీ నచ్చినట్లు అనిపించలేదు. సేల్సుమన్ ఓపికగా ఆమెకు అన్నీ చూపిస్తున్నాడు. ఆమె కొనడానికే వచ్చింది తప్పితే కాలక్షేపానికి రాలేదని సేల్సు మన్ కు తెలుసును. చాలా తరచుగా ఆమె ఆ షాపులో బట్టలు కొంటూంటుంది. ఆ నగరంలో ప్రముఖుడైన చలపతిరావు భార్య ఆమె.
"మేడమ్-కలగజేసుకుంటున్నందుకు మన్నించండి. ఆ ఆకుపచ్చ చీర మీకు ఎంతో బాగుంటుంది-" అన్న గొంతు ఒకటి కవితకు వెనుకనుంచి వినబడగా ఉలిక్కిపడి వెనక్కు తిరిగింది.
సుమారు ముప్పైఏళ్ల యువకుడు. ఎత్తయిన విగ్రహం. ఒత్తయిన జుట్టు. కళ్ళలో మర్యాద కనబడుతోంది.
ఆమె అతణ్ణి చూసి సిగ్గుపడింది. అప్రయత్నంగానే అతడు చెప్పిన ఆకుపచ్చ చీర వంక చూసింది. ఆమె కళ్ళలోని మెరుపును కనిపెట్టి సేల్సుమన్ ఆ చీర మడతలు విప్పి చూపిందాడు.
కవితకు ఆ చీర ఎంతో బాగున్నదనిపించింది. మరి తనకు ఇందాక ఎందుకు నచ్చలేదో!
ఆడదాన్ని ప్రభావితం చేయడానికి అపరిచిత యువకులు ప్రథమ సాధనాలు.
సేల్సుమాన్ సమస్య తీరిపోయింది. అతడా చీరను ప్యాక్ చేయించాడు.
చీర గురించి ఆమెకు సూచించిన యువకుడామెను సమీపించి-"నా అభిరుచిని మన్నించినందుకు థాంక్స్" అన్నాడు.
"సెలక్షన్ లో సహకరించినందుకు నేనే మీకు థాంక్స్ చెప్పుకోవాలి!" అంది కవిత.
"నేనన్నానని అంటున్నారా లేక మనస్ఫూర్తిగా థాంక్స్ చెబుతున్నారా-" అన్నాడతను.
అతడంత సూటిగా అడిగేసైకి మొహమాటపడింది కవిత-"అయ్యో-అలా ఎందుకనుకుంటున్నారు?"
"అయితే నాకు మిమ్మల్ని ఈ చీరలో చూడాలని వుంది. ఆ అవకాశం కల్పించగలరా?" అన్నాడతను.
"అంటే?" అంది కవిత తడబడుతూ.
"రేపు సాయంత్రం అశోకా పార్కులో మీకోసం యెదురు చూస్తూంటాను. ఇలా అన్నందుకు నన్నపార్దం చేసుకోకండి. నేను చాలా మర్యాదస్తున్ని మీరు వివావిత అని నాకు తెలుసు...." అని అతడు చరచరా అక్కణ్ణించి వెళ్ళిపోయాడు.
కవితకు ఆ రాత్రంతా నిద్రపట్టలేదు. "ఏమిటి అతగాడి ధైర్యం? బదులుకోసం కూడా ఎదురు చూడలేదు. తను వస్తాననే అనుకుంటున్నాడా?"
కానీ అతడు ప్రత్యేకంగా చెప్పనే చెప్పాడు....."నేను చాలా మర్యాదస్తున్ని. మీరు వివాహిత అని నాకు తెలుసు...."
అతడి మాటల్లో మర్యాద ధ్వనించింది.
వివాహిత అయిన స్త్రీ తనను గౌరవించి ఆరాధించే మగవాళ్ళను అభిమానించగలదు. కానీ తన శరేరాన్ని కాంక్షించే పరాయి మగవాడున్నాడంటే ఆ భావనే ఆమెకు కంటక ప్రాయమవుతుంది.
అతడి మంచితనాన్ని గురించి ముందామె మనసుకు నచ్చజెప్పుకుంటోంది. ఎందుకంటే అతడు ఎన్నికచేసిన ఆ చీర కట్టుకుని అతడికి కనిపించాలని ఆమెకు కోరికగానే వుంది.
ఆ చీరలో భర్త తనను చూసి-"మార్వెలస్!" అన్నాడు. తను సిగ్గుపడుతూంటే-"ఈ రోజు సిగ్గు కూడా కొత్త అందాలు సంతరించుకుంటోంది. అంతా ఆ చీర మహత్మ్యం-" అన్నాడు.
"అంటే నా అంధమేమీలేదా?" అంది కవిత.
"బంగారంలో రాళ్ళు పొదిగితే-బంగారానికే అందం వస్తుంది. కానీ అదిబంగారం కాబట్టే అందం వస్తుంది. నేను మెచ్చుకుంటున్నది ఈ చీరను కాదు. నీ అబిరుచిని. నీ వంటికి ఏమేమి నప్పుతాయో నీకు ఇంత బాగా ఎలా తెలుసా అన్నది నా ఆశ్చర్యం. అందమైన శరీరం వుంటే చాలదు. దన్ని అలంకరించుకొనడంలోనే వున్నది అభిరుచి...." అన్నాడు చలపతిరావు.
ఆ అభిరుచి తనది కాదు. ఆ యువకుడిది అతడు తన్నీ చీరలో చూడగోరాడు. అందులో తప్పున్నదా?
వున్నా తను ఉండనివ్వదు....
మర్నాడు సాయంత్రం ఆమె పార్కుకి వెళ్ళేసరికి అతడామెకోసం ఎదురు చూస్తున్నాడు.
"మీకు మరీ మరీ థాంక్స్!" అన్నాడతను.
"ఎందుకు?"
"నా మాట మన్నించినందుకు...."
కవిత ముఖం ఎర్రనయింది....."నేను మీ మాట మన్నించి రాలేదు. ఏదో పనుండి ఇలా వచ్చాను....."
"పోనీలెండి.....పనుండే వచ్చినా నేను చెప్పిన పార్కుకి నేను చెప్పిన సమయానికి నేను చెప్పిన చీర కట్టుకుని వచ్చారు. అదృష్టం ఇంతకంటే ఎక్కువగా ఎవరినీ కరుణించగలదనుకోను...." అన్నాడతను.
కవిత మాట్లాడలేదు. తనిప్పుడేం చేయాలీ అని ఆలోచిస్తున్నదామె. అతడు తన గురించి ఏమనుకుంటున్నాడో?"
"మీకు కుతూహలం తక్కువనుకుంటాను...." అన్నాడతను.
"ఏం?" అన్నదామె అప్రయత్నంగా.
"మీకు నేను అపరిచితున్ని అలాంటిది నేను మీకు సరిపడే చీర గురించి ఎలా చెప్పగలిగాను?" అన్నాడతడు.
"ఈ చీర నాకు సరిపడిందని ఎవరన్నారు? అంది కవిత.
"మీరిలా ఈ చీరతో ఇక్కడ నిలబడి వుండగా- ఎవరైనా గుడ్డివాడిక్కడికి వచ్చాడంటే-వాడిక్కూడా కళ్ళొస్తాయి-" అన్నాడతడు.
"అంటే?" అంది కవిత.
"అద్భుతమైన తన విశ్వరూపాన్ని సందర్శించే అవకాశమివ్వాలని పుట్టు గ్రుడ్డి అయిన ద్రుతరాష్ట్రుడికే కనులిచ్చాడు శ్రీకృష్ణుడు. ఇలాంటి సౌందర్యం దర్శించే భాగ్యం ఎవ్వరూ పోగొట్టుకొనరాదని ఆ సృష్టికర్తకు అనిపిస్తుంది-...."
కవిత సిగ్గుపడింది అతడు పొగడ్తలతో తనను ముంచేస్తున్నాడు. ఎందుకు?
"మీకు కుతూహలం చాలా తక్కువ...." మళ్ళీ అన్నాడతడు.
ఆమె చురుగ్గా అతడివంక చూసింది.
"నేను మీకీ చీర నెలా ఎన్నిక చేయగలిగానో ఆలోచించే ప్రయత్నం చేయడంలేదు మీరు....."
"చేశాను తెలియలేదు-...." అంది కవిత.
"కుతూహలమే కాదు. జ్ఞాపకశక్తి కూడా తక్కువే మీకు...."
"అంటే?"
"ఒక్క క్షణం అలా కూర్చోండి-" అన్నాడతడు.
కవిత కూర్చుంది. ఆమెకు కాస్త దూరంగా అతడు కూర్చున్నాడు.
"ఇప్పుడు గతం గురించి ఆలోచించండి...." అన్నాడతడు.
"ఎందుకు?"
"ఈ చీరకు సంబంధించిన మీ గతంలో ఏమైనా సంఘటన లుంటే గుర్తుకు వస్తాయి. అందుకు?"
