Previous Page Next Page 
వసుంధర కధలు-4 పేజి 28

 

                            కామినీ పిశాచి

                                                                     వసుంధర
    "నమస్కారం వెంకన్న గారు !" అన్నాడా యువకుడు.
    "కూర్చోండి " అన్నాడు వెంకన్న.
    "ఇదివరలో మీరు నన్ను ఓ హత్య కేసు నుండి రక్షించారు. మీదయ వల్ల జైలు పాలు తప్పించుకున్న నేను ఓ యింటి వాణ్ణి కాబోతున్నాను. " అంటూ ఆ యువకుడు వెంకన్నకు ఓ శుభలేఖ అందించాడు. వెంకన్న అది అందుకుని చదువుకున్నాడు. అ యువకుడి పేరు జనార్ధనరావు. అతని కాబోయే భార్య పేరు రాధ . వివాహాని కింకా పది రోజులు వ్యవధి వుంది.
    "అంటే పదిరోజుల్లో మీ అంతట మీరే జైలుకు వెడుతున్నారన్న మాట!" అన్నాడు వెంకన్న.
    యువకుడు ఆశ్చర్యంగానూ, కంగారుగాను "ఏం!" అన్నాడు.
    "పెళ్ళయ్యేవరకే ఇల్లు ఇల్లు. ఆ తర్వాత నుంచి అది జైలు. ఆ జైలుకు జైలరు భార్య" అని వెంకన్న ఏదో అనబోతుండగా బల్ల మీద ఫోన్ మ్రోగింది."
    "నేను వంటింట్లోంచి మాట్లాడుతున్నాను. మీ మాటలు నాకు వినబడుతున్నాయి. నేను మీకు జైలర్నా" అని పద్మావతీ దులిపేసింది ఫోన్ లో.    
    వెంకన్న ఫోన్ క్రింద పెట్టేసి స్వరం తగ్గించి "నా మాటలు వంటింట్లో ని నా భార్యకు వినబడ్డాయి. వెంటనే తీడుతూ ఫోన్ చేసింది. చూశారా -- పెళ్ళయ్యాక వాక్స్వాతంత్రం కూడా వుండదు"అన్నాడు.
    వెంకన్న అసిస్టెంట్ సీతమ్మ, రాజమ్మ ముసిముసిగా నవ్వుకున్నారు.
    జనార్ధనరావు కూడా నవ్వి "రాధతో నేను ప్రారంభించ బోయే జీవితాన్ని జైలు జీవితంతో పోల్చబడింది. అసలు నాకు జీవితం మీద ఆశ పుట్టించినదే రాధ పైన ప్రేమ. లేకపోతె నేను ఏ నాడో చచ్చిపోయి వుండేవాడ్ని " అన్నాడు.
    వెంకన్న అతన్ని వివరాలడగలేదు. ప్రతి ప్రేమికుడూ ప్రియురాలి కారణంగానే తన శూన్యజీవితం నిండుగా అయిందని అనుకుంటాడు. అది పెద్దగా పట్టించుకోవాల్సిన విషయం గాదు.
    "మీ ఆహ్వానానికి థాంక్స్!" అన్నాడు వెంకన్న.
    ఆ యువకుడు వెళ్ళిపోయాడు.
    "ఈ కుర్రాడికి భయమూ, కంగారూ యెక్కువ. ఓ హత్య కేసులో పోలీసులు ఇతన్నీ ప్రశ్నించారు. దానికే భయపడిపోయాడు. అతనికేం ప్రమాదం లేదని నేను చెప్పినా తనా హత్యకేసులో ఇరుక్కున్నాననే భావించాడు. కేసు ముగిశాక తను పెద్ద గండం తప్పించుకున్నాననీ - అదీ నా కారణంగాననీ నమ్మాడు. ఇలాంటి వాడు ఎప్పుడైనా నిజంగా తనే హత్య చేస్తే యెలా ప్రవర్తిస్తాడో?" అన్నాడు వెంకన్న.

                                    2
    "శవాన్ని చూస్తావా?'అనడిగాడు ఇన్ స్పెక్టర్ శంకర్రావు.
    వెంకన్న తలాడించాడు. ఇద్దరూ వెళ్ళి శవాన్ని చూశారు.
    నీటిలో చావడం వల్ల శవం బాగా ఉబ్బి ఉంది.
    "ఇది హత్యేనా అయిండాలి. ఆత్మహత్యేనా అయుండాలి!" అన్నాడు శంకరరావు.
    "అయ్ సి - మరింకే అవకాశమూ లేదా?' అన్నాడు వెంకన్న వెటకారంగా.
    శంకర్రావు నాలిక్కరచుకుని "నా ఉద్దేశ్యమేమిటంటే ఇది ప్రమాదవశాత్తు అనుకోకుండా జరిగిన సంఘటన కాదని!" అన్నాడు.
    "వివరాలు చెప్పగలవా?" అన్నాడు వెంకన్న.
    "హతురాలి పేరు రాధ...."
    "హతురాలు అంటే హత్య చేయబడిందనే నువ్వు నమ్ముతున్నావన్న మాట!' అన్నాడు వెంకన్న సాలోచనగా.
    "పోనీ.... చనిపోయిన అమ్మాయి పేరు రాధ. ఆమె వివాహాని కింక మూడు రోజుల వ్యవధి ఉంది. వారిది ప్రేమ వివాహం. వివాహానికి ముందే ఇద్దరికీ బాగా పరిచయం వుంది. ఇద్దరికీ ఒకరంటే ఒకరికి ప్రాణం అని రాధ ఇంట్లోని వారంటున్నారు. రాధ చనిపోయిన సమయంలో ఆమెకు కాబోయే ఆగిపోయిన భర్త జనార్ధరావుకు పరిష్టమైన ఎలిబీ వుంది. అతన్ని ప్రశ్నిడ్డామను కుంటే మనిషి మెంటల్ షాక్ తిన్నవాడిలా అయిపోయాడు, కానీ" .....అని ఆగాడు శంకర్రావు'.
    "కానీ....?!" అన్నాడు వెంకన్న కుతూహలంగా.
    "రాధ చనిపోవడానికి రెండు మూడు రోజుల ముందు నుంచీ ఆ యింటి వాతావరణం హటాత్తుగా మారిందనీ-- అంతవరకూ ఉత్సాహంగా ఉండేవారంతా మౌనంగా గంభీరంగా అయినారనీ చుట్టూ పక్కల వాళ్ళు చెప్పారు. రాధ రేపు చనిపోతుందనగా కాబోలు -- జనార్ధనరావు, రాధ కలిసి ఒక నర్సింగ్ హోం కు కూడా వెళ్ళినట్లు తెలిసింది. అక్కడ ఎంక్వయిరీ చేయగా ఏమీ సమాచారం లభించలేదు. ఇంకకీ విషయం రాధ శీలానికి సంబంధించినదని మాకో అనుమానం వచ్చింది. ఎందుకంటె....." మళ్ళీ ఆగాడు శంకర్రావు.
    "ఎందుకంటె ....?!" అనడిగాడు వెంకన్న.
    "రాధ కన్య కాదనీ.....మరణించడానికి పూర్వం ఆమెకు పురుషుడితో కనీసం ఒక్కసారైనా అనుభవం అయి వుండాలనీ డాక్టరు అంటున్నాడు..." అన్నాడు శంకర్రావు.
    "వ్వాట్!" అన్నాడు వెంకన్న. ఇటువంటిది అతనూహించినట్లు లేదు. ఒక్క క్షణం ఆలోచనలో పడిపోయాక "సరే నీ పూర్తీ కధ చెప్పు!" అన్నాడు.
    "చెప్పడానికే ముంది? రాధ , జనార్ధనరావు ఒకర్నొకరు ప్రేమించుకున్నారు , కలిసి మెలిసి తిరిగారు. ఇంటిల్లపాదికీ ఈ ప్రేమ ఇష్టం కాగా అది వారి పెళ్ళికి దారి తీసింది. అయితే జనార్ధనరావు కు ఏ కారణం గానో రాధ శీలం పైన అనుమానం కలిగింది. అతని అనుమానానికి స్పష్టమైన ఆధారం ఏదో లభించింది.  అది రాధ ఇంట్లో చెప్పాడు. దాంతో ఆ ఇంటి వాతావరణం మారిపోయింది. అందరికీ రాధ భవిష్యత్తు గురించి బెంగ పట్టుకుంది.
    అపుడు జనార్ధనరావు తన అనుమానాన్ని పూర్తిగా బలపర్చుకోవడం కోసం ఆమెను ఓ నర్సింగ్ హోం కు తీసుకువెళ్ళి పరీక్ష చేయించాడు. అతడి అనుమానం బలపడింది. ఆ నర్సింగ్ హోం నడిపే లేడీ డాక్టరు రాధ గురించి తనకేమీ తెలియదనడానికి కారణం అదే! జనార్ధనరావు రాధతో తెగతెంపులు చేసుకోవాలనుకున్నాడు. మర్నాడామే చనిపోయింది. ఊరి చివరకు వెళ్ళి నదిలో దూకింది. తన ప్రేమ విఫలమైందన్న విరక్తితో ఆమె నదిలో దూకిందా- లేక తన నామే మోసం చేసిందన్న కసితో ఆమె పై పగ బట్టి జనార్ధనరావామేను హత్య చేశాడా అన్న విషయం కాలమే తేల్చాలి. ఇప్పుడు జనార్ధనరావుకున్న ఎలీబి ని చేదించడం మావల్ల కాదు. అందువల్ల మాకు ఆత్మహత్యే గత్యంతరమవుతుంది--" అన్నాడు శంకరరావు.
    "మధ్య మీ రెందుకూ ఆత్మహత్య చేసుకోవడం?" అన్నాడు వెంకన్న నవ్వుతూ.
    'అంటే నా ఉద్దేశ్యం -- ఇది హత్యా, ఆత్మహత్యా అన్న విషయం తేల్చడంలో మాకిప్పుడు ఆత్మహత్య మాత్రమే ఎన్నుకోవాలని వుంది అని . అయినా కేసులో అడుగు ముందుకు వెయ్యని పరిస్థితుల్లో యిలాంటి నిర్ణయాలు తీసుకోవడం ఆత్మహత్య తో సమానమే గదా --' అన్నాడు శంకర్రావు.
    వెంకన్న అక్కణ్ణించి రాధ యింటికి వెళ్ళాడు. వాళ్ళంతా దుఖ సముద్రంలో ఉన్నారు. శవం తమకు అప్పగించబడగానే అంత్యక్రియలు జరిపించడానికి కూడా యేర్పాట్లు చేస్తున్నారు. ఇంట్లో యెవ్వరికీ కూడా జనార్ధనరావు మీద అనుమానం లేదు. పైగా అంతా అతన్ని దేవుడని అంటున్నారు.
    ఇది చాలా విడ్డూరంగానే తోచింది వెంకన్న కు.
    ఇంట్లో ఒక్కరు కూడా జనార్ధనరావు ను అనుమానించడం లేదు. వాళ్ళ ఆదరాభిమానాలు పొందడానికి జనార్ధనరావు ఏం చేశాడు? రాధ శీలవతి కాదని తెలిసి కూడా ఆమెను క్షమించాడా? ఆమెను వివాహం చేసుకునేందుకు సిద్దపడ్డాడా? అది భరించలేకనే రాధ ఆత్మహత్య చేసుకుందా? లేదా జనార్ధనరావు నయవంచన చేసి రాధను చంపెశాడా?"
    మరి అతడికున్న ఎలిబీ....?
    దాందేముంది! రాధ నతను స్వయంగా చంపనవసరం లేదు, ఎవరి ద్వారానైనా చంపవచ్చు.
    ఎవరి ద్వారానైనా అన్న ఆలోచన రాగానే వెంకన్న ఉలిక్కిపడ్డాడు.
    శంకర్రావుకి ఆలోచన ఎందుకు రాలేదు?
    శంకర్రావుకా ఆలోచన యెందుకు రాలేదో -- వెంకన్నకు వెంటనే స్పురించింది.
    వెంకన్న కే కాదు. ఒక్కసారి జనార్ధనరావు ముఖం స్పురిస్తే యెవరికైనా అతను హత్యలు చేయడానికి మనషులను వినియోగించగల సమర్ధత ఉన్నవాడన్న ఆలోచన రాదు.
    అలాంటివాడ్ని హంతకుడని మాత్రం యెలా అనుకునేది?
    హత్య సంగతి వేరు. తాత్కాలికావేశంలో మనిషి యెంత ఘోరమైన చేయగలడు. కానీ హత్యలు చేయించడానికి తాత్కలికావేశం చాలదు.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS