'కెవ్వుమంది'-- ఆ కేకకి మొదట ఇంట్లో వాళ్ళూ తరువాత ఇరుగు వారూ పొరుగు వారూ అంతా వచ్చి చేరారు.
అందులో ఒకరు గబగబా పరుగెత్తుకు వెళ్లి డాక్టర్ని తీసుకు వచ్చారు.
'ప్రాణం ఎప్పుడో పోయింది.' అన్న ఒక్క మాట చెప్పటం కంటే మరేమీ చెయ్యలేదు ఆ డాక్టర్.'
తాయారూ పిల్లలు ఆ శవం మీద పడి ఏడుస్తుంటే ఇరుగూ పొరుగూ వాళ్ళకి ధైర్యం చెప్పి, వోదార్చి తరువాత జరగవలసిన ఏర్పాట్లన్నీ చేశారు.
ఆ తరువాత వూళ్ళో జనం అంతా లక్ష్మీపతి చావుని గురించి రకరకాల వ్యాఖ్యానాలు చేశారు.
'అది అలా వెళ్ళిపోయింది అన్న వార్త విన్న దగ్గర్నంచి మళ్లీ వీధి మొహం చూడలేదు మానవుడు. అంత సిగ్గుతో కుమిలిపోయాడు.మనో వ్యాధితో కృంగి పోయాడు-- దుర్మార్గపు ముండ అతని దగ్గర డబ్బు వున్నన్నాళ్ళు గుంజు కున్నదే కాకుండా చివరికి మనిషి ప్రాణం కూడా తీసింది -- అంత షాక్ తగలక పొతే ఇలా అర్ధాంతరంగా పోవలసిన మనిషి కాదు' అని కొంతమంది అంటే,
'ఆ-- జరిగిన పరాభవానికి తట్టుకోలేక, ఇంట్లో వాళ్ళకీ వూళ్ళో వాళ్ళకి మొహం చూపించలేక ఏ మందో మాకో మింగి వుంటాడు, లేకపోతె రాత్రి హాయిగా తిండి తిని పడుకున్న మనిషి ప్రొద్దున్న కి చచ్చి వుండటం ఏమిటి?' అని బుగ్గలు నొక్కుకున్నారు కొందరు.
ఆ అన్ని రకాల వార్తలూ తాయారు దాకా వస్తూనే వుండేవి. అందులో ఏది నిజం అయినా తనిప్పుడు చేయగలిగింది ఏమీ లేదు. జరిగి పోయిన డానికి కారణాలు వెతుక్కుంటూ బాధపదేకంటే ముందు తనకీ పిల్లలకీ ఎలా గడుస్తుందో , పిల్లవాడు చేతికి అంది వచ్చే దాకా తను ఎంత జాగ్రత్తగా సంసారం గడుపుకు రావాలో ఆ విషయాలే ఆలోచిస్తూ వో నిట్టుర్పూ విడిచేది.
పది రోజులు గడిచిపోయాయి.
ఆ వాళ కరణం కామయ్య గారు వచ్చి పరిస్థితంతా వవరించి చెప్తుంటే -- తాయారు నవనాడులూ కృంగి పోయినట్లయాయి-- తన భర్త కొద్దో గొప్పో అప్పులు చేసి వుంటాడు అనే అనుకుంది కాని పరిస్థితి ఇంత దారుణంగా వుండి వుంటుందని ఆమె ఏనాడూ ఊహించలేదు. అతనికి అప్పు ఇచ్చిన వాళ్ళంతా కట్ట కట్టుకుని ఇంటి మీద పడి అల్లరి చెయ్యకుండా కరణం గారిని పంపించారు పరిస్థితులు వివరించమని.
'పిల్లలు , మైనర్లు వుండగా ఆస్తి మీద అప్పు చేసే హక్కు అతనికి లేదు. మీరు కోర్టుకి ఎక్కండి.' అని ఒకరిద్దరు సలహా కూడా ఇచ్చారు.
'అయిన వాళ్ళందరి దగ్గర డబ్బు తీసుకున్న మాట ఖర్చు చేసిన మాటా నిజమే. ఇవాళ నేను లా పాయింట్లు లాగి అవి ఎగివేసి వాళ్ళందరి వుసురూ పోసుకోటం ఎందుకు-- ఫరవాలేదు. పిల్లలూ నేనూ ఎలాగో బ్రతకలేక పోము, ఆస్తి అమ్మి అప్పులన్నీ తీర్చేస్తాను.' అంది తాయారు.
ఆ కుటుంబం పట్ల జాలి కలిగినా -- అప్పులు ఎగవేయ్యమని కరణం గారు మాత్రం ఎలా సలహా ఇస్తారు. చివరికి ఇల్లు పొలం అంతా అమ్మితే అప్పులకి సరిపోయింది.
ఇంట్లో వున్న కాస్త ఖరీదయిన సామాను కూడా అమ్మేసి ఆ డబ్బు తీసుకుని పుట్టింటి కి వచ్చింది తాయారు-- తల్లి బలవంతం మీద. అక్కడ పరిస్థితి కూడా అంతంత మాత్రం గానే వుంది. తాయారు తండ్రి పక్షవాతం లో మంచంలో ఉన్నాడు. అన్నగారికీ చాలీ చాలని జీతం, గంపెడంత సంసారం , అలాగే ఆ కుటుంబాన్ని ఈడుకు వస్తున్నాడు. ఇంక తనూ పిల్లలూ పూర్తిగా అతని మీద ఆధార పడితే అది అతనికి మోయలేని బరువవుతుందని తయారు కి తెలుసు-- కాని కనీసం రెండు మూడేళ్ళు ఎలాగో గడిపేస్తే అప్పటికి పెద్దవాడు మోహన్ ఏదో చిన్న వుద్యోగం చూసుకుంటే తనూ పిల్లలూ వేరే వుండొచ్చు . ఇప్పటి నుంచీ వేరే వుండాలంటే చేతిలో వున్న నాలుగు డబ్బులూ ఎన్నాళ్ళు వస్తాయి? ఆ తరువాత ఏం పెట్టుకు తింటారు? అని అన్నీ ఆలోచించే తాయారు ఆ పంచలో చేరింది.
ఇంట్లో ఖర్చులకీ, తండ్రి మండులకీ మాకులకీ, పిల్లల బట్టలకీ ఇలా ఎన్నో విధాల తన డబ్బు వాడుతూనే వున్నా ఆడబిడ్డ కీ సంతానానికీ వూరికే తిండి పెడుతున్నట్లే విసుక్కునేది వదిన గారు. అన్నగారు విని కూడ మొహం చాటు చేసేవాడు. తల్లి వోసారి ఏడ్చి తన దురదృష్టానికి, కూతురి దురదృష్టాన్ని తిట్టుకునేది -- అలాగే రెండు సంవత్సరాలు గడిచి పోయాయి. మోహన్ స్కూల్ ఫైనల్ చదువు తున్నాడు-- స్కూల్లో జీతం కట్టక్కర్లెకుందా సదుపాయం కల్పించారు స్కూలు అధికారులు -- కాని ఆ సంవత్సరం పబ్లిక్ పరిక్షకి ఫీజు కట్టాలి. తాయారు దగ్గర వున్న డబ్బు కాస్తా అంతకు ముందే అయిపొయింది.
తన దగ్గరా డబ్బు లేదనీ, ఇప్పటికే తెలిసిన వాళ్ళందరి దగ్గర అప్పు తీసుకున్నాననీ, ఇంక తనకి వూళ్ళో అప్పు పుట్టదని విసుక్కున్నాడు మేనమామ.
'అంత డబ్బు లేని వాళ్ళు చదువులకి ఎగబడటం ఎందుకు ? ఏ చిల్లర దుకాణం లోనో పద్దులు వ్రాయటానికి కుదురుకుంటే ఈ బాధలేమీ లేకపోయేవి గా' అంటూ మాటలు విసరటం మొదలు పెట్టింది అతని భార్య.
'ఆ చిరాకులో ఏదో అనేశాడే కాని మామయ్యా ఎలాగో చూసి ఏర్పాటు చేస్తాడులే బాబూ-- నువ్వేం బాధపడకు' అని వోదార్చించి అమ్మమ్మ.
మోహన్ కి భోరున ఏడావాలని పించింది కాని ఇంట్లో అందరి ముందు ఏడవాలంటే పౌరుషం వచ్చి, కళ్ళల్లో వుబుకి వస్తున్న కన్నీళ్లు ఎవరి కంటా పడకుండా తుడిచేసుకుని గబగబా బయటికి వెళ్ళిపోయాడు--
అలా నడిచి నడిచి కాలవ గట్టున రావి చెట్టు క్రిందికి వెళ్లి కూర్చున్నాడు-- దూరంగా బల్ల కట్టు, దాని మీద నుంచి కాలవ ఇవతల ప్రక్క నుంచి అవతల ప్రక్కకీ అవతల ప్రక్క నుంచి ఇవతల ప్రక్కకీ దాటుతున్న జనం లీలగా కనిపిస్తున్నారు.
రెండు చేతులూ కాళ్ళ చుట్టూ పెనవేసుకుని మోకాళ్ళ మీద మొహం ఆనించుకుని కూర్చున్న మోహన్, భుజం మీద ఎవరిదో చెయ్యి పడినట్లు త్రుళ్ళి పడి తల ఎత్తి చూశాడు.
ప్రక్కనే చిరునవ్వుతో మురళీ -- మోహన్ మొహం చూడగానే అతని పెదవుల మీద చిరునవ్వు ఎగిరిపోయింది 'అదేమిటి?' అన్నాడు అడుర్ద్గాగా.
అప్పటికి కాని మోహన్ కి గుర్తు రాలేదు తన చెంపల నిండా కన్నీటి చారికలు వున్నాయి. 'అబ్బే ఏం లేదు-- ఏం లేదు' అని తడబడుతూ చేత్తో బుగ్గలు తుడుచుకుంటూనే మళ్లీ తల వాల్చుకుని వెక్కి వెక్కి ఏడ్చేశాడు.
'ఏం జరిగింది మోహన్ నాకు చెప్పవూ?' ప్రక్కనే కూర్చుని అతని వెన్ను మీద చెయ్యివేసి అనునయంగా అడిగేడు మురళీ.
'చెప్పటానికే ముంది-- ఏమీ లేదు' తల ఎత్తకుండానే మోహన్ సమాధానం చెప్పాడు.
'కాదు ఏదో వుంది- ఏమీ లేదు' తల ఎత్తకుండానే మోహన్ సమాధానం చెప్పాడు.
'కాదు ఏదో వుంది-- లేకపోతె నువ్వింత బాధ పడవు -- నాతో చెప్పటం ఇష్టం లేకపోతె నేనేం బలవంతం చెయ్యను.' అన్నాడు మురళీ కాస్త జంకుతూ--'
మోహన్ తలెఎత్తి చూశాడు-- అతనికి క్లాసులో ఎవరితో కూడా పెద్దగా స్నేహం లేదు-- అందరితోనూ మామూలు పరిచయం , ముభావంగా అవసరం మేరకు మాట్లాడటం తప్ప ఎవరితోటీ అధిక ప్రసంగాలూ అనవసర జోక్యాలూ అతను కల్పించుకోడు. కాని, క్లాసులో అందరికీ మాత్రం అతనంటే మంచి అభిప్రాయం వుంది-- ఇప్పుడు తను ఏమీ చెప్పకపోతే మురళీ మరి బలవంతం చెయ్యడు-- కాని చెప్పాలి అని అనుకోకుండానే మోహన్ తన చరిత్ర యావత్తూ చెప్పేశాడు. అంతా చెప్పటం అయిపోయాక స్నేహితుడి మొహంలోకి కూడ చూడటానికి సిగ్గు పడుతున్న వాడిలా తల మరో ప్రక్కకి తిప్పేసు కుంటుంటే మురళీ కి అర్ధం అయింది అతను అంతా చెప్పినందుకు పశ్చాత్తాప పడుతున్నాడ ని-- అయినా అదేం గమనించని వాడిలా మురళీ -- 'ఎల్లుండి దాకా టైముంది గా , రేపు నేను తెచ్చి ఇస్తాను డబ్బు.' అన్నాడు.
'నువ్విస్తావా?' అన్నాడు మోహన్ తెల్లబోతూ. మోహన్ మళ్లీ ఏదో అనబోతుంటే చటుక్కున అడ్డు వచ్చి 'అవును ఇక నువ్వా విషయం గురించి ఆలోచించకు' అన్నాడు మురళీ.
ఒక్కసారి దీర్ఘంగా నిట్టూర్చి మురళీ కళ్ళల్లోకి కృతజ్ఞతా పూర్వకంగా చూస్తూ, 'నీ మేలు నేను జన్మలో మరిచి పోలేను మురళీ' అని, 'చూడు -- ఈ భోగం వాళ్ళు ఎన్ని సంసారాలని ఇలా నాశనం చేస్తారో కదా అనిపిస్తుంది నాకు. శ్రీమంతులుగా పుట్టిన మేము ఇవాళ ఇంత దారిద్యం అనుభవించటానికి కారణం చాలావరకూ వాళ్ళే కదా!' అన్నాడు.
'అవును' అన్నట్లు తల ఆడించాడు మురళీ. ఇద్దరూ లేచి యింటి ముఖం పట్టారు.
ఆ తరువాత పరీక్ష ప్యాసై ఉద్యోగం చూసుకున్నాక మొదటి జీతం లోనే ఆ అప్పు తీర్చేశాడు కాని, మురళీ చేసిన సహాయం మాత్రం ఈనాటి దాకా మరచి పోలేదు.
'ఆవాళ మా నాన్నగారి దుర్వ్యసనాల గురించి, ఆ కుటుంబపు అగచాట్ల గురించి మరొకరిముందు అలా చెప్పెశానే అని మొదట సిగ్గుపడ్డాను కాని, నీకు చెప్పకపోయి వుండి వుంటే అసలు నా చదువే పూర్తయేది కాదేమో.' అన్నాడు ఒకటి రెండుసార్లు.
'అదేం మాటలే! మీ మామయ్యే ఏదైనా చూసేవాడేమో...పోనీలే అదంతా-- ఇప్పుడెందుకు .' అని సర్దేసేవాడు మురళీ........
వంటగదిలో పనంతా ముగించుకుని, మంచినీళ్ళ కూజా గ్లాసు గదిలోకి తీసుకు వస్తున్న కళ్యాణి , కిటికీ దగ్గర నిలబడి బయటికి, దూరంగా ఎటో చూస్తూ పరధ్యానంగా వున్న భర్తని చూసి 'ఏమిటి బాబూ, ఇందాకటి నుంచి అంతలా ఆలోచించే స్తున్నారు' అంది చనువుగా.
'ఆహా ఏం లేదు.' అన్నాడు అక్కడ నుంచి కదిలి రాకుండానే. అంటీ ముట్టనట్లున్న అతని ప్రవర్తనతో మనస్సు చివుక్కుమన్నా, ఒకవేళ వాళ్లు గుర్తు వచ్చారేమో అనుకుని మరేమీ అడగకుండా వెళ్లి పడుకుంది కళ్యాణి.
మురళీ ఆలోచనలు ఈసారి మోహన్ ని వదిలి కళ్యాణి చుట్టూ పరిభ్రమించటం మొదలు పెట్టాయి. ఒకనాడు పార్కులో ఆమె చెప్పిన కధంతా విని సహృదయంతో అర్ధం చేసుకుని సానుభూతి చూపించ గలిగిన అతను ఇవాళ దాన్ని తలుచుకుని ఎవగించుకోటం మొదలు పెట్టాడు-- ముఖ్యంగా గంగరాజుని గురించి కళ్యాణి చెప్పింది గుర్తు చేసుకుంటుంటే ఏమిటో మనస్సంతా చేదుగా అయిపోతోంది. శరీరం అంతా భగభగ మంటలు పుడుతున్నట్లుంది. మరి అలా నిలబడలేనట్లు వెళ్లి పడుకున్నాడు----
కళ్యాణి వాళ్ళ వూళ్ళో గంగరాజు పుష్కలంగా డబ్బు , వూళ్ళో పెద్ద పలుకుబడి గల వ్యక్తీ . వోసారి అతను భార్యా పిల్లలతో సినీమా చూడటానికి వెళ్ళినప్పుడు కళ్యాణి వాళ్ళూ కూడా వెళ్ళటం జరిగింది. ఆమెని చూసి మరుక్షణం లోనే అతని మతి పోయినంత పని అయింది -- సినీమా కూడా చూడటం మానేసి అదే పనిగా, రెప్ప అయినా వాల్చకుండా ఆమెనే చూస్తూ కూర్చున్న అతనికి కాస్సేపటికి ఆ అమ్మాయి తను అందుకోలేని చందమామ కాదని, డబ్బుకి శరీరం అమ్ముకుని బ్రతికే వంశంలో పుట్టిన పాడుచే అని అర్ధం అయింది, వాళ్లతో వచ్చిన రాఘవుల్ని గుర్తుపట్టాక. ఇంక ఆ మర్నాటి నుంచే అతను రాఘవులు ద్వారా రాయభారాలు సాగించాడు.
