5


సురుచి అప్పుడప్పుడు తల్లి స్నేహితురాలికి తన బాధ చెప్పుకునేది.
"ఆడది ఏ ఇంట్లోనూ స్వాతంత్రురాలు కాదు. నిన్ను నా ఇంట్లో ఉంచుకునేందుకు నా భర్త ఒప్పుకున్నాడు. నీ చదువు కొనసాగించడానికి కూడా ఒప్పుకున్నాడు. ఇదే నాకో పెద్ద గౌరవం. నువ్వు సద్దుకుపోక తప్పదు...." అందామె.
ఆమె అలాగన్నప్పటికి - తనకోసం ఆమెకున్న స్వతంత్రాన్నంతటిని ఉపయోగించడం ఆమె కిష్టం లేదని సురుచికర్ధమయింది.
సురుచి క్రమంగా పెద్దదై గ్రాడ్యుయేషన్ లోకి వచ్చింది.
ఆమె తల్లి స్నేహితురాలి కూతురి కంటే ఎన్నో రెట్లు అందగత్తె. అందుకని స్నేహితురాలి కూతురికామే అంటే అసూయ. కొడుకు కామె అంటే ఆకర్షణ. తన కంటే సంవత్సరం పెద్దదైన ఆ అమ్మాయి దగ్గర తనకు బైట తెలిసిన భాషాజ్ఞానాన్ని ప్రయోగించి నోటి దురద తీసుకునే వాడా అబ్బాయి.
సురుచి అందాన్ని స్నేహితురాలి భర్త కూడా గుర్తించాడు.
స్నేహితురాలు నిశ్శబ్దంగా అన్నీ కనిపెడుతూనే వుంది. ఆమె త్వరగా సురుచికి పెళ్ళి చేసి పంపెయలనుకుంటోంది. ఇంట్లో సురుచిని వేయి కళ్ళతో కాపాడుకునేది. కూతురికి బైట పరిచయాలు పనిరావని చెబుతూనే -- సురుచికి ప్రేమ వివాహాలు కులాంతర వివాహాలు వాటి గొప్పతనం గురించి చెబుతుండేది.
కాలేజీలో ఆమె నేవరైనా ప్రేమిస్తే పెళ్లి చేసేద్దామని సురుచి తల్లి స్నేహితురాలేదురు చూస్తోంది. అసలామే తననే అందుకు కాలేజీకి పంపిస్తోందా అని సురుచికి అనుమానముంది.
ఏది ఏమైనా తనకాశ్రయమిచ్చిన తల్లి స్నేహితురాలంటే సురుచికి గౌరవముంది. ఆమె మనసును నొప్పించడం సురుచి కిష్టముండదు.
అందాన్ని ప్రేమించడానికీ, అనుభవించడానికీ ఎందరూ సిద్దంగా ఉంటారు. కానీ బాధ్యతగా భరించడానికేందరు ముందుకు వస్తారు? అందులోనూ కాలేజీలో విద్యార్ధి దశలో -- బాధ్యతలకు దూరం కావాలనే అంతా ప్రయత్నిస్తారు.
సురుచి కధ విని ఉదయ ఏంతో బాధపడేది.
హృదయమున్న ఉదయకు సురుచి దగ్గరయింది.
"నీ కష్టాలు కలకాలముండవు ...' అనేది ఉదయ.
అలాంటి సమయంలో ఘోరం జరిగిపోయింది. సురుచి దారుణంగా మోసగించబడింది.
ఆ ఊళ్ళో మురహరి పేరు తెలియని వారుండరు.
అతడికా ఊళ్ళో పెద్ద మేడ ఉంది.
మేడ చాలా పెద్దదే కానీ అతడి పలుడుబడి ఇంకా పెద్దది.
కేంద్ర, రాష్ట్ర మంత్రులతో అతడికి పరిచయాలున్నాయి. అతడి పరిచయాలు పదవులతోనే తప్ప-- మనుషులతో కాదు.
కాలేజీ సీట్లు, ఉద్యోగాలు, కాంట్రాక్టులు , ప్రమోషన్లు ఇప్పించడం నుంచి ప్రారంభమై -- జైల్లోంచి నేరస్థుల్ని తప్పించడం , ఇష్టం లేని మనిషిని లోకం నుంచి తప్పించడం వగైరాల వరకూ మురహరి ద్వారా సాధించవచ్చు.
పెద్ద పెద్ద వాళ్ళందరూ పెద్దవాళ్ళుగా కొనసాగడం కోసం మురహరి మీద ఆధారపడేవారు.
మురహరి సాయం సురుచి స్నేహితురాలి భర్తకు అవసరపడింది. అతడుద్యోగం వదిలి వ్యాపారంలో దిగే బృహత్ర్సాయత్నంలో ఉన్నాడు.
మురహరి తను సాయం చేయడానికి షరతు పెట్టాడు . పుర్వనుభవం లేని కన్నెపిల్ల కావాలన్నదే ఆ షరతు.
మురహరి షరతులు కష్టంగానే ఉంటాయి. అతడి షరతును తృప్తి పరచాలంటే అవతలి వ్యక్తికీ కొంత సామర్ధ్య ముండాలి!
సమర్దులకే మురహరి సాయపడతాడు.
తనకు ప్రయోజనం లేనిదే ఇతరులకు సాయం చేయకూడదన్న ఆదర్శం లేని వాడెవ్వడూ ఈ ప్రపంచంలో బాగుపడలేదు. గుర్తింపును పొందలేడు.
ఏమైతేనేం -- తనకు తెలియకుండానే సురుచి తనకాశ్రయమిచ్చిన ఆమె ఋణం తీర్చుకుంది.
జరిగినాదామే ఉదయకు చెప్పుకుని -- తను ఆత్మహత్య చేసుకుంటానంది.
"జీవితం విలువైంది. ఎవరో తప్పు చేస్తే నువ్వు చావడమేమిటి?" అంటూ ఉదయ ఆమెను మందలించింది.
సురుచి ఆత్మహత్య చేసుకోలేదు.
బియ్యే ప్యాసు కాగానే ఆమెకు ఉద్యోగం దొరికింది మురహరి దయతో.
ఆమెను పెళ్ళి చేసుకోలేదు.
ఆమె స్వతంత్రురాలు. అనగా ఇప్పుడు తన కాళ్ళ మీద తను నిలబడింది. తన ఇంట్లో తానుంటుంది.
కానీ మురహరి ఆమెను శాసించగలడు.
అతడు చెప్పేవరకూ ఆమె పెళ్లి చేసుకోరాదు.
సురుచికి పెళ్ళి చేసుకోవాలని లేదు. ఆమెకు జీవితమంటే విరక్తి పుట్టింది. అయినా జీవితం కొనసాగిస్తుంది.
మురహరి నుంచి ఆమెకు స్వాతంత్యం కావాలి.
వేదాంతం -- అవినీతి పరుడి పేరు సూచించమన్నప్పుడు -- ఉదయకు మురహరి గుర్తుకొచ్చాడు..?
సురుచి లేకుంటే ఆమెకు మురహరి గురించి తెలిసేది కాదు.
ఉదయ మురహరి గురించి చెప్పినప్పుడు వేదాంతం ఆశ్చర్యపడి "ఇతడు నా హిట్ లిస్ట్ లో లేడు. నీకెలా తెలిసాడు?" అన్నాడు.
"నాకూ జోస్యం తెలుసు --" అంది ఉదయ -- "నీ కోసం, నా దివ్యదృష్టి ఉపయోగించి తెలుసుకున్నాను..."
ఆమె చిన్నగా నవ్వింది. ఆ నవ్వుకే బుగ్గలు సొట్ట బడ్డాయి.
వేదాంతం ముచ్చటగా ఆమె వంక చూసి -- "ఈరోజు నుంచి ఎనిమిది రోజులు లెక్క పెట్టుకో -- పేపర్లో హెడ్ లైన్లో మురహరి ఉంటాడు....' అన్నాడు.
'అంత సులభం కాదు. నేనతడిని ముందుగా హెచ్చరిస్తున్నాను..."
"ఎందుకు?"
"నిన్నోడించాలని!"
"ఉదయా -నన్ను బయట పెట్టాలనుకోకు ..."
"ఏం ?"
"అందువల్ల నాక్కాదు. నీ విస్సీ బావకు ప్రమాదం..."
ఉదయ ఉలిక్కిపడి భయంగా వేదాంతం వంక చూసింది.
ఆమెకీ అతడిలో రాక్షసుడు కన్పించాడు.
***
సురుచి ఉదయ చెప్పింది విని ఆశ్చర్య పడింది.
"నీకెలా తెలుసు ?" అందామె.
"నాకు కలవస్తోంది. మొదటి కలలో అలౌకికానంద స్వామి, రెండో కలలో జయప్రకాష్, మూడో కలలో....మురహరి...."
సురుఛి నవ్వి....'అంతా అబద్దం. అంతా నీకు నీ స్నేహితురాలి పై ఉన్న అభిమానం. దేశానికి మురహరి పీడ అంత సులభంగా పోదు-" అంది.
"ఎందుకుట?"
"ఈ ప్రపంచంలో దేవుణ్ణి కూడా మనిషే నడిపిస్తున్నాడు. దేవుడి కంటే కూడా దేవుణ్ణి మనిషి నడిపించే బలమైనవాడు. మురహరి తేర వెనుక మనిషి. తెర ముందు బొమ్మలేన్ని మారినా వెనుక నుంచి ఆడించే మనిషి మారడు....'
"నామాట నమ్ము. మురహరిని హెచ్చరించు ...." అంది ఉదయ.
"హెచ్చరించడమెందుకు ?" అంది సురుచి.
"ముందుగా తెలిస్తే మనిషి తన్ను కాని ధనుష్టంకారం బారి నుంచి తప్పించుకోగలడెమో నాకు చూడాలనుంది" అంది ఉదయ.
"మురహరికి అంత్య కాలం సమీపిస్తే -- హెచ్చరించడం నాకిష్ట ముండదు" అంది సురుచి.
"నేను చెప్పేది సరిగ్గా అర్ధం చేసుకో - ఫలానా రోజున ఫలానా విధంగా జరుగుతుందని మురహరిని హెచ్చరించు. హెచ్చరిక వల్ల మురహరికి ప్రయోజన ముందనుకో ....అతడు నీకు మంచి బహుమతినియవచ్చు. మురహరి మెప్పు పొందడం వల్ల నీకు చాలా ప్రయోజనాలు. అతడు సామాన్యుడు కాదని నువ్వే అన్నావు అందువల్ల తనకు తానే ఈ ప్రమాదం నుంచి తప్పించుకోగలడు. అప్పుడు నీకే ప్రయోజానమూ ఉండదు....' అంది ఉదయ.
"పోనీ నువ్వు చెప్పినట్లే చేస్తాను. ఈ విషయం నాకెలా తెలిసిందని చెప్పను....?"
"దానికే ముంది .....కల ..... అలౌకికానంద స్వామి, జయప్రకాష్ విషయాలు ముందుగానే నువ్వు కలగన్నావు. ఇప్పుడు మురహరి విషయం కలలోకి వచ్చింది--" అంది ఉదయ.
'అలా చెబితే నమ్ముతాడా ?"
"ఎందుకునమ్మడు'? ఏదో మానవాతీత శక్తి ఈ పనులన్నీ చేయిస్తోంది ఎవరైనా గ్రహించగలరు..." అంది ఉదయ.
"నిజంగా మానవాతీతశక్తి ఈ పని చేస్తొందంటావు ?"
'నిజం తెలిసేదాకా అలాగే అనుకోవాలి మరి!"
