విస్సీ బావకేదైనా అయితే వేదాంతాన్నే తప్పుపడతాను నేను" అంది ఉదయ నిష్టూరంగా.
"నన్ను తప్పు పట్టాలని తొందర పడిపోకండి. అడిగో మన విస్సీ ......' అన్నాడు వేదాంతం.
పల్చబడుతున్న జనం మధ్య నుంచి విశ్వనాద్ అప్పుడే వచ్చి వాళ్ళను కలుసుకున్నాడు.
సీతమ్మ అతడిని కౌగలించుకుని "ఇంతసేపు ఎక్కడున్నావురా ? ఏం చేస్తున్నావురా ?" అంది.
విశ్వనాద్ మాట్లాడకుండా మాతృమూర్తి కౌగిలి సుఖాన్నభవిస్తున్నాడు.
"వాడెం చేస్తున్నాడో నేను చెప్పనా?" అన్నాడు వేదాంతం.
"ఊ" అంది ఉదయ. కులభూషణ్ కూడా వినడానికి ఆత్రుత పడ్డాడు.
"ధనుష్టంకారం!" అన్నాడు వేదాంతం.
"ధనుష్టంకారమా-- అంటే?" అంది ఉదయ.
"రేపు పేపర్లో మొదటి పేజీ చూడు ....తెలుస్తుంది" అన్నాడు వేదాంతం గంభీరంగా.
***
మర్నాడుదయం మంచి నిద్రలో ఉండగా వేదాంతాన్ని తట్టి లేపింది ఉదయ. అతడులిక్కిపడి విసుగ్గా లేచి ఉదయను చూడగానే తన విసుగునంతా మర్చిపోయాడు.
ఆమె అప్పుడే స్నానం చేసింది. కుబుసం విడిచిన పాములా ఆమె శరీరం మెరుస్తోంది. వంటికి రాసుకున్న పౌడరు మంఛి గంధం వాసన అతడి నాసికా పుటాలకు సోకి ఆమె పై దివ్య భావాన్ని కలిగించింది.
"ఏమిటి విశేషం?" అన్నాడతడు.
"నువ్వే చెప్పాలి " అంది ఉదయ.
"అంటే?"
"ఈ పేపరు చూడు ..." అంటూ అందించిందామే.
అది ఆ రోజు స్థానిక ప్రాంతీయ దిన పత్రిక.
మొదటి పేజీలో ఒక పక్కగా దీర్ఘ చతురస్రాకారంలో నాలుగు గీతల మధ్యగా "ధనుష్టంకారం" అన్న శీర్షిక ఉంది.
"ప్రజా విద్రోహులారా! మీ అందరికీ ఇదే నా హెచ్చరిక. మీరందరూ మీ ప్రస్తుత కార్యకలాపాలకు స్వస్తి చెప్పి -- మీ శక్తి యుక్తులను ప్రజా సంక్షేమానికి ఉపయోగించు కొండి. లేకుంటే పలువురి సమక్షంలో మీరే స్వయంగా మీ మీ నేరాలోప్పుకునేలా చేస్తాను. అలౌకికానంద స్వామి విషయం చూశారుగా! నా ఈ హెచ్చరికను లక్ష్మణ ధనుష్టంకారంగా భావించండి. ఇది లెక్క చేయరూ -- శరపరంపరనేదుర్కోనక తప్పదు -"
ఆ శేర్షిక క్రింద ఉన్న వివరాలివి.
చదివి ఉదయకు ఇచ్చేశాడు వేదాంతం.
"పేపర్లో ఈ వార్త వస్తుందని ముందే నీకు తెలుసు. ఎలా తెలిసింది?"
"ఎడిటర్ నా ఫ్రెండు...."
'అయన ముసలాయన. నీకు ఫ్రెండేలాగౌతాడు?"
"పోనీ -- ఎలా తెలిసిందంటావ్?"
"నువ్వే చెప్పాలి ...."
'చెబుతాను. కానీ ఒక్క షరతు...."
"ఏమిటది ?"
"సరిగ్గా నాలుగు రోజుల తర్వాత జయప్రకాష్ ఓ పెద్ద సభలో తన నేరాలన్నీ ఒప్పుకుంటాడు..."
"జయ ప్రకాష్ ఎవరు ?"
"మన సిటీ కార్పొరేషన్ మేయర్ !"
ఉదయ ఆశ్చర్యంగా -- "నీకెలా తెలుసు?" అంది.
"నాకు తెలుసు, సరిగ్గా నాలుగు రోజుల తర్వాత..."
'అలా ఎందుకు జరుగుతుంది ?"
"చెప్పను..."
"ఎందుకు చెప్పవు?"
'చెప్పకూడదు !"
"చెప్పకూడనపుడీ వార్త మాత్రం ఎందుకు చెప్పావు?"
"ఎందుకంటె ...." అని వేదాంతం ఆగాడు.
"ఊ చెప్పు ...."
"నాకు జోస్యం తెలుసునని నీకు తెలియాలి !" అన్నాడు వేదాంతం.
"నాకే ఎందుకు తెలియాలి ?" అంది ఉదయ.
'అప్పుడు నువ్వు నా జోస్యాన్ని నమ్ముతావు. విశ్వనాద్ నిన్ను పెళ్ళి చెసుకోడని నమ్ముతావు ..."
ఉదయ ఏదో అందామనుకుని తమాయించుకుని అక్కణ్ణింఛి వెంటనే వెళ్ళిపోయింది.
వేదాంతం భారంగా నిట్టూర్చాడు.
ఆ తర్వాత నాలుగు రోజులకూళ్ళో జరిగిన బహిరంగ సభలో మేయర్ జయప్రకాష్ లేచి నిలబడి ఒకటొకటిగా తన తప్పులన్నీ ఒప్పుకుని "నేను పోలీసులకు లొంగిపోతాను . కానీ అందుకు ముందు నా ఇంట్లో నా తండ్రి పటం ముందు సంజాయిషీ ఇచ్చుకోవాలి --" అన్నాడు.
అయన ఇంట్లో తండ్రి ఫోటో ఉన్న గదిలోకి వెళ్లి తలుపులు వేసుకున్నాడు. పావుగంట తర్వాత తలుపులు తెరవమని ముందే చెప్పాడు.
అప్పుడు తలుపులు తెరిస్తే అయన గదిలో నిలబడి ఉన్నాడు.
కాళ్ళూ చేతులూ అలౌకికానంద స్వామికి వలెనె బంధించబడ్డాయి. నోటికి టేపు .
పోలీసులాయన్ను తీసుకుని వెళ్ళారు.
ఇదంతా ఎలా జరిగిందో మాత్రం ఎవరూ ఊహించలేక పోతున్నారు.
మర్నాడు పేపర్లో తాటికాయలంత అక్షరాలతో మొదటి పేజీలో ఈ వార్త వచ్చింది. ఆ పేజీలోనే ధనుష్టంకారం పెరిక హెచ్చరిక కూడా ఉంది.
ఈసారి రెండు వార్తలకూ ప్రాధాన్యత హెచ్చడమే కాక ఈ వార్తలు జాతీయ దినపత్రికల్లో ఎక్కాయి.
ఉదయ ఈ వార్తను చూసి మళ్ళీ వేదాంతంతో ఏకాంతంగా మాట్లాడి "నిన్ను చూస్తుంటే నాకు భయంగా వుంది" అంది.
"నేను నిన్ను ప్రేమిస్తున్నాను. నాకు నువ్వు భయపడకూడదు ..."
"భయపడక తప్పదు. నేను నిన్ను ప్రేమించడం లేదు గదా!"
"ఉత్తమ ప్రేమ ఏదో ఒకరోజున మంచి ప్రతిఫలాన్ని పొందుతుంది. నేను నీకు అపకారం తలపెదతానని నువ్వనుకుంటే అది నాకెంతో బాధను కలిగిస్తుంది. ఎంత కాలమైన నేను నీలో మార్పు కోసం ఎదురు చూడగలను."
"నా భయం నా గురించి కాదు. విస్సీ బావ గురించి! బావను నువ్వేదో చేశావు. చేస్తున్నావు.... నామీద ఆశతో బావకు నువ్వన్యాయం తలపెడుతున్నావని నా అనుమానం" అంది ఉదయ.
"విస్సీ నన్ను నమ్ముతున్నంత కాలం నీ అనుమానం నన్ను బాధ పెట్టదు. కానీ నీ విస్సీ బావ గురించి ఆశలు పెంచుకోవడం మంచిది కాదు. వాడు పెళ్లి చేసుకోడు. ఈరోజు నేను చెబుతున్నాను. గుర్తుంచుకో ...."
'అయితే మాత్రం ఒక స్త్రీ ఎప్పటికీ ఒక మగాడినే ప్రేమించ గలదని నీకు తెలీదా!" అంది ఉదయ.
"ఉదయా! అలాటి కబుర్లు నాకు నచ్చవు. ప్రేమ అన్నది ఒక భ్రమ. మనకు నచ్చిన మనిషితో సాన్నిహిత్యం పెరిగితే ప్రేమగా మారుతుంది. నూరేళ్ళ జీవితంలో స్త్రీ పురుషులకు పరస్పరం తోడూ అవసరం. నీకిప్పుడు నాపైన ప్రేమ లేకపోవచ్చు. కానీ మనం కలిసి మెలిసి కొంత కాలం జీవించమంటే ప్రేమ అదే పుట్టుకొస్తుంది. దూరం దూరంగా ఉంటూ ప్రేమించుకుంటున్నామని యువతీ యువకులను కుంటే అది వట్టి ఆకర్షణ మాత్రమే! నీకు నీ విస్సీ బావతో పెళ్ళి సాధ్యం కాదని తెలిసిన రోజున హృదయపు కవాటాల్లో ఒక్క రోజు నన్ను బంధించి ఉంచ గలిగిన రోజున నువ్వే నన్ను ప్రేమిస్తావు. నాకా ధైర్యముంది. నా ధైర్యమే నీకు జోస్యం" అన్నాడు వేదాంతం.
'అయితే నేనూ జోస్యం చెబుతున్నా విను. నీకూ నాకూ పెళ్లి కాదు" అంది ఉదయ.
వేదాంతం నవ్వి "నీకు జోస్యం తెలీదు" అన్నాడు.
"కనీసం నాగురించైనా నాకు తెలుస్తుంది కదా!"
'అంటే ?"
"ఎట్టి పరిస్థితుల్లోనూ నేను నిన్ను చేసుకోనని నాకు తెలుసు..."
"ఉదయా! వాదించి లాభం లేదు. నా జోస్యానికి తెలిసినట్లుగా నీ గురించి నీక్కూడా తెలియదు" అన్నాడు వేదాంతం.
ఉదయ పట్టు విడవలేదు. "సరే నీ జోస్యాన్ని నేనబద్దం చేస్తాను...."
"ఎలా"
"పత్రికల్లో వస్తున్న ధనుష్టంకారం నీదేనంటున్నావు గదా! ఈసారి నువ్వెవరి బండారం బయట పెట్టబోతున్నావో చెప్పు ...."
"ఎందుకు?"
"నేనది ఆపుతాను ...."
వేదాంతం క్షణం అలోచించి "పోనీ ఓ పని చేద్దాం! నీకు తెలిసిన అవినీతి పరుడి పేరు చెప్పు. అతడి బందారమే నేను బయట పెడతాను. అందువల్ల నీకు నా శక్తి పై నమ్మకం పెరుగుతుంది " అన్నాడు.
"నువ్వు చెప్పింది బాగానే ఉంది. ఆలోచించాలి ....' అంది ఉదయ.
'ఆలోచించు ఒక్కరోజే గడువు ....' అన్నాడు వేదాంతం.
* * *
గ్రాడ్యుయేషన్లో ఉదయ క్లాస్ మేట్ సురుచి.
ఆమెకు జీవితం పై ఎన్నో ఆశలున్నాయి. అందుకని క్లాసులో కష్టపడి చదివేది.
సురుచికి తల్లి దండ్రులు లేరు. తల్లి స్నేహితురాలింట్లో ఉంటోందామె. చిన్ననాటి స్నేహాన్ని పురస్కరించుకుని సురుచి తల్లి పోయినప్పుడెవరూ ఆదుకోక పోతుంటే ఆమె సురుచిని తన దగ్గరుంచుకుంది.
అప్పుడు సురుచికి పదేళ్ళు.
సురుచి పుట్టినప్పుడే తండ్రి పోయాడు. ఆమెను పదేళ్ళు పెంచి తను జబ్బుతో బాధపడుతూ సరైన వైద్యం చేయించుకోక తల్లి చనిపోయింది.
స్నేహితురాలింట సురుచి కొంతకాలం గౌరవంగానే పెరిగింది.
ఆమెకో కూతురు, కొడుకు.
కూతురు సురుఛి కంటే ఏడాది పెద్దది. కొడుకు ఏడాది చిన్న.
స్నేహితురాలి భర్తకు సురుచి అంటే చిన్నచూపు.
ఒక్క స్నేహితురాలు మాత్రం సురుచిని గౌరవంగా చూసేది. తండ్రి పద్దతి చూసి పిల్లలిద్దరూ సురుచిని లోకువ కట్టారు.
"దాని చేత పని చేయించుకోండి" అనేవాడు తండ్రి.
వాళ్ళు పని చెప్పేవారు. ఆమె పని చేసేది. వాళ్ళకు నచ్చేది కాదు.
"మనకంటే తక్కువ వాళ్ళ చేత పని చేయించుకున్నప్పుడు -- వాళ్ళెంత బాగా పనిచేసినా వంకలు పెడుతుండాలి. మెచ్చుకుంటే వాళ్ళకు పనిలో శ్రద్ధ తగ్గిపోతుంది -' అని తండ్రి పిల్లలకు చెప్పాడు.
