తను, మధుకూడా లిప్తమాత్రంకూడా, కనురెప్ప మూస్తే ఏ ముఖకవళికా కనిపెట్ట లేకపోతామో అన్న ఆత్రుత పడ్డాడు. కీలకం.
చిన్నగా నవ్వేడు. "అయితే అయి ఉండవచ్చు. ఇదంతా నా భావనే కావచ్చు. కాని..."
"ఏమిటది?" మధు.
"ఒకనాడు కాకపోతే ఇంకోరోజైనా, నేను అక్కడకి వెళ్ళడం తప్పదు. అది ఎప్పుడో మాత్రం ఇప్పుడు చెప్పలేను, ఎప్పుడో ఎక్కడో నేను చెయ్యక వదిలివెళ్ళినని నాకోసం ఎదురు చూస్తున్నాయి." కిటికీలోంచి పైకి చూస్తూనే జవాబు చెప్పేడు.
పై మనస్సు పైకే ఎగిరి వెళ్ళిపోయినట్లు అయ్యింది రుక్మిణికి, రాజు మళ్ళీ వెళ్ళిపోతాడు. ఇది తప్పదు. వీళ్లిరువురి వైపూ చూసింది. శూన్యం తడితేనే - "నేను సత్య తల్లికి తాంబూలం ఇచ్చివచ్చే" అనేసింది. మధు, రావు కూడా "ఆ!" అన్నారు.
"పిచ్చి పిన్నీ! అమ్మ నిన్ను ఆరేళ్ళ క్రితం ఈ ఇంటికి తీసుకువచ్చింది, నాకు పెండ్లి చెయ్యాలని. కాని జరిగింది మరొకటి. నువ్వు నిర్ణీతవు కావు."
"నీ సర్వస్వం నేను రక్షించుకోవాలి. శ్రేయస్సు, అభివృద్ధికూడా చూడాల్సిన బాధ్యత నామీద ఉంది. దాన్ని సఫలం చేసుకోవడమే నా ఆశయం. దానికి ...."
"నా భౌతికానికే కాని ఆ హక్కు నా ఆత్మ మీద నీకు లేదు."
"లేకపోయినా ధర్మనిర్వహణ ఉందికా?"
"అదీ లోకం, పిన్నీ" అనేసి బయటకు వెళ్ళి పోయేడు. మధుకు, రావుకు కూడా దీని టీక అర్ధంకాక తికమక పడ్డారు. అనునయం చెయ్యలేని మగ మహారాజులు.
విజ్రుంభించి, పెనుగాలి అయిన ఓ సత్యం, ఇప్పుడు రాజులో కుదుటబడి, పేరుకుంటూంది, దీనివల్ల రాజు బిగుసుకున్నాడని, లోపల ఉన్నది పైకి మళ్ళీ క్రక్కడని, అది సరస్వతీ ఝరిలాగే ఉందన్న గ్రహింపు కలిగింది మధుకు. రాజు మారేడు. ఆ మార్పు ఏయే పరిణామాలకు సంసిద్ధపరుస్తుందో తనకు తెలియదు. దారి కనుపించటం లేదు. కనీసం సూచీభేధ్యంకూడా కావడం లేదు. ఇక ఉండడంవల్ల ప్రయోజనమున్నూ లేదు.
"మేం వెళతాం" అన్నాడు ముక్తసరిగా.
తల ఊపింది, గుమ్మం మెట్లు దిగుతున్న పుడే రావు "సత్య విషయంలో మీరన్నది నిజమేనా?" అన్నాడు.
"తల్లి ప్రాణం. అబద్ధం నిలుస్తుందనుకున్నా."
అంతదూరం వెళ్ళేవరకూ తను చూస్తూనే ఉంది. వాళ్ళతో కబురుపెట్టి, సత్యనుగాని, మాలనుగాని తను రప్పించినా, ఇప్పట్లో ప్రయోజనంలేదు. ఆ రాక ఓర్చుకోలేక విముఖత చెంది వెళ్ళడానికే దారి తీయవచ్చు. అందువల్ల మానేసింది.
శరీరం సుఖానికి నోచుకోలేదు. ఎప్పుడూ ఏదో ఒక క్లేశం బాధిస్తూనే ఉంది అన్న బాధ కలిగింది. భర్త ఉన్నా లేనట్లే. కొడుకనుకో వలసిన రాజు ఇదమిత్ధంలేని గమ్యం కలవాడు, తల్లికి, తండ్రికి ఈ ఇంట్లోంచి ఎంతగా బస్తాల్లోకి ఎత్తిపట్టుకు వెళ్ళవచ్చునా అన్న దృష్టి ఇక మిగిలింది తను ఒక్కతే అయ్యింది. అనునయం, ఆపేక్ష ఎంతగా సుభద్రమ్మ చూపించినా, అవి పైపైకి మొసలి కన్నీళ్ళవతు. దశరథంగారు నల్లపూసే అయ్యేరు; తనింటికి.
ఇవన్నీ జీవి ఎంతవరకూ ఓర్చుకోగలదు? తనకు తెలియదు. ఏ మార్గం ఆలోచించినా అవన్నీకూడా పై మెరుగులతో, లోపల లోపల రాలతో ఉన్నాయనే తడుతూంది. ఇంతమంది ఉన్నారు. డబ్బు ఉంది. లక్ష్మి తాండవిస్తునే ఉంది. కాని తానుమాత్రం చాలా ఏకాకి జీవితం గడుపుతూంది, ఎవరితోనూ చెప్పుకోలేదు. చెప్పడానికి మనస్కరించటం లేదు. ఆనాడు క్షణికం దిగతీతలో అత్తయ్యకు కొంత చెప్పినా, ఆవిడ తీర్చిదిద్దేది ఏమీ లేనట్లుగా పరిస్థితులు యథాతథంగానే ఉన్నాయి. పైగా స్వార్ధంలో దత్తత అన్న గుర్రపు ఎత్తు చేతుల్లో పెట్టు కుంది.
అప్పుడప్పుడు తన పూర్వ జీవితంలో, కలలు గన్న అంశాలు అన్నీ మననం అయ్యేవి. రాజు చుట్టూరా, తన సంసార ఔన్నత్యంలో రంగులు పూసుకుంది. వాట్లకు జీవంపోసి తను తాదాత్మ్యం పొందింది. ఏకతే మనసా, వచసా అయి తన్నే మరిచిపోయింది. ఇవి యిప్పుడు క్రూరంగా ఎదురుతిరుగుతాయి. అతని ఆశ్లేషంలో తను కరిగిపోతున్నట్లు భావన రెచ్చకొట్టి, కుమిలిస్తున్నాయి.
ఒక్కొక్కసారి తనకు మతి చాంచల్యం వస్తుందేమో అన్న భీకరంగా అవి నవ్వుతాయి. పిలిచి, వెక్కిరించి, చిలిపి... కజ్జాలే పెట్టి, ఏడిపిస్తాయి. అంత ఉన్మత్తత అవి. తనలో నరనరాలు పట్టిన జీవం.
తను మారిన స్థలంలో రాజుమీద తను మనస్సు ఇంకా పెట్టుకుని ఉందా? అతన్ని ఊహించుకుని, తన దగ్ధ జీవితం గడుపుతూందా అన్న మీమాంస రాకపోలేదు. సంకుల సమరంలా అది చెలరేగకపోలేదు. ఒంటిమీద స్పృహలేకుండా, ఛండాలపు కంపుతో, నోటి గురకల మధ్య చొల్లుకారుతున్న ఆయన్ను నిద్రలో చూచినపుడల్లా, తను ఎందుకు బ్రతికి ఉంది? ఇదా తన బ్రతుకు? ఈ ధనం విలువ? ప్రతిష్ఠ? అనిపిస్తుంది.
ఏవి ఎల్లా ఉన్నా తన్ను పెంచినందుకు, మలచినందుకు కృతజ్ఞత ఉండిపోతూంది. అదే ప్రస్తుతంలో ఆశయం క్రింద పెట్టుకున్నా, నిలుస్తుందా అన్న పిరికితనం తన్ను ఆవరించింది.
వీధి తలుపు గడియపెట్టి రాజు గదిలో చూచింది. లేడు. బహుశః డాబామీద ఉంటాడన్న భావన. ఆయన ఒళ్లెరగని గురక. డాబా మెట్లు నెమ్మదిగా ఎక్కింది.
దొడ్లో పువ్వుల, వాట్ల పరిమళం, దోబూచు లాడే గాలితో ప్రణయం. నువ్వులేని ఈనాడు లేదని, దివసనక్షత్రం వెంట చంద్రుని ప్రయాణం. ఆనలేని అరుంధతి చూపు. వలుపూరిన ఊపుతో వెన్నెల. నిజంగా చూస్తే అది మధుర ప్రశాంతయామినే. సౌందర్యలత్తుకే.
ఆకాశం వైపు చూస్తూ పడుకున్న రాజుకు, పిన్ని వచ్చిందని తెలియదు. ఆ సృష్టికర్త ప్రణయ వృత్తాంతం ఆదమరపులో చిత్రీకరణ అయ్యింది. పారిజాతాలు నా సవితి చిహ్నాలు; నేను వాట్లతో మీ పాదపూజ చెయ్యనన్న అమ్మ మొరాయింపు. ఆయన కోపం. వాసుకి భయం.
తను లేచేడు. ఎందుకో పిచ్చి ఆయత్తత. తను గుచ్చాలన్న ఆరాటన. ప్రోగు చేసుకుంటున్నాడు.
'పిచ్చీ! అదేం గుచ్చడం?' వాసుకి హేళన.
అమ్మ కోరచూపులో, ఆయన చిరునవ్వు.
ఓడిపోలేని సాంబ్రాణి. ప్రపంచం అంతా పారిజాతాలే అయిపోయేయి. గంగమ్మ నవ్వుతూంది. కొలకుల్లో నీటి చిమ్ము.
ఆయన ప్రేమ. తనలోనే ఇముడ్చుకున్న విశ్వకల్యాణం.
ఎదమీద శివోహం అన్న స్ఫటికమే.
ఉలిక్కిపడి లేచి గుండెలు తడుముకున్నాడు. 'ప్రభూ!' లేచి కలయచూచుకునే తెల్లబోయేడు.
"నువ్వా, పిన్నీ! ఎంతసేపైంది వచ్చి?" అడిగేడు.
పిట్టగోడకు అనుకునే నించునిపోయింది. "రావు, మధు వెళ్ళేరు." ముక్తసరిగా అంది.
కూర్చున్నాడన్న పేరేకాని దృష్టి పరధ్యానంలో ఉంది. ఏమైనా తను కదల్చాలి అన్నట్లే "బహుశః సత్య జ్ఞాపకం వచ్చి ఉంటుంది" అంది.
"సత్య కాని, మాలకాని నన్ను కదల్చరు."
"అయితే శాంత కదల్చిందా?"
"శాంతంటే ఎందుకంత కోపం?"
"ఆ విషయమే ఎంత విరుద్ధంగా ఉందో ఎప్పుడైనా ఆలోచించేవా?"
"పిన్నీ! నువ్వుకూడా హిసించడానికి పూనుకుంటున్నావా?"
"నీ శ్రేయస్సు కాని వేరు దృష్టి లేదు రాజూ."
"ఆ విషయం ఇకెప్పుడూ ప్రస్తావించనని వాగ్ధానం చేస్తావా?" తన కాళ్ళకు బంధం వేస్తూన్నాడు. అది ఎంత ఉన్మత్తతగానైనా రేపటితో బిగిసి ఉరిత్రాడవవచ్చు.
"నీ జీవితంలో నాకు ఉన్న స్థానం ఇదేనా?" రుగ్దంలో అడిగింది.
ఏం చెప్పగలడు? ఏ విధంగా తను ఆవృతి చేసి, ఓ మార్గంగా ఇది అని నచ్చచెప్పడం? ఆ మార్గమేమిటి? ఆవిడకు, తనకు ఆ బంధుత్వ రీత్యా ఉన్న సన్నిహితం కాని ఇంకొకటి లేదు. అదైనా ఇంకా తేరుకోలేదు తను అతిథి.
"నువ్వు ఈ ఇంటికి యజమానురాలివి. ఆ స్థానం విలువ నిల్పుకోవడం నీ ఆశయం. దానికి నేను అడ్డు రాను."
నవవలో, ఏడ్వాలో కూడా తెలియలేదు రుక్మిణికి. ఇక భరించుకోలేదన్నట్లే "బావా! ఎందుకింత క్రూరత్వం" అంది.
హడిలిపోయేడు రాజు. ఏమిటీ పిలుపు! ఇదా రుక్మిణి అంతరాంతరాల్లో మెదులుతున్న కోర్కె? ఇంకా తను ఆమె వాడేనని, ఆ ఆశ పోలేక చిగుర్చుకుంటూందని, ఈనాటి స్థానం మార్పైనా, తన ఆశయం, జీవితం కూడా, ఈ కోర్కె సాఫల్యంకోసమే కేంద్రీకరింపబడి పరితప్త అయ్యిందా? ఈనాటి నాటకం క్రింద ఉన్న సూత్రధారణ ఇదా?
"ఏమంటావు, బావా?" దగ్గరసా వచ్చే ప్రాధేయపడింది. "ఎవరికోసం జీవిస్తున్నాను? ఒక్క నీకోసం -నువ్వు నా ఎదురుగా ఉండాలని, కబుర్లు చెప్పాలని, ఆనందంగా కాలం గడపాలని. ఇంత ఐశ్వర్యంతో నేను పొందలేని ఆనందం, సుఖం, సౌఖ్యం, కనీసం నువ్వేనా నా కళ్ళెదుట పొందాలి.
"అది నీ కళ్ళల్లో ప్రతిఫలించాలి. అది నాకు కావాలి. నా జీవితంలో ఒక్కసారి ఆ అనుభూతి చూస్తినా తరిస్తాను.
"దానికోసం, బావా, నా సర్వస్వం ధార పోస్తా. ఆఖరుకు నన్ను బలి పెట్టుకోవాలన్నా నాకు అభ్యంతరం లేదు. ఎంత పతనమైనా భరించుకునే ధైర్యం ఉంది, బావా!" కళ్ళల్లోకి చూడాలన్న ఆయత్తంలోనే ఒదిగింది.
కెక్కరిల్లినట్లయ్యింది రాజుకు. రుక్మిణి, సత్యలాగే తన శరీరానికి పవిత్రత లేదని, ఆశయానికే ప్రాధాన్యం ఇస్తూందా? దానికే ఇప్పుడు సన్నద్దం అయ్యిందా? ఈ అన్న ఆశయం క్రింద దాగి ఉన్న ఉన్మత్త కోర్కె, శరీరపు బలి రుక్మిణిలో ఉంది.
ఈ పరిణామం తీసుకురావడానికి ఓ విధంగా చూస్తే తను కారణం. అది ఒప్పుకుని తీరాలి. ఇప్పుడు తన తప్పిదాల ఫలితం తన్నే ఎదురుగా వచ్చి చెవు పట్టుకుంది. నవరంధ్రాలూ బిగియ కట్టినట్లు ఎదురుగా, వికటాట్టహాసం చేస్తూంది.
"ఈ భావనకే రూపొందించి, నన్ను క్షుభితం చేస్తే నీకు తృప్తి కలుగుతుందా?"
"నేను ఇంతవరకూ దేన్ని చూచి బ్రతుకు తున్నాననుకుంటున్నావ్? నిన్ను నువ్వంటే నిన్ను, బావా!"
"ఆ ఆరాధన నేను తప్పు అనను. అంతర్గతంగా అది ప్రతి జీవిలోనూ ఉండవచ్చు. కాని దాన్ని భౌతికపు విలువల్లో తూచి మలినం చెయ్యడం మానవత్వం అనిపించుకోదు, రుక్మిణీ!"
నవ్వింది. "బావా, ఆ వచ్చిన రోజునే అమ్మ ఏమందో, ఎల్లా దుయ్యపట్టిందో నీకు తెలియదు. ఇన్నాళ్ళూ ఈ ఇంట్లో ఉండి, ఆఖరుకు ఈ శరీరంలోని వంపుల్ని బలిపెట్టయినా, నిన్ను పొందలేకపోయేను. చీర చెంగుకు కట్టుకో లేకపోయేననే అంది. అది నాకు, నా శరీరానికి కన్నతల్లి ఇచ్చిన విలువ. బావా, అదీ నాకున్న ఔన్నత్యం."
నాలుగు వైపులనుండి ఉవ్వెత్తుగా గాలి వచ్చి తాకిందన్నట్లే ఊగిపోయేడు. జాలిలో రుక్మిణిని చూచేడు.
"అందువల్ల ఈ శరీరంమీద, జనితం అయిన ఇచ్చలు, కోర్కెలమీద నాకు విలువ లేదు. దాని ఇష్టా యిష్టాల మీద చెలరేగనివ్వడం దృక్పథం."
"కొంచెం ఆలోచించుకుందుకు వ్యవధి నిస్తావా?" తప్పించుకు తీరాలి.
"అల్లాగే, బావా! కాని ఒక్కటి. రవ్వంత చోటిచ్చినట్లు, ఈ కాలిపోయే కట్టెకు తృప్తి ఇస్తివా అదే నాకు సుమంగళీత్వం. దానికోసం ఏమైనా చేస్తాను."
లేచింది. దగ్గరగా వస్తూనే, చేతుల్లోకి ముఖం తీసుకుని, ఒక్క ఊపు ఊగి, ముద్దు పెట్టుకుంది. కళ్ళు మెరుస్తూన్నాయి. శరీరం వేడిగా కాగుతూంది. చలువకాడలా అయ్యే, జబ్బ పట్టుకుని, మెట్లువరకూ తీసుకువెళ్ళేడు.
వంగి పాదాలకు నమస్కరించి కళ్ళకు అద్దు కుంది.
బొట బొటా కనీళ్ళు తిరిగేయి. పిట్టగోడ కానుకునే, ఆమెను చూచేడు. ఏమిటీ విషాదాంత జీవితం ఆవృతి, దాని ఆవలింపు? మానవుల హృదయాల పరిణామాలు ఇంత క్రూరంగా, ఆటబొమ్మలవతు వాళ్ళు చేసి ఆడిస్తారా?
ఇల అంతా నాటకరంగం. అందులో జీవులు పావులా? అన్న నానుడి ఎదురు తిరగింది. తనదో? ఎక్కడ ఈ ఆటకట్టు? ఈ దుఃఖ దహనం?
ఏమైనా, రేపటినుండి తను ఈ ఇంట్లో ప్రప్రధమంగా నిర్ణయం చెయ్యవలసినది, వెయ్యి ఏనుగుల బలంతో రుక్మిణే అయ్యింది. అది తన్ను వెన్నాడుతూంది. ఇప్పుడు తోకచుక్క అయ్యింది.
