Previous Page Next Page 
కృష్ణవేణి పేజి 28


    "ఈనాటికి నీకీ అనుమానం రావటం చిత్రం గానే వుంది. మీ పరిచయాన్ని స్నేహంగా మార్చుకున్ననాడే నీమీద నిండు నమ్మకం ఏర్పరచుకున్నాను. నీపట్ల నాకెటువంటి దురభిప్రాయమున్నా యీ స్నేహం యింతవరకూ పెరుగుతూ వచ్చేది కాదు.
    "నామీద నీకింత నమ్మకం వుండటం చాలు. యీ స్నేహానికి నేను కోరుకున్న ఫలితం లభిస్తుంది. అయినా నీకు కొన్నిమాటలు చెప్పాలని వుంది. స్త్రీనుంచి పొందాల్సిన అప్యాయతా, అనురాగం అంటే ఏమిటో ఎరుగని నాకు నీ చల్లని స్నేహం వాటిని ప్రసాదించింది, నన్నర్ధం చేసుకుంటూ జీవితాంతం నా కష్ట సుఖాల్లో పాలుపంచుకునే యువతి నాకు తోడు నీడ కావాలని కోరుకున్నాను. నా కోరికని తీర్చగలిగిన నిన్ను నా భార్యగా స్వీకరిస్తాను. నేను చెయ్యబోయే పనికి కొన్ని ఆటంకాలే రావచ్చు. నేనెవర్నీ లెక్కచెయ్యదల్చుకోలేదు. నాకు కావాల సింది ఒక్కనువ్వు. నిన్ను ఎప్పుడూ అన్యాయం చెయ్యను. నామీద నీకా నమ్మకం వుంటే చాలు. మాధవ్ నామొహంలోకి చూస్తూ వూరుకున్నాడు.
    నేను నిన్నెప్పుడూ శంకించలేదు మాధవ్!' అన్నాను. అనటమే కాదు. మాధవ్ పట్ల నాకు నిండు నమ్మకం వుంది. మాధవ్ అంటే ప్రేమ సానుభూతీ వున్నాయి. మాధవ్ ని నా మాధవ్ గా చేర్చుకోవాలనే ఆరాట పడ్డాను. మాధవ్ వెళ్ళి పోతున్న ఆ కొద్ది సేపైనా సంతోషంగా గడపాలి. మాధవ్ ని వదిలి వుండటం అంటే శరీరం నుంచి ఏదో భాగాన్ని దూరం చేసుకుంటున్నట్టే అనిపించింది.
    "మాధవ్ యీ మూడు రోజులు గడచి నట్టే లేదు. మరి మూడు రోజులు వుండ కూడదూ?" అన్నాను ప్రాధేయపడుతున్నట్టు. మాధవ్ చిన్నగా నవ్వుతూ గడ్డం ఎత్తిపట్టి కళ్ళల్లోకి చూశాడు.
    "నువ్వు కోరితే కాదంటానా వేణూ? కాని చిన్న షరతు"
    "ఏమిటో?" అన్నాను కళ్ళతో.
    "తర్వాత కాదంటావా?"
    "అదేమిటో తెలియకుండా మాటివ్వను ముందు చెప్తే......."
    "అడగి లేదనిపించుకోవటం నాకిష్టం లేదు"
    "నాదగ్గర కూడా నీకు పౌరుషమే కాబోలు"
    "పౌరుషమంటూ వుంటే ఎక్కడైనా వుంటుంది."
    "పోనీ ఒప్పుకుంటాను చెప్పు"
    "నమ్మమంటావా?"
    "నమ్మితే చెప్పు - నమ్మకపోతే మాను"
    "అయితే విను మరి. యీ మూడు సాయంత్రాలూ నీతో నేను గడిపాను ఆ మూడు రాత్రులూ నాతో నువ్వు గడపాలి అదీ షరతు"
    "ఈ షరతు నాకు ముందే తెలుసు" నవ్వాను.
    "తెలిసీ నటించడం-ఆశపెట్టి పూరించడం నీకు సరదా. పోనీ నీకే బోలెడు పాపం. అబద్దా లాడావ్."
    "నాపాపం నువ్వూ సగం పంచు కోవాలి. మనం తోడూ నీడ కదా?" మాధవ్ అలక చాలించి దగ్గరికొచ్చాడు - "నువ్వు చెప్పింది నిజం కృష్ణా! పాపమైనా, పుణ్యమైనా, సుఖ మైనా, దుఃఖమైనా యిద్దరం కలిసే అనుభవిస్తాం. అవును కదూ?" అన్నాడు. మాధవ్ భవిష్యత్తు గురించి పుట్టెడాశతో వున్నాడు. ఆ ఆశతోనే జీవిస్తున్నాడు.
    మాధవ్ ఎన్నో కబుర్లు చెప్పాడు. వింటూ కూర్చున్నాను. "యీ ఆలోచనలతో చదువునినిర్లక్ష్యం చెయ్యకు సుమా!" అన్నాడు. కాలం గడవకూడదనుకున్నందుకే తొందరగా చీకటి పడిందనిపించింది.
    "ఈ ప్రదేశాన్ని జీవితంలో మర్చిపోలేం కదూ?" అన్నాడు మాధవ్ ఆ చోటును వదిలే ముందు.
    "ముఖ్యంగా నిన్ను వదిలి వెళ్ళడం నాలో ఏదో అంశాన్ని వదులుకున్నట్టి బాధ కలుగుతూంది వేణూ!" అన్నాడు.
    "అలా బాద్ కలగటమే మంచిదేమో! ఆ వదులుకున్న అంశాన్ని దగ్గర చేర్చు కోవాలనే తహతహ వుంటుంది."    
    "ఎంతమాట కృష్ణవేణీ! వెళ్ళి పోతున్నానని నిష్ఠూరమాడుతున్నావా?" నేను జడలోంచి ఓ గులాబి తీసి యిచ్చాను.
    మాధవ్ గులాబీ తీసుకుని "మరి వెళ్ళిరానా? అన్నాడు.
    "మంచిది వెళ్ళిరండి" అన్నాను నవ్వుతూ. నా చేయి నొక్కుతూ "వచ్చేసారి జంటగా వెళ్దాం. వెళ్తాను మరి" అంటూ సాగిపోయాడు.
    
                             *    *    *

    మాధవ్ తో గడిపింది కొన్ని గంటలే. కానీ మాధవ్ ని గురించి దాదాపు పూర్తిగా తెలుసు కున్నాననిపించింది. లేఖల్లో మాధవ్ కన్నా వాస్తవంలో మాధవ్ కి ఓ విశిష్టత వుంది. అంత సన్నిహతంగా వుండి కూడా హద్దు మీరి ప్రవర్తించడానికి ప్రయత్నించలేదు. ఒక్కసారి ఆవేశపడ్డందుకు ఎంతో మధనపడ్డాడు.
    మాధవ్ వెళ్ళినది మొదలు సదా జాగ్రదావస్థలోనూ-నిద్రావస్థతోను మాధవ్ తోనే కాలం గడిపాను మాధవ్ సన్నిధిలో గడచిన ఆ ముచ్చటైన మూడు ప్రశాంత సాంధ్య వేళలూ చిరస్మరణీయాలు. సంధ్యా సమయాలలో తోటలో ఏమొక్క పక్కనో తలక్రింద చేతులుంచుకు పడుకొని ఆకాశంలోకి చూస్తూ ఆ ప్రేమ లీలలను  కన్నులముందు పరుచుకొంటూన్న కొద్దీ మనసు మాధుర్యాలతో నిండిపోయేది. తనువు తీయని తలపులతో పులరించేది.
    ఎటు చూసినా వసంతం! ఏది వూహించినా మాధుర్యం! "మాధవ్ రసికుడే సుమా!" అనుకున్నాను.
    పురుషుడు పౌరుషవంతుడే కాదు. రసికుడు కూడా అయివుండాలి. తరుచు గుర్తు వచ్చే ఆ  కథని తల్చుకు నవ్వుకున్నాను.
    ఒక బావా! మరదలూ! చిన్నతనం నుండి ఒకేచోట కలసి మెలసి పెరుగుతారు. 'ఒకరంటే ఒకరు యిష్టాలు పెంచుకుంటారు. మరదలు-పేరు గుర్తు లేదు కాబట్టి "రాధ అంటాను" యుక్తవయస్కురాలవుతుంది. మేనల్లుడంటే గురిలేని మామగారు కూతురికి మరో సంబంధం నిర్ణయిస్తాడు. పెళ్ళి ప్రయత్నాలు చురుకుగా సాగుతూంటాయి.
    మరదలుతోనే మనసు నింపుకున్న బావగారికీ తతంగమంతా బాధే కలిగిస్తుంది. కానీ ఆ మరదలితో నైనా మనసు విప్పి చెప్పుకోలేకపోతాడు. మరదలు కూడా బావగారి ముభావానికి అభిమాన పడి మనసైన వ్యక్తికి దూరమైపోతున్నా, నిర్లక్ష్యంగా వుండిపోతుంది. వూహ తెలిసినప్పటి నుంచి తనదవుతుందనుకుంటున్న మరదలు పరాయిదైతే చూడలేననుకొని బావగారు మరదలి పెళ్ళినాటికి పరారీ అవుతాడు. మరదలి పెళ్ళి మాత్రం నిర్విఘ్నంగా జరిగిపోయింది.
    కాలచక్రం నాలుగు సార్లు దొర్లేసరికి అనుకోని మార్పులు జరుగుతాయి. రాధ పసుపు కుంకుమలకి దూరమై అనాధగా పుట్టింటికి చేరుతుంది. పరారీ అయిన బావగారు ఒక నగరంలో ఉద్యోగం సంపాదించుకొని క్రమంగా ఉన్నత దశ నందుకొంటాడు. తన ఉనికి మేనమామకి తెలియజేస్తాడు. యాత్రలకు రావాలనుకొంటూన్న మరదలిని తప్పక తన యింటికి రమ్మని ఆహ్వానిస్తాడు.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS