Previous Page Next Page 
కరుణా మయి అరుణ పేజి 28


                                   40
    ఒకరోజు గడిచింది. వారం గడిచింది. ఒక పక్షమే గడిచి పోయింది. సేతుపతి గారికి చెల్లెళ్ళ నీ, అక్కలనీ ఎవ్వరూ లేరు. ఏదో తన ఇంటి ఆడపడుచూ, మేనకోడళ్ళూ , బావగారూ -- తన ఇంటికి వచ్చినంతగా సంబర పడిపోతున్నారు సేతుపతి . అందరినీ పూలలో పెట్టి పూజిస్తున్నారు. అందలం ఎక్కించి , ఊరేగి స్తున్నారు. అయినా....శంకర నారాయణ గారికి అంతా కంటక ప్రాయంగా ఉంది. అయన గారి మనసు, మనసులో ఉండడం లేదు.
    "అరుణ ఆవేశంలో ఏదో అంది. అన్నదని అక్కడ అంతటినీ వదులుకుని వచ్చాను. మా మూలాన్ని అరుణ వీరికి దూరమైతే అంతకన్నా మహాపాపం మరొకటి ఉంటుందా? అరుణ కైనా అది ధర్మమేనా? ఎంత పొరపాటు చేశానూ? ఈ పొరపాటు ఎంత త్వరగా సరిదిద్దు కుంటే అంత మంచిది!" అనుకుంటున్నాడు శంకర నారాయణ తమలో తాము.
    సరిగా ఆ సమయానికే, సేతిపతి గారూ, అరుణా కలిసి డాక్టర్ మోహన సుందరం అన్న ఒక ప్రఖ్యాతి గాంచిన వైద్యుణ్ణి తెచ్చారు అక్కడికి.
    "వీరే నండీ....శంకర నారాయణ గారని మాకు చాలా ఆప్తులు. వీరు డాక్టర్ మోహన సుందరం గారు." పరిచయ వాక్యాలు పలికి సేతుపతి అరుణను వెంట తీసుకుని వెళ్ళిపోయాడు. శంకర నారాయణ గారు కన్నీటి పర్యంతం అయ్యారు.
     మోహన సుందరం పరీక్ష మొదలు పెట్టాడు. ఆ పరీక్ష కు పాల్పడక తప్పింది కాదు శంకర నారాయణ కు. అయిదారు నిమిషాలు పరీక్ష చేసి శంకర నారాయణ గారి వద్ద సెలవు తీసుకుని మోహన సుందరం వెళ్ళిపోయాడు. అయన ఆ గది దాటాడో లేదో ఇంతసేపూ శంకర నారాయణ గారి గుండెలో రగులుతున్న ఆవేదన అనే అగ్ని భగ్గున మండింది! దావానల మై ఆయన్ని దహించి వేస్తుంది. మనిషి గిలగిల లాదిపోయాడు. చెప్పలేనంతటి బాధ ముంచు కొచ్చేస్తుంది! తనకు తెలుసు.......
    "ఆ...ఆ........ఆ........" అంటూనే ఉన్నారు. పేరు.....ఎంత ప్రయత్నించినా నోటంట పూర్తిగా రావడం లేదు.
    అక్కడ డాక్టరు గారు చెప్పింది విని మనసు పూర్తిగా పాడు చేసుకుని అరుణ ఆ గదిలోకే వచ్చింది.
    "నాన్నా, నాన్నా , మామయ్య గారూ! డాక్టర్! డాక్టర్! అయ్యో....నాన్నా! " అంటూ గావు కేకలు పెట్టింది అరుణ. మళ్ళీ ఆ గదిలో అందరూ చేరారు. కళ్ళు తెలేవేశాడు శంకర నారాయణ! ఆ చూపులనే సేతుపతి గారి వైపు మరల్చి చేతులు జోడించడానికి ప్రయత్నం చేశాడు. ఏదో....."వద్దు, వద్దు' అన్నట్టు తల ఆడించాడు. ఈలోగా మోహన సుందరం ఒక ఇంజక్షన్ ఇచ్చాడు. శంకర నారాయణ గారి కళ్ళు మామూలు స్థానాన్ని చేరుకున్నాయి. ఆ గిలగిల లాడ్డం ఆగింది. సేతుపతి గారికి అంతా అర్ధమయింది.
    "శంకర నారాయణ గారూ , మిమ్మల్ని చేతులు జోడించి ప్రార్ధిస్తున్నాను! మీరు మీ మనసును ఏ విధంగానూ పాడు చేసుకోవద్దు. నేనెంత? నా బ్రతుకెంత? నాది నడిమంతరపు సిరి! మీరు అగర్బ శ్రీమంతులు! విధి విలాసం! ఓడలు బళ్లయ్యాయి! బళ్ళు ఓడలయ్యాయి. అంతమాత్రాన మిమ్మల్ని జాలి దలచి, ఏదో దిక్కు లేనివారికి ఇంత చేయూత ఇచ్చినట్టు నేను మీకు ఉపకారం చెయ్యదలచు కోలేదు. అంతశక్తి నాలో లేదు. మిమ్మల్ని చులకన చేసేటంతటి నీచుణ్ణి కాను నేను. అరుణ, మీ బిడ్డ అయితే నా కోడలు! అదయినా మీరు అంగీకరిస్తేనే! ఇదుగోండి. మీ బిడ్డను మీకు అప్పజేబుతున్నాను. అమ్మాయి బుద్ది మంతురాలు, చదువుకుంది. సంపాదించ గలదు. మీ కష్టాలు తీరి, మీరు ఒక ఒడ్డు చేరుకున్న తరవాతే అరుణను నా ఇంటి కోడలుగా తెచ్చుకుంటాను. నేను చొరవ తీసుకుని చేసిన పనుల్లో తప్పేమైనా ఉంటె నన్ను క్షమించండి." అంటూ చేతులు జోడించారు సేతుపతి. శంకర నారాయణ గారి కను కోలుకుల్లో నుంచి రెండు కన్నీటి చుక్కలు వెడలి చెక్కిళ్ళ మీదుగా పక్క మీదికి రాలిపోయాయి. అరుణ గుక్క తిప్పుకోనంత ఇదిగా ఏడుస్తుంది. ఉస్సురని శంకర నారాయణ ప్రశాంతంగా కళ్ళు మూశారు.
    "నాన్నా!"
    "మరేం ఫరవాలేదమ్మా. పేషెంటు ఓ గంట గంటన్నర సేపు నిద్ర బోతాడు. ఆ తరవాత మళ్ళీ మాములుగానే ఉంటాడు" అన్నారు డాక్టర్ మోహన సుందరం!
    "ఓ....థాంక్ యూ, డాక్టర్!"
    "వస్తానండీ సేతుపతి గారూ!....నేనన్నట్టు ఓ అయిదారు సంవత్సరాల కిందటే జాగ్రత్త పడి ఉంటె....పరిస్థితి ఇంత విశామించేది కాదు. వారు మానసికంగా ఏమాత్రం ఆందోళనా పడినా ఇదిగో ఇలానే జరుగుతుంటుంది. ఒక రోజు అది చెడుగా కూడా పరిణమించవచ్చు. బీ వెరీ కేర్ ఫుల్!" అని అయన వెళ్ళిపోయాడు.
    మర్యాద కోసమయినా ఆయన్ని తలుపు వరకూ సాగనంపె ఓపిక లేకపోయింది సేతుపతి కి! ఇక అరుణ సంగతి చెప్పక్కర్లేదు. సేతుపతి దిగాలుగా అక్కడే చిన్న సోఫాలో కూల బదిపోయాడు. "మామయ్యగారూ!' అంటూ వెళ్లి అరుణ అయన పాదాల నాశ్ర యించింది.
    "ఊరుకో తల్లీ, నేను చెప్పినదంతా శంకర నారాయణ గారిని ఊరడించడానికి చెప్పిన మాటలు కావు. అది న్యాయం. అది ధర్మం. నీవు లేని ఈ ఇల్లు నరక మౌతుంది. నాకు తెలుసు. అయినా.....నా స్వార్ధం కోసం నిన్నూ ఈ పున్యాత్ముడ్ని విడదియ్యలేను! వారు నలుగురి లో ఒకరి లాటి వారయితే.........అన్ని ఏర్పాట్లూ నేనే చేసి ఉండేవాణ్ణి. ఏది ఎప్పుడు, ఎందుకు జరుగుతుందో మనకేం ఎరుక తల్లీ? నాకు నీవు ఒక్క వాగ్దానం మాత్రం చెయ్యి అరుణా. రఘు, నీ ఒక్కర్తెకే భయపడతాడు. అప్పుడప్పుడు వీలు చూసుకుని వచ్చి, వాణ్ణి ఒక కంట కనిపెడుతూ ఉండు. కావాలంటే ఈ ఊళ్ళో నే నీకు ఉద్యోగం చూసి పెట్టగలను అరుణా!"
    "నాన్నగారిని అడిగి చెబుతా నండి మామయ్య గారూ!"
    "అలానే తల్లీ." అరుణ మళ్ళీ బావురుమంది!
    "ఆరూ అనవసరంగా ఎందుకమ్మా అలా కుమిలి పోతావు? ఆమాత్రం అర్ధం చేసుకోలేని అనుభవ హీనుణ్ణి కానుగా నేను".......వెళ్ళు. వెళ్లి నా పైపు తెచ్చి పెట్టు తల్లీ. శంకర నారాయణ గారు నిద్ర లేచే దాకా నేనిక్కడే ఉంటాను. అసలు ఈ వేళ నేనెక్కడికి వెళ్ళదలుచు కోలేదు. అయ్యం గారు గారికి ఫోన్ చేసి అన్ని ఎంగేజ్ మెంట్స్ కాన్సల్ చేసేయ్యమను . వెళ్ళమ్మా , వెళ్ళు."
    అరుణ కన్నీరు తుడుచుకుని లేచింది. లేచిన పిల్ల మళ్ళీ పడి, సేతుపతి గారి పాద ధూళి తీసుకుని శిరసున తాల్చింది. సేతుపతి ప్రియమార అరుణ తల నిమిరారు. తృప్తి గొని లేచి అరుణ వెళ్ళిపోయింది.

                                 

                                     41
    నిజం చెప్పాలంటే రఘు, తన ఇంటిలోనే తాను పరాయి వాడుగా ఉంటున్నాడు. తండ్రీ కొడుకుల సంగతి సరేసరి! తల్లితో కూడా ఈ మధ్య అట్టే చనువుగా ఉండడం మానేశాడు! ఆ ఇంట , ఒక్క అరుణ మాత్రం అతనికి ఆప్తురాలు. ఒక్కో తూరి ఆ అమ్మాయి ఎంత చిలిపిగా సమాధానాలు ఇచ్చినా.....నిజంగా తన ఊహల్ని , ఆశయాల్ని, అర్ధం చేసుకో గలది-- ఒక్క ఆరుణే అన్న నమ్మకం అతనిలో దృడ పడిపోయింది.
    ఒక్కోనాడు ఏ రాత్రి పదకొండు గంటలకో వచ్చి , అరుణను నిద్ర లేపేవాడు. ఆవలిస్తూ "ఏమండీ యువరాజావారు!" అంటూ తలుపు తీసేది అరుణ.
    "అబ్బబ్బ! ఆ పాడు పేరుతొ నన్ను పిలవద్దు! ఈ రాజులూ , యువరాజులూ సర్దార్ పటేల్ పుణ్యామా అంటూ కోరలు పీకిన పాముల్లా పడి ఉన్నారు. ఈ ఇండస్ట్రియల్ సామ్రాజ్యాన్ని స్థాపించుకునే వారందరూ మహారాజులై , వారి సుపుత్రులు యువరాజులై తే మళ్ళీ దేశ స్వాతంత్ర్యం కోసం మనం జరిపిన పోరాట మంతటి పోరాటాన్ని మరో పద్దతిలో నడిపి వీరిని కూడా వైదొలగ గొట్ట వలసి ఉంటుంది."
    "రామరామ! అర్దరాత్రి పూట ఈ గొడవ ఏమిటి ఇక్కడ? పి.యు.సి మొదటి సారి పాసు కాలేని మొద్దబ్బాయివి, ఈ పనికి రాని విజ్ఞానాన్నంతటిని ఎక్కణ్ణించి సంపాదించావు?"
    "దేశం లోని పరిస్థితి ని కళ్ళారా చూడ్డానికీ, చూచినదాన్ని అర్ధం చేసుకోడానికీ, ఓపిక ఉండాలే గానీ.......ఈ విజ్ఞానం కోసం యూనివర్శిటీ ల్లో చదివి బి.కాం. లు, ఎం.కాం. లు పాసు కావలసిన అవసరం లేదు."
    "సరి, ఒప్పుకున్నాం . వచ్చి కూర్చుంటారా... వెళ్లి పడుకుంటారా?"
    "నా మానసు బాగు లేదు ఆరూ!"
    "దేశం లోని పరిస్థితి బాగుపడితే కదా, తమ బోంట్ల మనసులు బాగుండడానికి!"
    "అలా బీచికి వెళదామా ఆరూ?"
    "నీకు పట్టిన పిచ్చి నాకు పట్టలేదు. పైగా.......ఈఅర్ధరాత్రి పూట మనమిద్దరం ఆ బీచిలో తిరగడం చూస్తె పోలీసులు పట్టుకుంటారు! అయినా....ఈ పూట నీకు వచ్చిన బాదేమిటి రఘూ?"
    "మన సుందరం లేడూ?.......
    "వాడెవడో నాకు తెలియదు! పోనీ ఆ పేరు గలవాడోకడున్నాడనుకుందాం! ఆ సుందరాని కొచ్చిన తొందరేమిటి?"
    "వాళ్ళ నాన్న చచ్చిపోయాడు. శవాన్ని మోసుకు వెళ్ళడానికి కూడా డబ్బుల్లేక చందాలు పోగు చేసి, మోసుకు వెళ్లారట! అతను జబ్బు పడ్డప్పుడే సుందరం అప్పుడో పదీ....అప్పుడో పాతికా తీసుకునేవాడు. నా దగ్గిర మందుల కనీ, డాక్టర్ల కనీను. ఇక అడగడానికి సిగ్గేసి, పాపం, బిచ్చమెత్తి వాళ్ళ నాన్నను స్మశానానికి తీసుకెళ్లాడట!"
    "అడగలేదు! ఆ తప్పు అతడిది! నీవెందుకు రఘూ బాధపడడం?"
    "అంతకంటే చేసేదేముంది ఇప్పుడు?! అది కాదు నేననేది! మా నాన్న గారే చచ్చా......"
    "రఘూ!"
    "అందరూ చావవలసిందే ఆరూ! నీవు....నేను...నాన్నగారు....ఎవరైనా సరే! చావును జయించగలిగిన వాడు , ఇంతవరకూ పుట్టలేదు! ఇక మీదట పుట్టబోడు."
    "సంతోషించాం లే! కమ్మని నా నిద్ర పాడు చేసి మంచి టాపిక్కే లేవదీశావు!"
    "ఆహా! నేను చెప్పిచ్చిందేమిటంటే ...ఎవరైనా గొప్పవాడు చస్తే, ఒక బ్రహ్మాండమయిన పెళ్ళికి చేసినంత ఖర్చు చేస్తాం! పేదవాడు చస్రే -- ఏడ్చేదిక్కు కూడా ఉండదు! ఛీ ఛీ....."
    "అయిందా ...ఇంకా ఏమన్నా ఉందా....ఉపదేశం చెయ్యడానికి?'
    "ఇంకేమీ లేదు!"
    "వెళ్లి స్నానం చేసి పడుకో! లేకపోతె ఆ సుందరం తండ్రీ, భూతమై కలలో కి వచ్చి, "చిన్నయ్య గారూ! నా మందుల కోసం అంత ఇచ్చిన  తమరు, కర్మల కోసం మరో అంత ఎండు కొవ్వలేదూ?-- అని డిమాండ్ చేస్తాడు! గుడ్ నైట్ !" అంటూ డభాలున తలుపు వేసేసేది అరుణ
        
                              *    *    *    *
    ఒక్కోనాడు వచ్చి, "అరుణా, నేనీ ఇల్లు వదిలి వెళ్ళిపోతా!" అనేవాడు రఘు.
    "ఇదొక కొత్త పిచ్చా?"
    "దేశంలో కనీసం యాభై శాతం తిన తిండి లేక....నిలవ నీడ లేక బాధపడుతుంటే, మనకు ఇంతింత మేడల్లో ఉంటూ.....ఇన్నిన్ని సుఖాల్ని అనుభవించే అధికారం లేదు!"
    "రఘూ, నీకు పిచ్చి పట్టింది! నా బాధ అంతా ఏమిటంటే.........కీల్సాక్ నించి వచ్చిన నిన్ను పెళ్లి చేసుకోవలసి వస్తుందే అని !"
    "అలాగే ఉంటుంది. టాల్ స్టాయ్ అంతటి మహానుభావునికి పిచ్చి పట్టిందన్నారు! సూర్యుడస్తమించని బ్రిటన్ సామ్రాజ్యాన్ని, కేవలం తన బోసి నవ్వుతో .....అహింసా వాదంతో లొంగ దీస్తానన్న మహాత్మునికి పిచ్చి పట్టిందన్నారు!"
    'అమ్మ బాబో! అయితే నీ ప్లానంతా ఏవో టాల్ స్టాయివో.....మహాత్మావో కావాలనా? మరి ఇన్నాళ్ళూ చెప్పలేదేం రఘూ?"
    "ఫో! నీ ఒక్కర్తేవూ నన్నర్ధం చేసుకో గలవను కుంటే......నీకు కూడా నేనేదన్నా హాస్యాస్పదం గానే ఉంది!"
    "లేకపోతె ఏమిటి రఘూ? మనదేశం లోని జనాభా నలభై అయిదు కోట్లనుకో! దేశంలో ఉన్న డబ్బును ....పొలాన్ని........ఇళ్ళను....అంతటిని అందరికీ సమానంగా పంచామనుకో........."
    "అలా పంచి పెట్టమని నేననడం లేదు. కలవారు లేనివారిని ఒక కంట కనిపెట్టి ఉంటె ఏ గొడవా ఉండదు! ఇప్పుడీ భూదానమనీ....శ్రమ దానమనీ సంపత్తి దానమనీ....సర్వోదయ వారు మొదలు పెట్టారు కాబట్టి సరిపోయింది. అదే.....మాలాటి వాళ్ళం మొదలు పెట్టామనుకో! వెంటనే ఇంకో రియాక్షన్ వచ్చేది! పోనీ.....ఎవరు తలపెట్టినా మంచి మంచే! హృదయ పూర్వకంగా దాన్ని అందరూ ఆచరణలో పెట్టనీ! పరిస్థితి దాని అంతట అదే మంచి వైపు మొగ్గుతుంది."
    "అలాగేలే స్వామీ , అలాగాలే! ఈతూరి నాకేవరైనా అగుపడితే 'సర్వోదయవారి విధానము, మా రఘు విధానము ఒకటే! మా రఘును మరో విధంగా మీరపార్ధం చేసుకో వద్దండీ' అని నచ్చ చెప్పి, అందరినీ ఒప్పిస్తానులే!"
    ఆ ఇద్దరి మధ్యా ఎప్పుడూ ఆ పద్దతుల్లో జరిగేవి వాద ప్రతివాదాలు!

                                               *    *    *    *


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS