Previous Page Next Page 
బ్రతుకు బొంగరం పేజి 28

   
                               18
    "రవీ!" సురేంద్ర!
    తన ఎదురుగా సురేంద్ర!
    "ఎక్కణ్ణించి వస్తున్నావు, ఏమిటిది?"
    "జైలు నుంచి వస్తున్నాను. తప్పించుకొని వస్తున్నావు!"
    "ఎందుకు?"
    "హా హ హ, నీకు తెలియదా ఎందుకో? ఛీ....ఛీ సిగ్గు లేడూ అని అనడానికి? నేను కసి తీర్చు కుందామని తప్పించుకొని వచ్చాను. నీవు నా స్నేహితుడవని నా దగ్గిర ఆశ్రయాన్ని ఇస్తే, నన్ను జైలు కు పంపించడానికి గూడా వెనుకాడ లేదు. దిక్కు మొక్కు లేకుండా ఏడుస్తూ నాగపూరు లో నా అనేవాళ్ళు లేకుండా అల్లాడుతుంటే నేను...నేను ...నిన్ను దగ్గిరికి తీసుకున్నాను. దిగులుతో కుంగిపోతున్న నీకు ధైరాన్ని చెప్పాను. చిన్నప్పటి స్నేహితుడవు గదా అని నిన్ను ప్రాణం కంటే మిన్నగా చూసుకున్నాను. ఆ విధంగా ఉంటె నన్ను...నన్ను యావజ్జీవ కారాగార శిక్ష పాలు చేశావు. నిన్ను గూడా సురేఖ లాగానే గొంతు పిసికి చంపేస్తాను...గొంతు పిసికి....."
    "వద్దు ,సూరీ , వద్దు....నన్ను క్షమించు. నన్ను బ్రతకనియ్యి, అబ్బా....సూరీ...."
    "అహహహ....పిసుకుతాను....గొంతు పిసుకుతాను."
    "అమ్మో! " కెవ్వున కేకవేసి రవిచంద్ర లేచి కూర్చున్నాడు.
    రాత్రి రెండు గంటలయింది. పక్క మీద ముద్దగా తడిసిపోయి ఉన్నాడు. భయంతో. సురేంద్ర కలలోకి వచ్చాడు.
    రవిచంద్ర నెమ్మదిగా లేచాడు. గ్లాసులో మంచినీళ్ళు పోసుకొని తాగాడు. గుండె దడ అలాగే ఉంది.
    ఇంకా గడవని రాత్రి భయపెడుతున్నది అతణ్ణి. పదేపదే సురేంద్ర జ్ఞాపకంతో నిద్ర పట్టడం లేదు. ఒకవేళ నిద్ర పట్టినా సురేంద్ర ను గురించిన కలలే! గట్టిగా కళ్ళు మూసుకొని పడుకున్నాడు.
    అప్పటికే సురేంద్ర ను అక్కడి నించి తీసుకొని వెళ్లి రెండు నెలల యింది. సురేంద్ర హంతకుడి గా మారిన తరవాత మళ్ళీ అతను నటించిన పాత చిత్రాన్ని ఆ పేరు మీద విడుదల చేశారు. లక్షలు సంపాదించింది ఆ సినిమా. అందులో యాదృచ్చికంగా సురేంద్ర వేసిన పాత్ర హత్య చేసినట్లుగా చిత్రీకరించబడింది. అయితే సురేంద్ర నిజజీవితానికి, సినిమాకు తేడా ఏమిటంటే, నిజ జీవితంలో సురేంద్ర శిక్షించబడ్డాడు, ఆ సినిమాలోని పాత్ర శిక్షించబడలేదు. సినిమాలో ఒక స్నేహితుడు ఆదుకొని, అప్పటిదాకా మరుగున పడి ఉన్న రహస్యాన్ని బయటికి గుంజి , సురేంద్ర వేసిన పాత్రను శిక్ష నుంచి రక్షిస్తాడు.
    ఆ ప్రయత్నంగా ఆ సినిమాకు వెళ్ళాడు రవిచంద్ర . రెండు నెలలు గడిచేసరికి సురేంద్ర ను చూడాలనిపించే కోరిక బలపడి ఆ సినిమాకు వెళ్లి కూర్చున్నాడు.
    అనుకోకుండా రాజగోపాలం , ప్రియం వద కూడా వచ్చారు.
    సినిమా మొదలయింది.
    సురేంద్ర చాలా అందంగా ఫోటో గ్రాఫ్ చేయబడ్డాడు. ఎంత అందంగా ఉన్నాడు! ఇంత అందం ఇదివరకు తనకు కనపడలేదే? రవి మనసు మధన పడసాగింది.
    మొదటి సగం వరకు హుషారుగా నవ్వుతూ, గెంతుతూ కేరింతలతో సురేంద్ర నిజజీవితంలో మాదిరే ఉన్నట్లనిపించాడు.
    ప్రియంవద మాటిమాటికి కళ్ళు అద్దుకోసాగింది. ఆమెకు పదేపదే నవ్వుతూ, పేలుతూ తమతో గడిపిన సురేంద్ర కళ్ళ ముందు దీనంగా, జైలులో శుష్కించి పోతున్నట్లుగా కనపడసాగాడు.

                                      
    జైలు దృశ్యాలు వచ్చేసరికి రవిచంద్ర , రాజగోపాలం కూడా చలించి పోయారు.
    తామిద్దరూ జైలులో చూసినట్లే సురేంద్ర సినిమాలో ఉన్నాడు బాధపడుతూ , కుంగి పోతూ.
    సినిమాలోని స్నేహితుడు వచ్చి అతణ్ణి బ్రతిమాలాడు. భంగ పడ్డాడు. ప్రార్ధించాడు. అసలు సంగతి తెలుసుకోడానికి, చివరికి హత్య చేయడాని ఏర్పడ్డ పరిస్థితులను తెలుసుకున్నాడు.
    కోర్టులో అందరూ శిక్ష తప్పదను కొన్న సమయానికి స్నేహితుడు అసలు సంగతిని బయట పెడతాడు. ఆ పరిస్థితుల వల్ల ఎలాంటి మార్పు వచ్చిందో కళ్ళకు కట్టినట్లుగా సురేంద్ర తరపు వకీలు వాదిస్తాడు. పరిస్థితుల ప్రోద్భలం వల్ల తనను తాను రక్షించుకోడానికి హత్య చేసినట్లుగా చివరకు విచారణలో తేలుతుంది.
    జడ్జి అతణ్ణి వదిలి పెట్టినట్టుగా తీర్పు ఇస్తాడు. హుషారుగా గెంతుతూ, సురేంద్ర విడుదల అయి బయటి ప్రపంచంలోకి వస్తుంటే సినిమా పూర్తీ అయింది.
    చటుక్కున లైట్లు వెలిగాయి. రవిచంద్ర కుర్చీలో స్పృహ తప్పి పడి ఉన్నాడు.
    "రవిచంద్రా! ' ఆదుర్దాగా పిలిచాడు రాజగోపాలం.
    రవిచంద్ర కు తెలివి రాలేదు. ప్రియ కంగారుతో వణికి పోసాగింది. రాజగోపాలం పరుగెత్తుకొని వెళ్లి నీళ్ళు తెచ్చి ముఖాన చల్లాడు.
    రవి కదిలాడు. 'సూరీ, నిన్ను రక్షించుకోలేక పోయాను. నిన్ను రక్షించు కోలేక పోయాను.' కలవరిస్తున్నాడు.
    "రవిచంద్ర గారూ, రవిచంద్ర గారూ!" ప్రియ ఆదుర్దాగా పిలిచింది. రాజగోపాలం నెమ్మదిగా అతని కణతలు నొక్కుతుంటే , స్పృహ తప్పి పడిపోయాడు రవిచంద్ర-- అసిస్టెంటు కలెక్టర్!
    దియేటరు ప్రోప్రయిటరు ఆదుర్దాగా వచ్చి, సంగతి తెలుసుకొని డాక్టరు కోసం ఫోను చేయటానికి వెళ్ళాడు.
    అప్పటికే చిన్న గుంపు పోగాయింది.
    నెమ్మదిగా రవి మెదల సాగాడు. "రవిచంద్ర గారూ, రవిచంద్ర గారూ" అంటూ రాజగోపాలం ఆదుర్దాగా అతని మీదికి వంగాడు.
    బలహీనంగా కళ్ళు తెరిచాడు రవి. "నేనెక్కడున్నాను?' అని అడిగాడు.
    "నేను......రాజగోపాలాన్ని."
    "మీరా? ....ఏమిటిది?" దిగ్గున లేచి కూర్చున్నాడు.
    "ఏమీలేదు, పదండి, వెళదాం , ఎలా ఉంది ఒంట్లో?"
    "బాగానే ఉంది, పదండి." గబగబా లేవబోయాడు .
    నెమ్మదిగా అతణ్ణి తీసుకు వచ్చి కార్లో కూర్చో బెట్టాడు రాజగోపాలం. ప్రియ తలుపు వేసి కూర్చున్నతరవాత భారంగా కదిలింది కారు.

                          *    *    *    *
    "నేను భరించలేకుండా ఉన్నాను. సూరి జీవితాన్ని నా చేతులతో నేనే ధ్వంసమొనర్చాను. ఏమిటి నాకు శిక్ష? ఏమిటి నాకు నిష్కృతి? రాజగోపాలం గారూ, ఈ ఆవేదన నా హృదయాన్ని తినేస్తున్నది. కూర్చున్నా, నిల్చున్నా పదేపదే సురేంద్ర జ్ఞాపకం వస్తున్నాడు . వాడు లేని ఈ జీవితం నాకెందు కనిపిస్తున్నది? నాకీ జీవితం అంటే విరక్తి కలుగుతున్నది." రవిచంద్ర మాటలు రాజగోపాలం హృదయాన్ని చీల్చసాగాయి. ఏం చెప్పగలడు తను? ఒకరు చేసిన నేరానికి ఇంకొకరు ఎలా బాధ్యులవుతారు? న్యాయం ఇంత కఠినంగా ఉంటుందా? రవిచంద్ర ఈ విధంగా వేదనతో మగ్గి పోతుంటే ఎలా ఒడార్చాలి? అంతు దొరకని ప్రశ్నలు....అసలు అంతు అనేది లేని ప్రశ్నలు!
    "రవిచంద్ర , ఏమిటిది? ఇంత బేలగా మారిపోతే ఎలా? అందులో మీ దోషం ఏముంది? మీరు ఎందుకలా బాధపడతారు?" రాజగోపాలం మాటలు అతనికి రుచించ లేదు . దిగ్గున లేచాడు.
    "మీరు నిజాన్ని దాస్తున్నారు. నా ముందర నన్ను ద్వేషించడం లేదు గాని, మీ హృదయం నిండా నామీద ద్వేషం ఉంది, అసహ్యం ఉంది. హృదయాన్ని ఇచ్చిన స్నేహితుణ్ణి అధికార దర్పంతో న్యాయం అనే బురఖా తగిలించుకొని, హృదయం లేకుండా బాధించానని, కనీసం ఒక అపరిచితుడు చేసే సహాయాన్ని గూడా చేయలేదని మీ అందరికీ నామీద కోపం ఉంది. నాతొ చెప్పడం లేదు. నన్నెందుకు మీరు బాహాటంగా అసహ్యించు కోరు? మీ కసి తీరేలా నన్ను ఎందుకు ఖండించరు? నేను చేసింది ద్రోహమని, పాపమని , అన్యాయమని ఎందుకు నా ముఖం మీద అనరు? నన్నిలా గౌరవస్తుడిగా, హృదయం ఉన్నవాడిలా ఎందుకు మర్యాద చేస్తారు?" ముఖాన్ని రెండు చేతులతో కప్పుకొని ఆవేశంతో బిగ్గరగా అరవసాగాడు.
    రాజగోపాలం క్షణ కాలం దిమ్మెర పోయాడు. కాని, రవి పరిస్థితి అర్ధమయింది. రవిచంద్ర అంటే విపరీతమైన జాలి ఆ నిమిషంలో కలిగింది.
    కళ్ళల్లో మసకలు కమ్ముకుంటుంటే ఆప్యాయంగా అతని భుజం మీద చేయి వేసి దగ్గిరికి గుంజు కున్నాడు.
    "రవీ, మిమ్మల్ని బాగా అర్ధం చేసుకున్నవాడు, చేసుకోగలిగిన వాడు ఈ ప్రపంచంలో ఎవరైనా ఉంటె నేనే. ఎందుకలా మిమ్మల్ని మీరు కించ పరుచు కుంటారు? అనవసరంగా బాధను ఎందుకు ఎక్కువ చేసుకుంటారు? సురేంద్ర పరిస్థితి కి నేను దుఃఖ పడుతూనే ఉన్నాను. ఆ దుఃఖం ఇలాంటిది అని చెప్పలేనటువంటిది. శాశ్వతమైనది. అందుకోసమని పదేపదే దాన్ని గూర్చి అనుకోవడం వివేక వంతుడు చేయవలసిన పని కాదు. మీకు తెలియదు, రవీ. మిమ్మల్ని చూస్తుంటే నాకు గర్వంతో హృదయం ఉప్పొంగి పోతున్నది. మీ నిజాయితీ ని శంకించిన వాడికి మంచితనం విలవ తెలియనట్లే. ప్లీజ్, నాకోసం, నామీద మీకేమైనా గౌరవం ఉంటె బాధపడకండి." రవి అతని దృడమైన పరిష్వంగం లో ఏదో శాంతి, ఏదో హాయి పొందాడు. అతని మాటల్లో ఏమిటో సుఖం, కష్టాలను ఇట్టే పోగొట్టేటటు వంటి గుణం!
    చాలాసేపటి దాకా సమయం బరువుగా కదిలింది.
    "ఉల్లాసంగా ఉండడానికి పరయత్నించండి. ఆ జ్ఞాపకాలను తిరగాతోడే ప్రతి విషయాన్ని మరిచిపొండి. సురెంద్రను మరిచిపొండి. మీకు సురేంద్ర అనే స్నేహితుడు ఒకడున్నట్లు గా కూడా భావించకండి."
    "అసంభవం. సూరిని నేను మరిచిపోలేను. నన్ను నేను మరిచి పోగలనా రాజగోపాలం గారూ?"
    ఆ ప్రశ్నకు కదిలి పోయాడు రాజగోపాలం.
    "మీరు మరిచిపోవాలి, రవీ. అవసరం ఉంటె మిమ్మల్ని మీరు మరిచిపోక తప్పదు. ఈ ప్రపంచంలో దుఃఖం, విచారం, ఆవేదన, బాధ -- ఇవే ఉన్నవను కోకండి. వీటితో బాటు సంతోషం, సుఖం, ఉల్లాసం కూడా ఉన్నాయి. ఎన్నో వ్యాపకాలు, మీ బాధను మరిచి పోవడానికి ఎన్నో అవకాశాలు. రవీ, మీరు మాత్రం మామూలు మనిషి కావాలి. ఇప్పుడు ఇదివరకటి రవిచంద్ర కాదు మీరు. మీమీద ఎన్ని బాధ్యతలు, అధికారం తెచ్చిన ఎన్నో బరువులు ! వాటన్నిటికి మీరు న్యాయం చేకూర్చాలి. వ్యక్తిగతంగా మీరు బాధతో, వేదనతో పీడించబడుతున్న వారు కావచ్చు. కాని మీ బాధలు ఇతరుల మీద రుద్దవద్దు. మీ మీద ఆధారపడ్డ వారికీ మీరు న్యాయం చేకూర్చక తప్పదు."


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS