ఇంతవరకు కనకం, తను ఎలాగో బతుకులు తెల్లారిపోవా అని వెనక, ముందు చూసుకోకుండా వీళ్ళకు పెట్టేడు.
"ఇంక మన సంసారం పెరిగేలా ఉంది' అన్నది కనకం. ఆ మధ్యన. ఒకరి వెనక ఒకరు పుట్టుకు వస్తుంటే , వాళ్ళను పెంచి పెద్ద చెయ్యాలా వద్దా?" తన కోసం , తన పిల్లల కోసం వీళ్ళు తమ గోరైనా వంచరు. అటువంటి ఆశలన్నీ సాంబు తోనే పోయేయి.
తన పీకల మీదికి ఈ జానకి ఒక్కత్తే. ఏమైనా అంటే, నా బరువు నువ్వేం మోస్తున్నావు? నేను ఉద్యోగం చేసుకొంటున్నానంటుంది. ఉద్యోగం చేస్తున్న మాట నిజమే. డబ్బు గడిస్తున్న మాట నిజమే. అంత మాత్రం చేత అన్నకు బాధ్యత లేకుండా పోతుందా?
"మీ చెల్లెలుతో తరచూ కనిపిస్తుంటాడు. ఎవరయ్యా అతను? మీ బావగారా?"
"మీ చెల్లెల్ని అత్తవారు తీసుకెళ్లలేదని విన్నామే?"
"అదేం కాదయ్యా. ఈయన చెల్లెలే మొగుణ్ణి వదిలి పెట్టిందిట."
"మరి సన్నగా, పొడుగ్గా ...సూటూ , బూటుతో ఆయనేవరు?"
ఇలా తెలియనట్లు అంతా ముఖం మీద అడుగు తుంటే వాళ్ళకు జవాబులు చెప్పలేక నాలుక చిల్లులు పడుతున్నది.
"బంధువూ కాదు, బావగారూ కాదు. వాళ్ళ బాస్." "అదే అనుకున్నాము. బాగా డబ్బున్న వాడి లాగే ఉన్నాడు."
ఇలా సాగుతుండే సంభాషణల లోంచి తప్పుకోలేక వినలేక బాధ పడుతున్నాడు తను.
ఒక సంవత్సరం ముందు తనకీ బుద్ది పుట్టి ఉంటె, బంగారు లా జానకి అత్తవారింటికి వెళ్ళి పోయి ఉండేది.
"నాన్నగారు పోయేక చాలా రోజులు చూసేనండి- మీనుండి మాటేమైనా వస్తే జానకిని తెచ్చుకొంధామని. పంతాలకి పోయి పాపం ఆ పిల్ల బతుకు అన్యాయం చెయ్యడం ఎందుకని. కాని మీ ఇంటి గాలే ఇటు తగలలేదు. ఆడపిల్ల వారికి మీకే అంత లక్ష్యం లేకపోతె.... ఇప్పుడు నేనేం చేసేది చెప్పండి ఇదిగో నా భార్య. అదిగో ఉయ్యాలలో నా కొడుకు.
"పరువు గల కుటుంబాల వాళ్ళం. కోర్టుల కెక్కి రొష్టు పడడం నా కిష్టం లేదు. మీచేల్లెలి జీవనభ్రుతి నేనెంత ఇచ్చుకోవాలో చెప్పండి. ఇచ్చేస్తాను." అన్నాడు జానకి భర్త.
ఇంట్లో లక్ష్మీ దేవిలా కలకల్లాడుతూ చురుగ్గా పనిపాట్లు చేసుకొంటున్న పెళ్ళాం; పండు లాటి కొడుకు. అతనికేం? అదృష్టవంతుడు. శని అంతా నా పీకకే చుట్టుకొంది. నా నుదుట రాసున్న రాత అనుభవించకుండా తప్పుతుందా? అనుకొనేవాడు సూర్యారావు.
సూర్యారావు ఆలోచనలేమీ, కార్యరూపం లోకి రాకుండానే మరి రెండు నెలలు గడిచి పోయేయి. ఇంట్లో ఆర్ధిక పరిస్థితులు ముందు కన్న మెరుగ్గానే ఉన్నా, సూర్యారావు కు దేనికీ సొమ్ము లేనట్టే అనిపించేది. రమారమి ఇంటి నిలవకు సరిగా పెరిగిన అప్పు తీర్చి వేసి ఇల్లు నిలుపుకోవాలన్న ఆరాటం అప్పుడే మొదలైంది. "ముగ్గురం ఇంత తెచ్చుకొంటున్నాం కదా! నెలనెలా ఇంతని ఇంటి అప్పు తీరుస్తే బాగుండదూ?" అన్నాడు సూర్యారావు.
"ఏం లాభం , అన్నయ్యా! ఇంత ములిగి పోయేక ఇంకా ఈ ఇల్లు నిలబెట్టుకోవాలనుకొడం అర్ధం లేని తాపత్రయం. బూడిద లో పోసిన పన్నీరు లా ఈ అప్పులో సొమ్ము పోసే కన్న ఇంకో విధంగా వినియోగిస్తే మంచిది. ఇల్లయినా మరీ అంత కొత్తది కాదు" అన్నాడు ప్రకాశం.
"ఇంకోలా వినియోగించడం అంటే, మరికొన్ని పుస్తకాలు కొని, కొట్టు పెంచుకొంటే బాగుంటుందనేనా నీ అభిప్రాయం? అవును; ఉండేందుకు ఇల్లు, తిండి పెట్టేందుకు అన్న ఉంటె , అర్జనంతా మదుపు పెట్టి కోటీశ్వరుడయి పోవాలని అందరికీ ఉంటుంది. బాంకు లో ఓ పది వేల రూపాయలు దాచుకోవాలని నాకూ ఉంది. కాని నాకెవరూ అటు వంటి అన్నలు లేరు" అన్నాడు సూర్యారావు.
"నీకివ్వకుండా, నేనేదో వేరుగా సొమ్ము దాస్తున్నాననే కదూ నీ బాధ అన్నయ్యా! నాకటువంటి అభిప్రాయం ఏం లేదు . సొమ్మంతా తెచ్చి నీ చేతుల్లో పోయ్యమన్నా పోస్తాను. కాని కూర్చుని తింటే అది ఏ మూలకి వస్తుంది?
"నేను కొట్లో సొమ్ము , మదుపు పెట్టినా, ఇంట్లో ఖర్చు పెట్టినా నా ఒక్కడి కోసం కాదన్నయ్యా! మనందరి క్షేమం ఆశించే చేస్తున్నాను. అందరం బాగు పదాలని సుఖంగా జీవితాలు గడిపి వేయాలని నా కోరిక. ప్రతిదానికి మదుపు పెట్టాలి, అన్నయ్యా. సుఖ జీవానానికి, పరిశ్రమ మదుపు పెట్టి ముందుకు పోయే ప్రయత్నం నాది."
'అవునురా, ప్రకాశం. నువ్వు రోజురోజుకీ నీ పరిశ్రమతో ముందుకే పోతున్నావు. పేపరు కుర్రాడుగా జీవితం మొదలు పెట్టినవాడివి. బజార్లో పుస్తకాల షాపు కదిపతివయేవు. ఎప్పటికీ మారంది పెరగంది నా జీవితమే. మీరంతా గొప్పవాళ్ళయి, ధనధాన్య వస్తు వాహనాలు పోగు చేసుకొంటుంటే నేను తిండి తిప్పలకు వెతుకులాడుతూ ఇలాగే కళ్ళు మూస్తాను.
"నా తరువాత నా పెళ్ళాం పిల్లలు ముష్టేత్తుకొంటూ మీ గుమ్మాల ముందు కొస్తే, మీకు తోచిన ముష్టి పడేసి పొమ్మంటారు. దీనికి మిమ్మల్నేమీ అనటం లేదు. తెలివి తక్కువగా ప్రవర్తించి చేతులు కాల్చుకొన్నాను. ఇప్పుడు బాధ పడితే మాత్రం తప్పుతుందా?"
"ఇదంతా నువ్వు దేని కంటున్నావో నా కర్ధం కాలేదన్నయ్యా! నీవూ, నేనూ వేరనే అభిప్రాయం నీ మనసులో కెందుకొచ్చిందో నాకు తెలియదు. మనుష్యుల అభిమానాలు డబ్బుతో పాటే కొలవబడతాయని నువ్వు అనుకొంటుంటే , నీపట్ల నాకున్న అభిమానం చూపు కొందికి నేనెంత డబ్బు ఇవ్వాలో చెప్పు. ఇస్తాను.
"మనిషి బ్రతికిందికి డబ్బు కావాలి. నిజమే. కాని మనిషిని మనిషి చంపుకొందికి కూడా అదే కారణం అవుతున్నది. మనుష్యుల మధ్య అభిమానాలు నిల్పుకొందికి డబ్బు ఉపకరిస్తున్నది. తిరిగి ఆ అనుబంధాల్ని డబ్బే నిర్మూలిస్తున్నది. మనం ఈ సుడిలో పడడం నాకిష్టం లేదు, అన్నయ్యా!
'ఆశయాలు, మార్గాలు వేరై అన్నదమ్ములు విడిపోతే, నే నర్దం చేసుకోగలను. కాని డబ్బు కోసం....వద్దు అన్నయ్యా. అలా ఎన్నటికి జరగకూడదు. నీ డబ్బు మీద నాకు పూర్తీ అధికారం ఉందనే అభిప్రాయం తోనే ఇప్పటివరకు రెండు పూటలా కడుపు నిండా తిని, అరిగించుకొంటున్నాను. ఇంకో భావనే నాలో కలగలేదు. లేకపోతె ఇదిగో నా తిండి కని నెలనెలా నీ చేతిలో ఇంత సొమ్ము పడేసేవాణ్ణి. నీ ఉద్దేశం అదే అయితే అలా ఇచ్చిందికి నాకేం అభ్యంతరం లేదు. కాని, దానితో నువ్వూ, నేనూ ఎంత దూరమై పోతామో , మరోసారి ఆలోచించుకో, అన్నయ్యా!' అన్నాడు ప్రకాశం.
అప్పటికి సూర్యారావు ఏమీ మాట్లాడలేదు. అటు తరువాత కూడా ప్రకాశం తన తిండి కింద అని అన్న చేతిలో పెట్టలేదు. ఇంట్లో తన బాధ్యత అంతకన్నా గురుతరమైనదనీ , ఆ విధంగా సోమ్మిస్తే దానిని తక్కువ చేసినట్లు అవుతుందనీ ప్రకాశం అభిప్రాయం.
సాధారణంగా ఇంట్లో ఏదైనా వస్తువు కొరత పడిందంటే ప్రకాశం తో చెప్పడం, అతడు తేవడం అలవాటు. నెల మొదట్లో జీతం అందగానే సూర్యారావు అవసరమైన వస్తువులు కొని ఇంట్లో పడేసేవాడు. మిగిలినవి ప్రకాశం చూసుకొనేవాడు. ఆ నెల సూర్యారావుకు బాజారుకు పోయేందుకు ఏ కారణం గానో, లేక అకారణం గానో తీరలేదు. పై మీద వాణీ వేసుకొని వీధి లోకి వెళ్ళి పోతూ , "చూడు, ప్రకాశం! మీ వదిన ఇంట్లో సామాన్లు నిండు కున్నాయంటున్నది. ఓసారి బజారుకు పోయిరా" అన్నాడు. దాని అర్ధమేమిటో ప్రకాశానికి తెలుసు.
"ఏం మనుష్యులురా బాబూ!" అనుకొన్నాడు.
ఈ అలవాటు ఏర్పడ్డాక ప్రకాశానికి బరువు పెరిగినట్లు కాక తరిగినట్లు అనిపించింది. డబ్బుతో అంత సులువుగా బాధ్యతల్ని వదుల్చుకోవచ్చని అతనికి అప్పుడే తెలిసింది. రోజు రోజుకూ తను అన్నకు పడిన బాకీ తీరి, స్వేచ్చ పొందుతున్న భావన ఏర్పడింది.
