Previous Page Next Page 
వంశాంకురం పేజి 28


    "అపారేం?" కళ్ళు తుడుచుకుంటూ అడిగింది.
    "నీ ఆవేశము తగ్గని." అన్నాడు.
    "ఫరవాలేదు. పోనివ్వండి. యెందుకో ఈ రోజు పిచ్చిగా వస్తుంది కన్నీరు."
    "ఇప్పుడెం చెప్పకు. కాసేపు విశ్రాంతి తీసుకో."
    "ఫరవాలేదు. ఈ గుండెలలో భారము మోయలేను. నలిగిన దుస్తులు సరి చేసుకొని అతని రెండు చెంపలు వాయించాను. కారే కన్నీరును తుడుచుకోవాలని తెలియలేదు.ఎలాగో ఇల్లు చేరాను. బాబును వడిలో పెట్టుకుని గంటల తరబడి ఏడుస్తూ కూర్చునే దానిను. అనుభవశాలి అయిన వృద్దురాలు నా పరిస్థితి అర్ధం చేసుకున్నది.
    "జరిగినదానికి విచారించకమ్మా. ఇలాంటిది జరుగుతుందని ముందే తెలుసు. మనలాంటి వారికి సంఘంలో రక్షణ లేదు." ఓదార్చింది. ఎన్నాళ్ళని ఒకరికి బరువుగా వుండను? మరణించాలని ప్రయత్నించి విఫలురాలనయ్యాను. అభిమానము మర్యాద గల రేఖ ఆనాడే మరణించింది. తన కొడుకు కోసము వేషము వేసి మోసముతో బ్రతికే రేఖ జీవించి యున్నది. పోనీ నేను ఏమయినా, నా కుమారుడిని పెద్దవాడిని చేయాలని సంకల్పించాను. మొదటిసారిగా రాత్రిళ్ళు జరిగే పాట, అట చూస్తూ కూర్చున్నాను. ఒక ధనవంతుడు వచ్చాడు.
    "ఓహ్ ఎవరీ ఊర్వశీ! నన్ను చూచి అలాగే నిలిచిపోయాడు. నాకై వందలు వెచ్చించడానికి సిద్దపడ్డాడు. తలవంచాను. డబ్బు డబ్బు సంపాదించడమే ధ్యేయంగా పెట్టుకున్నాను. కాని అది పొరపాటని తెలిసింది. ఈ వీధిలో ఒకరికి ఒకరు పోటీ పడతారు. విటులనింటికి తేవడానికి బ్రోకర్లుంటారు వారికి చదివించాలి. అప్పుడప్పుడేదో మిషతో వచ్చే పోలీసులకి చదివించాలి. చిన్న బేరాలు ఒప్పుకుంటే చవక అయిపోతావనేది ముసలమ్మ ఊర్వశి పేరుతొ వాడలో పేరు గాంచాను. వచ్చేది పెద్ద మనుష్యులు. పాత ఇల్లు బాగు చేయించాము. ఫర్నిచర్ కొన్నాము. ఒకోసారి నెలల తరబడి సంపాదన వుండదు..."
    "చాలు రేఖా వినలేను. చెప్పకు.."
    "అడిగావు . నన్ను ఉత్తెజితురాలనీ చేశావు. పూర్తిగా చెప్పనియ్యి. ఆపకు ఆనంద్. అలా కాలము గడువసాగింది. ఒక వంక నీకై అన్వేషణ బయట కెప్పుడూ వెళ్ళను. వెళ్ళితే ఎప్పుడూ నా కళ్ళు నలుమూలలా గాలిస్తాయి. ఎవరి వెంబడియో సినిమాకు వెళ్ళితే సినిమా చూడ్డము ఆపి మనుష్యులను చూచేదానిని. నా చూపులు వృధా అయ్యేవి. బాబు నాలుగేళ్ల వాడు అయ్యాడు. వాడికి ప్రపంచము అర్ధము అవుతుంది."
    "అమ్మా! రాత్రి వచ్చిన తనెవరమ్మా?"
    "రాత్రి యేవరోచ్చారు?" మాట తప్పించాలని చూచేదాన్ని.
    "నేను చూడలేదేమిటి? నీ దగ్గర సోఫాలో కూర్చుండ లేదా? అవ్వ వచ్చి పిలుచుకు పోయింది కాకుంటే అప్పుడే వచ్చేవాడిని."
    "తెలిసిన వారు."
    "అప్పటికి ఊరుకుని , మరోరోజు , మరో సందేహము.    
    "అమ్మా, మా నాన్న ఎవరు?" అడిరిపోయాను. ఆ చుట్టూ ప్రక్కల నాన్న అనే పదము విని యుండడు. వీడికి ఆలోచన ఎలా వచ్చిందా అని ఆశ్చర్యపోయాను.
    "చెప్పమ్మా. వరహాలు ఇంట్లో వాళ్ళ నాన్న ఉన్నాడు." అప్పుడు గుర్తుకొచ్చింది అప్పుడప్పుడు వరహాలు వెంట బయటి కి వెళ్ళాడు.
    "మరి వాళ్ళింటి లో పాప ఉంది. వరహాలు ను నాన్న అంటుంది."
    "మీనాన్న ఉన్నారు బాబూ"
    "ఎక్కడ?"
    "దూరము, చాలా రోజులకు వస్తారు"
    "తొందరగా రమ్మని వ్రాయి వాడి మాటలకు నవ్వూ, ఏడ్పు వచ్చాయి. ఆ విషయము అందరితో చెబితే గాని వాడికి శాంతి లభించలేదులా ఉంది. వాడికి ఇంట్లో అక్షరాలూ, అంకెలూ నేర్పాను. అల్లరి భరించరానిదయ్యింది. చిన్నపిల్లాడిని దూరము బడులకు పంపడము దేనికి, అని వరహాలు , వృద్దురాలు వెళ్ళి ప్రక్క వీధిలో ఉన్న బడిలో చేర్పించారు. ఆరోజు సాయంత్రము బాబు ఇంటికి వస్తూనే ఓ ప్రశ్న వేశాడు.
    "అమ్మా! నీవేం పని చేస్తావు?" నేను తెల్లబోయి చూచాను.
    "మా బడిలో....బడిలో ఒకామె అడిగి రమ్మన్నది' మనుషులు ఎంత రాక్షస ప్రవృత్తి కలవారు. పసివాడితో పరిహాసమా?
    "మా అమ్మ నాకు దుస్తులేసి, అన్నము పెడుతుంది. రాత్రికి చదువు చెబుతుందని చెప్పు" అని చెప్పాను. మర్నాడు మరో ప్రశ్నతో వచ్చాడు.
    'అమ్మా! మా అయానేమో నాకట. ఊరంతా నాన్నలెనట. ఇంకేమో అంది" నా గుండెలు అవిసి పోయాయి. బడి మాన్పించాను. ఇంట్లోకి ఏవరోచ్చినా వాడు నానా ప్రశ్నలు వేసేవాడు. ఒకోసారి ముసలమ్మ విసిగి రెండు అంటించేది. ఒకసారి...ఒకసారి ఓ భగ్న ప్రేమికుడు ఈ ఇంటిలో అడుగు పెట్టాడు. అతను మనః శాంతి కోసము వచ్చానని. నాపాటికే డబ్బు చెల్లించి, నన్ను తోబుట్టువులా ఆదరించాడు. అలాంటి పురుషులుంటారని మొదటిసారి తెలుసుకున్నాను.
    "మీరు ఉన్నవారి లాగే కనిపిస్తున్నారు. ఆశాంతికి కారణమేమిటి?" అడిగాను.
    "డబ్బు ఒక్కటే శాంతి నిస్తుందనుకోవటము పొరపాటు భార్య మరణించింది. ముగ్గురు బిడ్డలు. నా మానాన నేను బ్రతుకుదామంటే బంధువులు, స్నేహితులు కంకణము కట్టుకుని, పునర్వివాహము చేసుకొమ్మని పోరాడినారు. వారు చెప్పిన మాటలు అప్పుడు హితవుగానే కనిపించాయి. వివాహము చేసుకున్నాను. ఆమె వచ్చి నా బిడ్డల కేర్పడిన లోటు తీరుస్తుందని ఆశించాను. కాని నాకే తీరని లోటు చేస్తుందని అనుకోలేదు." అతని కళ్ళు నిండుకున్నాయి.
    "ఏం చేసిందండీ?' ఆత్రంగా అడిగాను.
    "పిల్లలను రాచి రంపాన పెట్టసాగింది. వారిని నానా హింసలకు గురి చేసింది. అటు వారి బాధలు చూడలేక ఆమెను అదుపులో పెట్టలేక సతమత మయ్యేవాడిని. చివరకు వారినో బోర్డింగ్ స్కూల్లో వదిలి వచ్చాను. అతని కంఠం వణికింది.
    "ఫరవాలేదులెండి. వారక్కడ చదువు కుంటారు." అతన్ని ఒడారుస్తుండగా నాముందు ప్రశ్నలా బాబు నిల్చున్నాడు. వెంటనే వివరాలు అడిగి అడ్రసు తీసుకుని, అతన్ని పంపాను. రెండు రోజులు అలోచించి, గుండె రాయి చేసుకుని వాడి నక్కడ చేర్పించాను. కాని, నెలనెలా డబ్బు పంపాలంటే ప్రాణం పోతుంది. అందుకే మీ కోసము వెతకాలని దృడ నిశ్చయము చేసుకున్నాను. వాడు మీ నీడన బ్రతికితేనే చాలనిపించింది." ఆమె తేలికగా నిట్టూర్చింది.
    "కొంతలో కొంత పుణ్యము చేసుకున్నాను రేఖా. మిమ్మల్ని కలుసుకున్నాను. లేకపోతె వాడు అనాధగా నేను ఆవేదన పూరితమైన హృదయముతో బ్రతకాల్సి వచ్చేది." అతను హృదయము నిండుగా గాలి పీల్చుకున్నాడు. తెల, తెలవారుతుండగా దూరము నుండి హైదరాబాదు పట్టణము కనిపించింది.

                                                             12


    అరుణ ఆరోజంతా భర్త కోసము యెదురు చూస్తూనే ఉంది. సినిమా కెళ్ళిన మనిషి, అర్జెంటుగా ఫోను చేయించి యెక్కడకు వెళ్ళినట్తో!
    "పని ఉంటేనే వెళ్తాడే. చెప్పా పెట్టకుండా యెప్పుడైనా వెళ్ళాడా?" కోడలి ఆదుర్దా తగ్గించాలని అన్నది సరస్వతమ్మ.
    "అంతే అయి ఉంటుందత్తయ్యా. అని వచ్చి గదిలో కూర్చుందే గాని, మనసంతా గుమ్మము వైపే లాగుతుంది. పత్రిక తీసింది. మనసు నిలువలేదు. అటూ, ఇటూ తచ్చాడుతూ సాయంత్రము వరకు గడిపింది. చీకటి పడుతుంటే ఆమెకి దిగులుగా ఉంది. కారు హారన్ వినిపించగానే , సత్తిని పిలివాలన్న విషయము కూడా మరిచిపోయి, తనే పరుగులు పెట్టింది. గేటు తీసింది. ఆనంద్ కారు లోపలికి రాగానే గేటు వేసింది. విచారంగా, అలసటగా వస్తాడనుకున్న భర్త సంతోషంగా రావటము చూచి క్షణము విస్తుబోయింది. అతను కారు దిగి ఓ అయిదారేళ్ళ కుర్రవాడిని , చేయూత నిచ్చి దింపాడు. అరుణ తొందరగా వారిని చేరుకుంది.
    "ఈ ఇల్లు మనదేనా నాన్నా?" కుర్రవాడి ప్రశ్నకు అరుణ ఉలిక్కిపడింది.
    "మనదే బాబూ." అరుణ వంక చూచి చిన్నగా మందహాసము చేశాడు. అబ్బాయి ఎవరన్నట్టు కళ్ళతోనే ప్రశ్నించిందామే
    "బాబూ! అమ్మకు నమస్కరించవా?" ఆనంద్ మాట పూర్తి కాక పూర్వమే వాడు అరుణ కాళ్ళు వాటేసుకున్నాడు.
    "అమ్మా!ఈసారి లండన్ వెళ్ళితే నన్ను యెవరి వద్దా వదిలి పోవద్దు. వదిలితే నేను...నేను ఏడుస్తాను....ఆ" అరుణ కేం అర్ధం కాలేదు. తనను చనువుగా వాటేసుకున్న అబ్బాయిని యెత్తుకుని ముద్దు పెట్టుకోకుండా ఉండలేక పోయింది.'    "ఎవరమ్మా అరుణా? అబ్బాయి వచ్చాడా? అయ్యో, అప్పుడే అంత బరువులు ఎత్తవద్దమ్మా చూస్తూ వూరు కుంటావెంరా? ఎవరీ అబ్బాయి?" వరండాలోకి వచ్చిన సరస్వతమ్మ అడిగింది. అరుణ అబ్బాయిని దించింది. వాడామేను వాటేసుకుని కాస్త మెడ త్రిప్పి భయంగా వరండా వంక చూచాడు.
    "పద ఇంట్లోకి వెళ్ళి మాట్లాడుకుందాము.' తల్లిని ఉద్దేశించి అన్నాడానంద్. భార్యను కళ్ళతోనే రమ్మని పిలిచాడు. తల్లీ, కొడుకు ముందు పోగా అరుణ పిల్లవాడిని నడిపించుకుని లోపలికి వచ్చింది. ట్యూబ్ లైట్ కాంతి లో కుర్రవాడిని చూచి ఆశ్చర్యపోయింది. భర్తను కుర్రవాడిని మార్చి మార్చి చూసింది.
    "ఎవరండి , ఈ అబ్బా...."
    "ఉష్...." మాట్లాడవద్దని భార్యకు సైగ చేశాడు. "బాబూ! ఈమె నానామ్మా నమస్కరించవా?"
    "మరి తాతయ్య ఉన్నాడన్నావు?"
    "అమ్మా! నన్నగారేరి?"
    "వెంకటరత్నం గారింటికి వెళ్ళారు. ఇంతకీ."
    "కొంచెమాగు , అరుణా! బాబుకు ఆకలిగా వుంది. అన్నము పెట్టు." అరుణ కుర్రవాడిని తీసుకొని వెళ్ళింది.
    "మనమెలాగూ ఓ కుర్రవాడిని పెంచు కోవాలనుకుంటున్నాముగా! వాడు నా ప్రాణ స్నేహితుతుని కొడుకు. నా ప్రాణము. వాడిని గూర్చి దెబ్బలాడేవారు, ఆస్తి పంచమనే వారు ఎవరూ లేరు. వాడు నా కొడుకమ్మా! నా కొడుకు."
    ఆవేశంగా అన్నాడు. సరస్వతమ్మ కొడుకు దెస నిశితముగా చూచింది. యేనాడూ చూడని మెరుపూ తృప్తి కనిపిస్తున్నాయి. ఆ కళ్ళల్లో .
    "అలా చూస్తావేమమ్మా! వాడు ముద్దుగా లేడూ!"
    "ముద్దుగా ఉన్నావారంతా మనకు కావాలంటే వస్తారా? ఒక్కసారి నాన్నగారిని ఆడగవద్దా!" అన్నది.
    "నాన్నగారెన్నోసార్లు , బంధువుల బిడ్డలు వద్దు. తెలిసిన వారి బిడ్డలు వద్దు. అనాధల్ని తెచ్చుకుందామని అనలేదా? నాకు అడిగి అనుమతి పొందే అవకాశము లేకపోయింది. అమ్మా వాడు నాకెంతో నచ్చాడు."    
    "పోనీలే . నీకు సంతోషంగా ఉంటె అదే చాలు. అన్నట్టు ఇతని తండ్రి కెనా సీరియస్ గా ఉందని వెళ్లావు?"
    "ఊ" ఏం చెప్పాలో తెలియలేదు.
    "ఎలా ఉంది?"
    "చచ్చిపోయాడు.' శక్తి నంతా కూడదీసుకొని చెప్పాడు.
    "అయ్యో, అసలేం జబ్బు?"
    "ఏమో. ఆ వివరాలన్నీ యెందుకు?' అతను బాధపడటము చూసి ఊర్కుంది. ఇరువురూ డైనింగ్ హాల్లోకి వెళ్ళారు. అరుణతో కబుర్లు చెబుతూ అన్నము తింటున్నాడు.
    "అమ్మా! ఆయా కూడా చాలా , చాల మంచిది యెప్పుడూ కొట్టలేదు. హైదారాబాదు లో బడిలో ఉందే ఆయా చెడ్డది." వాడి మాటలకు ఆనంద్ ముఖము మలినము కావటము యెవరూ చూడలేదు.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS