Previous Page Next Page 
బాంధవ్య బంధితులు పేజి 29

   
    "చి. శ్రీనివాస్ కు ఆశీర్వచనములు.
    ఈ ఉత్తరం రాసిందెవరో తెలుసుకుంటే నీకు చదవాలన్న కోరిక నశించే అంత ..."
    'ఈ ఉపోద్ఘాతాలతో ఇంత పెద్ద ఉత్తరాన్ని చదివే ఓపిక లేదు' అనుకుంటూ మడిచి కవర్లో పెట్టి పక్కనే ఉన్న డ్రాయరు లాగి అందులో పడేసి సొరుగు తోశాడు బలంగా.
    "అదేమిటి, చదవకుండా అందులో పడేశారు? పూర్తి చెయ్యండి!" అంది ఆశ్చర్యంగా అనూరాధ.
    "ఇప్పుడదంతా చదివేందుకు టైము లేదు. పద, పద" అన్నాడు.
    "అదేం పని! పాపం, ఎవరు రాశారో! కనీసం మీతోనయినా తెచ్చుకోండి."
    "అంత ముఖ్యమయినదయితే అదే వేచి ఉంటుందిలే! ఇప్పటి మన ప్రయాణంకంటే ముఖ్యమయినది కాదు. పద."
    ఎయిరో డ్రోమ్ కు అనూరాధ కుటుంబమంతా వచ్చింది. ఆరోజు శ్రీ లక్ష్మి హృదయం ఆనందంతో తేలిపోసాగింది. తిరిగి తమ కూతురు అంత ఆనందంగా తిరుగుతూందని, అల్లుడి మంచితనానికి సంతోషించింది. ఎత్తియిన విగ్రహం, మంచి ఛాయతో, నిండుగా ఫుల్ సూట్ తో అనూరాధవెనక చెయ్యి వేసి జాగ్రత్తగా విమానం ఎక్కుతూంటే ఆమె కళ్ళు చెమర్చాయి.
    రాజశేఖరంగారు చెప్పలేక చెప్పారు: "అమ్మాయి ఆరోగ్యం జాగ్రత్త! ఎప్పటికప్పుడు క్షేమం తెలియపరుచు."
    కృష్ణమోహన్ కరచాలనంకోసం చేయి చాపుతూ "హేవ్ ఎ నైస్ టైమ్" అన్నాడు.
    "థాంక్యూ. మళ్ళీ మిమ్మల్ని పెళ్ళికొడుకుగా. చూడటానికి వస్తాం." నవ్వాడు శ్రీనివాస్.
    ఒకసారి లలితవంక చూచాడు మోహన్. ఇద్దరి దృష్టి ఏకమయింది. అందులో ఎన్నో భావాలు గోచరించాయి.
    రెండుచేతులు జోడించి "వస్తాం" అన్నాడు శ్రీనివాస్, లలితవైపు తిరిగి. అప్రతినమస్కారంచేస్తూ తల ఊగించి, అనూరాధవైపు తిరిగి, "చేరగా లెటర్ రాయి" అంది.

                                                     37

    అనూరాధ, శ్రీనివాస్ తిరిగివచ్చేసరికి రాజశేఖరంగారి ఇంటికి పెళ్ళి కళ వచ్చింది. ఇల్లంతా హడావిడిగా ఉంది. ఆరోగ్యంగా, ఆనందంగా ఉన్న అనూరాధను చూడగానే తృప్తిగా నిట్టూర్చింది శ్రీలక్ష్మి. నిండుగా, భారంగా నడుస్తున్న రాధతో ఆ ఇంటికే కొత్తకళ వచ్చింది. అనూరాధను అక్కడ వదిలిపెట్టి తమ ఇంటికి వెళ్ళాడు శ్రీనివాస్.
    గందరగోళంగా ఉన్న ఇంటిని కాస్త అదుపులోకి తెప్పించి, స్నానంచేసి, వాళ్ళు లేని ఆరువారాలలో వచ్చిన ఉత్తరాలు చూచుకోసాగాడు. అన్నింటిలోనూ బరువుగా, పరిచయమయిన దస్తూరీతో కనిపించిన కవరు ఎక్కడనుండో తెలిసినా కొద్దిక్షణాలు దాన్ని చూస్తూ గడిపాడు. చివరకు ఏదో నిర్ణయించుకున్నట్లు దాన్ని తెరిచాడు.    
    "చి. అబ్బాయికి ఆశీర్వచనములు.
    బాబూ, వారంక్రితం వచ్చావు. వెళ్ళావు. నీ నోటితో నువ్వు వచ్చిన కారణం తెలపకపోయినా, పలుకు పలుకుకు కరుకుదనంతో, కోపంతో కందిపోయిన నీ ముఖం కారణాన్ని చెప్పాయి. ఎందుకింత ద్వేషం నామీద? నేను చేసిన పొరపాటేదైనా ఉంటే అది నీ అభివృద్ది కోరడమే! నిజమయిన ప్రేమ ప్రతిఫలం కోరదంటారు. అది నిజమో, కాదోగాని నామీద నీకు నరనరంలో ద్వేషం రక్తంలా పారుతూన్నా, నా ముఖం మరెప్పటికీ చూడకూడదనుకున్నా నాకు కోపం లేదు. నాకు కావలసిందల్లా నీ సంతోషం, నీ ఉన్నతి.
    నువ్వు ఈ ఊరు వచ్చిన కారణం నాకు తెలుసు. నీకు ముందునించి విచక్షణాజ్ఞానం తక్కువ. ఆవేశం ఎక్కువ. ఈ రెండు పోలికలు ఎలా వంట బట్టాయోగాని, అవే నీ పతనానికి కారణమవకుండా చూచుకో. ఈరోజు చెప్పబోతున్న విషయాలు నాతోనూ, మీ నాన్నగారితోనూ అంతంకావాలని నిర్ణయించుకున్నాం. కాని మాతృప్రేమకు ముందుచూపు మధ్యమధ్య మరుగున పడుతుందేమో!
    దాదాపు ఇరవై ఎనిమిదేళ్ళక్రితం, అంటే నాకు సుమారు పదిహేనేళ్ళప్పుడు, ఒక శ్రావణ శుక్రవారంనాడు జరిగిన పొరపాటుకు ఫలితం నువ్వు, ఒంటరిగా పేరంటానికి వెళ్ళి వస్తున్నాను. ఆకాశమంతా చీకటిమబ్బు లతో మూసుకుపోయింది. టపటపా వర్షం పడనారంభించింది. వానలో తడుస్తాననే భయంతో దగ్గరగా ఉన్న ఒక పెద్ద ఇంటి వసారాలో నుంచున్నాను. ఆ ఇల్లు మా మేనమామగారి ఇల్లు. మేఘావృతమయిన ఆకాశం. గుండెలు ఝల్లు మనిపించేలా ఉరుములు, మెరుపులు! కుండపోతగా కురుస్తున్న వానలో, ఒంటరిగా నేను. అప్పుడే పట్నంనుండి వచ్చిన మా మామయ్య కొడుకు ఇంట్లోనే ఉన్నాడు. అప్పుడే వయస్సులో అడుగుపెడుతున్న అతను, ఏమీ తెలియని నేను ఒంటరిగా ఒక ఇంట్లో కొద్దిసేపు ఉండటానికి తీసుకు వచ్చిన పరిస్థితులే నీ జన్మకు కారణం. ఆ సాయంత్రం ఇంటికి వెళ్ళాక మా అమ్మకు చెప్పే సరికి గజగజ వణికిపోయింది,
    అదృష్టవశాత్తో, దురదృష్టవశాత్తో ఒక నెలరోజులలో మీ నాన్న గారితో పెళ్ళి నిశ్చయమయింది. మరో నెల తిరగకుండా పెళ్ళి అవడం, అత్తవారింటికి వెళ్ళడంకూడా జరిగిపోయాయి.
    స్వాతంత్ర్యోధ్యమానికి ముమ్మరంగా కొట్లాటలు జరుగుతున్న రోజులు అవి. దేశభక్తి గల ప్రతి ఒక్కరు సత్యాగ్రహాలలో పాల్గొంటున్నారు. అప్పటికే ఒకసారి జైలుకు వెళ్ళి వచ్చిన మీ నాన్న, ఒకరాత్రి గడిపిన కొత్త పెళ్ళికూతురని కూడా లెక్కచేయకుండా వెళ్ళిపోయారు ఉద్యమంలో పాల్గొనడానికి. అలాంటి రోజుల్లో వెళ్ళిన ఆయననిగురించి విచారంతో కొందరు, కోపంతో కొందరు విలవిలలాడుతూంటే, నేనుమాత్రం తేలిగ్గా ఊపిరి పీల్చుకున్నాను. ఆయన ఎదట నిలవాలంటే ఏదో తెలియని భయంతో చెయ్యరాని నేరం చేసినట్లు కుళ్ళిపోయాను ఆ రెండురోజులు.
    ఉద్యమంలో పాల్గొన్న చాలామంది జైలుపాలయ్యారు. నాలుగు నెలల తరువాత జైలునుండి కొడుకు ఇంటికి వచ్చేసరికి తల్లి తండ్రుల ముఖాలలో ఆనందం ద్విగుణీకృతమవుతూంది. ప్రతి మాటలో, ప్రతి కదలికలో గర్వం, సంతోషం చిందులు వేస్తున్నాయి. వారిని అది క్షణకాలం ఆశ్చర్యపరిచినా, తన రాకకేమోనని సరిపెట్టుకున్నారు.
    నాకుమాత్రం ఆయన ఎదట పడాలంటే విపరీతమయిన భయము, వణుకు ప్రారంభమయ్యాయి. ఆరోజు పగలంతా తప్పించుకుని తిరిగాను. రాత్రి అవుతున్న కొద్ది నా మనస్సంతా మొద్దుబారిపోతూంది. జరగబోయేదానిని ఊహించుకునేందుకు శక్తి లేనంతగా నీరసం నన్నావరిస్తూంది. ఏదైనా హఠాత్తుగా జబ్బుచేసి మరణిస్తే బాగుండునన్న కోరిక క్షణక్షణానికి ఎక్కువవుతూంది.
    చివరికి రాకూడదనుకున్న సమయం వచ్చింది. రాత్రి అంతా సద్దుమణిగాక గదిలోకి అడుగుపెట్టాను. ఆయన నాకోసం ఎదురుచూస్తూ ఏదో పుస్తకం చదువుకుంటూ కూర్చున్నారు. గదిలోకి అడుగుపెడుతున్న సమయంలో నాలుగునెలల అనంతరం కలుసుకోబోయే మధురక్షణంలా లేదు. నా జీవితం ఇటు మృత్యుముఖానికో, అటు స్వర్గసీమకో అన్నట్లుంది. మా అమ్మకు, నాపెళ్ళి ముందు జరిగిన విషయం ఈయనకు చెప్పడం ఇష్టంలేదు. కాని నాలో పెరుగుతున్న రూపం ఆయనకు ప్రతిరూపం అన్న విషయాన్ని ఆయన నమ్మడం అనేది ఎంత అసంభవమయినదో మా ఇద్దరికే తెలుసు. అందుకనే నాలో నేను ముందుగానే నిర్ణయించుకున్నాను. ఇది నా వైవాహిక జీవితాధ్యాయానికి మొదటి మెట్టయినా కావాలి. లేక ఆ అధ్యాయానికి చివరిరాత్రి అయినా కావాలి. జరిగింది జరిగినట్లు చెప్పడానికి నిర్ణయించుకున్నాను. తప్పుచేసినప్పుడు శిక్షకు వెనకాడితే ఎలా? ఆయనకు నన్ను క్షమించగలిగేందుకు ఔదార్యం ఉంటే నా జీవితం ముందుకు నడుస్తుంది. ఆయన నిరాదరణే ఎదురయితే మరునాడు పొద్దుటితో నా జీవితం అంతం అవుతుంది. ఈ నిర్ణయం నాలో బలంగా నాటుకుపోయింది. నేను చేసుకున్న నిర్ణయం నాలో మొండిధైర్యాన్నిస్తుంటే, ఆయనలాంటి పవిత్రమూర్తి ఔదార్యానికి పరీక్ష పెడుతున్నందుకు నాలో బాధ నిప్పుకణికలా మండసాగింది.

                                  *    *    *


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS