Previous Page Next Page 
బాంధవ్య బంధితులు పేజి 28

                               

                                     35

    "అనూరాధా!    
    ఎప్పుడూలాగానే చాలా విషయాలలో పొరబడ్డాను. నీతో ఎన్నో విషయాలు మాట్లాడాలి. శనివారం సాయంత్రం మన ఇంట్లో కలుసుకో!
                                                                                                   శ్రీనివాస్."
    మనస్సులోని ఆవేదనను నిగ్రహించుకోలేక, అయినవారి అపవిత్రతను సమర్ధించుకోలేక ఒంటరితనంతో ఆవేదన పాలయ్యాడు శ్రీనివాస్. తన కర్తవ్య మేమిటో, తన ఇలాంటి స్థితికి కారకులు ఎవరో, ఎవర్ని నిందించాలోకూడా అర్ధం చేసుకోలేకపోయాడు. ఒక్కసారిగా లోకంమీదే అసహ్యం కలిగింది. ప్రతి దానిమీద ఏదో తెలియని నిర్లక్ష్యం ఏర్పడింది. ఆ క్షణంలో అతని మనస్సులో ఉన్న స్థానం ఆక్రమించుకున్నది ఇద్దరే! తన నెంతగానో ప్రేమించి పెద్దచేసిన ఔదార్య పూర్ణపురుషుడు, ఒంటరితనంలో క్షణక్షణానికి గుర్తుకు వచ్చే భార్య. తన జన్మకారకులు, తన మనోవ్యథకు మూలమయినవారు మరో ఇద్దరిమీద ద్వేషం కూడా ప్రబలిపోయింది. కన్నతల్లిని ప్రేమించి గౌరవించవలిసిందిపోయి అసహ్యించుకుంటున్నందుకు సిగ్గుపడ్డాడు కూడా! దీని కంతటకు కారకుడు కృష్ణమూర్తిగారు. 'పొంగులువారే యౌవనంలో కన్నుమిన్ను కానక చేసిన పనికి సిగ్గుతో చితికి పోవలసినదిపోయి పెద్దమనిషిలా పరువు ప్రతిష్ఠలతో చలామణీ అవుతున్నారు!' అనుకున్నాడు కసిగా.
    'తన్ని అంటి వెంటాడుతున్న ఈ ఆలోచనలనుండి పారిపోవాలి. బహు మార్గాలలో పయనిస్తూ గమ్యం చేరుకోలేని తనకు ఒక మార్గదర్శి కావాలి. తన అనూరాధ కావాలి. ఆమె సమక్షంలో తప్ప తన బాధలను మరిచిపోలేడు. తనంటే తనకే విలవ తగ్గినప్పుడు అనూరాధ తనని గౌరవిస్తుందా?'
    వెంటనే రెండుముక్కల ఉత్తరం పడేసి, సరాసరి స్టేషనుకు వెళ్ళాడు గుంటూరు వెళ్లేందుకు.
    శ్రీనివాస్ ఉత్తరం చదువుకున్న రాధకు ముందు ఏమీ తోచలేదు. 'తనతో ఏమి మాట్లాడాలి? తనని అన్న మాటలు చాలలేదా! లేక తిరిగి తనకు దగ్గిర అవుదామనా?' అనూరాధ కళ్ళు మెరిశాయి. 'ఇదంతా నిజమా? తన కోరికలు ఫలిస్తున్నాయి! తన ఆశ నెరవేరుతూంది! ఇదంతా తన ఊహేనేమో! ఇంతలో ఆయనలో మార్పు ఎలా వస్తుంది? వారంక్రితం విడాకుల ప్రయత్నంలో "నువ్వు నేను కలిసిఉండటం జరగని పని" అన్న ఆయన ఈరోజు "మన ఇంట్లో" అని రాశారు. అవును. అది మన ఇల్లే! శ్రీనివాస్ లో మార్పు వచ్చింది. భగవాన్! ఎంత దయామయుడివి!'
    క్షణమొక గంటగా గడుపుతున్న అనూరాధకు రోజొక యుగం అయింది. 'అసలు రోజులు గడుస్తాయా? శనివారం వస్తుందా?' అనిపించింది. అనుమానంతో సతమతమౌతూ, సంతోషంతో తేలిపోతూ తమ ఇంటికి చేరింది. అప్పటికే ఆమెకోసం ఎదురుచూస్తున్నాడు శ్రీనివాస్. ఈ వారంలో అతనిలో చాలా మార్పు వచ్చింది. బాగా చిక్కిపోయాడు. సరిఅయిన భోజనం చెయ్యక, మనస్సుకు స్తిమితం లేక బాగా నలిగిపోయాడు.
    ఆత్రంగా ఎదురుగా చూస్తున్న అతను తలుపు చప్పుడవగానే ఒక్క ఉదుటున వెళ్ళి తెరిచాడు! ఆమెను చూడగానే సంతోషంతోపాటు ఆశ్చర్యం అవధులు దాటింది. కనురెప్ప వాల్చకుండా తదేకంగా చూస్తూ నిశ్చేష్టితుడయ్యాడు. మనస్సులో ఆనందంతో "అనూ" అన్న మాట అతనికి తెలియకుండానే పెదవులు దాటింది. కళ్ళెత్తి చూచింది అనూరాధ కొలకులనిండా నీళ్ళతో.
    "అనూ!" చేతులు చాపాడు ఆప్యాయంగా.
    ఒక్కసారిగా అతని చేతులలో వాలిపోయింది. ఆ కౌగిలికి, ఆ స్పర్శకు తపించి పోయిన అనూరాధ కళ్ళనుండి వెచ్చని కన్నీళ్ళు జలజలా రాలి అతని గుండెలమీద జారసాగాయి.
    "ఎంత బాధ పెట్టాను అనూ! నన్ను క్షమించగలవా? నాఅంత మూర్ఖుడు మరెవరయినా ఉంటాడా?"
    ఆనందంతో మాట్లాడలేని ఆమె మౌనమే అతనికి సమాధానమయింది. ఎన్ని ఎదురుదెబ్బలు తిన్నా, చలనమే ఎరగని శ్రీనివాస్ కళ్ళవెంబడి ఆ రోజున కన్నీళ్ళు టపటపా రాలి ఆమె మెడమీద పడ్డాయి. అతనిలో ఐక్యమయిపోతున్న ఆమెను ఆ వెచ్చని కన్నీళ్ళు వాస్తవంలోకి తెచ్చాయి. కళ్ళెత్తి అతనివైపు చూచింది. చెమర్చిన కళ్ళను క్రిందికి దించుకున్నాడు.
    "రాధా, ఎంత చిక్కిపోయావు!" అన్నాడు ఆప్యాయంగా బుగ్గలు నిమురుతూ.
    ఆరోజు ఆమెకు ఏమీ మాట్లాడాలనిపించలేదు, అతని మాటలు వినాలని తప్ప అతను ఏం అడిగినా సమాధానం మౌనమే అయింది.
    "రాధా, నీకు ఎంత దూరం కావాలనుకున్నావో నీ ఆలోచనలు అంత దగ్గిరికి లాగాయి. నీమీద కోపంతో, మొండిగా ఉండటానికి ఎంత బాధపడ్డానో? నన్ను క్షమించు, అనూ!"
    "మీకోసం, మీ పిలుపుకోసం ఎంత తపించిపోయానో! నన్ను దూరం చేసినదానికంటే, నన్ను అంతగా తప్పు అర్ధం చేసుకున్నందుకు ఎక్కువ బాధ పడ్డాను. మీ సంతోషంకోసం దూరమవగలనేమోగాని, ప్రాణాధికంగా ప్రేమించిన మీరు అసహ్యించుకుంటూంటే అంతకంటే చిత్రవధ లేదనిపించింది!" అంది మెల్లిగా అతనిలోకి ఇముడుతూ.
    "అన్ని తెలిసి నన్ను ఎందుకు పెళ్ళి చేసుకున్నావు, అనూ! నాఅంత బలహీనుడు తప్ప నీకు ఇంకెవరూ దొరకలేదా? ఏరి కోరి పెళ్ళి చేసుకునేందుకు నాలో ఏం చూశావు? నామూలంగా ఏమనుభవించావు బాధతప్ప?" అన్నాడు గాద్గదికంగా, హృదయానికి బలంగా హత్తుకుంటూ.
    "............................"
    "ఒక్కటిమాత్రం నిజం. ఎన్నో విషయాలలో పొరబడ్డట్లే ఇందులో కూడా పొరబడ్డాను. నీకు దూరమయి బ్రతకటంమాత్రం సాధ్యంకాలేదు. నువ్వు నాకింత అవసరమని ఎన్నడూ తెలియదు."
    ఆరోజు సమాగమం అనూరాధకు కొంత అలసట కలిగించింది. ఆ సంతోషాన్ని హృదయం భరించగలిగినంతగా శరీరం తట్టుకోలేకపోయింది. మెల్లిగా సోఫాలో కూర్చున్న అనూరాధకు పక్కగా కూర్చుని, ఆమె తలను తన ఒడిలోకి తీసుకుంటూ, "ఇంత శుభవార్త చెప్పకుండా ఇన్నాళ్ళు ఎలా దాచావు? ఈవేళ నిండుగా, స్ఫుటంగా కనుపిస్తూన్న నిన్ను చూడగానే ఆశ్చర్యంతో బాధకూడా కలిగింది. ఎంతో సంతోషంగా ఉండవలసినసమయంలో ఎంత బాధపెట్టాను!" అన్నాడు శ్రీనివాస్.
    "ఇంక జరిగినవాటిని తలవకండి! అదంతా ఒక పీడ కల! ఆనందాన్ని అనుభవించే అదృష్టం రాసిపెట్టి ఉండాలి. ఆరోజు మీకీ విషయం చెప్పాలని ఎంతో అనుకున్నాను. మీరు ఇంటికి రాగానే లలిత తల్లి విషయం చెప్పారు. దానితో ఈ సంగతి మరిచిపోయాను. గుర్తు ఉన్నా చెప్పి ఉండేదాన్నికాను" అంది తేలికగా కళ్ళు మూసుకుంటూ. మూసిఉన్న కనురెప్పలు భారంగా కదిలాయి. కొడుకులలో ముత్యాలలా నీళ్ళు నిలిచాయి.
    "ఛ, వద్దు. రాధా! ఇంక ఏడవకు. అసలే అలిసిపోయావు" అంటూ కన్నీరు తుడిచాడు. "మీ అన్నయ్య, నాన్నగారు అందరు వచ్చి, మనమధ్య విషయం కదల్చబోయారు కాని, ఈ విషయం ఒక్కరు చెప్పలేదు."
    "అది నాకే ఇష్టం లేకపోయింది. మనం తిరిగి కలుసుకోవడం జరిగితే, అది మన ఇద్దరికి ఒకరికి ఒకరు కావలసి కలుసుకోవాలి. కానీ మీరీ విషయం తెలుసుకుని, మన పాపమూలంగా తిరిగిరావడం, బాధపడటం నాకు ఇష్టం లేకపోయింది. మన ఇద్దరి కలయికమూలంగా మరో రూపం ఉద్భవిస్తూన్నా, ఆ రూపంమూలంగా మనం కలవడం జరిగితే మాత్రం దానికుండే వాస్తవికత దీనికి లేదు." అంది.
    ".................................."
    "మీరేం చేసి ఉండేవారు, ఈ విషయం మీరు మనస్సు మార్చుకోక ముందే తెలిసిఉంటే?"
    "ఏమో, మనస్సు మార్చుకుని ఉండేవాడినేమో! పసిపాపలంటే నాకు ఎప్పుడూ మక్కువే. అందులో ఈ పాప నా స్వంతమనుకుంటే ఏ పని చెయ్యడానికి వెనకాడనేమో!" అన్నాడు అనుకోకుండా. కాని తననుండి వెలువడ్డ మాటలకు తనే ఆశ్చర్యపోయాడు అప్రయత్నంగా కృష్ణమూర్తిగారు మనస్సులో మెదిలారు. బలవంతాన ఆలోచనలను మళ్ళించుకున్నాడు.    
    అంతగా కఠినత్వం వహించిన తనలో మార్పుకు కారణం అడుగు తుందేమో అనుకున్నాడు శ్రీనివాస్. కాని నిజానికి అనూరాధకు అలాంటి ఆలోచనే రాలేదు. కారణం ఏదైనప్పటికీ తెలుసుకుందామన్న కోరిక లేకపోయింది.    
    రాత్రి పడుకుని ఉన్న అనూరాధదగ్గిర కూర్చుంటూ, "ఇలాంటి సమయంలో ఎన్నో కోరికలుంటాయిట. నీకేం కావాలో అడుగు" అన్నాడు శ్రీనివాస్.
    "నా కోరిక తీరింది. కావాలనుకున్నది లభ్యమయింది. నాకింకేం కోరికలు లేవు!"
    "అలా కాదు. నిన్నింత క్షోభకు గురిచేసినందుకు, నీ కోరిక తీర్చవలసిందే." బలవంతం చేశాడు.
    "నిజంగా చేస్తారా నేనడిగింది?"
    "ఆ!!....ఒక్కటి తప్ప."
    బాధగా కళ్ళు మూసుకుంది. కొద్ధిక్షణాల అనంతరం, "నేనంత తెలివిలేనిదాన్ని కాదు. ఇంతకీ నే నడుగుదామనుకుంది..... మనం ఇక్కడినుండి ఎక్కడికయినా దూరంగా వెడదాం, ప్రశాంతంగా ఉండేందుకు. ఈ జ్ఞాపకాల నుండి దూరం కావాలని ఉంది. ఇక్కడ నాకు తృప్తిగా లేదు" అంది.
    "తప్పకుండా రాధా. అసలు నీ ఆరోగ్యం బాగుపడటంకోసమయినా మనం మంచి ప్రదేశానికి వెళ్ళాలి. నీకు శారీరికంగాను, మానసికంగాను విశ్రాంతి కావాలి."
    మరునాడు పొద్దున్న అప్పటికప్పుడు ఫోనుచేసి బెంగుళూరు వెళ్లేందుకు విమానంలో బుక్ చేశాడు. వారం వ్యవధిలో టిక్కెట్లు దొరికాయని రాధకు చెప్పి తక్కిన ఏర్పాట్లలో మునిగిపోయాడు.
    అనూరాధను వాళ్ళింట్లో దింపి, ఇండియన్ ఎయిర్ లైన్సు ఆఫీసుకు వెళ్ళి టిక్కెట్లు తీసుకుని ఇంటికివచ్చి, ఏవో పనులలో మునిగిపోయాడు. తలుపు దగ్గిర చప్పుడయ్యేసరికి తలఎత్తి చూచాడు. గుమ్మంలో నిటారుగా, ఠీవిగా, విచార, వదనంతో ఉన్న కృష్ణమూర్తిగారిని చూడగానే ఆశ్చర్యంతోపాటు, ఆగ్రహం కూడా కలిగింది.
    కొద్దిక్షణాలు తీక్షణమయిన దృక్కులతో చూచి కిందికి వాలాయి అతని కన్నులు లోపలికి రమ్మన్న ఆహ్వానంకూడా లేకపోయేసరికి తటస్థంగా నిలబడిపోయారు కృష్ణమూర్తిగారు.
    "కులాసా?"
    "ఆఁ!"
    ముభావంగా సమాధానం వచ్చేసరికి ఆయనకు ఏమనాలో తోచలేదు.
    "లోపలకు రావచ్చా?"
    "ఆఁ, కొద్ది నిమిషాలలో నేనిక్కడనుండి వెడుతున్నాను డాక్టర్. మీ రిక్కడికి ఎందుకు వచ్చారో తెలియదు. నేను మిమ్మల్ని గురించి ఎలా బాధపడుతున్నదీ తెలిసి రావడంలో మీ ఉద్దేశం నాకు తెలియదు."
    "రోజుల మార్పుతో మనస్సులో భావాలు మారవనేముంది?"
    "ఆ విషయం తెలుసుకోవడానికి వచ్చి ఉంటే, దానికి జవాబుగా మారలేదని చెప్పగలను."
    "శ్రీనివాస్, నీ జీవితంలో నువ్వు పొరపాట్లు చెయ్యలేదనగలవా?"
    "ఎలా అనగలను?"
    "నేనూ అంతే! తప్పులు చెయ్యడం తప్పే. తప్పు చెయ్యకుండా ఉండటమనేది నిజంకాదు. నువ్వు నన్ను ఒకప్పుడు ఎంతో అభిమానించి, గౌరవించిన రోజులున్నాయనుకుంటాను. కాదనగలవా?"
    "కాదనవలసిన అవసర నాకు లేదు. కాని అది గతం."
    "నేనూ నిన్ను అలాగే అభిమానించాను."
    "హుఁ. అభిమానించారు ఒక తండ్రిగా, చెప్పుకోవడానికి కూడా సంకోచం లేకుండా మీకు తెలుసు మీరు చేసిన తప్పేమిటో నన్ను అభిమానించారంటే అది పొరపాటు. మీకు మెడిసన్ అంటే తెలియనిదికాదు. అందుకు ఉండవలసిన వేమిటో అవి మీకు తెలియనివికావు. నేను మూసుకోవాలనుకున్న తలుపులు మీరు తెరిచారు. నేను నడవకూడదనుకున్న దోవలో మీరు నడిపించారు."
    "అది నేను చేసిన పొరపాటు. ఒప్పుకుంటున్నాను. కాని అది జరిగిపోయిన సంగతి."
    "అది జరిగిపోయిన సంగతి అని ఎంత తేలికగా అనగలుగుతున్నారు! మీరు చేసిన ఆ పొరపాటుమూలంగా ఒక నిండుజీవితం నాచేతిలో సమాప్తమయి ఉండేది. నాలోని అసమర్ధతమూలంగా, మీలోని అత్యాశ మూలంగా అభిమానం అనే అంధకారంలో ఒక ప్రాణం సమాప్తమయిఉండేది. కాని... కాని..." ఆవేశంతో మాటలు ఆగిపోయాయి.
    "కాని..... ఆమె .... లలిత తల్లి సజీవంగా, సలక్షణంగా ఉంది. మళ్ళీ మళ్ళీ తరిచి గతం తవ్వుకుని, ఆ విషయంలోకి వెళ్ళవలసిన అవసరం లేదు. నువ్వు ఎలా బాధపడుతున్నది నేను ఊహించగలను. కాని ఈనాడు సజీవంగా ఉన్న ఒక ప్రాణం నీ చేతిలో ఏదో అయి ఉండేదన్న ఊహతో మనస్సులో సతమతం కావలసిన అవసరం లేదు."
    "............................."
    "నువ్వు నన్ను దూరం చేసుకోవాలనుకోవడానికి కారణం అదొక్కటే కాదు. కారణం ఏదైనా, మనం మళ్ళీ స్నేహితులం కాకుండా ఉండవలసిన అవసరం లేదు. నేను నీకు తండ్రిని, నువ్వు నాకు కొడుకువి అన్న విషయం అప్రమత్తం, శ్రీనివాస్. మన బాంధవ్యం తెలియకమునుపునించి నువ్వంటే ఏదో తెలియని అభిమానం కలిగింది. నీతో స్నేహాన్ని వాంఛించడానికి కారణం అదే! మన స్నేహం నెలకొన్నాక ఈ విషయం తెలిసింది. అది తెలిశాక ఆ వాత్సల్యం ఎక్కువయింది."
    కొద్దిక్షణాలు అతి నిశ్శబ్దంగా, బరువుగా నడిచాయి.
    "శ్రీనివాస్, నీ స్నేహాన్ని వాంచించిన నాకు ఎదురయింది. వట్టి చెయ్యే! కాని మనం తిరిగి కలవాలనుకుంటే ఇద్ధరిలో ఎవరో ఒకరు అడుగు వెయ్యాలి. పెద్దవాణ్ణి తప్పులు చేసినా అనుభవం ఉన్నవాణ్ణి. అందుకే నేను వేశాను ముందడుగు. కాని ... కాని..... తిరిగి కలవాలంటే నీదే కావాలా అడుగు. ఇక మనమధ్య ఎటువంటి బాంధవ్యం కలిసినా అది నీవైపునించే.
    "............................."
    
                                     36

    ఎయిరో డ్రోమ్ కు బయలుదేరుతూంటే ఒక మనిషి వచ్చాడు, చేతిలో ఒక పెద్ద కవరుతో. అతన్ని చూడగానే కళ్ళు చిట్లించాడు శ్రీనివాస్. ఆ వ్యక్తిని కృష్ణమూర్తి గారి ఇంటి దగ్గిర చాలాసార్లు చూచినట్లు గుర్తు. ఆ వచ్చిన వ్యక్తి ఒక కవరు శ్రీనివాస్ చేతిలో పెట్టి, తన బాధ్యత అంతే అన్నట్లు వెనక్కి పోయాడు. లోలోపల విసుక్కుంటూనే కవరు తెరిచాడు. డాక్టర్ కృష్ణమూర్తిగారి లెటర్ హెడ్స్ తో ఆ కాగితాలను చూడగానే మనస్సు ఏమిటోగా అయిపోయింది. 'సంతోషంగా వెళ్ళబోతూఉంటే ఇప్పుడీ ఉత్తరం ఏమిటి, తిరిగి మనస్సు వికలమవడానికి తప్ప?' అని అనుకుంటూనే చూచాడు.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS