Previous Page Next Page 
ఆఖరి మజిలీ పేజి 29

 

    'అవును మీకు అధికారమూ , చొరవా రెండూ లేవు అందుకనే ఏకవచన ప్రయోగంతో మాట్లాడుతున్నారు" మధ్యలో శివరామ్ మాటలకి అడ్డు తగులుతూ అంది నిర్మల.
    శివరామ్ మాట్లాడబోయే లోపలే 'ఆగండి -- మీరు చాలా మాట్లాడారు. ఎంతో అలిసి పోయారు" అని కాసేపాగి "శివరామ్ ఒక మనిషి మీద ఇంకో మనిషికి ఎందుకు అభిమానం కలుగుతుందో -- ఎందుకు ద్వేషం కలుగుతుందో ఒక్కొక్కసారి చెప్పలేం. ఇందాక మీరన్నారే "ప్రణయ జ్యోతిని వెలిగించానని" అదీనేనూ అంటున్నాను. ఏమూలో దాగి ఉన్న ప్రణయ జ్యోతి దర్శనం మీ సాన్నిధ్యంలోనే కలిగింది. ఇంకో విషయం -- శ్రీధర్ కి నేనంటే, లేదా నన్ను చూస్తె ఎటువంటి సంచలనమూ కలగదు. నాకు కాబోయే భర్తగా ఒక చల్లని చూపు- ఒక చక్కని మాట ఎన్నడూ పరిహాసానికైనా అని ఎరగడు. భార్య- భర్త - అంటే ఒకరి కొకరి పైన ఒక రకమైన ఆకర్షణ ఉండాలి అని నేననుకుంటున్నాను. మామయ్య నేను ఏకాంతంగా ఎన్నో సార్లు కొన్ని గంటల కాలం గడిపి ఉంటాం. నేను అలోచించనే లేదు కాని- ఇప్పుడని పిస్తున్నది -- భార్గవీని  నన్నూ ఒకేరకంగా చూసేవాడేమో మామయ్య.
    "కొందరి స్వభావం అలా ఉంటుంది నిర్మలా? ప్రేమ లేదని ఎందు కనుకోవాలి--"
    "అసలు మామయ్య కు నా మీద ప్రేమ ఉందా లేదా అని నేనెందుకాలోచించాలి....నాకు మనసుంది నా మనసుకి ప్రేమించే అధికారం ఉంది. నాకు కావాల్సిన వ్యక్తీ-- నా మనసు మెచ్చిన వ్యక్తిని భర్తగా నిర్ణయించుకోగలిగే విచక్షణా జ్ఞానమూ, వయసూ రెండూ వున్నాయి. అటువంటప్పుడు అందరి మనసూ తెలుసుకోవలసిన అవసరం నాకు లేదు" నిర్మల గొంతులో చికాకు ధ్వనించింది.
    "నిర్మలా అయినా మనిద్దరికీ పెళ్ళి జరుగుతుందన్న మాట కలలో వార్త."
    "శివరామ్ మీకు తెలియదు కాబోలు -- కలలు కూడా నిజమవుతాయి."
    "మాటల్తో నన్ను మభ్యపెట్టాలని చూస్తె నేనింకెం మాట్లాడను" అతని గొంతు మెత్తబడటం గమనించింది నిర్మల.
    "శివరామ్ ! సంధ్య రాబోతున్నది. ఈ ప్రశాంత వారావరణం లో పవిత్రమైన మనసుతో చెప్తున్నాను. మనో వాక్కాయ కర్మల ద్వారా మీరే నా భర్త.
    "నిర్మలా ఆశ్చర్యంగా అన్నాడు శివరామ్.
    "నన్ను భార్యగా స్వీకరించటానికేమైనా అభ్యంతరమా"
    క్షణం సేపు నిర్మల వంక చూశాడు శివరామ్.
    విచ్చిన గులాబీలా ముగ్ధంగా ఉంది నిర్మల. పసిపాప అమాయకత్వం ఆమె కన్నులలో దోబూచులాడుతున్నది.
    "నిర్మలా! కోరి అదృష్టం వరిస్తుంటే కాదనే మూర్ఖుడుంటాడా" అన్నాడు. "పదండి! కాళీ దేవాలయానికి వెళ్లి దేవి దర్శనం చేసుకుని ఇంటి కెళ్దాం" అంది నిర్మల లేచి నిలబడుతూ.
    మందార పూలదండ ఒకటి తీసుకుని ఆలయానికి వెళ్ళారు. సృష్టి స్థితి లయకారకురాలైన జగన్మాత -- మాతృమూర్తి లా శాంతరూపిణియై లేక - రౌద్రమూర్తియై శత్రు సంహారకారిణిగా హృదయంలో లేలేత భయాన్ని కలిగిస్తుంటే భయభక్తులతో చేతులు జోడించి నమస్కరించింది.
    చైతన్య వంతమైన ఈ సమస్త జీవకోటి మాతృమూర్తి - జగన్మాత కాళీ మాత ! అనుకోకుండానే నోటి నుంచి "కాళీమాతకు జై" అని వెలువడింది.
    "ఈ పవిత్ర ఘడియల్లో ఈ తల్లి ముందు చెప్తున్నాను -- నిష్కల్మషమైన హృదయంతో -- శివరామ్! మిమ్మల్ని భర్తగా మనస్పూర్తిగా అంగీకరిస్తున్నాను" మనసులోనే అనుకుని కళ్ళతోనే అతని పాదాలకు నమస్కరించింది నిర్మల.
    ఇద్దరూ ప్రసాదం తీసుకుని బయటకు వచ్చారు.
    "మీ దగ్గర డబ్బుందన్నారుగా? ఎంత వుంది'  అనడిగింది దారిలో నిర్మల.
    "ఏం? ఎంత కావాలి."
    "నేనొక చీర కొనుక్కుంటాను" నవ్వుతూ అంది నిర్మల.
    "అప్పుడే మొదలా!" అతను కూడా నవ్వుతూ షాప్ లోకి దారి తీశాడు. ఇద్దరూ ఇంటికి వచ్చేసరికి ఇందిర, నీరజ ప్రయాణసన్నాహాల్లో ఉన్నారు. శ్రీధర్ కోసం ఎదురు చూస్తున్నారు. టైమయిపోయిందని కంగారు పడుతున్న సమయంలో శ్రీధర్ వచ్చాడు.
    అందరూ స్టేషను కి బయలుదేరారు.
    నిర్మల రానన్నది . నిర్మలకి తోడుగా శివరామ్ ఉండిపోయాడు. ఇద్దరూ సోఫాలో కూర్చున్నారు.
    "నిర్మలా! నాకింకా అనుమానమే. నాకు డబ్బు లేదు. మంచి ఉద్యోగమూ లేదు. నన్నుపెళ్ళి చేసుకుని నువ్వేం సుఖ పడతావని....."
    "డబ్బు, ఉద్యోగం - అవేనా మనిషికి ముఖ్యం. మీ మంచి మనసు నాకు నచ్చింది."
    మాటల్లో పడి టైమే తెలియలేదు వాళ్ళకి.
    "నిర్మలా! నాకింత అదృష్టం వ్రాసి పెట్టుందని నేను ఊహించను కూడా లేదు తెలుసా?' అంటూ ఆమెను హృదయానికి హత్తుకున్నాడు శివరామ్.    
    నిర్మల అతని మెడ చుట్టూ చేతులు వేసి అతని గుండెల మీద తల ఆన్చి కళ్ళు మూసుకుంది.
    అతని గుండెలు గడియారం లా లయబద్దంగా చెవుల్లో వినిపిస్తున్నాయి నిర్మలకు.
    "నిర్మలా....." పిడుగు లాంటి ధ్వనికి అదిరిపడి ఈ లోకంలోకి వచ్చారిద్దరూ.
    "శివరామ్! ఇదా నువ్వు చేస్తున్న నిర్వాకం" నిప్పులు కురిపిస్తూ అన్నాడు శ్రీధర్.
    "మీరు వెళ్ళండి శివరామ్ . నేను మాట్లాడతాను" ధైర్యంగా అంటున్న నిర్మలను చూసి గబగబా అడుగులేసుకుంటూ వెళ్ళిపోయాడు శివరామ్ అతని వెనకాలే వెళ్ళి అతని కనుచూపు మేర దాటి పోయేవరకూ చూసి తలుపులు వేసి శ్రీధర్ దగ్గర కొచ్చింది నిర్మల.
    "నిర్మలా" పెద్దగా కేకపెట్టాడు శ్రీధర్.
    "ఎందుకు మామయ్యా! అలా హైరానా పడతావ్" ప్రశాంతంగా అంది నిర్మలా.
    "నువ్వు.....నువ్వు..... చేస్తున్న పని...." మధ్యలోనే అందుకుంది నిర్మల.
    "నేను చేస్తున్న పని అన్ని విధాలా అందరికీ ముఖ్యంగా నీకు నీసమస్య పరిష్కరమయ్యే పనే చేస్తున్నాను."
    "ఏమంటున్నావు నువ్వు" అర్ధం కానట్టు అడిగాడు శ్రీధర్.
    "మామయ్యా! చిన్నప్పుడు తెలిసో తెలియకో పెద్దవాళ్ళు కొన్ని పొరపాట్లు చేస్తుంటారు. అవి పిల్లల మనసుల మీద ఎలా పనిచేస్తాయ్యో తెలుసా? ఊహ తెలిసినప్పటి నుంచి నా భర్త స్థానంలో నిలబెట్టారు నిన్ను -- నేనూ అలానే అనుకున్నాను. అటువంటి నీ చేతుల్లో -- నీ పరిష్వంగంలో ఇంకో స్త్రీ ని చూసి ! ఏ కన్నె పిల్లా మాత్రం ఏం చేస్తుంది" ఆవేశంలో ఒక్క క్షణం ఆగింది నిర్మల.
    "చిన్నప్పుడు మంచి పరికిణి కట్టుకుంటే "పోవే! వెళ్ళి నీ మొగుడికి చూపించిరా అనేది అమ్మ. పక్కింటి పిన్నిగారు మల్లెపూలు జడవేసి "ఏమయ్యోయ్ ! శ్రీధరం -- నీ పెళ్ళాం జడ చూసి పో " అని కేకేసేది. నేనేం చేసినా నువ్వు చూడాలి , నా గొప్ప ఘనత అన్నీ విని నువ్వు మెచ్చితేనే దానికి విలువ - ఈరకంగా వేసిన విత్తనాలు పెరిగి పెద్దవయినాయి. నేనేం చేసినా నీ కోసమే! నా ప్రాణం నువ్వే! నా పూపిరి నువ్వే ఎందుకని. నువ్వు నా భర్తవు. భర్తగా నా హృదయంలో నిలచిపోయిన నిన్ను నా మనసులోంచి తొలగించగలనా -- మాటాడు మామయ్యా!" నిర్మల బుగ్గల మీద నుంచి వెచ్చటి కన్నీటు కారిపోతున్నది.
    శ్రీధర్ నిశ్చేష్టుడయి చూడసాగాడు.
    'అందుకని -- ఆ నిర్భాగ్యుడ్ని .....తన తిండే తను సంపాదించుకోలేని ...."
    "అగు మామయ్యా" శివరామ్ కి డబ్బు లేక పోవచ్చు.  నీలా గొప్ప ఇంజనీరు కాకపోవచ్చు. కాని నిన్ను మించిన హృదయ సంస్కారం ఉంది. నన్ను మనసంతా నింపుకోగలిగిన విశాలమైన హృదయం ఉంది - ఇక డబ్బు -- అదేగా తక్కువ. నాన్న సంపాదించిన డబ్బంతా ఎవరిది? ఎవరికిస్తారు? నిర్మల భర్తగా శివరామ్ నీకంటే చివరికి శేఖరం కంటే కూడా భాగ్యవంతుడవుతాడు"
    దృడంగా అంటున్న నిర్మలను మాటలు రాక ఆశ్చర్యంగా చూస్తుండి పోయాడు శ్రీధర్.
    "మామయ్యా...నువ్వు ఇందిరను చేసుకోవాలంటే నేను చెయ్య గలిగిన సహాయం ఇంతకంటే నాకు కనబడలేదు."
    "లేదు నిర్మలా! సున్నితమైన నీ మనసుని అర్ధం చేసుకోలేక పోయాను" బాధగా అన్నాడు శ్ర్రీధర్.
    నిర్మల మాట్లాడలేదు.
    "నిర్మలా! నన్నర్ధం చేసుకో! భార్గవి తో సమానంగా ఎత్తుకున్న నిన్ను  భార్యగా ఊహించలేక పోయాను" ఈ విషయాన్ని నువ్వన్నా అర్ధం చేసుకుంటే ...."
    "నా మీద నీ కటువంటి అభిప్రాయమే లేనప్పుడు నీ భార్యగా ఆ స్థానంలో ఉండటం ఎంత ఘోరం! ఆరోజు బ్యాగ్ మర్చిపోయాను, అందుకని వెళ్ళిన వాళ్ళం మళ్ళీ వెనక్కి వచ్చాం. కారు బయటే ఆపి, నన్ను వెళ్ళి బ్యాగ్ తెచ్చుకోమన్నారు. లోపలి కొచ్చిన నాకు నీ గొంతు వినపడింది. ఆశ్చర్యంగా తలుపు సందులో నుంచి చూశాను. ఇందిరతో జరిపిన సంభాషణ అంతా విన్నాను. ఆరోజు నేను ఆ సంభాషణ వినకపోతే ఈసమస్య పరిష్కారం అయేది కాదుగా!
    ఇద్దరి హృదయాలూ తేలిగ్గా ఉన్నాయి.
    "కాని, శివరా,మ్ తో నీ పెళ్ళికి అక్కయ్య ఒప్పుకుంటుందా-" అనుమానంగా అన్నాడు శ్రీధర్.
    "నీకెందుకు! అదంతా నేను చూసుకుంటాను. ఇందిరతో నీ పెళ్ళి జరిపించే బాధ్యత కూడా నాదే"
    "నిర్మలా! నా కళ్ళ ముందు పెరిగిన నువ్వు -- నాకంటే ఎంత ఎదిగిపోయావు."
    దీర్ఘంగా నిట్టుర్చిన ఆమె నిట్టుర్పు ప్రకృతిలో కలిసిపోయింది.
    కూరల కోసం మధ్యలో ఆగిపోయిన భార్గవి, శేఖర్ లు వచ్చారు.
    "ఏమిటో చాలా దీర్ఘంగా ఆలోచిస్తున్నారే" అంటూ శేఖర్ వాళ్ళ పక్కన కూర్చున్నాడు.
    భార్గవి , శేఖర్ కూర్చున్న సోఫా వెనకాల నిలబడింది.
    "ఏమీ లేదు , నిర్మల - శివరామ్ ని పెళ్ళి చేసుకుంటుందట!" అన్నాడు నెమ్మదిగా శ్రీధర్.
    "అయితే ఇంకేం! త్వరగా కాకినాడ ప్రయాణం పెట్టండి. అందరం కలిసి వెళ్దాం -- అన్ని విషయాలు మాట్లాడుకోవచ్చు" అన్నాడు శేఖర్ హుషారుగా.
    భార్గవి నిర్మల వంక చూసింది. అదే సమయానికి నిర్మల కూడా భార్గవి వంక చూసింది. నిర్మల కళ్ళల్లో భార్గవి కి తన ప్రశ్నకు సమాధానం దొరికింది. "నిర్మలా! ఎంత త్యాగం చేశావు' మనసులోనే అనుకున్న భార్గవి కి గుండెలు బరువెక్కగా లోపలికెళ్ళి పోయింది.
    శ్రీధర్ , శేఖర్ ఇద్దరూ ప్రయాణం గురించి ఆలోచించసాగారు.

                             *    *    *    *
      


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS