ఇందిర , నీరజ ఇంటికి వచ్చేసరికి హల్లో సోఫాలో కూర్చుని తీరుబడిగా పుస్తకం చదువు కుంటున్నాడు సురేంద్ర.
"ఏమండీ! ఒక్క ఊపులో వెళ్ళి అతని కాళ్ళ మీద పడింది నిర్మల.
అసలే తెల్లగా ఉండే సురేంద్ర రక్తం లేనట్టు పాలిపోయి ఉన్నాడు. గడ్డం బాగా పెరిగి ఉంది. సురేంద్ర ను చూస్తూనే "శాంతి' భయపడి గుక్కలు పట్టి ఎడవసాగింది. సురేంద్ర అదోలా నవ్వాడు.
ఇందిర కూడా గబగబా దగ్గర కొచ్చింది.
"ఎప్పుడొచ్చారు ?' దాదాపుగా ఇద్దరూ ఒకేసారి అడిగారు అతన్ని.
"నేను వచ్చి వారం రోజులయింది. నిన్ననే వచ్చానిక్కడికి. నీరసంగా ఉందతని గొంతు.
ఆరోజుతో సెలవయిపోవటంతో ఇందిర ఆసుపత్రి కెళ్ళి పోయింది.
సుందరమ్మ గారికి విపరీతమైన కడుపు నొప్పి రావటంతో నీరజే వంట చేసింది.
తనకు స్వయంగా వడ్డిస్తున్న నీరజను చూస్తూ "నీరజా! వంట నువ్వే చేశావా?' అన్నాడు సురేంద్ర.
"అవును. నేనే చేశాను."
"జీవితానికి సరిపడ తిన్నాను- ఇక అన్నం తిన్నా తినక పోయినా ఫర్వాలేదు. చచ్చిపోయే లోపల నీ చేతి వంట రుచి చూడాలని వచ్చాను. ఆ కోరిక నెరవేరింది."
చేతిలో పెరుగు గిన్నె జారి పడిపోయింది నీరజకు. అక్కడే కుప్పలా కూలబడి పోయింది.
"అవెం మాటలండీ?" అంది ఏడుస్తూ భయంగా.
"పెరుగు వెయ్యి నీరజా! అసంపూర్తిగా భోజనం చేసినట్టవుతుంది.
నీరజ మాటలు విననట్టే అన్నాడు సురేంద్ర.
ఏడుస్తూనే పెరుగు వేసింది. శోకమూర్తి లా ఉన్న నీరజను పరీక్షగా చూసిన సురేంద్ర హృదయం తరుక్కు పోయింది.
పచ్చగా అందంగా ఆరోగ్యంగా ఉండే నీరజ-- ముఖం పాలిపోయి కళ్ళు లోపలికి పోయి -- ప్రాణమే లేనట్లుంది. అసలా కళ్ళల్లో కాంతే లేదు. గాజు కళ్ళలా నీర్జీవంగా ఉన్నాయి.
"నీరజా!' అతడి కళ్ళ నుండి రెండు కన్నీటి బొట్లు రాలి పడ్డాయి. లేచి వెళ్ళి చెయ్యి కడుక్కున్నాడు. నీరజ వంటింటి తలుపులు వేసి వెళ్ళి పడుకుంది. సాయంత్రం 7 గంటల దాకా అలాగే పడుకుని ఒక పడుకోలేక నెమ్మదిగా లేచి పైకి వెళ్ళింది. సురేంద్ర ఎక్కడికి వెళ్ళాడో తెలియదు.
అక్కడక్కడా నక్షత్రాలు మినుకు మినుకు మంటున్నాయి. ఆకాశం మేఘామృతమయింది. మబ్బుల మూలంగా నల్లని రాత్రి మరింత నల్లగా ఉంది.
"నీరజా, వచ్చావా?" ఉలిక్కిపడి పక్కకు తిరిగి చూసింది నీరజ.
సురేంద్ర కూర్చుని ఉన్నడక్కడ పిట్ట గోడ కానుకుని. క్షణ కాలం గుండె కొట్టుకోవటం మానేసింది నీరజకు.
"నీరజా -- కూర్చో , నీతో కొన్ని విషయాలు మాట్లాడాలి"
అతని కభిముఖంగా బొమ్మలా కూర్చున్న నీరజను పది నిమిషాలు చూస్తూ కూర్చుండి పోయాడు సురేంద్ర.
"నీరజా! నీకు ద్రోహం చేశాను కదూ! నేను చచ్చిపోయిన తరువాతయినా నన్ను క్షమిస్తావా?" పల్చగా ఉన్న ఆమె అరచేతిని తన చేతిలోకి తీసుకుంటూ అన్నాడు సురేంద్ర.
"అవెం మాటలండీ! పొద్దున్న కూడా ఇలాగే అన్నారు. దుఃఖంతో ఆమె గొంతు పూడుకు పోయింది.
నీరజా! ఇల్లు అమ్మేశాను. ఉద్యోగానికి రాజీనామా ఇచ్చాను. ఇన్నాళ్ళు ఎన్నో ఊళ్ళు తిరిగాను. కనిపించిన ప్రతి దేవాలయానికి వెళ్ళాను. అంతటా నువ్వే కనిపించావు. నీకు తెలియదు నీరజా! నువ్వు నమ్మవు కాని నా మనసంతా నీవే. నా కళ్ళకి ప్రపంచంలో నీరజ తప్ప ఇంకేమీ కనుపించటం లేదు" ఆయాసంగా ఒక్క క్షణం ఆగాడు సురేంద్ర.
"మీరు నా ప్రాణం - శరీరంలో ప్రతి అణువు మీ కోసం తపస్సు చేస్తున్నది. మీరు లేని నీరజ లేదు. నా శరీరంలో ప్రవహించే రక్తం లో మీ పేరు మీ రూపం నిండి ఉన్నాయి - మీరే నా ప్రపంచం. అని కోటి గొంతులతో అరవాలనిపించింది నీరజకు.
దుఃఖం తో గొంతులో నుంచి మాట బయటకు రాలేదు.
"నీరజా! దిక్కు లేక కనీసం గుక్కెడు నీళ్ళన్నా ఇచ్చేవాళ్ళు లేక - నీవు దగ్గర లేనందువల్ల ప్రాణం పోక మరణబాధతో సతమతమాయి పోయే రోజు -- ఆ రోజన్నా నా దగ్గరకు వస్తావు కదూ" అతని ముఖమంతా కన్నీళ్ళ తో తడిసి మలినమై పోయింది.
"కాదు - కాదు! అలా ఎన్నటికి జరగదు - విధి తో పోరాడి విసిగి వేసారి పోయి అలిసిపోయిన ఈ నీరజ మీ గుండెల్లో పడుకుని "మిమ్మల్ని చూస్తూ ఆఖరి శ్వాస విడుస్తుంది. ఇది నిజం. భగవంతుడు ఈ విషయంలో నన్నా నాకు న్యాయం చేకూర్చక పోడు. నేను...నేను.... చివరి ఘడియల్లో ....మీ ఒడిలో నిశ్చింతగా హాయిగా ప్రాణం విడుస్తాను. నాకలా మాటివ్వండి" ఎక్కడున్నా ఆ క్షణానికి నా దగ్గరుంటానని మాటివ్వండి -- ఆర్తితో హృదయం లోంచి పిలిచే నా పిలుపుకి పలుకుతానని మాటివ్వండి --" సురేంద్ర గుండెల మీద వాలిపోయి అతని మెడ చుట్టూ చేతులు వేసి వెక్కి వెక్కి ఏడవసాగింది నీరజ.
"నీరజా....' ఆమె తల నిమురుతూ హృదయానికి దగ్గరగా తీసుకున్నాడు.
"నీరజా ! ఏదైనా ఆశ్రమానికి వెళ్ళటానికి నిశ్చయించుకున్నాను. వెళ్ళటానికి నిశ్చయించుకున్నాను. దేశాలు పట్టి ఇక తిరగలేను. డబ్బంతా నీ పేర బ్యాంకు లో వేశాను. జాగ్రత్తగా ఉంటావు కదూ" నెమ్మదిగా నీరజను వేరు చేస్తూ అన్నాడు సురేంద్ర.
నీరజ గుండెలు పగిలిపోయేలా ఏడుస్తున్నది."
సురేంద్ర కు ఏడ్చి ఏడ్చి కంట్లో నీళ్ళిగిరిపోయినాయి.
నీరజకు వంటి మీద స్పృహ లేదు, తన ఒడి లోంచి నెమ్మదిగా నీరజను లేవదీసి పక్కకు పడుకో బెట్టి బరువుగా అడుగులు వేస్తూ వెళ్ళిపోయాడు సురేంద్ర.
నీరజ మనసులో చిక్కని చీకటి ప్రకృతంగా అలుముకుంది. నల్లని మేఘాలు ఆకాశమంతా నిండిపోయాయి. ధారాపాతంగా వర్షం కురవసాగింది. కొంతసేపటికి నీరజ తేరుకుని కిందికి వచ్చి తలుపులు తోసుకుని బయటకు పరుగెత్తింది.
అప్పటికే సురేంద్ర చీకట్లో బాణం లా దూసుకుపోయాడు.
వర్షానికి తడిసి నిర్మానుష్యంగా ఉన్న రోడ్డు నీరజను వెక్కిరించింది.
కళ్ళు పొడుచుకుని సురేంద్ర కోసం అలా చీకట్లోకి చూస్తూ నిలబడిపోయింది నీరజ.
(సమాప్తం)
