Previous Page Next Page 
ఆఖరి మజిలీ పేజి 28

 

    సరాసరి జూలాజికల్ పార్కు కి తీసుకెళ్ళాడు శివరామ్ నిర్మలను. మూడు వందల సంవత్సరాల ఆయుర్దాయం కలిగి ఊడలన్నీ మానులై మహా వృక్షాలుగా పెరిగిన వట వృక్షాన్ని ఆశ్చర్యంగా తిరిగి చూసింది నిర్మల.
    అమాయకంగా పసిపిల్లలా ఉన్న నిర్మల అంతర్యమేమిటో అర్ధం కాక విస్మయంగా చూస్తూ నిలబడ్డాడు శివరామ్    కారియర్ లో తెచ్చిన భోజనం ఇద్దరికీ వడ్డించింది నిర్మల.
    "ఈరోజు ఇక్కడికి వస్తామని ముందే తెలుసా! అన్నీ సిద్దం చేశారు"
    "శేఖరం గారు చెప్పారు. ఇవ్వాళ ఇక్కడికి వెళ్ళమని. నా మనసు తెలుసుకున్న వారిలాగ మీరే ఇక్కడకు తీసుకు వచ్చారు. "మరి కొంచెం కూర వేస్తూ అంది నిర్మల.
    "చాలు! చాలు- ఎందుకలా వేస్తారు తినవద్దూ! నేను మనిషినండి బాబూ! హాస్యంగా అన్నాడు శివరామ్.
    నిర్మల చిరునవ్వుతో అతని కళ్ళలోకి చూసింది మౌనంగా.
    సాయంత్రం దాకా తిరిగి ఇంటి ముఖం పట్టారు.
    "అబ్బ! ఇంక నడవలేకుండా ఉన్నాను బాబూ" అంది నిర్మల కూర్చుంటూ.
    "అరె! కూర్చుంటే ఎలా? కారు దాకా నడవ్వల్సిందే"
    "కాస్త చెయ్యి ఆసరా ఇద్దురూ. మీకు పుణ్యం ఉంటుంది" వస్తున్న నవ్వును ఆపుకుంటూ అంటున్న నిర్మలను ఉలిక్కిపడి చూశాడు శివరామ్    
    వెంటనే అతని చెయ్యి పట్టుకుని ఒక్క ఊపున లేచింది నిర్మల. అతని చేతిని తన చేతిలో సాధ్యమైనంత గట్టిగా నొక్కిపట్టి నడవసాగింది.
    శివరామ్ కి నుదుటంతా చిరుచెమట పట్టింది. ఏమిటి? ఈవిడ ప్రవర్తన - మరీ వింతగా ఉంది. అతని మనస్సు శరీరం రెండూ విచిత్రమైన అనుభూతిని పొందుతున్నాయి.
    కారులో వచ్చి కూర్చున్న తరువాత కూడా నిర్మల శివరామ్ చెయ్యి వదల్లేదు.
    "చెయ్యి వదిలితే కారు నడుపుతాను. శివరామ్ గొంతు నీరసంగా వినిపించింది. నిర్మలకి జాలేసింది. పాపం! ఇతనెంత అమాయకుడు. అనుకుంది అతని చెయ్యి వదుల్తూ.
    ఆ మరునాడు "జైనమందిర్ " కి వెళ్ళారు. అద్దాల మయంగా ఉన్న ఆ మందిరాన్ని కళ్ళు పెద్దవి చేసుకుని మరీ చూసింది నిర్మల. ఈ రెండు మూడు రోజుల పరిచయంలో కాస్త చనువు ఏర్పడింది శివరామ్ కి. తనంతటతనే నిర్మలకు దగ్గరగా నడవసాగాడు. శివరామ్ లోని మార్పును గమనించిన నిర్మల దీర్ఘంగా నిట్టూర్చింది.
    బేలూరు మఠం వైపు దారి తీసింది కారు.

                                 
    బేలూరు మఠం దగ్గర మాత్రం నిర్మలమనసు భక్తీ భావంతో నిండిపోయింది. గంగ ఒడ్డున ఉన్న అ మందిరం పవిత్రతకు చిహ్నంగా , పరమేశ్వరికి మరో రూపంలా భాసించింది నిర్మల మనసుకు.
    "శివరామ్! ఏడడుగులు కలిసి వేస్తె అది విడదీయరాని బంధం అంటారు పెద్దలు. అందులో మీకు నమ్మక ముందా?" పవిత్రమైన ఆ వాతావరణం మనసుని ఆహ్లాదపరుస్తుంటే -- అనంతమైన గంగా ప్రవాహాన్ని చూస్తూ అడిగింది నిర్మల.
    నీటి మీద నుంచి వచ్చే చల్లని గాలి, ఆ గాలికి యెగిరి పడుతున్న ఆమె ముంగురులను తదేకంగా చూస్తున్న శివరామ్ "ఎందుకు లేదు! పెద్దలు చెప్పిన ప్రతి మాట మీద నాకు నమ్మక ముంది" అన్నాడు.
    "అయితే మనది విడదీయరాని బందం"
    పిడుగు పడ్డట్టయి అదిరిపడి చూశాడు శివరామ్.
    "ఏమిటి? ఏమంటున్నారు మీరు......"
    "తొందర లేదు. మీరు అనవసరంగా గాభరా పడకండి. ప్రశాంతంగా ఆలోచించే ఒక నిర్ణయానికి రండి -- పైన భగవంతుడున్నాడు" జీరబోయిన గొంతుతో అంది నిర్మల. ఏదో మాట్లాడబోయాడు శివరామ్. "వద్దు శివరామ్! మీరు ఆ విషయమై ఇప్పుడెం మాట్లాడవద్దు. కావలసినంత వ్యవధి తీసుకోండి. తొందరపడి చేసుకునే నిర్ణయాలేవీ మంచివి కావు.'
    ఇద్దరూ మౌనంగానే ఇల్లు చేరారు. శివరామ్ వైపు చూసే ధైర్యం లేనిదానిలా ఒక్క పరుగులో లోపలి కెళ్ళి పోయింది నిర్మల. ఆమె వెళ్ళిన వైపే కాసేపు చూస్తూ నిలబడి - భారంగా వెనుదిరిగి గబగబా అంగలేసుకుంటూ వెళ్ళిపోయాడు శివరామ్.
    ఆరోజు శుక్రవారం. తలకి స్నానం చేసి వాకిట్లో శివరామ్ కోసం ఎదురు చూస్తూ కూర్చున్నది నిర్మల. దాదాపు 10 గంటల ప్రాంతంలో కూర్చున్న నిర్మల 2 గంటల వరకూ అలాగే కూర్చుంది. తన ముందు నుంచే శ్రీధర్ వచ్చి వెళ్ళాడు. కొంతసేపటికి ఇందిర, శేఖర్, భార్గవి వెళ్ళారు.
    రెండు గంటలు దాటుతుండగా దిగాలు పడి ముఖమంతా పీక్కుపోయి నెమ్మదిగా అడుగులో అడుగు వేసుకుంటూ వచ్చాడు శివరామ్ శివరామ్ ని చూస్తూనే ఒక్కంగలో అతని దగ్గర కెళ్ళింది నిర్మల.
    "వచ్చారా! ఇక రారేమో అనుకున్నాను" అంటున్న నిర్మలను రెండు నిముషాలు అలాగే చూస్తూ నిలబడ్డాడు శివరామ్.
    "రండి -- వెళ్దామా" అని వెనక్కు తిరిగి బయలుదేరబోయాడు.
    "ఆగండి కొంచెం. పర్సు తీసుకువస్తాను" అని ఇంట్లోకి వెళ్ళబోయిన నిర్మలను "నా దగ్గర డబ్బుంది లే త్వరగా రండి" అని వాకిట్లోంచే తీసుకు వెళ్ళిపోయాడు.
    టాక్సీ జులాజికల్ పార్కు ముందర ఆగగానే.
    "మళ్ళీ ఇక్కడికి ఎందుకు? ఇంకెక్కడికైనా వెళ్దాం!" అంటున్న నిర్మల మాటలు వినిపించుకోకుండా లోపలికి దారి తీశాడు శివరామ్.
    "అబ్బ! ఆయాసంగా ఉంది బాబూ! మరీ పరిగెత్తించేశారు" అంటూ పచ్చ గడ్డిలో కూర్చున్న నిర్మల కభిముఖంగా కూర్చున్నాడు శివరామ్ పది నిముషాలు మౌనంగా దొర్లిపోయాయి. ఇద్దరూ ఎవరి ఆలోచనల్లో వారున్నారు.    
    "నిర్మలా పెదవాళ్ళతో ఆటలాడుకోవటం మీ గొప్పవాళ్ళకు హాబీ కాబోలు" నిష్టూరంగా వినపడింది శివరామ్ గొంతు.
    "శివరామ్! ఏనాడైతే మిమ్మల్ని భర్తగా గుర్తించానో ఆనాటి నుంచి మీ భోగభాగ్యాలే నావి. ప్రత్యేకంగా నాకున్న భాగ్యమేమీ లేదు"
    శివరామ్ పకపకా నవ్వాడు. నిర్మల ఆశ్చర్యంగా చూసింది శివరామ్ కేసి.
    "ఈ డైలాగులన్నీ మనం సినిమాల్లోనూ, కధల్లోనూ వినవలసిందే! నిజ జీవితంలో అదేన్నటికీ సాధ్యం కాదు. అసలదలా ఉంచండి -- శ్రీధరంగారిని కాదని నన్ను భర్తగా నిర్ణయించుకోవటం లో మీ ఉద్దేశ్యమేమిటి? కోరి పేదరికాన్ని ఆహ్వానించటంలో గల అంతరార్ధం మేమిటి? మన పరిచయం అయి ఎన్నాళ్ళయింది? ఇంత స్వల్ప వ్యవధి లో నా మంచితనాన్ని మీరేం చూశారు? నా నుంచి మీకేరకమైనా ఆకర్షణ కలిగింది? ఈ ప్రశ్నలన్నిటికి నాకు సమాధానం కావాలి"
    "అయిపోయినయ్యా! ఇంకా ఏమైనా ప్రశ్న లున్నాయా?"
    "నిర్మలా! పరిహాసమా" కోపంగా అన్నాడు శివరామ్.
    "కోరి మనసు పడి ఎన్నుకున్న భర్తతో పరిహాసమా...."
    'అగు, ఏ రకంగా నేను నీకు భర్తను కాగలననుకున్నావ్" కోపంతో అతని ముఖం ఎర్రగా జేవురించింది.
    అంతలోనే అతని ముఖం మీద విషాదం అలముకుంది.
    "నిర్మలా! పేదవాళ్ళ కి కూడా మనసుంటుంది -- వాళ్ళవి కూడా జీవితాలే! ఇన్ని రోజులుగా నేనేదో మైకంలో ఉన్నాను,. రాత్రంతా ఆలోచించాను. నీ దగ్గరకు వచ్చేవరకు ఆలోచిస్తూనే ఉన్నాను. మూగబోయిన ఈ గుండెలో మినుకుమినుకుమని ఆరిపోతున్న ప్రణయ జ్యోతిని వెలికి తెచ్చి దేదీప్యమానంగా వెలిగింపచేశావు. ఆ వెలుగులో నన్ను నేను మర్చిపోయాను -- నిర్మలా! నా కిప్పుడనిపిస్తుంది కదా, నాకు పెదరికమేమిటి? నేనొక చక్రవర్తిని నా మనసొక మహా సామ్రాజ్యం . నాకు పేదరికమే లేదు......."
    "శివరామ్ ......." కళ్ళ నుండి ఆనందం అశ్రురూపంలో చెక్కిళ్ళ ను తడుపుతుండగా అతని ఒడిలో వాలిపోయింది నిర్మల.
    "నిర్మలా ...." గబుక్కున లేవదీసి దూరంగా జరిగాడు శివరామ్ . "నిర్మలా....! నీకూ, నాకూ మధ్య అనంతమైన దూరం ఉంది. ఏరకంగానూ మనం చేరుకోలేం. ఏదో ఆవేశంలో అన్నాను. నాకు ప్రశ్నలూ లేవు. సమాధానాలు లేవు. నువ్వు సుఖంగా ఉండటమే నా కోరిక -- నిన్ను శాసించే అధికారమూ, చొరవా రెండూ నాకు లేవు గాని -- అయినా ఒక అత్మీయుడిగా చెప్తున్నాను -- శ్రీధరం గార్ని పెళ్ళి చేసుకో --వెర్రి ఆలోచనలు పెట్టుకోకు.."


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS