"ఇప్పుడే వాడిని పట్టుకొని నాలుగు ఉతికితే నిజం కక్కి ఛస్తాడు కదా!" కానిస్టేబుల్ ఆవేశంగా అన్నాడు.
"మనం తొందరపడకూడదు. వేడిని పట్టుకున్నట్టు తెలిస్తే వీడివెనక వున్న ముఠా అంతా పారిపోతుంది. కనుక ఈరోజు మనం అతన్ని ఫాలో కావటం ఒక్కటే మార్గం, వాడు ఉండేదెక్కడో తెలుస్తుంది" అన్నాడు ఇన్ స్పెక్టరు.
"ఆ తరువాత అతన్ని అనుసరిస్తూ దూరదూరంగా పొంచివుండి అతని చర్యలని కనిపెడుతూనే ఉన్నారు.
ముప్పావుగంట తరువాత.
అతను దైవదర్శనం చేసుకోకుండానే కొండ దిగటం ప్రారంభించాడు.
ఇన్ స్పెక్టరు, కానిస్టేబుల్ గూడా కొండ దిగారు. అతని వెనుకనే అతనిని అనుసరిస్తూ.
అతను కొండ దిగిన తరువాత ఇంకేదీ పట్టించుకోకుండా సరాసరి ఒక హోటల్లోకి వెళ్ళాడు. అక్కడ టిఫిన్ తిని కాఫీ త్రాగాడు. బయటికి వచ్చి రెండు అరటిపళ్ళు కొనుక్కొని మళ్ళీ ముందుకి సాగాడు.
పావుగంట తరువాత
ఈమధ్య అక్కడ ప్రయాణికుల వసతి గృహాలుగా ప్రయాణీకుల వసతి కోసం సింగిల్ రూమ్ క్వార్టర్సు కట్టించాడు ఒక మహానుభావుడు. అవి చౌకగా భక్తులకి అద్దెకిస్తుంటారు. దూర తీరాల నుండి వచ్చినవాళ్ళు ఆ చిన్న రూమ్ చాలక రెండు రూమ్స్ తీసుకున్నవాళ్ళూ ఉన్నారు. అది వేరే విషయం.
అతను ఒక రూ, తలుపు తాళం తీసి రూమ్ లోకి వెళ్ళి తలుపు వేసుకొన్నాడు.
అక్కడిదాకా ఆ యువకుడిని అనుసరిస్తూ వచ్చిన ఇన్ స్పెక్టర్ వర్ధనరావూ, కానిస్టేబుల్ అహోబిలం దూరంగా నుంచుని అతని చర్యలను అప్పటిదాకా కనిపెడుతున్న వారల్లా అక్కడే ఆగిపోయి సరిగ్గా అరగంట నిరీక్షించారు.
ఆ అరగంటలో అతను తలుపు తియ్యలేదు, బయటికి రాలేదు.
"అతను ఈ పూటకి ఇక బయటకి రాడు. చూస్తుంటే లోపల అతను ఒక్కడేమో అనిపిస్తోంది. ఒక్క రోజులో అతను బిచాణా ఎత్తివెయ్యడు కదా! ఇతని సంగతి మళ్ళీ మనం రేపు చూద్దాం. ఈ పూటకి తిరిగివెళ్ళటం మంచిది" అన్నాడు ఇన్ స్పెక్టర్ వర్ధనరావు.
"మీరు చెప్పిందే కరెక్ట్ సార్! మీకంటపడ్డ పక్షి ఎగిరిపోవటం కూడానా. వీడి అమీ తుమీ రేపు తేలుద్దాం. మళ్ళీ కొండమీదకి వెళదామా లేక ఇంటికి వెళదామా" అడిగాడు కానిస్టేబుల్ అహోబిలం.
"ఇంటికే బయలుదేరుదాం" అన్నాడు ఇన్ స్పెక్టర్ వెనుతిరుగుతూ.
'హమ్మయ్య' అనుకున్నాడు అహోబిలం.
ఇరువురూ ఇంటిదారి పట్టారు.
17
"నాకో ఆలోచన తట్టింది" పచార్లు ఆపి అన్నాడు వర్ధనరావు.
"ఏంటి సార్!" ఆత్రుతగా అడిగాడు అహోబిలం.
"ఇవాళ మనం వాడి వెనుకనే ఇద్దరమూ వెళ్ళొద్దు. మనం రెండురోజుల నుంచీ ఫాలో అవుతున్నాం కదా! వాడి గురించి ఏం తెలుసుకున్నాం?"
"వాడు సరిగ్గా సాయంత్రం నాలుగు గంటల సమయంలో గదిలోంచి బయటకివచ్చి గది తలుపులకి తాళం వేస్తాడు. ఆ తరవాత హోటల్ కెళ్ళి వట్టి కాఫీ మాత్రం తాగుతాడు. ఆ తర్వాత అక్కడినుంచి బయలుదేరి కొండ ఎక్కుతాడు. కొండపైన దిక్కుమాలిన పరిశోధన చేస్తూ రెండు గంటలు టైమ్ వేస్ట్ చేస్తాడు. ఆ తర్వాత కొండ దిగివచ్చి మళ్ళీ హోటల్లో దూరి కాఫీ టిఫిన్ తీసుకుని, రెండు అరటిపళ్ళు కొనుక్కుని తన రూమ్ దగ్గరికి వస్తాడు. ఇంక రూమ్ లో దూరినవాడు మళ్ళీ తలుపుతీసే పనిలేదు. మనం పరిశోధించి తెలుసుకుంది వాడి గురించి అంతవరకు మాత్రమే" అన్నాడు అహోబిలం.
"గుడ్! బాగానే కనిపెట్టావు. సరిగ్గా వాడు చేస్తున్నదీ అదే, మనం కనిపెట్టిందీ అదే. వాడు సామాన్యుడు కాదని నా సిక్త్ సెన్స్ చెపుతున్నది. 'ఆలస్యం అమృతం విషం' అన్నారు. కనుక ఈ రోజు మనం మరో పనిచేద్దాం."
"ఆ మరో పనేమిటో చెప్పండి సార్! చేసేద్దాం" హుషారుగా అన్నాడు అహోబిలం.
"మనం మామూలుగా మారువేషాలు ధరిద్దాం. వాడు గదిలోంచి వచ్చి బయలుదేరంగానే నువ్వు వాడివెనుకనే వెళ్ళు...."
"మరి మీరేం చేస్తారు?" వెంటనే అడిగాడు అహోబిలం.
"చెప్పేది సాంతం విను. నువ్వు వాడివెనకనే గుడిపైదాకా వెళ్ళు. నేను ఈలోపల మారు తాళం చెవులతో వాడి గది తాళం తీసి గదిలో దూరతాను. గదిలో....పెట్టె తట్ట బుట్ట వాడి తాలూకా ఏదుంటే అది వెతుకుతాను. ఏదైనా ఆధారం దొరికితే తెస్తాను..."
"ఆగండి సార్!" వర్ధనరావు చెప్తుంటే అహోబిలం మధ్యలో అడ్డు తగిలాడు.
"నువ్వు నన్ను ఆగమన్నావా?" వర్ధనరావుకి అనుమానం వచ్చి అడిగాడు.
"అవును సార్! అన్నాను"
"ఎందుకు అన్నావు?"
"నాకో అనుమానం వచ్చింది సార్!"
"వస్తే?"
"తర్వాత అయితే మరిచిపోతానేమో, ఇప్పుడు అడిగి తెలుసుకుందామని...."
"విషయం అదన్నమాట!"
"అదే సార్!"
"అయితే అడుగు"
'మీరు వాడి గది శోధించి ఏదో ఒకటి సాధించి దొరికిందేదో తెచ్చారనుకోండి సార్! ఆ తర్వాత వాడికి అనుమానం వచ్చి బిచాణా ఎత్తేస్తే.'
'ఇదేనా నీ అనుమానం!!'
'అవును సార్!'
'అహోబిలం. నువ్వెంత పిచ్చివాడివయ్యా' అన్నట్లు వర్ధనరావు చిద్విలాసంగా ఓ నవ్వు నవ్వి 'అహోబిలం! నీ అనుమానం సరైనదే కానీ....నేనంత తెలివితక్కువవాడ్ని కాదుకదా! పథకం పన్నానూ అంటే అది చచ్చినట్లు సక్సెస్ అయ్యి తీరవలసిందే. నూరు ఆరయ్యేది ఆరు నూరయ్యేది నా ప్లాన్ మాత్రం ఫెయిల్ కాదు....'
