ఆ గదిలోకి తీసుకుపోయి సింహాసనంమీద కూర్చోమని లింగప్ప దొరకు ఆదేశించాడు ఖాన్.
దొర సింహాసనంమీద కూర్చుని రవ్వ మీసం దువ్వాడు. తలుపులు దగ్గరగా వేశాడు ఖాన్.
"నేను తలుచుకుంటే నిన్ను రాజును చెయ్యగలను" అన్నాడు దొరతో.
"నేను రాజును కావటంకన్నా నీ రాజ్యాన్ని నువ్వు ధర్మగుణంతో పాలిస్తే యెక్కువ సంతోషిస్తాను" అంటూ బదులిచ్చాడు దొర.
మొండివాడు దైవంకన్నా దండి బలవంతుడన్న సత్యం ఖానుకు రుజువు పరుస్తున్నాడు దొర. ఖాను పట్టుదల పెరిగిపోతోంది.
"హుక్కా తాగుతావా? ఆలోచన అంటే యేమిటో తెలుస్తుంది."
"హుక్కా త్రాగితే తప్ప ఆలోచనలు అంటే యేమిటో తెలియదన్నమాట మీకు?"
ఒక జాడిలోవున్న మధురసాన్ని చషకంలోకి వంచి యిచ్చాడు ఖాను. తాను త్రాగుతున్నాడు. క్రమంగా కళ్ళు యెరుపెక్కినాయి.
లింగప్పదొర త్రాగలేదు.
"సారాయి త్రాగితే చెడిపోతావా?" నవ్వాడు ఖాను.
"ఎందుకు త్రాగాలి సారాయి?" దొర యెదురుప్రశ్న.
"మజాకోసం" అని సమాధానం.
"నీ మజా మండిపోను. వ్యసనాల్లోంచి వచ్చేది మజా యెలా అవుతుంది?" అనుకున్నాడు దొర.
ఖాను గంటకొట్టాడు. తలుపులు తెరుచుకోబడినాయి. యెదురుగా బానిస నిలబడ్డాడు చేతులు కట్టుకుని.
"తిండి తీసుకురా!" ఖాను ఆదేశించాడు. క్షణాలమీద వచ్చింది. యిద్దరూ తిన్నారు. ఆ తరువాత మంచంమీద పడి సాయంత్రం వరకూ గొడ్డులా నిద్రపోయాడు ఖాను లేచి స్నానం చేశాడు. మంచి ఖరీదయిన రవసెల్లాలు ధరించి ఖరీదయిన అత్తర్లు రాశాడు. లింగప్పకూ పులిమాడు. యిద్దరూ మరొక గదిలోకి వచ్చారు.
అది విశాలమయిన హాలు హాలు మధ్యలో మంచం వుంది. దాని ప్రక్కన హుక్కా వుంది. హుక్కా తాగుతూ, ఖరీదయిన సారాయి తాగుతూ అరేబియానించి వచ్చిన యెండుద్రాక్ష తింటూ నాట్యం చూస్తున్నాడు ఖాను దొర అదంతా గమనిస్తున్నాడు.
అతని మనసులో తన జాతి జనుల శ్రేయస్సుకోసం ప్రాణాలను అవలీలగా త్యాగం చేసిన కూచిపోతి ఆకారం మెదులుతోంది. నవాబు దర్జా అనే పేరుతో ఖాను చేస్తున్న వెకిలిచేష్టలు అతనికి నచ్చలేదు. ఆడదంటే శరీరమేకాని మరొకటి కాదు అన్న భావం అతనికి జుగుప్స కలిగించి రోత పుట్టింది. "యిది మజాకాదు, వీడి శ్రాద్ధం" అనుకుంటూ మౌనంగా అన్నీ భరించాడు. నాట్యాలు ఆగిపోయాయి. సంగీతం ఆగిపోయింది. త్రాగటం, తినటం ఆగిపోయింది.
కొంతమందిని అక్కడే వుండమని ఆదేశించి మరికొంతమందిని తీసుకుని అక్కడనించి నిష్క్రమించాడు ఖాను.
పోతూ త్రాగిన మైకంతో ఒకమాట అన్నాడు. "మీ హిందువులకు రవజ్ఞత అంటే యేమిటో తెలియదు" అని.
దొర ఆ మాటలకు నవ్వుకున్నాడు. "నీ పిండాకూడు. రవజ్ఞత అంటే వెకిలిచేష్టలు చెయ్యటమేనా?" అనుకున్నాడు.
షేర్ ఖాను వెలుపలకు పోగానే బైటనించి తలుపులు మూసుకున్నాయి.
చాలాసేపు అతడు రంగంలోకి యెట్లా దిగుతాడా అని యెదురు చూచారు అక్కడున్న ఆడవాళ్ళు దొర దర్జాగా పవ్వళించాడు తప్ప కన్ను మలిపి వాళ్ళవంకకూడా చూడలేదు. ఆడవాళ్ళకు విసుగూ, నిద్రా వచ్చాయి.
ఒకామె చొరవచేసి దగ్గరకు వచ్చింది. మిగిలినవాళ్ళు పై చెంగులు పరుచుకుని అస్తవ్యస్తంగా పడి నిద్రపోతున్నారు.
"దొరా! మామీద దయలేదా?" అందామె దగ్గరగా వచ్చి.
"దయకేమి కావలసినంత వుంది. మీనవాబుకి బుద్దిలేదు" అన్నాడు దొర.
"అదేమిటి?" అన్నదామె ఆశ్చర్యంతోనూ, భయంతోనూ.
"ఎందుకు భయపడతావు?"
"మీరన్నమాట భానుసాహెబ్ వింటే....?" అందామె.
"విన్నా నన్నేమీ చెయ్యడు- చెయ్యలేడు" దొర బింకం పలికాడు.
"ఎందుకని?"
"అదంతా రాజకీయం నన్నేదయినా చేస్తే సవరలు మళ్ళీ తిరగబడతారు"
"ఓహో అదా మీ ధైర్యం?" అంటూ ఆమె మంచంమీద కూర్చుంది.
"నువ్వు చాల అందంగా వున్నావు" అన్నాడు దొర.
ఆమె సిగ్గుతో నవ్వింది.
"చాలా బాగా పాడావు."
ఆమె సిగ్గుతో తలవంచుకుంది.
"చాల చక్కగా ఆడావు."
ఆమె సిగ్గుతో రెప్పలు వాల్చింది.
"కాని నీకీ ఖర్మ ఏమిటి?" అన్నాడు దొర.
ఆమె రెప్పలు పైకెత్తి దొరవంక చూచింది అయోమయంగా.
"నీకెందుకీ బానిస బ్రతుకు" దొర ఛీత్కరించాడు ఆమె ఆ ఛీత్కారానికి కోపం తెచ్చుకోలేదు నెమ్మదిగా వినయంగా అంది.
"బానిసను కనుక!" దొర ఆశ్చర్యపడిపోయాడు.
"ఇంత అందమయిన బానిసలు వుంటారా?" అని ఆశ్చర్యపోయాడు. ఆ మాటలు అతనికి తెలియకుండానే అనేశాడు ఆమెకు విన్పించేలా.
ఆమె నవ్వింది. దానిమ్మపూవు రేకుల్లాంటి పెదవులు విచ్చుకున్నాయి. దానిమ్మగింజల్లాంటి పలువరుస తెల్లగా మెరిసింది. దానిమ్మ పిందెలా ముఖం యెర్రబడింది. విరగకాచిన దానిమ్మకొమ్మలా ఆమె తల వంచింది.
"ఈ అందమే బానిస అయ్యే అర్హతను నాకు ప్రసాదించింది" అంది.
