సాయంత్రం జరిగిన సంఘటన పదే పదే గుర్తుకు వస్తూ సాహితిని ఓ పక్క అధైర్యపరుస్తూ.....మరొకపక్క రెచ్చగొడుతోంది.
తనను భయపెట్టి ప్రీమియర్ కంపెనీకి ఫైనాన్స్ చేయకుండా ఉండేందుకు ప్రత్యర్థులు ఎన్నుకున్న అతి హేయమైన మార్గం.....తనని చంపబోవటం.
"అమ్మా" అంది నిద్రలో ఉలిక్కిపడుతూ సోనీ అసంకల్పితంగా బెడ్వైపు ఉరికి సోనీ వెన్నుమీద చేయివేసి ప్రేమగా నిమిరింది.
మంచం పక్కనే ఉన్న వాలు కుర్చీలో కూర్చుని పైకప్పుకేసి చూస్తూనే ఓ చేతిలో కూతురు శరీరాన్ని ప్రేమగా స్పృశించుతోంది.
ఒక్క వ్యక్తిగాని, సంఘటనగాని మనఃఫలకంమీద ముద్రించుకు పోవటానికి సుదీర్ఘమైన కాలం గాని టైమ్ లేప్స్ గాని అక్కరలేదు.
ఆ సంఘటన జరిగి కరక్టుగా 36 గంటలు, అప్పటినుంచి ఆ వ్యక్తి చురుకయిన కళ్ళు నీడలా వెంటాడుతూ తనను ఆపదలనుంచి రక్షిస్తున్నా భావం తెరలుతెరలుగా కుదిపివేస్తోంది.
ఒకేఒక్క క్షణం ఆలస్యమై ఉంటే ఈనాడు తన బిడ్డగతి ఏమయ్యేదో ఆలోచించుకుంటుంటే సాహితకి నాగ్ మీద కృతజ్ఞతాభావం రెట్టింపవుతోంది.
ఓ పక్క తన ప్రాణదాత___మరో ప్రక్క తనని చంపటంద్వారా తన ప్రయత్నాల్ని అడ్డుకోవాలనుకొనే దుష్టశక్తులు......
అతనికెలా ఉంది? ఈ ప్రశ్న సాహితి కొన్ని లక్షలసార్లు తనకు తానే ప్రయత్నాల్ని అడ్డుకోవాలనుకొనే దుష్టశక్తులు......
తనను అమాంతం గాల్లోకి లేపిన అతని శక్తివంతమైన బాహువులు తనను రక్షించే [ప్రయత్నంలో అతని కళ్ళలో కనిపించిన తెగువ మృత్యువు చివరను తాకుతూ తనను రక్షిస్తున్నా అతి సాధారణంగా ఉండగలిగిన అతని స్థయిర్యం.
దాదాపు తన వయస్సే ఉండి ఉండచ్చు__జీవితపు అటుపోటుల్ని చవిచూసిన ఆనవాలు లేని ఆ మొఖంలో కొండంత ఆత్మవిశ్వాసం..... ఎలాంటి విపత్తునయినా అధిగమించగలను అనే భావాన్ని సూచించే అతని శరీరవేగం.... కనురెప్పపాటు కాలపు ప్రమాదాల్ని సయితం చప్పున గ్రహించి, చర్య తీసుకోగల స్ఫూర్తి......
అంతలోనే సాహితి ఆలోచనలు ఓ కేంద్ర బిందువు దగ్గర ఆగిపోతున్నాయి.
కరక్టుగా ఐదు సంవత్సరాల క్రితం తన భర్త తనకు దూరంగా వెళ్ళిపోతూ ఇద్దరు వ్యక్తులు ద్వారా పంపించిన ఐదు లక్షలు....ఆ మరుసటి రోజు తన భర్త ప్రమాదవశాత్తు ఓ ఎత్తయిన మేడమీంచి పడి చనిపోవటం.....ఆ చావు అప్పటికే తన కడుపులో పెరుతున్న ప్రాణి ఉలికిపాటుకు గురిచేసిన సంఘటన....ఆ ఐదు లక్షలతో తను అంచెలంచెలుగా పై కొచ్చిన సుదీర్ఘ సంక్లిష్ట ప్రయాణం. ఓ ఆడదేమిటి ఇంతటి గొప్ప ఉద్దేశాలు కలిగి వుండటం ఏమిటి? పారిశ్రామిక ప్రపంచంలో ఇంతటి పేరు ప్రఖ్యాతులు గడించటమేమిటి? అనే ఈర్ష్యతోకొందరు కల్గించిన అడ్డంకులు.....వాటిని తను అధిగమించిన తీరు.......
ఇవన్నీ అలా వుంచితే ఈ ఐదు సంవత్సరాల కాలంలో తనకు ఏనాడు తన బతుకు భద్రతపట్ల భయంకాని, మగవాడి గురించిన ఆలోచనగాని రాలేదు.
కాని ఈ నాడు............?
మనసంతా గజిబిజిగా అయిపోయి ఆలోచనలు, అనుభవాలు సంఘర్షించుకుంటున్నాయి.
ఓసారి అశాంతిగా తల విదిలించి ఫోన్ దగ్గరకు నడిచి మరోసారి ప్రయత్నించింది. లాభం లేకపోయింది.
ఆ చికాకుతోటే వచ్చికూతురుపక్కనే ఒరిగిపోయికళ్ళుమూసుకునే ప్రయత్నం చేసింది. అదీ లాభంలేక పోయింది. తిరిగి ఆలోచనలు__ ఆలోచనలు.....
రేపు ఉదయమే హాస్పిటల్ కి వెళ్ళి అతనేవరయింది? ఏం చేస్తున్నది తెలుసుకోవాలి.
ఈసారి ఉలిక్కిపడింది- అతని వివరాలు తెలియలేదనే అసంతృప్తిలోంచి వచ్చిన అశాంతా....ఆలోచనలా....?
ఇంతకి తనను చంపబోయిన ఆ ఇద్దరు వ్యక్తులెవరు?
దిగ్గున లేచి కూర్చుంది. ఓ అరనిముషం తర్వాత కొవ్వొత్తి వెలుగులోనే బాల్కానీ గోడదగ్గరకు నడిచి కిటికి రెక్కముందు ఆగింది.
విశ్వమంతా గాఢనుషుప్తిలో ఉంది.
ఆకాశమంతా అంధకారమయం.
ఆ ఏకాంతం గాఢంధకారంలో......నీరవ నిశ్శబ్దంలో తనహృదిలో చిత్రమైన అలజడి.....అది ఏ స్పందనకు ప్రతిస్పందనో తెలియని అయోమయస్థితి.
ఆమె గజిబిజి ఆలోచనలు ఓ నిర్దుష్టరూపం కోసం తడుముకుంటున్నాయి.
ఒంటరితనపు నిశ్శబ్ద జీవితపు స్రవంతిలో ఓ మూల చిన్న అసంతృప్తి.....కొండలా పెరుక్కుంటూ వస్తూన్న శూన్యత.....పరిపూర్ణతలేని జీవితం.
