వయసుకు మించి పెరిగిన అవయవాలను చూస్తూనే ఆమె గొప్పింటికి చెందిన దానిలా అనిపిస్తుంది. ముఖ్యంగా ఆమె ఎద పల్చటి బంగారు రేకులో పూలచెండ్లను మడిచినట్లుంటుంది. రకరకాల పూలచెట్లుండే నర్సరీలోకి అడుగుపెడుతూనే ఎలా ఉక్కిరిబిక్కిరి అవుతామో ఆమెని చూసినప్పుడు కూడా అలాంటి అనుభూతే కలుగుతుంది.
"ఆ!"
"భోజనాలు చేసేప్పుడు సాధారణంగా రకరకాల వంటలు గురించి మాట్లాడుకుంటాం. అలా నువ్వు ఆ మూడ్ లో వున్నావు కనుక అవే వినాలని అడుగుతున్నట్లుంది" అంది మాలిని.
"అవుననుకో"
"అయితే చెబుతాను శ్రద్దగా విను" అంటూ చెప్పుకుపోతోంది మాలిని.
"మాది ఆత్మకూరు దగ్గరుండే పల్లెటూరు. డిగ్రీ వరకు చదువుకున్నాను. నేను ఒక్కదాన్నే సమాథానం కనుక ఇరవై నుంచి నాకు పెళ్ళి చేయాలనీ సంబంధాలు మొదలుపెట్టారు..
కానీ అమ్మా వాళ్ళకు ఎవరూ నచ్చేవాళ్ళు కారు. ఉద్యోగం వున్న వాడికి తోబుట్టువులు ఎక్కువనో, ఎవరూ లేనివాడికి ఉద్యోగం లేదనో.....ఇలా వచ్చిన ప్రతి సంబంధాన్ని ఎగరగొట్టేవాళ్ళు. ఈ పెళ్ళిచూపుల గోల లేకుంటే ఎలా వుండేదానన్నో తెలియదుగానీ, పెళ్ళి ఆలోచన మొదలవడంతో తోడు కోసం మనసు యాగీ చేయడం ప్రారంభించింది. వయసు ఒక్కసారిగా చిన్నపిల్లలా అయిపోయి ఏదేదో కావాలని అల్లరిచేయడం ప్రారంభించింది అనవసరంగానే అయినా ఒక్కొక్కసారి ఫక్కున నవ్వేదాన్ని. మరోసారి కారణం లేకుండానే దిగులుగా అయిపోయేదాన్ని. ప్రపంచాన్నంతా మడిచి గుండెల్లో కూరుకున్నట్లు చలాకీగా వుండేదాన్ని అంతలోనే ఏదో అయిపోయినట్లు నిశ్శబ్దంతో గడ్డ కట్టుకుపోయేదాన్ని. ఈ మార్పుల్ని అదృష్టం కొద్దీ అమ్మా నాన్న గుర్తించలేదు.
ఇలా మనసు ఊసరవెల్లిలా అయిపోయిన సమయంలో అనంత్ మా ఇంటికొచ్చాడు.
అతను మాకు దూరపు బంధువు. నెల్లూరు ఆర్టీసీ డిపోలో మంచి ఉద్యోగం. కోవూరు దగ్గర పల్లెటూరు. అతనికి సొంతంగా ఓ ట్రాక్టర్ వుండేది. మా ఊర్లో పొలం దున్నడానికని ట్రాక్టర్ పంపించాడు. డ్రయివర్ దగ్గర లెక్కలు చూసుకుని, డబ్బు తీసుకుపోవడానికి అతను మా ఊరొచ్చాడు. మేము తప్ప మరొక బంధువు లేకపోవడంతో ఇంటికొచ్చాడు.
నేనున్న పరిస్థితి వల్ల కాబోలు అతనిమీద ఇష్టం కలిగింది. పైపై మెరుగులు చూసి ఇష్టపడడం ప్రేమ కాదని, అది కేవలం ఆకర్షణ అని, ప్రేమకు కావలసింది ఒకరినొకరు అర్ధం చేసుకోవడమనీ అంటుంటారు కానీ, ఇదంతా ఒట్టి దొంగ మాటలనుకుంటాను. ఒకరికొకరు పరిచయం కావడం, ఒకర్ని ఒకరు అర్ధం చేసుకోవడం, ఆ తరువాత ప్రేమించడం ఇదంతా ఎంత నాన్సెన్స్ గా వుంటుందో ఆలోచించు.
కొంతకాలం పరిచయంతో అర్ధం చేసుకోవడం అనేదే సులభమైతే భార్యాభర్తలు ఎలా వుండాలి? కాని అలా వుంటున్నారా? ఒకరికొకరు అర్ధం కావడమన్నది ఎప్పుడూ జరగదు. మహా అయితే రాజీపడతాం అంతే. ఎవరి టెంపరమెంట్ వాళ్ళదే. ఎవరి అభిరుచులు వాళ్ళవే. కుటుంబం సాఫీగా సాగడానికి ఎదుటి వ్యక్తి అభిరుచుల్ని గౌరవించినట్లు నటిస్తాం.
అతన్ని ఇష్టపడడానికి కారణం నేనున్న పరిస్థితి. ఎదుటి వ్యక్తి గొప్పతనం కన్నా నా అవసరం నన్ను పురికొల్పింది. అందుకే మొదటిరోజు అతనిని తప్పించుకు తిరిగినదాన్ని, రెండో రోజుకల్లా అతనికి ఎదురు పడడానికి తెగ ఉత్సాహం పడిపోయాను.
అప్పుడు మా అమ్మకి కంటి ఆపరేషన్ జరగడం నాకు కలిసొచ్చింది. నేనే వడ్డించేదాన్ని మామధ్య మాటలు కలిశాయి.
నిఒజంగా పని వుండిందో, లేక నాకోసమే ఆగిపోయాడో తెలియదుగానీ పదిరోజుల పాటు అతను వుండిపోయాడు. చూపుల్లోకి మా అభిమానాన్ని అనువదించుకున్నాము తప్ప డైరెక్టుగా చెప్పుకోలేదు.
అతను వచ్చినప్పట్నుంచీ మా అమ్మకు ఆలోచన కలిగినట్లుంది. అతను వెళ్ళగానే నాన్నతో అమ్మ విషయం కదిపింది.
"కుర్రాడు బావున్నాడు ఏం.ఏ చదివాడు. ఉద్యోగం వుంది. ఒక్కడే కొడుకు. ఆస్తి బాగానే వుంది. వెళ్లి విషయం తెలుసుకురండి"
నాన్న బయలుదేరి వెళ్ళి వచ్చాడు. ఆయన వాకిట్లోకి రాగానే అమ్మ హగావుడిగా ఎదురెళ్ళి "పండా? కాయా?" అని అడిగింది. సారాంశం అంతా వివరంగా వినే వీలులేనంత టెన్షన్ లో వుంది.
"పండే"
నేను కూడా తుళ్ళిపడ్డాను.
మరోసారి అతను కొత్తగా పెళ్ళిచూపులకని వచ్చాడు. రాగానే బాత్రూమ్ కి తీసుకెళ్ళి కాళ్ళు కడుక్కోడానికి చెంబుతో నీళ్ళిచ్చాను.
చెంబు అందుకుంటూ "నిన్ను చూడాలనే వచ్చాను" అన్నాడు మెల్లగా.
నేను సిగ్గు రెక్కల్ని కట్టుకుని తూనీగే అయిపోయాను. కిచెన్ లోకి పరిగెత్తాను.
భోజనాల సమయానికి కొంత సర్దుకున్నాను. అప్పటికి మా అమ్మ కళ్ళకున్న కట్లు విప్పకపోవడంతో వడ్డనంతా నేనే చేశాను. సాయంకాలం అతను వెళ్ళిపోయాడు.
అన్నీ కుదిరి పెళ్ళి నిశ్చయమైంది.
ఆత్మకూరులోని ఓ సత్రంలో పెళ్ళి జరిగిపోయింది. మధ్యాహ్నం మూడుగంటలకి బయల్దేరి ఊరికొచ్చాం. మా వెంట ఓ పదిమంది దాకా బంధువులొచ్చారు. నాలుగు గంటల నుంచే వంటలు ప్రారంభమయ్యాయి. ముందు గదిలో అనంత్. చివరి గదిలో నేనూ వుండిపోయాం.
"ఈరోజు సూర్యాస్తమయం జరగకుండా, రాత్రి రాకుండా వుంటే ఏమవుతుంది? ఫస్ట్ నైట్ ఉంటుందా? వుండదా?" లాంటి చిలిపి చిలిపి ఆలోచనల్లోనే సాయంకాలం కరిగిపోయింది.
రోజూ రాత్రి వస్తుంది కానీ ఆ రాత్రి మాత్రం చాలా డిఫరెంట్ గా వుండడం గుర్తించాను. ఆ రాత్రికి ఏదో సుగంధం వున్నట్టే వుంది. ఆ చీకట్లకు ఏదో తెలియని మెరుపు కవచంలా వున్నట్లే తోచింది. ఆ రాత్రి ముసుగు దొంగలా కాకుండా, మాకు అలసట వచ్చినప్పుడు జోల పాడడానికి వచ్చిన గంధర్వుడిలానే అనిపించింది. ఆ రాత్రి ఆకాశం తారుడబ్బాలా కాకుండా చమ్కీలు పొదిగిన నీలం రాయిలా కనిపించినట్టే వుంది. గాలి కూడా కొత్తగా వీస్తోంది.
తొమ్మిది గంటల ప్రాంతాన మమ్మల్నిద్దరినీ కూర్చోబెట్టి నలుగు పెట్టారు. ముసలి ముత్తయిదువలు నా కంఠానికి గంధం రాస్తున్నప్పుడు అతనే స్వయంగా చక్కిలిగింతలు పెట్టినట్లనిపించిందంటే నేనెలాంటి స్థితిలో వున్నానో ఊహించు.
చివరన ఓ ముసలామె పాటెత్తుకుంది. ఇలాంటి సమయాల్లో ఎవరో ఒకరు పాట పాడడం ఆచారం. ఎవరైనా ఓ పాట పాడండి అని మా అమ్మ అనగానే ఆమె పాటందుకుంది. గొంతులో నుంచి ముళ్ళకంపను లాగినట్లు కర్ణకఠోరంగా వుంది పాట. ఆరోజు ఏమైనా బాగా లేదనిపించిందంటే అదే. అయితే ఆమె గొంతు అలా వుందో, లోపలికి వెళ్ళాలని నాకు తొందరగా వుండడం వల్ల అలా అనిపించిందో తెలియదు. ఎలాగైతేనేం మరో అయిదునిముషాలకి పాట ముగిసింది. నన్ను వంట గదిలోకి తీసుకెళ్ళి పాలగ్లాసు అందించారు.
