Previous Page Next Page 
వసుంధర కథలు-14 పేజి 27


    అప్పుడామెకు రాం కుమార్ గుర్తుకు వచ్చాడు.
    అతడి గతి ఏమయిందో ? తనకు తెలిసిన తప్పును స్త్రీ అంత సులభంగా క్షమించలేదు. ఆ యువతి స్థానంలో జ్యోతి ...ప్రసాద్ స్థానంలో రాం కుమార్ ....
    అయితే రాం కుమార్ కు జ్యోతి తనపై ఎందుకు తిరగబడుతోందో తెలుసు. అయితే మాత్రం అతడికి మాట్లాడే అవకాశం రావాలి గదా!
    జ్యోతి రియాక్షన్ మీద గీత కాసక్తి వుంది. అనుకున్న ఫలితం సాధిస్తే మరో వంద రూపాయలిస్తా నన్నాడు రాం కుమార్ ఆమెతో.
    ఆ రోజు కింక చేయగలిగిందేమీ లేదు. మర్నాడామే రాం కుమార్ ఆఫీసుకు ఫోన్ చేసింది.
    "హలో -- గీతా! థాంక్యూ వెరీ మచ్ ఫర్ దీ కాల్ . సాయంత్రం మనం కలుసుకుందాం --ఎప్పటి లాగే?" అన్నాడు రాం కుమార్ .
    ఎప్పటి లాగే అంటే అశోకా హోటల్లో అతడు తన కోసం రూమ్ బుక్ చేసి వుంచుతాడు.
    సాయంత్రం ఆమె హోటల్లోని తన రూముకు వెళ్ళి రాం కుమార్ కోసం ఎదురు చూస్తూ కూర్చుంది.
    అన్నకంటే అరగంట ఆలస్యంగా వచ్చి సారీ చెప్పుకున్నాడు రాం కుమార్. అతడి ముఖం సంతోషంతో వెలిగి పోతోంది.
    "నాకు బహుమతి గ్యారంటీ" అనుకుందామే. అయితే సాధించబడిన ఫలితమేమిటో ఆమెకు తెలియదు.
    రాం కుమార్ , ఆమెకు ఎదురుగా కూర్చుని "మిస్ గీతా నువ్వు నాకు మహోపకారం చేశావు. ప్రేమను అలక్ష్యం చేసుకోబోయిన నా కళ్ళు తెరుచుకున్నాయి. అందుకు కారణం నువ్వు" అన్నాడు.
    "ఏం జరిగిందో చెప్పు" అంది గీత.
    "జ్యోతి -- మనిషి ఎంత అందమైనదో మనసు కూడా అంత అందమైనది. ధన లోభంతో ఆమెను పోగొట్టు కో కుండా నువ్వు కాపాడేవు ."
    "ఏం జరిగింది ?"
    "జ్యోతి నిన్న నన్ను కలుసుకుంది...." అని ఆగాడు రాం కుమార్.
    ఇంతకాలం జ్యోతి అతడికి దూరంగా వుండడమే కాక పెళ్ళి గురించి కూడా తేల్చి చెప్పడం లేదు . మనం ఒకరి నొకరు బాగా అర్ధం చేసుకోవాలి - అంటుండేదామె. నిన్నటి దినం ఆమె - రాం కుమార్ ని వివాహం చేసుకుందుకు నిర్ణయించు కున్నట్లు తేల్చి చెప్పింది.
    "చూడామే ఎంత గొప్పదో , నాగురించి చెడుగా వినగానే రవంత కూడా చలించలేదు. ఆ ప్రసక్తి నా వద్ద తీసుకుని రాలేదు. నా అనుమానం ఆమె నా ట్రిక్కు తెలుసుకుందని !" అన్నాడు రాం కుమార్.
    "అసలు నువ్వమెను పోగొట్టుకునే ప్రమాద మెందుకుంది?"
    రాం కుమార్ నవ్వి తన ప్రేమకధను చెప్పాడు.
    ప్రేమ అనే సెంటి మెంటు పెళ్ళికి దారి తీస్తుంది. పెళ్ళి అంటే యిద్దరపరిచితులు జీవితకాలం కలిసి జీవించాలి. అందుకే ప్రేమలో ఎప్పుడూ అల్టర్నేటివ్ వుండాలి. ఒకరిని ప్రేమించి దెబ్బతింటే దిగాలు పడిపోకుండా అల్టర్నేటివ్ గా మరో ప్రియురాలు ఉండాలి. ఇద్దరిలో ఒకరి నేన్నుకోవాలి.
    రాం కుమార్ జ్యోతిని ముందు ప్రేమించాడు. ఆమెకు అల్టర్నేటివ్ గా ఆమె స్నేహితురాలు చందనను కూడా ప్రేమించాడు. జ్యోతికి అందం మాత్రముంది. చందనకు అందంతో పాటు ఆస్తి కూడా వుంది. చందనవి విశాల భావాలని అతడి అభిప్రాయం కానీ నిన్నటి దినం ఆమె అతణ్ణి లేనిపోని అనుమానాలతో వేధించింది. లాయర్లా ప్రశ్నలు వేసి అతడి శీలం మంచిది కాదనీ, కాల్ గర్ల్స్ తో తిరుగుతాడనీ ఋజువు చేయబోయింది.
    రాం కుమార్ తన జేబులోంచి ఓ పర్స్ తీశాడు. అందులోంచి ఓ ఫోటో తీసి క్రింద పారేసి -- "ఇక మీదట నా పర్స్ లో రెండు ఫోటోలకు స్థానం లేదు. జ్యోతి ఫోటో మాత్రమే ఇందులో వుంటుంది"... అన్నాడు.
    గీత అప్రయత్నంగా క్రింద పడిన ఫోటో చూసింది. దాన్నామే చేతులోకి తీసుకుని -- "నువ్వు పారవేసిన ఫోటో ఎవరిది?" అంది.
    "చందనది ?" అన్నాడు రాం కుమార్.
    'చందనదా?" అందామె ఆశ్చర్యంగా. ఆమెనే తను జ్యోతిగా భావించి పార్క్ లో రాం కుమార్ కు వ్యతిరేకంగా నూరిపోసింది. తన వల్ల అలాంటి పొరపాటేలా జరిగింది.
    జ్యోతి యింట్లోంచి బయటకు వచ్చిందామే. ఆ కారణంగా తనామెను జ్యోతిగా భావించింది. బహుశా చందన జ్యోతి యింటికి వెళ్ళి వుంటుంది.
    రాం కుమార్ జ్యోతిని పరీక్షించాలనుకున్నాడు. తను చందనను పరీక్షించింది. చందన పరీక్షలో ఓడిపోయింది .
    "జ్యోతి ఫోటో చూడనీ!" అంది గీత.
    రాం కుమార్ ఆమెకు జ్యోతి ఫోటో చూపించాడు.
    తెలల్బోయింది గీత. జ్యోతి అంటే ప్రసాద్ ప్రియురాలు. చిలిపితనానికి తను ఆమెలో ప్రసాద్ కు వ్యతిరేకంగా భావాలు ప్రవేశపెట్టింది.
    అసలేం జరిగి వుంటుంది?
    చందన జ్యోతి ఇంటికి వెళ్ళింది. ఏదో ప్రోగ్రాం వేసి వుంటుంది. అయితే జ్యోతి ప్రసాద్ ను కలుసుకోవలసి వుంది. అనారోగ్యం వంక పెట్టి ఆమె చందనను పంపివేసి వుంటుంది. అందుకే గుమ్మం దాకా కూడా రాలేదు. తర్వాత ఆమె పార్క్ కు వచ్చింది తన కబుర్లు వింది.
    రాం కుమార్ లాగే జ్యోతి కూడా ప్రసాద్ ను అల్తర్నేటివ్ ప్రేమికుడిగా వుంచుకుంది. ప్రసాద్ గురించి తెలియగానే రాం కుమార్ పై ఆమెకు గౌరవం పెరిగింది.
    డబ్బిచ్చి కాల్ గర్స్ ని గదికి తెచ్చుకుని ఆమెను తాకనైనా తాకని రాం కుమార్ -- తండ్రి మాటలకు భయపడి ఇతర స్త్రీలను పెళ్ళి చూపులు చూడ్డానికి వెళ్ళే ప్రసాద్ కంటే -- జ్యోతికి తగిన వరుడు.
    గీత ఓ జంటను విడదీసింది. అందుకామెకు విచారంగా లేదు.
    రాం కుమార్ జ్యోతి పరీక్షలో నెగ్గించుకుంటున్నాడు.
    జ్యోతి తన అల్టర్నేటివ్ ప్రియుడు మోసగాడను కుంటోంది.
    ఏమైతేనేం -- ఆ జంట ఒకరికొకరు దగ్గరయ్యారు. అదీ తన కారణంగా!
    గీత జరిగిందేమిటో రాం కుమార్ కి చెప్పదల్చుకోలేదు.

                                   *** 


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS