"అయితే నేనేం చేయాలి ?"
"పెళ్ళి చూపుల విషయం మాత్రం ఆమెకు చెప్పకండి. మళ్ళీ ఆమె నా ముఖం చూడదు. సాయంత్రం ఆరింటికి సంగీతా పార్కులో నేనామె కోసం ఎదురు చూస్తుంటానని చెప్పండి. మీ మేలు ఈ జన్మకు మరువను."
"ష్యూర్ ...." అంది గీత.
"మరి సెలవు " అన్నాడు ప్రసాద్.
"బెస్టాఫ్ లక్ ' అంటూ చేయి సాచింది గీత. అతడు తటపటాయిస్తూనే ఆమె చేతి నందుకున్నాడు. అతడు వణుకుతున్నట్లు గ్రహించి తనలో తనే నవ్వుకుంది గీత.
4
ప్రసాద్ వెళ్ళిపోయాడు . గీత ఆలోచనలో పడింది.
ప్రసాద్ ఒక అమ్మాయిని ప్రేమించాడు. పెళ్ళికి ముందే ఆమె తన నపార్ధం చేసుకుంటుందేమోనని భయపడుతున్నాడు. చిన్న విషయాల్ని, ప్రమాదం లేని విషయాన్ని ప్రియురాలి నుంచి దాచాలను కుంటున్నాడు.
రాం కుమార్ కూడా ఓ అమ్మాయిని ప్రేమించాడు. పెళ్ళయ్యాక ఆమె తన నపార్ధం చేసుకుంటుందేమోనని పెళ్ళికి ముందే కల్పిత గాధల నామే తలలో కెక్కించి తమాషా చూడాలను కుంటున్నాడు.
ఇద్దరూ భిన్న దృవాలు.
అప్పుడే గీత మనసులో ఓ చిలిపి ఆలోచన ప్రవేశించింది.
ప్రసాద్ పిరికివాడు భయస్థుడు. ప్రియురాలు తన నపార్ధం చేసుకుంటుందేమోనని కంగారు పడుతున్నాడు. అటువంటప్పుడు ప్రియురాలు నిజంగానే అపార్ధం చేసుకుని నిలదీస్తే ఏం చేస్తాడు ?
కాసేపట్లో ప్రసాద్ ప్రియురాలు వస్తుంది. ఆమెతో తను ప్రసాద్ పట్ల అనుమాన బీజాలు నాటాలి. ఆ తర్వాత సాయంత్రం సంగీతా పార్కుకు వెళ్ళి అక్కడ జరిగే తమాషా చూసి ఆనందించాలి.
జ్యోతి లో తను అపార్ధాన్ని సృష్టించింది. అందువల్ల తనకు ప్రతిఫలం లభిస్తుంది. రాం కుమార్ నుంచి. ఇప్పుడు ప్రసాద్ ప్రియురాలితో తానపార్ధాన్ని సృష్టిస్తుంది. వినోదమే అందుకు తగిన ప్రతిఫలం .
గీత అక్కడే కూర్చుని ఎదురు చూస్తోంది. మధ్య మధ్య టైము చూసుకుంటోంది. కాసేపటికి అక్కడికొక యువతి వచ్చింది.
ఈ యువతిది అద్భుత సౌందర్యం.
పసుపు పచ్చని పోలీఎస్టర్ చీర ఆమె చాయతో కలిసి పోయింది.
"ప్రసాద్ ఛాయిస్ అద్భుతం ....' అనుకుంది గీత.
ఆ యువతి అక్కడే ఒక్క క్షణం అసహనంగా తిరిగింది.
"నీదీ నాలాంటి కేసే అనుకుంటాను ...." అంది గీత.
అంతవరకూ ఆ యువతి ఆమెను పలకరించలేదు. అప్పుడామె గీత వంక ప్రశ్నార్ధకంగా చూసింది.
"నేను నా ప్రియుడి కోసం ఎదురు చూస్తున్నాను. ఎటొచ్చీ అతడొచ్చే అవకాశం లేదు. నీకేమైనా చాన్సుందేమో తెలియదు ...." అంది గీత.
ఈ రకమైన సంభాషణ ఆ యువతికి నచ్చలేదు. అయిష్టంగా ఓ చూపు చూసి అక్కడే పచార్లు చేయసాగింది.
'అలా తిరిగితే కాలక్షేపం కాదు. కూర్చో -- నా కధ చెబుతాను " అంది గీత చనువుగా.
ఆమె ఏమనుకుందో ఏమో గీత కెదురుగా కూర్చుంది.
"నిజం చెబుతాను. నన్నీసడించకు. నేను నీలాంటి దాన్ని కాదు. నువ్వు నాలాంటి దానివి కాదని చూస్తూనే గ్రహించాను...."
ఆమె మాట్లాడలేదు.
"నేను చెడిన మాట నిజం. అంతమాత్రాన నాతొ మాట్లాడితేనే నువ్వూ చెడిపోతావా?" అంది గీత బాధగా.
ఆమె తడబడి "నా ఉద్దేశ్య మది కాదు. నా ఆలోచనల్లో నేనున్నాను. నీ గురించి నాకేమీ తెలియదు" అంది.
"నా గురించి వినడం నీకు ప్రయోజనం ...." అంది గీత. ఆ యువతి అనుమతి కోసం ఎదురు చూడకుండా ఆమె చెప్పడం ప్రారంభించింది.
'అతడు నన్ను ప్రేమించానన్నాడు. నిజమేనను కున్నాను. అతడు నన్ను పెళ్ళి చేసుకుంటానన్నాడు. లొంగిపోయాను. తర్వాత నుంచి మొహం చాటేయడం మొదలు పెట్టాడు. అతడి మోసం అర్ధమయింది కానీ నేనేం చేయగలను? ఆ తర్వాత కొన్నాళ్ళకతడు తన తప్పు తెలుసుకున్నానని మళ్ళీ నా దగ్గరకు వచ్చాడు. నిజమేననుకున్నాను. అతడి దురుద్దేశం నా కర్ధం కాలేదు.
ఇంట్లో తలిదండ్రులు పెళ్ళి కొప్పుకోరని చెప్పి - నన్నేక్కడికో తీసుకుని వెళ్ళాడు. నన్ను డబ్బుకో దుర్మార్గుడి కమ్మేశాడని ఆలస్యంగా నాకు తెలిసింది. అక్కడ నన్ను బలవంతంగా వ్యభిచారం లో ప్రవేశ పెట్టాలని కొన్ని ప్రయత్నాలు జరిగాయి. అక్కణ్ణింఛి నన్నో యువకుడు రక్షించాడు - ఒక షరతు మీద. నేనిప్పుడు కాల్ గర్ గా ఉంటూ నా సంపాదనలో కొంత ఆ యువకుడి కిచ్చు కుంటున్నాను. వ్యభిచారం కంటే బాగా మెరుగ్గా వుందది.....
అప్పుడా యువతి గీత వంక జుగుప్సాకరంగా చూసింది. ఆమె తన నసహ్యించుకున్నట్లు గీత కర్ధమయింది.
"అలా చూడకు. నా కధ పూర్తిగా విను. ఓ గంట క్రితం తొలిసారి నన్నుమోసహించిన దుర్మార్గుడు కనిపించాడు. నన్ను చూసి ముఖం రాసేయబోయాడు. నేనే పిలిచి పలకరించి ఇక్కడకు తీసుకుని వచ్చాను. నా కధ చెప్పుకున్నాను. వాడికి నా మీద యింకా ఆశ వుంది. ఎలాగూ చేడిపోయాను కాబట్టి తప్పు లేదనుకున్నాడు. అబద్ద'మెందుకూ-కన్నె హృదయాన్ని తొలిసారిగా నమ్మి అర్పించుకున్నందువల్ల నా మనసులో వాడికో స్థానముంది.
వాడు మళ్ళీ మంచి మాటలు చెప్పి నాకో దారి చూపిస్తా నన్నాడు. మోసమని తెలిసిపోయినా నేను లొంగిపోయాను. ఉన్నట్లండి ఏమయిందో టైము చూసుకుని "నువ్వు వెళ్ళిపో - మళ్ళీ ఎప్పుడయినా కలుసుకుందాం" అన్నాడు. వాడలాగంటె నా కనుమానం వచ్చింది. నేను వెళ్ళనన్నాను. బ్రతిమాలాడు , వెళ్ళనన్నాను. "నాకు అర్జంటు పనుంది వెళ్ళిపోతున్నాను. నా మీద నమ్మకముంటే సాయంత్రం ఆరు గంటలకు సంగీతా పార్కుకి రా' అన్నాడు. "నీతో ఇంకా చాలా చెప్పుకోవాలి. అర్జంటు పని చూసుకుని నువ్వే యిక్కడకురా - నువ్వొచ్చే దాకా అన్నపానాలు చూసుకుని యిక్కడే ఎదురు చూస్తుంటాను' అని వాడికి చెప్పాను.
వాడు రానని ఖచ్చితంగా చెప్పేశాడు. నేనిక్కండ్నించి కదలనని ఖచ్చితంగా చెప్పేశాను. సంగీతా పార్కు గురించి మరోసారి హెచ్చరించి వెళ్ళిపోయాడు. అయినా వస్తాడేమోననే ఆశతో ఇక్కడ కూర్చున్నాను. కానీ ప్రసాద్ నన్నెన్ని సార్లు మోసగించలేదు కనుక ....ఈసారి కాదను కునేందుకు " అంది గీత.
"నీ ప్రియుడి పేరేమిటన్నావ్ ?" అందా యువతి ఉలిక్కిపడి.
"ప్రసాద్ -- ఏం ?" అంది గీత అర్ధం కానట్లు.
ఆ యువతి ముఖంలో రకరకాల భావాలు కనిపించాయి. గీత అని చూసి మనసులోనే నవ్వుకుంది.
"ఏమీ లేదు " అందా యువతి అన్యమనస్కంగా.
"చూడు - నీ ప్రియుడు కూడా రాలేదు. మగవాళ్ళను గుడ్డిగా నమ్మకు పెళ్ళయ్యేవరకూ ఎలాంటి నమ్మకస్తుడి నైనా దూరంగానే వుంచు. అనుభవం మీద చెబుతున్నాను" అంది గీత సలహా యిస్తున్నట్లు.
ఆమె అవన్నీ విందో లేదో తెలియదు. కానీ -- "సాయంత్రం నువ్వు సంగీతా పార్కుకి వెడతావా?" అనడిగింది గీతను.
"వెళ్ళను. ప్రసాద్ వచ్చేవరకూ నేనిక్కడే ఎదురు చూస్తాను" అంది గీత.
"మంచి కంపెనీ యిచ్చావు థాంక్స్ !" అంటూ లేచిందా యువతి.
గీత నవ్వుతూ-- "అప్పుడే వెళ్ళి పోతున్నావెం -- కూర్చో !" అంది.
"లేదు - నేను వెళ్ళాలి !" అందామె.
గీత మళ్ళీ తనలో తనే నవ్వుకుంది.
5
సాయంత్రం ఆరింటికి సంగీత పార్కుకి వెళ్ళి రహస్యంగా గమనించింది గీత.
ఆ యువతి ప్రసాద్ ను నోరెత్తనివ్వలేదు. అతణ్ణి నానా మాటలూ అంది. దుష్టుడు, దుర్మార్గుడు , నీచుడు లాంటి పదాలన్నీ వాడింది. తన అదృష్టాన్ని తనే అభినందించుకుంది. ఏ జన్మలోనో తను చేసిన పుణ్యం ఈ జన్మలో సమయానికి తన్ను ప్రసాద్ వంటి భ్రష్టుడి పాలబడకుండా రక్షించిందంది.
జరుగుతున్నదంతా గీత చూసింది. మొదట్లో ఆమెకు కాసేపు వినోదంగానే అనిపించింది. తర్వాత ప్రసాద్ ను చూస్తె జాలి వేసింది. అతడి కసలు మాట్లాడే అవకాశమే రావడం లేదు. అలాంటి అమాయకుడి మీద తానెన్ని నిందలు వేసింది.
ఆ యువతి వెళ్ళిపోయాక ప్రసాద్ దిగులుగా కూర్చుండి పోయాడు.
జరిగిందేమిటో అతడికి తెలియదు. తన ప్రియురాలి అలకకు కారణమతడికి తెలియదు. బహుశా తను పెళ్ళి చూపులకు వెళ్ళిన విషయామెకు తెలిసి వుంటుందని అతడనుకుంటూ వుండవచ్చు.
ప్రసాద్ ని ఓదారుద్దామా అనుకుంది గీత. ఆ ప్రేమికులను తిరిగి కలపడానికి తను సాయం చేయాలని కూడా ఆమె అనుకుంది. కానీ ఇలాంటి సమస్య నుంచి తనకు తానై సంబాళించుకోలేనివాడు ప్రేమకు అనర్హుడని కూడా ఆమె భావించింది.
కొద్ది రోజులు చూసి అప్పుడు తను రంగ ప్రవేశం చేయాలను కుందామే. ఎందుకంటె ఆమెలో యిప్పుడు తప్పు చేసిన అనుభూతి కూడా వుంది. మనసారా ప్రేమించుకున్న ఓ జంట కేవలం తన కారణంగా విడిపోతోంది....
