Previous Page Next Page 
వసుంధర కధలు -11 పేజి 27


    జేబులోకి చేయి పోనిచ్చి ఒక చిన్న భరిణను బైటకు తీశాడు రంగనాథ్. నెమ్మదిగా దాన్ని లాకర్లోకి తోసేముందు చేత్తో లోపల తడిమాడు. ఏమీ తగల్లేదు. లాకరు కాళీగా వుంది. రంగనాథ్ ముఖంలో కొద్దిగా నిరుత్సాహం కనిపించింది. అతను భరిణను లాకర్లో వదిలి సుబ్బారావు వంక తీవ్రంగా చూసి-"మీ కింకో లాకర్ వుందిగదా-నా రెండో భరిణను అందులో వుంచుతాను" అన్నాడు.
    సుబ్బారావు తాపీగా - "లాకర్లో చాలా కాళీవుంది" అన్నాడు.
    "సుబ్బారావుగారూ నిర్ణయాలు నావే కానీ మీవికాదు. చెప్పినట్లు చేయడమే మీ కర్తవ్యం. రెండున్నార కల్లా నేను వెళ్ళి మీ యిల్లు చేరకపోతే-మీరు చాలా దుర్వార్తలు వినాల్సి వుంటుంది - కాబట్టి క్విక్..."
    సుబ్బారావు ఆలస్యం చేయకుండా రెండో లాకర్ కూడా తెరిచాడు. ఆయన ముఖంలో కొద్దిగా దిగులు కనబడింది.
    "నంబర్ ఇరవైఏడుకదా-అది నా లక్కీ నెంబర్" అన్నాడు రంగనాథ్. అతను జేబులోంచి ఇంకో చిన్న భరిణనుతీసి- ఆ లాకర్లో ఉంచుతూ చేత్తో తడిమాడు. వున్నట్లుండి అతడి ముఖం వెలిగింది. బయటకు చిన్న భరిణతీసి - పరీక్షగా చూడసాగాడు.
    "అది మీ భరిణ కాదు-" అన్నాడు సుబ్బారావు.
    "కాదని ఎలా అనగలరు? దీనిమీద రంగనాథ్ అని పేరుంది చూడండి-" అంటూ అతను జేబులోంచి భూతద్దంతీసి భరిణకు పైగా వుంచాడు. అంతవరకూ చుక్కలుగా కనబడుతున్నవి-రంగనాథ్ అన్న అక్షరాలుగా మారాయి.
    సుబ్బారావు తెల్లబోయాడు-"అవన్నీ మీకనవసరం. అది నా లాకర్లోది-"
    "ఆ వస్తువుమీద నా పేరుంది!"
    "అసలు మీ పేరు రంగనాథ్ అన్న గ్యారంటీ ఏమిటి?"
    "ఏమిటా? దీన్ని చూడకమునుపే నా పేరు రంగనాద్ అని మీకు చెప్పాను. దీనిమీద నా పేరుందన్న విషయంకూడా మీకు నేనే చెప్పిచూపించాను. ఇంకా చాలా వివరాలు చెబుదురుగానీ సమయం చాలదు. నేను త్వరగా వెళ్ళి మీ భార్యాబిడ్డల్ని రక్షించాలి. కాబట్టి ఆ రెండు లాకర్ల తాళాలు ఇలాగివ్వండి. వెంటనే వెళ్ళి పోతాను-..."
    "నేనివ్వను-" అన్నాడు సుబ్బారావు.
    "సుబ్బారావుగారూ-మీరు చిన్నపిల్లలుకారు. ఆ తాళాలు నాకు చాలా అవసరం. వెంటనే ఇచ్చేయండి" అన్నాడు రంగనాథ్.
    "ఎందుకీ తాళాలు?" అన్నాడు సుబ్బారావు.
    "రెండు ప్రయోజనాలు. ఒకటి నా వస్తువుల్ని నేను రక్షించుకోవడం. రెండు-ఇప్పుడు మీరు వెంటనే పోలీసుల్ని రప్పించి నన్ను పట్టించకుండా వుండడం. నన్ను పోలీసులు పట్టుకున్నారా- ఈ రెండు తాళాలూ పోలీసుల కిచ్చి మీ లాకర్లు చెక్ చేయమంటాను. వాటిలోకి దొంగవస్తువులెలా వచ్చాయో చెప్పమంటాను. ఏ పరిస్థితుల్లో నేను వాటిని మీ లాకర్లో పెట్టానో-మీరు చెప్పుకోలేరు. చెప్పుకున్నా యెవరూ నమ్మరు. ఎందుకంటే అందులో వుంచిన భరిణల మూతల్ని భూతద్దంలో చూస్తే-సుబ్బారావు అన్న పేరు కనబడుతుంది ఒకటి రెండ్రోజుల్లో లాకర్ల తాళాలు భద్రంగా మీకు అందుతాయి. ప్రస్తుతానికి నేను వెడుతున్నాను. అవతల మూడు ప్రాణాలు ప్రమాదంలో వున్నాయి...." అని సుబ్బారావు దగ్గర తాళాలు తీసుకుని - అక్కణ్ణించి కదిలాడు రంగనాథ్.
    సుబ్బారావు నిశ్చేష్టుడై చూస్తూండిపోయాడు.
    
                                        14

    "ఎవరో తలుపు తడుతున్నారు. వెళ్ళిచూడు-" అంది మహాలక్ష్మి. ఆమె మంచంమీద నిద్ర నటిస్తూంటే-చేతిలో పుస్తకంతో వెళ్ళి తలుపు తీసింది అప్సర. ఎదురుగా నిలబడ్డ పోలీస్ కాన్ స్టేబుల్ని చూసి ఉలిక్కిపడిందామె.
    "మన్నించాలి-" అన్నాడు కాన్ స్టేబుల్ - "ఇలా ఈ యింట్లోకి ఎవరైనా మనిషి వచ్చాడా?"
    "లేదు-" అంది అప్సర.
    "చేతిలో గ్లాక్సో డబ్బా వుంటుంది-" అన్నాడు కాన్ స్టేబుల్ ఆమె మాటలు పట్టించుకోకుండా. గ్లాక్సో డబ్బా మాట వింటూనే ఉలిక్కిపడి లేచింది మహాలక్ష్మి.
    "ఇలా రా నాయనా!" అన్నదామె. అతడు లోపలకు నడిచాడు.
    "ఏ మనిషీ ఈ ఇంట్లోకి రాలేదు కానీ- నా దగ్గర చాలా గ్లాక్సో డబ్బాలున్నాయి. కావాలంటే ఒక టిస్తాను. పట్టుకుపో-" అంది మహాలక్ష్మి.
    "అరకేజీదేనా?" అనడిగాడు కాన్ స్టేబుల్.
    "అవును-" అంటూ ఆమె అప్సరకు కనుసైగ చేసింది. అప్సర తమ సంచీలోంచి ఓ గ్లాక్సో డబ్బాతీసి పోలీసు కాన్ స్టేబుల్ కిచ్చింది. అతడు ధన్యవాదాలు చెప్పుకుని వెళ్ళిపోయాడు.
    "మన పనైపోయింది-" అంది మహాలక్ష్మి.
    "అయితే నేను సురేంద్రను లేపుతాను. నువ్వు అత్తయ్యగారిని లేపు-" అంది అప్సర. ఆమె వెళ్ళినాలుగైదుసార్లు కుదిపేసరికి సురేంద్ర కళ్ళు నులుముకుంటూ లేచి-ఎదురుగా అప్సరను చూసి-"మీరు పక్కనుండగానే ఇంత మొద్దునిద్రపోయావా?" అన్నాడు.
    "అమ్మ గురించీ నేనూ ఇంతసేపూ వుండిపోవలసి వచ్చింది. ఇప్పుడే అమ్మ లేచింది. వెళ్ళిపోదామంటోంది. వెళ్ళేముందు మీకు చెప్పిపోదామని..."
    "చాలా మంచి సమయం వృథా అయిపోయింది-" సురేంద్ర బాధగా అన్నాడు.
    "పోనీలెండి-ముందు రోజులన్నీ మనవేగదా-" అంది అప్సర అనునయంగా.
    సులోచన సురేంద్రకోసం కేకపెట్టింది. అతను అక్కన్నించి కదిలాడు. అతన్ని చూస్తూనే రిక్షా పిల్చుకుని రమ్మని చెప్పింది సులోచన. సురేంద్ర కదిలేలోగా టెలిఫోన్ మ్రోగింది. సురేంద్ర వెళ్ళి ఫోన్ తీశాడు.
    ఎవరైనా కొత్తవాళ్ళు మనింటికొచ్చారా-అంతా ఏంచేస్తున్నారు-అని ప్రశించాడు సుబ్బారావు. సురేంద్ర ఇంట్లోని పరిస్థితి వివరించి ఫోన్ పెట్టేసే సమయానికి ఎవరో వీధి తలుపు తట్టారు. అతనే వెళ్ళి తలుపుతీసి ఎదురుగా కనబడ్డ మనిషిని చూసి ఉలిక్కిపడి రెండడుగులు వెనక్కువేశాడు.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS