Previous Page Next Page 
వసుంధర కధలు-10 పేజి 27

 

    'అంతా చూపించేశాం కాబట్టి నువ్వు చూపించాలి" అన్నాడు వెంకట్రావు.
    "మీలో ఎవరి కయినా దేవుడి మీద నమ్మకముందా ?'
    "నాకుంది!' అంది స్వాతి వెంటనే మిగతా అందరూ కూడా వుందని అన్నారు.
    "నాకు మాత్రం లేదు. అయినా మీ అందరి కోసం దేవుడి ప్రసాదం తీసుకు వచ్చాను...." అంటూ డబ్బా మూత తెరిచాడు రాము. అందరూ ఆత్రుతగా చూశారు. అందులో కొబ్బరి కాయ ముక్కలున్నాయి.
    "నీలాంటి వాడిని నమ్మడం కష్టం. ప్రసాదం ముందుగా నువ్వు కాస్త తినాలి...." అన్నాడు వెంకట్రావు.
    "దేవుణ్ణి నమ్మే మీరు మనిషిని నమ్మలేరు. ఆ దేవుడు కూడా మీకు మనిషి మీద నమ్మకం పుట్టించ లేకపోతున్నాడు. నేను తెచ్చిన ప్రసాదంలో తనకు తోచిన కొబ్బరి ముక్క స్వాతి నా నోట్లో పెడితే నేను చాలా సంతోషిస్తాను" అన్నాడు రాము.
    స్వాతీ, రాముకు మాత్రమే కాకుండా అక్కడున్న అందరికీ ప్రసాదం నోట్లో పెట్టింది.
    "మీకు అభ్యంతరం లేకపోతె సిగరెట్ కల్చుకుంటాను " అన్నాడు రాము. అంటూనే అతను జేబులోంచి సిగరెట్ పెట్టి తీసి టేబుల్ మీద పెట్టి -- 'ఇప్పుడు నేను మీకు నా కధ చెప్పాల్సి వుంది....' అన్నాడు.
    అక్కడున్న అందరికీ అతని కధ వినాలని ఆత్రుతగా వుంది.

                                    15
    "ఒక దుర్మార్గుడు మా నాన్నను ఘోరంగా హత్య చేయించాడనెందుకు బలమైన సాక్ష్యాలున్నప్పటికీ డబ్బు లంచం పట్టి పోలీసులు కేసును మసిపూసి మారేడు కాయ చేసేశారు. ఆ దుర్మార్గుడిని సమూలంగా నాశనం చేయాలని నేనీ నగరం వచ్చాను. నా పగ వాడి మీద, వాడి కుటుంబం మీద, అసమర్ధు లైన పోలీసుల మీద!
    ఆ దుర్మార్గుడి పేరు సుదర్శనరావు. ఇక్కడకు వచ్చి అతని కుటుంబాన్ని చూసేక స్వాతి నాలో కొత్త ఆశలు రేపింది. ఆమెను తోలి చూపులోనే ప్రేమించాను. సుదర్శనరావు అతని కుటుంబాన్ని నాశనం చేయాలన్న ఆలోచనలు విరమించుకున్నాను.
    అయితే ఇక్కడకు చేరిన కొద్దిరోజుల్లోనే సుదర్శనరావు ఇంకా ఘోరాలు చేస్తూనే ఉన్నాడని అతగాడు సంఘానికి బట్టిన చీడ పురుగని గ్రహించాను. వెంకట్రావు కు అతనిపై పగ వున్నదని తెలిసి అతన్ని కలిశాను. సుదర్శనరావు పనియిపోయింది.
    స్వాతి ని కలుసుకుని నా కోరిక చెప్పుకున్నాను. ఆమె మొదట ప్రభాకర్ అడ్డం అంది. ప్రభాకర్ చనిపోయాడు. తర్వాత గోవిందరావు అడ్డం అంది. ఆయనా చనిపోయాడు. తర్వాత వెంకట్రావు అడ్డం అంది.
    అప్పుడే స్వాతిలోని రక్త దాహాన్ని గుర్తించాను. రహస్యంగా వాళ్ళింటికి వెళ్ళి మాటు వేసి విన్న సంభాషణ ప్రకారం వాళ్ళు వెంకట్రావు నూ, నన్ను కూడా చంపాలను కుంటున్నారు. మొత్తం  రెండు కుటుంబాల అస్తికీ, వ్యాపారాలకూ సర్వాదిపత్యం వహించాలని అనుకుంటున్నారు.
    స్వాతి అసలు స్వరూపం తెలిసేక నాకు స్త్రీ జాతి అన్నా, ఈ జీవితం అన్న అసహ్యం వేసింది. చావాలనిపించింది. కానీ చచ్చేముందు నా కధను అందరికీ వినిపించాలి.
    ఇంతవరకూ జరిగిన హత్యలు, ఇక ముందు జరుగునున్న హత్యలు ఎలా జరిగాయో తెలియక పోలీసులు కొట్టుకుచావాలి. పోలీసులు ఏడిపించడానికి నా కింతకంటే మార్గం కనిపించలేదు " అని ఆగాడు రాము.
    అతని మాటను వినగానే అక్కడున్న అందరి ముఖాల్లోనూ ముచ్చెమటలు పోశాయి.
    "నువ్వంటున్న వన్నీ అబద్దం. అసలు మా యింటికి రహస్యంగా ఎవ్వరూ రాలేదు. గేటు వద్ద పటిష్టమైన ఏర్పాటుంది " అంది స్వాతి.
    "ఇంతవరకూ వాచ్ మాన్ కి పదిహేను వేలిస్తానని ఉండరు" అని నవ్వాడు రాము. ఆ నవ్వు చూస్తుండగా వికటంగా మారింది.
    "అయితే ఆ హత్యలన్నీ ఎలా చేశావ్?' అన్నాడు వెంకట్రావు.
    "నేను రెండు సంవత్సరాలు ఆఫ్రికాలో వున్నాను. అక్కడ ఓ కొత్త రకం ఈగల్ని చూశాను. సుందరం అని ఓ ఇండియన్ సైంటిస్ట్ అక్కడ రకరాకాల ఈగల మీద పరిశోధన చేస్తున్నాడు. ఈ ఈగలు కొబ్బరి వాసనను ఇట్టే పట్టేస్తాయి. ఏ మనిష యినా కొబ్బరి తింటే ఈ ఈగలు సుమారు రెండు కిలో మీటర్ల ఆవరణలో ఆ మనిషి వాసన పసి గడతాయి.
    ఒకే చెక్కలోని కొబ్బరి ఈ ఈగలకూ, ఓ మనిషికీ పెడితే రెండు కిలోమీటర్ల వరకూ అవి అతి సులభంగా ఆ మనిషి ని గుర్తించగలవు. ఈ ఈగల్లోని రెండో విశేషం కొబ్బరి తిన్న మనిషిని ఇవి కుడితే ఆ మనిషి వెంటనే మారు మాట్లాడకుండా గుండె ఆగి మరణిస్తాడు. ఆ దేవుడే దిగి వచ్చినా అది హత్య అని తెలుసుకోలేడు. నేనా ఈగల్ని ప్రయోగించి ఇంతవరకూ మూడు హత్యలు చేశాను. మిగతావి యిప్పుడు చేయబోతున్నాను...." అని ఆగాడు రాము.
    అక్కడున్న అందరి ముఖాల్లోనూ భయం స్పష్టంగా కనబడుతోంది.
    "మనం సరిగ్గా అయిదుగురం. ఒకసారి మనిషిని కుట్టేక ఈ ఈగకున్న విష ప్రభావం పోతుంది. ప్రస్తుతం నావద్ద మిగిలినవి మన అయిదుగురి కోసం అయిదు ఈగలు. మనమందరం ఒకేసారి సహజంగా ఎలా మరణించామో తెలియక పోలీసులు బుర్రలు బద్దలు కొట్టుకుంటారు" అంటూ రాము సిగరెట్ పెట్టెలోని సిగరెట్లు తీశాడు. సరిగ్గా అయిదు సిగరెట్లున్నాయి.
    "వీటిల్లో వున్నాయి -- ఒకే సిగరెట్ లో ఒకో ఈగ చొప్పున. అంతా దైవ ప్రార్ధన చేసుకోండి" అన్నాడు రాము. 'ఇప్పుడు మీ అందరి ముఖాల్లోనూ మృత్యు కళ అద్భుతంగా కనబడుతోంది."'
    వెంకట్రావు, రాజు ముందుకు వురక బోయారు.
    "సాహసం చావును దగ్గర చేస్తుంది. మీరు ముందు కురికితే మిమ్మల్ని మీరు రక్షించుకోగలగడం కల్ల. కిలోమీటర్ల దూరం పరుగెత్తండి. చావు తప్పించు కుంటారు . ఊ క్విక్!' అన్నాడు రాము.
    రాము నోటమ్మట ఆ మాటలు రావడం తోటే నలుగురు ఆ గదిలోంచి ఒక్కసారిగా పరుగు లంకించుకున్నారు. ఒక్కొక్కరే తమ శక్తంతా కూడగట్టుకుని పరుగు పెడుతున్నారు....
    మర్నాటించి --
    అంతవరకూ పోయిన ముగ్గురు కాక మరో అయిదుగురు ఒక్కసారిగా సహజ మరణం ఎలా పొందారో తెలియక పోలీసులు బుర్ర బద్దలు కొట్టుకోవడం ప్రారంభ మైంది.

                                  _____అయిపొయింది _____


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS