"ఛా -- అవెం మాటలండీ"అంది శాంతాదేవి.
'అవును మరి. ఇంట్లో ఇంకెవరున్నారు? కొడుకూ కోడలూ హనీమూన్ వెళ్ళి పది రోజులయింది. కూతురు పిక్నిక్ వెళ్ళి రెండ్రోజులయింది. నువ్వూ నేనూ, పని మనిషి, నౌకర్లూ, తోటమాలీ ...." సోమయాజు లేదో అనబోతుండగా....
"అది కాదండీ. ఒకవేళ మన అదృష్టం పండి పాతిక లక్షల బంగారం బయటపడితే, పది లక్షలు ఆ జ్యోతిష్కుడి కి ధార పోయాల్సిందేనంటారా?" అంది శాంతాదేవి.
"అదా నీ బాధ?" అని నవ్వాడు సోమయాజులు. "ఈ సోమయాజులు ఆడిన మాట తప్పదు. అన్న ప్రకారం పది లక్షలూ జ్యోతిష్కుడి కి సమర్పించుకుంటాడు. అయితే డబ్బుతోవాడు బయటపడగానే గంగులు వాణ్ణి వెంటాడుతాడు. మన పదిలక్షలూ మనకు చేర్చుతాడు...."
"గంగులు వచ్చేడంటారా?"
"వాడు నమ్మిన బంటు. వచ్చి చాలాసేపయింది. కావాలంటే నువ్వు కూడా వెళ్ళి చూడు."
"వద్దులెండి" అంది శాంతాదేవి . గంగులంటే ఆవిడ కిష్టమే కాని అతన్ని చూడాలంటే ఆవిడకు భయం. అతను చేసిన ఘనకార్యాలు వింటుంటేనే ఒళ్ళు జాలదరిస్తుందావిడకు. చాలా భాగం అవి తమకు శ్రేయోభిలాషి గానే చేసినప్పటికీ కోడిని చంపలేను గానీ ఎవరైనా చంపి వండితే తినగలను. అదే మాంసాహారినిలా ఆవిడదీ జాలిగుండె! అందుకని సాధారణంగా ఆవిడ గంగులుని చూడదు. కానీ అతని రక్షణ ఉందని నిక్కచ్చిగా తెలిసేవరకూ ఆవిడకు తృప్తి గా ఉండదు. భర్త ఆ సంగతి చెప్పాక ఆవిడ కిప్పుడు తృప్తిగా వుంది.
"సరే, మన తక్కిన నౌకర్లందర్నీ బయటకు పంపించేశాను. తోటమాలి ని కూడా పంపించేశాను. పనిమనిషి మాత్రం ఇంట్లోనే ఉంటుంది. రహస్యంగా ఓ కంట జ్యోతిష్కుడి ని కనిపెడుతూ" అన్నాడు సోమయాజులు.
"అన్నీ చెప్పారా దానికి!" అంది శాంతాదేవి.
"ఆహా అన్ని చెప్పాను" అన్నాడు సోమయాజులు.
సరిగ్గా అప్పుడే గడియారం పన్నెండు గంటలు కొట్టింది. జ్యోతిష్కుడు హల్లో అడుగు పెట్టాడు. అతను వచ్చిన వైపు చూసి, "ఏమయ్యా పంతులూ వీధి తలుపు నించి కాదా వస్త?' అన్నాడు సోమయాజులు ఆశ్చర్యంగా.
"లేదండీ. పది లక్షలతో వ్యవహారం . ఎలాగైనా కాస్త జాగ్రత్తగా ఉండాలి. అందుకని దొడ్డి గుమ్మం నించి వచ్చాను" అన్నాడు జ్యోతిష్కుడు.
"నీ జోస్యం నిజమయేలాగే కనబడుతోందయ్యా" బెదిరించిన వాడు రాలేదు నిన్న!"
జ్యోతిష్కుడి ముఖంలో గర్వం కనబడుతోంది. "ఎలా వస్తాడండీ రాలేడు. ఎవడికైనా విధి లిఖితం తప్పదు. మీ ఇంట్లో నిధి ఉందని తెలిసీ నేనేం చేయగలిగాను. మీరు పిలిచే వరకూ అలా ఎదురు చూస్తూ కూర్చున్నాను వాడూ అంతే. మీఇంట్లో లక్ష్మీ దేవికి నా ద్వారా చెర తప్పాలని రాసి పెట్టి ఉంది. ఆ సంపద మీ కనుభవం కావాలని ఉంది. మీ ద్వారా నాకు కొంత రావాలని వుంది. మధ్య మూడో వాడెం చేయగలడండీ...."
'అన్నీ సిద్దంగా వున్నాయి. అంజనం వేశావా! నిధి కనబడిందా?"
'అన్నీ సిద్దమే నండీ. మీ మేడ మీద మూడు వరుస గదులున్నాయి. వాటిల్లో ఒక దాంట్లో వుంది నిధి. ఏ గది అన్నది మాత్రం మనం పరిశీలించి తెలుస్కోవాల్సిందే" అన్నాడు జ్యోతిష్కుడు.
ముగ్గురు మేడమీదకు నడిచారు. మొదటి గదిలోకి వెళ్ళేక జ్యోతిష్కుడు తన జేబులోంచి రెండు గుళికలు తీశాడు. "లక్ష్మీని సందర్శించే ముందు మీరివి వేసుకోవాలి...."
సోమయాజులు సందేహంగా భార్య వంక చూశాడు. శాంతాదేవి కూడా అదే రకంగా భర్త వంక చూసింది.
"ముహూర్తం మించి పోతోంది. త్వరగా!" అన్నాడు జ్యోతిష్కుడు.
దంపతులిద్దరూ తటపటాయించకుండా గుళికను నోట్లో వేసుకున్నారు. వేసుకున్న క్షణం లోనో వారికి కళ్ళు తిరిగి నట్లయింది. మరు క్షణం లోనే ఇద్దరూ స్పృహ తప్పి కుప్పలా కూలిపోయారు.
6
"ఏయ్! ఇలారా" అని పిలిచాడు శ్రీనాద్.
కాషాయ బట్టలు కట్టుకుని క్యోతిష్కుడి వేషంలో వున్న ఒక మనిషి శ్రేనాద్ వంక ఆశ్చర్యంగా చూసి, "నేనా ఎందుకు?" అన్నాడు.
"ఒక చిన్న పని చేయాలి. అందుకు ప్రతిఫలంగా పాతిక రూపాయలిస్తాను నీకు" అన్నాడు శ్రీనాద్.
"ఏమిటా పని?"
"టాక్సీలో ఒక ఇంటికి వెళ్ళాలి. అన్నీ తెలుసుకున్న వాడిలా చనువుగా అ ఇంట్లో ప్రవేశించాలి. వాచ్ మాన్ లేడా ఇంటికి. ఇంట్లోకి ప్రవేశిస్తూనే ఒక హాల్లోకి వెడతావు. ఆ హల్లో టేబిల్ మీద రెండు బ్రీప్జ్ కేసులుంటాయి. చాలా బరువుగా వుంటాయవి. ఒక్కొక్కటి పాతిక, ముప్పై కేజీలకు తక్కువ కాకుండా వుంటుంది. అవి రెండూ తీసుకుని బయటకు వచ్చి మళ్ళీ టాక్సీ ఎక్కాలి. పెద్ద మర్రి చెట్టు అని చెబితే చాలు. టాక్సీ వాడు నిన్నాక్కడకు తీసుకు వెడతాడు. ఆ రెండు బ్రీఫ్ కేసులూ మర్రిచెట్టు వెనక వదిలి రావాలి...." అన్నాడు శ్రీనాద్.
జ్యోతిష్కుడి కళ్ళు మెరిశాయి. "ఆ బ్రీప్ కేసుల్లో ఏముంది?"
"అది నీ కనవసరం. ఈ పని చేసినందుకు నీకు పాతిక రూపాయలు ముడతాయి. ఎక్కడా ఎవరూ నినడ్డగించరు. పోలీసుల ప్రసక్తి రానేరాదు...." అన్నాడు శ్రీనాద్.
అన్నింటికీ అంగీకరించాడు జ్యోతిష్కుడు. శ్రేనాద్ అతన్ని తను ముందుగా చెప్పి ఉంచుకున్న టాక్సీ దగ్గరకు తీసుకు వెళ్ళాడు. జ్యోతిష్కుడు టాక్సీ ఎక్కాడు.
టాక్సీ సోమయాజులు ఇంటి ముందాగింది. జ్యోతిష్కుడు టాక్సీ దిగి ఇంట్లోకి వెళ్ళాడు.
సోమయాజులు గారి కేదురింటి ముందు నిలబడి కాపలా కాస్తున్న గంగులు లో చలనం వచ్చింది. టైము చూసుకున్నాడు. పన్నెండుం పావయింది. అంతవరకూ జ్యోతిష్కుడిలా కనబడే వాడెవడూ ఇంట్లోకి వెళ్ళలేదు. అతనికి బాగా చిరాగ్గా వుంది. అప్పటికో మనిషి టాక్సీ దిగి ఇంట్లోకి వెళ్ళాడు. వేషధారణ ను బట్టి అతనే సోమయాజులు గారు చెప్పిన జ్యోతిష్కుడయుండాలని గంగులు అనుకున్నాడు.
జ్యోతిష్కుడు హాల్లోకి వెళ్ళాడు. శ్రీనాద్ చెప్పినట్లు గానే అతనికి రెండు బ్రీఫ్ కేసులు కనబడ్డాయి. ఎత్తి చూశాడు. చాలా బరువుగా వున్నయవి. రెండూ రెండు చేతుల్తోటి పట్టుకుని వీధిలోకి వచ్చి టాక్సీ ఎక్కాడు." పెద్ద మర్రిచెట్టు" అనగానే టాక్సీ కదిలింది.
గంగులు తనూ కదిలి నాలుగంగలు వేసి దగ్గరలో తనుంచిన మోటార్ సైకిల్ ఎక్కాడు. టాక్సీ ననుసరించ సాగాడు.
టాక్సీ సందులు, గొందులు చాలా తిరిగింది. వెళ్ళిన దారామ్మాటే మళ్ళీ మళ్ళీ వెళ్ళింది. అలా సుమారు రెండు గంటల సేపు ప్రయాణం చేసి అది ఒక మర్రి చెట్టు దగ్గర ఆగింది. జ్యోతిష్కుడు రెండు బ్రీఫ్ కేసులూ తీసుకుని మర్రి చెట్టు వెనక్కు వెళ్ళాడు. క్షణం మాత్రం తటపటాయించి వాటి నక్కడ వదిలేశాడు.
అవి చాలా బరువుగా ఉన్నాయి. అందులో బంగారముండవచ్చు లేదా ముక్కలైన మనిషి శావాలుండవచ్చు . టాక్సీ వాలా తొందర చేస్తున్నాడు. అతను తిరిగి టాక్సీ ఎక్కాడు.
టాక్సీ కదిలి వెళ్ళిపోయిన అయిదు నిముషాలకు గంగులు మర్రిచెట్టును సమీపించాడు.
టాక్సీలో టాక్సీ వాలా జ్యోతిష్కుడికి పాతిక రూపాయలూ ఇచ్చి దింపమన్న చోట దింపేసి తనదారిన తను పోయాడు.
7
టాక్సీ కదిలేక -- ఆ టాక్సీని గంగులనుసరించి వెళ్ళేక ఇవన్నీ రహస్యంగా ఆ ప్రాంతాల్లోనే ఉండి గమనిస్తున్న శ్రీనాద్ సోమయాజులు గారింట్లో ప్రవేశించాడు. ఏదో తెలియని బెడురులో అతని గుండెలదుర్తున్నాయి.
అతను హాల్లోకి ప్రవేశించగానే ఎవరో తన్ను పిలిచి నట్లయింది. తలెత్తి పైకి చూశాడు. మెట్ల మీద జ్యోతిష్కుడి రూపంలో ఉన్న ఒక వ్యక్తీ తనను పిలుస్తున్నాడు. అతన్ని శ్రీనాద్ గుర్తుపట్టాడు. ఈ భవనం ముందే కూర్చుని చేతులు చూస్తుంటాడాయన. నిన్ననే తనాయనకు పది రూపాయలు కూడా ఇచ్చాడు. ఆయనిక్కడెందుకున్నాడు?
"మీరా?" అన్నాడాశ్చర్యంగా.
"పైకిరా......." అన్నాడు జ్యోతిష్కుడు. శ్రీనాద్ గబగబా పైకి వెళ్ళాడు.
"మీ నాన్న నాకు తెలుసు. అన్నీ వివరంగా చెప్పాడు. టాక్సీ దొడ్డి గుమ్మం దగ్గర సిద్దంగా ఉందా?" అన్నాడు జ్యోతిష్కుడు.
"ఉందండి...."
"సోమయాజులు గారి మనిషి తప్పుదారి తోక్కాడా?"
"తోక్కాడండీ!"
"నీకోసమే చూస్తున్నాను. పద- లక్ష్మీని కళ్ళారా చూద్దువు గానీ ...." అన్నాడు జ్యోతిష్కుడు. శ్రీనాద్ కుతూహలంగా ఆయన్నునుసరించాడు. ఇద్దరూ మేడ మీదున్న మధ్య గదిలోకి వెళ్ళారు. గది నిండా బంగారపు అచ్చులు శ్రీనాద్ కళ్ళు చెదిరిపోయాయి.
"ఇది నిజంగా బంగారమేనా?"
"ఏమీ సందేహం లేదు. దీని విలువ కనీసం పాతిక లక్షలుంటుంది. అయితే ఇందులో మనం తీసుకోబోయే ది కేవలం పది లక్షలు మాత్రం. మిగతా పదిహేను లక్షలూ సోమయాజులుగారిది...."
"మనమంటే -- మీకూ వాటా కావాలా?"
"వెర్రివాడా -- నాకు డబ్బెందుకు? నీ తండ్రి నా స్నేహితుడు. పది లక్షలూ నీకే. నాకిందులో ఏమీ అక్కర్లేదు. నేను కోరుకునేది భగవంతుడనుగ్రహం ఒక్కటే!" అని జ్యోతిష్కుడు . కంగారుగా -- "ఇంకెంతో టయిం లేదు. నువ్వు చాలా జాగ్రత్తగా ఇల్లు చేరాలి. కనీసం నాలుగు టాక్సీ లైనా మారు. అవసరమైతే రిక్షా కూడా ఉపయోగించుకో ...." అన్నాడు.
అక్కడ ఆరేడు భ్రీఫ్ కేసులు న్నాయి. శ్రేనాద్ అందులో రెండింటిలో ఓ ఇరవై అచ్చులు సర్దాడు. అక్కణ్ణించి కదిలి వెళ్ళాడు. అతను వెళ్ళేసరికి దొడ్డి గుమ్మం దగ్గర టాక్సీ సిద్దంగా ఉంది. జ్యోతిష్కుడు చెప్పిన విధంగానే అతను టాక్సీలు మారాడు. ఇంటికి రిక్షాలో వెళ్ళాడు. అయినా అతని గుండెలు గుబగుబాలాడ్తూనే ఉన్నాయి.
అంత డబ్బు తన స్వంత మవుతోందంటే ఇంకా ఏదో కలలా ఉందతనికి.
8
జ్యోతిష్కుడు ఆ గదిలో ఉన్న రహ్యసపు అరలన్నీ ఒకటోక్కటే మూసేశాడు. గది చూడ్డానికి యధాప్రకారంగా ఉంది. గది నిండా బంగారపు అచ్చులు మాత్రం వున్నాయి.
