ఇప్పుడు మళ్ళీ కాలింగ్ బెల్ మ్రోగుతోంది. భయం కరమయిన వాడి ముఖంలో కంగారు కనబడుతోంది. ఎత్తిన కత్తి కిందికి దిగిపోయింది. మళ్ళీ తనకు కొన్ని క్షణాలు జీవితం లభించింది. ఆ పోయే ప్రాణమేదో వెంటనే పోతే బాగుండును. ఇప్పుడు భయంతో ప్రతి క్షణమూ చచ్చిపోతోంది తను. ఏమో ఆ కాలింగ్ బెల్ మోగడం క్షణం ఆలస్యమైతే కత్తి తనగుండెల్లో దిగబడే దేమో. తనకింకా ఆయువు ఉన్నదేమో!
ఆమెలో మళ్ళీ కొత్త ఆశలు చిగుర్చుతున్నాయి. అతను బయటకు వెళ్ళాడు.
ఎవరతను? సుధాకర్ కి ఏమవుతాడు? సుధాకర్ ఇంట్లో మకాం ఎలా సంపాదించాడు? సుధాకర్ కీ యితనికీ ఏమిటి సంబంధం? రకరకాల ప్రశ్నలు ఆమె మనసులో మెదులుతున్నాయి. కుతూహలానికి సంబంధించిన ఈ ప్రశ్నల వెనుక ఆమె జీవన్మరణ సమస్య మనసులో మెదుల్తూనే వున్నది.
మరి కాస్సేపటికి ఆ గదిలోకి కొందరు మనుషులు అడుగుపెట్టారు. ఆమెకళ్ళు వెలిగాయి. ఎదురుగా మధు, రవి, పోలీస్ ఇన్ స్పెక్టర్, సుధాకర్....
మధు సుజాతను చూశాడు. నిస్సహాయంగా గోడకు వేలాడుతున్న మనిషి. ఆచ్చాదనలేని గుండెలపై నీలంగా మెరుస్తున్న వలయం......అతను చటుక్కున పరుగెత్తి ఆమెను సమీపించి గుండెలమీది ఆచ్చాదనను సరిచేశాడు. తర్వాత అంతా ఆమెకు కట్లువిప్పారు.
"ఏం జరిగింది సుజాతగారూ?" అన్నాడు సుధాకర్.
సుజాత సుధాకర్ వంక తిరిగి ఏదో అనబోయి ఆశ్చర్యంతో ఆగిపోయింది. "మైగాడ్ - ఇదెలా సాధ్యం ఇతనే హంతకుడా?" అంది చటుక్కున.
సుధాకర్ ఉలిక్కిపడి "మీరేం మాట్లాడుతున్నారో మీకు తెలుసా?" అన్నాడు.
"అదే డ్రస్సు, అదే పొడుగు, అదేమాట ముఖం మాత్రం తేడా అతడి చేతిమీద నా పంటిగాటుకూడా వుంటుంది చూడండి. అతని జేబులోని బాల్ పెన్ కూడా అదే. ఇదేం మాయ!" అంది సుజాత.
అక్కడున్న అందరికీ ఆమె చెప్పింది అర్ధంచేసుకోవడానికి కొంతసేపు పట్టింది. సుజాత చెప్పినప్రకారం ముఖంతప్ప మిగతా ఆనవాళ్ళన్నీ సుధాకర్ కి సరిపోతున్నాయి. పోలీస్ ఇన్ స్పెక్టర్ పరీక్షగా సుధాకర్ ముఖం లోకి రెండు క్షణాలు చూసి చటుక్కున అతన్ని తన ఉక్కు కౌగిలిలో బిగించి, "మిస్టర్ మధూ! ఇతగాడి ముఖానికున్న మాస్క్ ను తొలగించడానికి ప్రయత్నించండి" అన్నాడు.
మధు, రవికూడా' ఎంతో ప్రయత్నించారు కానీ-అది అసలు ముఖమేకాని మాస్కుకాదని తెలిసింది. ఇన్ స్పెక్టర్ ఇంకోక్షణం ఆలోచించాడు. మళ్ళీ సుధాకర్ని బాగా శోధించారు.
సుధాకర్ చొక్కా లోపలిజేబులోంచి ఒక మాస్క్ దొరికింది. ఆ మాస్క్ ని తనే స్వయంగా సుధాకర్ కు తొడిగాడు ఇన్ స్పెక్టర్. అప్పుడు అతన్ని చూస్తూనే, "కెవ్వుమని" అరిచింది సుజాత.
"హంతకుడు దొరికాడు" అన్నాడు పోలీస్ యిన్ స్పెక్టర్.
15
శాంతి, రాధికల శవాలు సుధాకర్ ఇంటి దొడ్లో దొరికాయి. సుధాకర్ నేరాలన్నీ ఒప్పుకున్నాడు. అతని కథ విచిత్రమైనది.
బాగా కలిగిణ వారింట పుట్టాడతను. తల్లిదండ్రులు అపురూపంగా పెంచేరు. అతనికి దురలవాట్లూ, దుష్ట స్వభావమూ ఏర్పడ్డాయి. కానీ అప్పుడప్పుడు అతని ప్రవర్తన మరీ దారుణంగా వుండేది.
ఒకరోజు అతను ఓ పనివాన్ని క్రూరంగా హింసించి గుండెలమీద సున్నాపెట్టి కత్తితో పొడిచి చంపాడు. తల్లితండ్రులు హడలిపోయారు. ఆ పనికుర్రాడికి కావలసిన వాళ్ళెవ్వరూ లేరుకాబట్టి కేసు ఏమీ అవలేదు. కానీ కుర్రాడి ప్రవర్తనకు భయపడి డాక్టరుకు చూపించగా ఆయన కొంతకాలంపాటు తనవద్ద ఉంచుకుని యెన్నో పరీక్షలు చేసి "ఇతని శరీరతత్వానికి వంకాయ మంచిదికాదు. అది తిన్నపుడు అతని ప్రవర్తనలో విపరీతమైన మార్పు వస్తోంది. అది తిననప్పుడు అతని ప్రవర్తన నార్మల్ గానే ఉంటోంది" అని చెప్పాడు.
అప్పట్నించీ అతనికి వంకాయ వాసనకూడా తగలకుండా జాగ్రత్తపడేవారు తల్లిదండ్రులు. అయితే అప్పుడప్పుడు పొరపాటు జరుగుతూండడమూ కొడుకు దారుణానికి తెగించడమూ గమనించేక తండ్రి అతనికోసం ఓ మాస్కు చేయించి ఇచ్చాడు. ఎప్పుడన్నా వంకాయ కూర పొరపాటున తింటే శరీరతత్వం యథాస్థితికి వచ్చేవరకూ మాస్క్ వాడమన్నాడు.
సుధాకర్ ది స్వతహాగాకూడా దుష్టస్వభావం. అందువల్ల తన బలహీనతను ప్రొఫెషనల్ మర్దర్సుకూ ఉపయోగించుకున్నాడు. నగరంలోని కోటీశ్వరులకు శత్రువు లను చంపవలసి వచ్చినప్పుడల్లా అతను వంకాయకూర తిని మాస్కులేసుకుని తనపని ముగించేవాడు. ఆ విధంగా అతను పాతికేళ్ళకే లక్షలకు లక్షలు సంపాదించి తండ్రిని ఆస్తి పరుల జాబితానుండి మహదైశ్వర్యవంతుల జాబితాలోకి మార్చాడు. అతనికి వివాహమయ్యేక హత్యలు మానేశాడు. రాధికకు ఇతని జబ్బుగురించి తెలిసింది శాంతి హత్య తర్వాతనే.
శాంతిని చంపాలని తనింటికి తీసుకురాలేదతను. మామూలుగా నాలుగురోజులుంచుకుని మనసుమార్చి పంపేయాలనే తీసుకువచ్చాడు. ఇంట్లో వంకాయకూర వండకుండా అతనెన్నో కట్టుదిట్టాలు చేశాడు కానీ శాంతికి యిష్టమని రాధిక వంకాయకూర చేసింది. రుచి చాలాబాగుందని సుధాకర్ కూడా తిన్నాడు. వెంటనే అతనిలో చలనం ప్రారంభమయింది. భార్యకి చెప్పకుండా రాత్రికిరాత్రి శాంతిని హత్యచేశాడు. అందుకు కారణం రవి విషయంలో మనసు మార్చుకోక పోవడమేనని శాంతితో అన్నాడు.
మర్నాడు ఉదయం శాంతి శవాన్నిచూసి రాధిక కంగారుపడితే తన బలహీనత గురించి చెప్పుకున్నాడతను. రాధిక హడలిపోయింది. ఆ తర్వాత అతన్ని పొరపాటున కూడా వంకాయకూర ముట్టుకోనిచ్చేది కాదు.
ఒకరోజు స్నేహితుడింటికి భోజనానికి వెడితే-వాళ్ళ కితను వంకాయకూర తినడని తెలుసు. ఆ స్నేహితుడి భార్య ఇతనిచేత ఎలాగయినా వంకాయకూర తినిపించి తన పాక ప్రావీణ్యం తర్వాత చెప్పాలనుకుంది. అందుకు మరోపేరు చెప్పి కొత్తరకం వంకాయకూర చేసి వడ్డించింది.
అది తిని ఇంటికివెళ్ళాక సుధాకర్ లోని రాక్షసుడు పూర్తిగా మేల్కొన్నాడు. ఇంట్లోవున్న భార్యను చంపి ఆనందించాడు. ఆ తర్వాత జరిగింది తెలిసి ఏడిచాడు.
ఏకారణంవల్లనో అతడి హత్యలు సుజాత మెదడు టెలివిజన్లో చూసినట్లు చూడగలిగింది. అందుకు కారణాలు పేరాసైకాలజిస్టులు వెదుకవలసిందే. అంతకు మునుపు ఎన్నో హత్యలు చేసినా శాంతిహత్యను మాత్రమే ఆమె కలలో చూసింది. బహుశా సుధాకర్ అప్పుడామెకు కొద్దికిలోమీటర్ల దూరంలో ఉండడమే అందుక్కారణం కావచ్చు. ఆ తర్వాత జరిగిన రాధిక హత్య దూరంలో వున్నా ఆమె చూడగలిగింది. అప్పటికా హంతకుడు ఆమె బ్రెయిన్ కు ట్యూన్ కావడం కారణమయుండవచ్చు. సుజాతకు కలలో కనిపించి ఉండకపోతే ఆ రెండుహత్యలూ సుధాకర్ చరిత్రా ఎప్పటికీ బయటపడి వుండేవికాదేమో!
విచిత్ర పరిస్థితుల్లో అయితేనేం-ఒక దారుణ హంతకుడి ఆచూకీ బయటపడింది.
సుజాత ఇప్పుడు ఇంట్లో వంకాయకూర వండడం పూర్తిగా మానేసింది.
-:అయిపోయింది:-
