"హలో !" అన్నాడాయన. కాసేపటిలో అయన ముఖంలో రంగులు మారాయి. అయన ఎవరితో మాట్లాడుతున్నాడో గోపీకి అర్ధం కాలేదు.
వీరరాఘవయ్య ఫోన్ పెట్టేసి -- "నువ్వు రామేశాన్ని వదిలి పెట్టేయాలి" అన్నాడు.
"ఎందుకని?" అన్నాడు గోపీ తెల్లబోయి.
"ఇప్పుడు నాకు ఫోన్ చేసింది ప్రిన్సిపాల్ మోహనమూర్తి. ఆయనకు రామేశం ఫోన్ చేసి తన ఇబ్బంది చెప్పుకున్నాట్ట. రామేశానికి రక్షణ యేర్పాటు చేయమని అయన నన్ను కోరుతున్నాడు."
"మీరేం రక్షణ శాఖాధికారీ కాదు, పోలీసు డిపార్టుమెంటు కాదు. ఈ విషయం అయన మీకు ఫోన్ చేయడమేమిటి?' అన్నాడు గోపీ.
'ఆయనకూ నాకూ కొన్ని మొహమాటాలున్నాయి. ఇలాంటి సమయాల్లో నా ప్రతిభ చూపించ కుంటే -- ఆయనకూ నామీద గౌరవముండదు . ఇందులో నాకేమీ శ్రమ లేదు. రామేశాన్ని బెదిరించిందేవరో కూడా నాకు తెలుసు. అందువల్ల నువ్వీ విషయం మర్చిపో -- అదే మనిద్దరికీ మంచిది...."
గోపీకి యేమనాలో అర్ధం కాలేదు. రామేశాన్ని ఆపాలని అతడి కుంది. రామేశాన్ని ఆపమన్న వీరరాఘవయ్యే ఇప్పుడు రామేశం జోలికి వెళ్ళవద్దంటున్నాడు.
గోపీ ఆలోచిస్తుండగానే వీరరాఘవయ్య ఏదో నెంబరు కు డయల్ చేసి -- "హలో -- ప్రొఫెసర్ రామేశం గారేనా -- నమస్కారమండీ ....మీసంగతి నాకిప్పుడే ప్రిన్సిపాల్ గారు చెప్పారు. మీరేమీ భయపడకండి. మనమేమీ ఇక్కడ గాజులు తోడుక్కునీ చేతులు ముడుచుకుని కూర్చోలేదు. మా మనుషులు వెయ్యి కళ్ళతో మిమ్మల్ని కాపాడుతుంటారు మీకే ప్రమాదం వుండదు" అన్నాడు.
10
వీరరాఘవయ్య ఇంటి నుంచి తిన్నగా మరో యింటికి వెళ్ళాడు గోపీ. జగ్గూ వున్నాడా అనడిగాడక్కడ.
"ఓ రెండ్రోజుల పాటు ఇంటికి రానని చెప్పాడు బాబూ!" అంది ఓ వృద్దురాలు. ఆమె జగ్గూ తల్లి అయుండవచ్చు.
గోపీ నిట్టూర్చి అక్కణ్ణించి కదిలాడు. జగ్గూ అతడి వయసు వాడు. అతడి వంటి వాడు. ఈ వ్యవహారంలో జగ్గూ సాయం తప్ప వేరెవ్వరి సాయం తీసుకోకూడదని నిర్ణయించుకున్నాడతను.
"సుదర్శనం దురదృష్టవంతుడు...." అనుకున్నాడు గోపీ.
తనకు చేతనైనంతలో గోపీ సుదర్శనానికి సాయపడాలనే అనుకుంటున్నాడు. కానీ ఎక్కడా కలిసి రావడం లేదు.
ఇంక ఇంటర్వ్యూ కి రెండే రెండ్రోజులు టయిముంది. ప్రొఫెసర్ రామేశాన్ని ఆపే అవకాశం వచ్చిందనుకుంటే వచ్చినట్లే చేయి జారిపోయిందది.
తనకూ సుదర్శనానికి వున్న పరిచయం -- కొంత మందికైనా తెలుసు. అందుకని చివరి అస్త్రంగా జగ్గూ ను ఉపయోగించాలనుకున్నాడు తను ముందుగా సుభాష్ ని బెదిరించి ఉన్నాడు. ఆఖరున జగ్గు సుభాష్ ని ఆపుతాడు.
జగ్గూ కు గోపీ -- గోపీకి జగ్గూ -- ఎన్నో వ్యవహారాల్లో సాయపడినా వారిద్దరూ వేర్వేరు ముఠాలకు చెందినవారని అంతా అనుకుంటారు. అయితే ఎట్టి పరిస్థితుల్లో నూ ఒకరి వ్యవహారాల కొకరు ఎదురుపడకుండా , ఇబ్బంది జోక్యం కలిగించుకోకుండా చూసుకుంటారు.
ఇప్పుడా జగ్గూ దొరకలేదు. అందువల్ల తనే స్వయంగా సుభాష్ ని ఆపాలనుకున్నాడు గోపీ. ఈ అభిప్రాయంతో సాయంత్రం అతడు పార్కు కి వెళ్ళాడు.
అక్కడ సుభాష్, సుశీల యధా స్థానంలో యధాప్రకారం కబుర్లు చెప్పుకుంటున్నారు.
"హలో మిస్టర్ సుభాష్!" అన్నాడు గోపీ.
సుభాష్ ఉలిక్కిపడి -- "నువ్వా?' అన్నాడు.
"అవును -- నేనే! నా హెచ్చరిక గుర్తుందో లేదోనని ఒకసారి గుర్తు చేసిపోవడానికి వచ్చాను...." అన్నాడు గోపీ.
"హెచ్చరికేమిటి-- నాకేమీ గుర్తు లేదే!" అన్నాడు సుభాష్.
గోపీ జేబులోంచి బటన్ నైఫ్ తీసి బటన్ ప్రెస్ చేసి "ఇప్పుడు గుర్తుకొచ్చిందా?' అన్నాడు.
సుభాష్ తల అడ్డంగా ఊపి -- "లేదు -- కానీ ఓసారి వెనక్కి చూడు" అన్నాడు తాపీగా.
గోపీ వెనక్కు తిరిగి తనులిక్కిపడి "అరె -- జగ్గూ -- నువ్వా?' అన్నాడు.
వాళ్ళిద్దరూ ఒకరికొకరు తెలిసినవారేనని గమనించగానే సుభాష్ కలవర పడ్డాడు కానీ అక్కణ్ణించి కదలలేదు.
జగ్గూ గోపీ ఒకరినోకరు పలకరించుకున్నారు.
సుభాష్ బాబాయి జగ్గూకి గురుతుల్యుడు. ఎవరో ఇంటర్వ్యూ కి వెళ్ళవద్దని బెదిరిస్తున్నారని తెలిసి అతడి పిన్ని జగ్గూ కి కబురంపింది. రెండ్రోజుల నుంచీ అతడు సుభాష్ తోనే వుంటున్నాడు. జగ్గూ గోపీ కధ కూడా విని - "మనమిద్దరం ఒకరితో ఒకరు భేటీ పడ్డం ఇంతవరకూ జరగలేదు. ఇప్పుడెం చేద్దామంటావు?" అన్నాడు.
వృత్తి రీత్యా ఇద్దరికీ ఒకరి తోడూ ఒకరికి అవసరం. వృత్తి రీత్యానే మున్ముందు ఇద్దరూ భేటీ పడవలసి రావచ్చు కూడా. ఇప్పుడీ చిన్న విషయానికి ఇద్దరూ బలాబలాలు పరీక్షించుకోవడం గోపీ కిష్టం లేదు.
"సరేలే-- నేనింకో మార్గం చూసుకుంటాన్లే ...." అన్నాడు గోపీ.
జగ్గూ గోపీకి థాంక్స్ చెప్పుకున్నాడు. సుభాష్ మాత్రం గోపీ జగ్గూ కి భయపడ్డాడని అనుకున్నాడు.
గోపీ అక్కణ్ణించి వెళ్ళి సుదర్శనాన్ని కలుసుకుని-- "నీకే విషయం లోనైనా సాయం చేయగలను కానీ ఉద్యోగం విషయంలో చేయలేను. చేతనైతే అరామేశాన్ని కానీ, మోహనమూర్తి ని కానీ నువ్వే బెదిరించు లేదా ఆ సుశీలను రేప్ చేసి నువ్వే పెళ్ళాడు. ఏం చేసినా నువ్వే స్వయంగా సాధించుకోవాలి. ఇంటర్వ్యూ కి వెళ్ళకుండా ఆ సుభాష్ ని అపాలనుకోవడం అన్యాయమనిపిస్తోంది"అని సెలవు తీసుకున్నాడు.
11
"కధ మళ్ళీ మొదటికి వచ్చింది --" అనుకున్నాడు సుదర్శనం.
ఇలాంటి అపూర్వవకాశం మళ్ళీ తనకు రాకపోవచ్చు. పెద్ద పెద్ద వాళ్ళ అడ్డంకులన్నీ తొలగిపోయాయి. తనకిప్పుడు సుభాష్ ఒక్కడే పోటీ. ఆసుభాష్ కీ తనకీ ఒకటే తేడా! అతడు ప్రిన్సిపాల్ కూతురు సుశీలను ప్రేమించి పెళ్ళి చేసుకోబోతున్నాడు. సుశీల ను పెళ్ళి చేసుకుంటే తనకూ ఆ ఉద్యోగం రావచ్చు.
ఇంతకాలం తన ఆలోచనలీ దార్లో మళ్ళలేదు.
తనూ అందంగానే వుంటాడు. సుశీల గురించి ముందు నుంచి ప్రయత్నిస్తే ఆమె తననే ప్రేమించి వుండేది. ఇప్పుడామె సుభాష్ ని ప్రేమిస్తోంది. ఆ ప్రేమ నుంచి ఆమె మనసును మళ్ళించాలంటే.....
"నువ్వే ఆమెను రేప్ చేసి పెళ్ళాడు."
ఇది గోపీ మాటలు, సుదర్శనం చెవుల్లో గింగురు మంటున్నాయి.
రేప్ చేయడం నేరం కావచ్చు. కానీ తనద్వారా ఆ వనిత కన్యాయం జరక్కపోతే అది నేరం కాదు. రేప్ చేశానని సుశీల తనని అసహ్యించుకోవచ్చు. కానీ భర్తగా ఆమె తనను తప్పక ఆదరిస్తుంది.
"అదే-- అన్నింటికీ మంచి మార్గం -- కానీ ....ఎలా?"
సుదర్శనం బుర్రలో ఆలోచనలు తిరుగుతున్నాయి. అతడేక్కువ జాప్యం చేయలేదు. తనకున్న టైము ఎంతో లేదు.
ఆరోజు గడిస్తే మర్నాడే ఇంటర్వ్యూ.
పార్కులో సుభాష్ సుశీల కలుసుకుంటున్నారు. టైము ఎడయ్యే దాకా సుశీల అక్కడే వుంటుంది. అప్పుడు సుభాష్ , సుశీల విడిపోతారు. తాను సుశీల ననుసరిస్తాడు. దారిలో పలకరిస్తాడు. సుభాష్ గురించి గొప్పగా నాలుగు కబుర్లు చెప్పి ఆమెను తప్పుదారిన నడిపిస్తాడు. ఓ చిన్న అడ్డదారి వుంది. ఆమె దృష్టి నా అడ్డదారిని గుర్తించనీయకుండా -- అమెనా దారిలో నడిపించగలిగితే.... ఆ ప్రానతంలో కొన్ని మానభంగాలు జరిగాయి. అటు వైపు జనాలట్టే వెళ్ళరు. అక్కడ ప్రదేశామూ అందుకనువుగా వుంటుందంటారు.
తను చూడ్డానికి పెద్దమనిషిలా వుంటాడు. ఓ క్షణం క్రితం వరకూ నిజంగా కూడా పెద్దమనిషే! అందువల్ల సుశీల నాదారికి తీసుకుని వెళ్ళడం కష్టం కాదు.
అక్కడ తను అనుకున్నది సాధిస్తాడు.
అంతా అయిపోయాక కన్నీళ్ళతో విలపిస్తున్న సుశీలనలా వదిలి వెళ్ళి పోకుండా --ఆవేశంలో జరిగిన పొరపాటు కు క్షమించమంటాడు. తనామెను పెళ్ళి చేసుకుందుకు సిద్దంగా వున్నానంటాడు. నెమ్మదిగా ఉద్యోగం గురించి చెప్పవచ్చు.
తన పధకంలో ప్రమాదముందని సుదర్శనానికి తెలుసు. అంతవరకూ ఏ నేరమూ చేయని తాను ఒక ఆబల పై అత్యాచారం చేయగలడా అన్నది సందేహాస్పదమని అతడికి తెలుసు. తను నేరస్థుడిగా పట్టుబడితే జీవితమే సర్వనాశనమవుతుందన్న విషయం కూడా అతడికి తెలుసు.
తనకు తన కుటుంబం పట్ల, సమాజం పట్ల వున్న బాధ్యతలతడికి గుర్తున్నాయి. ఒక అబల పై అత్యాచారం చేసినవాడికి అధ్యాపకుడయ్యే అవకాశముండదేమో నన్న విషయమూ అతడు గుర్తించాడు.
కానీ -- తనకు ఇంటర్వ్యూ లెటర్ వచ్చినపుడు తండ్రి అతడితో -- "ఆశను ఎక్కువగా నమ్ముకున్న వాడు తన ప్రాణాలు నిలబెట్టుకోవడం సంగతెలగున్నా- నిరాశ ఎదురైనపుడు - ఎదుటి వాళ్ళ ప్రాణాలు తీయాలనుకునే టంత ఘోరావేశానికి గురి అవుతాడు " అన్న మాటలు గుర్తు లేవు.
స్త్రీకి మానభంగం హత్యతో సమానమన్న గుర్తింపు అతడిలో లేదప్పుడు.
