"నీ అదృష్టం బాగోలేదు. ఉద్యోగం మీద ఆశలు పెట్టుకోకు" అన్నాడు ఆనందరావు.
"ఏమయింది?"
"మోహనమూర్తి నేననుకున్నంత స్ట్రిక్టు కాడు. ఇంటర్వ్యూ కి ఎన్నికైన అభ్యర్ధుల్లో నాగభూషణం అనే వాడిని కలిపాడాయన. అందుక్కారణం వీరరాఘవయ్య" అంటూ ఆ వ్యవహారం చెప్పాడానందరావు.
"ఒకచిన్న ఉద్యోగాని కెంత పోటీ?' అన్నాడు సుదర్శనం నీరసంగా.
"అయితే వుద్యోగం నాగభూషణరావుకి రాదు"-- అన్నాడానందరావు.
"మరి?"
"ప్రిన్సిపాల్ చాలా తెలివైనవాడు. ముందు ఎనమండుగురినే ఎన్నిక చేసినవాడు నాగభూషణం గురించి ఒత్తిడి రాగానే ఏం చేశాడో తెలుసా -- అలాంటివాడినే ఇంకొకడ్ని కూడా ఎన్నిక చేశాడు. అతడి పేరు విద్యాసాగర్. ఈ విద్యాసాగర్ కూడా ఊళ్ళో బాగా పేరున్న గణపతి రావు గారి మేనల్లుడు. ఆయనకూ కాలేజీలో చాలా పలుకుబడి వుంది."
'అయితే?"
"వీరరాఘవయ్య పలుకుబడికి గణపతిరావు పలుకుబడితో భేటీ పడుతుంది. ఇద్దరికిద్దరూ హేమాహేమీలు. వీళ్ళిద్దరిలో ఏ ఒక్కరిని ఎన్నిక చేసినా ఊళ్ళో భూకంపం వచ్చేస్తుంది."
"అరే బాప్ రే!" అన్నాడు సుదర్శనం.
"ఈ తిరకాసంతా ఇప్పుడిప్పుడే నాకర్ధమవుతోంది" అన్నాడు ఆనందరావు.
"అయితే ఇప్పుడెం జరుగుతుంది?"
"మోహనమూర్తి చాలా తెలివిగా వ్యవహరిస్తున్నాడు. అయన కమిటీ మెంబర్స్ కి తన సమస్య చెప్పుకున్నాడు. వాళ్ళైతే అయన మీద జాలిపడి సుభాష్ ని సెలక్టు చేయమని సూచించారు కూడా. వాళ్ళ పాయింట్ యేమిటంటే వీరరాఘవయ్య, గణపతి రావు-- వీళ్ళిద్దరిలో ఏ ఒక్కరిని మాత్రమే సంతృప్తి పరచినా , అసంతృప్తి కి గురిచేసినా ఇబ్బంది. ఇద్దరి కాండిడేట్సు ని తిరస్కరించడంలో సమస్య లేదు. అలాంటప్పుడు ప్రిన్సిపాల్ గారి కాండిడేటు ని ఫేవర్ చేయడం మంచిది గదా -- ఎవరో మనవాళ్ళ కే ఉద్యోగ మొస్తే మనకూ తృప్తిగా వుంటుందని వాళ్ళాయనతో అన్నారు. అయన దానికి ఒప్పుకోలేదు. పైగా ఈ క్లిష్ట పరిస్థితుల్లో తను సెలక్షన్ బోర్డులో వుండనని కూడా అయన స్పష్టం చేశాడు. అందుకోసం ఓ వారం రోజులు సెలవు కూడా పెడుతున్నాడు."
"పాపం -- అయన నిజంగానే స్ట్రిక్టు మనిషి లగున్నాడు...." అన్నాడు సుదర్శనం అప్రయత్నంగా.
'అలా అప్పుడే జాలిపడిపోకు. ఇలా జరిగినప్పుడే నాకాయన నిజాయితీ మీద అనుమానం కలిగింది. ఎందుకంటె అయిన వాళ్ళ నుద్యోగానికి సెలక్టు చేయాలనుకున్నప్పుడేవరైనా ఇలాంటి పనే చేస్తారు. తనేమో సెలక్షన్ కమిటీలో ఉండడు. సెలవు పెట్టి ఇంటి దగ్గర కూర్చుంటాడు. తనకు బాగా నమ్మకమున్న వాళ్ళను సెలక్షన్ కమిటీ చెయిర్మన్ చేస్తాడు. అయిన వాళ్ళు సెలక్టవుతారు. ఆ సెలక్షన్ లో ఆయనకేమీ సంబంధముండదు. ఇది అందరికీ తెలిసిన రహస్యం. అయినాయెవ్వరూ తప్పు పట్టలేరు...."
"నువ్వనవసరంగా ఆయన్ననుమానిస్తున్నావు...."
"సెలక్షన్ కమిటీ చైర్మనేవరో తెలిస్తే నువ్వామాట ఆనవు. ప్రొఫెసర్ రామేశం ప్రిన్సిపాల్ మోహనమూర్తికి ప్రాణ స్నేహితుడు...."
సుదర్శనం ఆలోచనలో పడ్డాడు.
"అసలిప్పటి పరిస్థితి ఏమిటి?'
వెంకోజీరావు కాలేజీలో ఒకే ఒక ఎకనామిక్స్ లెక్చరర్ ఉద్యోగం . దానికి మొత్తం పదిమందిని ఇంటర్వ్యూ కి పిలిచారు. పిలిచినవారిలో తను ఉత్తమ అభ్యర్ధి. తనకున్న అవకాశాలేలాంటివో తెలియదు. ఆ పదిమందిలో చిట్టచివర పేర్లున్న నాగభూషణం, విద్యాసాగర్ లకు బాగా పలుకుబడి వుంది. ఇద్దరిలో ఏ ఒక్కరూ మాత్రమూ అప్లై చేసి వుంటే తప్పక సెలక్టయుండేవారు. ఇద్దరూ అప్లై చేశారు కాబట్టి ఏ ఒక్కరికీ అవకాశం లేదు. ప్రిన్సిపాల్ తను సెలక్షన్ కమిటీ లోంచి తప్పుకుని తన ప్రాణస్నేహితుడు ప్రొఫెసర్ రామేశాన్ని కమిటీ చైర్మన్ చేశాడు. మొహనమూర్రి తనకిష్టం లేదంటూనే వుంటాడు. రామేశం సుభాష్ ని యెన్నిక చేస్తాడు.
ఇదంతా ఓ పెద్ద నాటకం. ఉద్యోగాల విషయంలో ప్రటి చోట ఇలాంటి అన్యాయాలు జరిగిపోతుండడం వల్లనే సమర్ధులకుద్యోగాలు రావడం లేదు. ఫలితంగా దేశం నష్టపోతోంది.
'అయితే మనం చేయగలిగిందేమన్నా వుందా?' అన్నాడు సుదర్శనం.
"అపగాలిగితే రామేశాన్ని కూడా ఇంటర్వ్యూ కమిటీకి వెళ్ళకుండా ఆపాలి!" అన్నాడు ఆనందరావు.
"నాలుగుద్యోగాలకి ప్రయత్నిస్తే -- చీఫ్ మినిస్టర్నవడానిక్కూడా సరిపడ అనుభవం వచ్చేలా వుంది--" అనుకున్నాడు సుదర్శనం.
9
ఒక ఎయిర్ కండిషన్డ్ గదిలో కలుసుకున్నారు వీరరాఘవయ్య, గణపతిరావు.....
"ఆ ప్రిన్సిపాలు గోలేట్టేస్తున్నాడు. మీ యిద్దర్లో యెవరో ఒకరు తేల్చుకోకపోతే -- ఇద్దరికీ ఉద్యోగమివడం కుదరదని -- మీ వాడప్లై చేశాడని తెలిస్తే నా మేనల్లుడ్ని వద్దని చెప్పేద్దును. ఇప్పుడేమో తీరా వాడు అప్లై చేశాడు. వాడికి రాకుండా మీవాడి కొస్తే -- నా చెల్లెలు నా ప్రాణం తీస్తుంది..." అన్నాడు గణపతి రావు.
వీరరాఘవయ్య కూడా ఓ క్షణం అలోచించి -- "మనవంటి వాళ్ళు బలబలాలు తేల్చుకోవాల్సిన రంగస్థలం వెంకోజీరావు కాలేజీ మాత్రం కాదు. నాదీ నీకులాంటి పరిస్థితే! ఏం చేయాలో నాకూ తోచడం లేదు. ఇద్దర్నీ కలిపి యెక్కడి కైనా తోలేయడం మంచిదేమో! ఎందుకంటె మావాడు ఇంటర్వ్యూ కి వెళ్ళకపోతే చివరి క్షణం లో మీవాడికి మూడ్ వచ్చి ఇంటర్వ్యూ కి వెళ్ళవచ్చు---" అన్నాడు.
ఇద్దరూ కలిసి అలోచించి నాగభూషణానికీ, విద్యాసాగర్ కీ కాశ్మీర్ కార్యక్రమం ఫిక్స్ చేశారు. అప్పుడు గణపతి రావు వెళ్ళిపోయాడు.
ఆ తర్వాత వీరరాఘవయ్య గోపీ కబురంపించాడు.
"ప్రొఫెసర్ రామేశం విషయంలో ఏం చేశావు?'
"ఫోన్ చేసి బెదిరించాను...."
"ఏమన్నావు?"
"మే ఏడో తేదీన యిల్లు కదిలితే ప్రమాదమని చెప్పాను...."
"ఆరోజే కదా ఇంటర్వ్యూ -- అందరికీ తెలిసిపోతుంది...."
"తెలిస్తే మాత్రం -- ఇదంతా ఎవరూహించగలరు? అయన ఇంటర్వ్యూ కి వెళ్ళడం వల్ల మీ అబ్బాయికి అన్యాయం జరిగుతుందని మీరే ఇంత పని చేశారని యెవ్వరూ అనుమానించరు...."
'అంటే నీకు నా అవసరం తెలిసి పోయిందన్న మాట."
గోపీ గర్వంగా నవ్వి - "నా ప్రయత్నం లేకుండానే నాకీ విషయం తెలిసింది. ఆరోజు ప్రొఫెసర్ రామేశాన్ని ఆపమని మరికొందరు నన్నడిగారు--' అన్నాడు.
"ఎవరు వాళ్ళు?"
"ఇంకెవరు-- కాండిడేట్సు తాలుకే!"
"వాళ్ళ పేర్లు చెప్పు...."
"తెలుసుకోవాలనుకుంటే మీకు అసాధ్యం కాదు. కానీ అందువల్ల మీకేమీ ప్రయోజనం లేదు. నాకేమో రహస్యం దాచలేదన్న అసంతృప్తి మిగులుతుంది...."
వీరరాఘవయ్య నిట్టూర్చి -- "మావాడు ఇంటర్వ్యూ కాండిడేట్ గా వుంటే -- ఇలాంటి పని యెవరు చేసినా నేనే చేశానని అనుమానిస్తారు, అందుకే మావాడ్ని ఇంటర్వ్యూ కే పంపడం లేదు ...." అన్నాడు.
"అంటే గణపతి రావు గారి మేనల్లుడికి డోకా లేదన్న మాట...."
వీరరాఘవయ్య ఆశ్చర్యంగా -- "వాటం చూస్తె నీకు మొత్తం కధంతా తెలిసినట్లే వుందే --" అని - "వాడూ ఇంటర్వ్యూ కి రాడు. ఇద్దరూ కలిసి కాశ్మీర్ వెడుతున్నారు. ఇంటర్వ్యూ అయ్యాకే వస్తారు...' అన్నాడు.
"అయితే నేను రామేశాన్ని ఆపుతాను. అప్పుడేవ్వరూ మిమ్మల్ననుమానించరు. అంతే కాకుండా ఇలాంటి వ్యవహారాల్లో మీలాంటి వాళ్ళే కాకుండా ఇతరులూ జోక్యం కలిగించుకోవచ్చని అందరికీ తెలుస్తుంది"అన్నాడు గోపీ.
అతడిలాగనడానికి కారణముంది. రామేశం గురించి అతడికి సుదర్శనం చెప్పాడు. రామేశం ఇంటర్వ్యూ కి వెళ్ళకపోతే -- మరొకడు సెలక్షన్ కమిటీ చైర్మన్ కావచ్చు. రామేశమే చైర్మన్ అయితే సుదర్శనానికి యే అవకాశమూ వుండదు. అయన సుభాష్ ను తప్ప వేరోకడ్ని సెలక్టు చేయడు.
ఎలాగూ వీరరాఘవయ్య, రామేశాన్ని అపు చేసే పని చెప్పాడు. అటు సుభాష్ ని ఇటు రామేశాన్ని అపగలిగితే చాలా బాగుంటుంది. సుదర్శనం కోసం తనింకో మనిషిని నియోగించాలి. ఇంతకాలం ఈ విషయం మూడో మనిషికి తెలియకూడదనుకున్నాడు గానీ -- ఇది సుదర్శనానికి జీవిత సమస్య. ఎలాగో అలా అతడికి సాయపడాలి.
"నువ్వు చెప్పింది బాగుంది. నా కాండిడేట్ లేకపోయినప్పటికీ రామేశాన్నేవరో బెదిరిస్తున్నారంటే -- ఎవరూ నన్ననుమానించరు--" అన్నాడు వీరరాఘవయ్య.
సరిగ్గా అప్పుడే అయన పక్క బల్ల మీద ఫోన్ మ్రోగింది.
