Previous Page Next Page 
వసుంధర కధలు-5 పేజి 28

 

    "అలాంటప్పుడు అప్పారావుకు అంత డబ్బు ఎలా బాకీ పడ్డారు?' అడిగాడు శాస్త్రి.
    "ఆప్రశ్నకు జవాబు నేనుచేప్పలేను. పోతురాజు చెప్పాలి--" అన్నాడు నరసరాజు.
    "పోతురాజా, వాడేవాడు?" అన్నాడు శర్మ ఆశ్చర్యంగా.
    "పోతురాజు నాకు లక్ష రూపాయలు బాకీ వున్నాడు. కానీ వాడది తీర్చడు. ఇమ్మని నేనూ అడగలేను. వాడు నా బాకీ తీరిస్తే నేను అప్పారావు గారి బాకీ తీర్చడం కష్టం కాదు. సరిగదా క్షణాల మీద పని!"అన్నాడు నరసరాజు.
    "మీ యింట్లో ఎలాంటి వాడినైనా పట్టుకో గల ఏర్పాట్లు న్నాయి కదా-- మీరు పోతురాజు నెందుకు స్వాధీనం చేసుకోలేకపోయారు?" అనడిగాడు శర్మ.
    "పోతురాజు గురించి ఎరిగిన వాళ్ళెవ్వరూ ఈ ప్రశ్న వేయరు--" అన్నాడు నరసరాజు.
    "నాకు తెలియదు కాబట్టే నేనీ ప్రశ్న వేశాను. వాడి గురించి చెప్పండి--"అన్నాడు శర్మ.
    "వాడి గొప్పతనం అనుభవించిన వాడికి గానీ తెలియదు. పగవాడికి కూడా వాడి గొప్పతనం అనుభవం లోకి రావాలని నేను కోరుకోవడం లేదు--" అన్నాడు నరసరాజు.
    "మేమిద్దరం పోతురాజు దగ్గరకు వెళ్ళి మీ బాకీ వసూలు చేసుకువస్తాం. మీకు అభ్యంతరమా?" అన్నాడు శాస్త్రి.
    "అభ్యతరమే -- అది నాకు ప్రమాదం. పోతురాజు కూ నాకూ గొడవలోద్దు మీరు -- " అన్నాడు నరసరాజు.
    "పోతురాజు మీకు బాకీ వున్నప్పుడు అడగడానికి మీకు భయమెందుకు?" అన్నాడు శాస్త్రి.
    'అప్పారావు నా దగ్గర బాకీ వసూలు చేసుకోడానికి సాహసిస్తున్నాడా? ఇదీ అంతే -- మహా సముద్రంలో చిన్న చేపలు పెద్ద చేపలకు దూరంగా వుండక తప్పదు. వ్యాపారస్తుడు తీసుకున్నది లాభం అంటారు. గవర్నమెంట్ తీసుకుంటే పన్ను అంటారు. అవి అప్పు లనరు. సాటివాడు తీసుకుంటేనే అప్పవుతుంది. పోతురాజు నాకు సాటి వాడు కాదు--"
    "మేమోసారి పోతురాజును కలుసుకోవాలి. వివరాలు చెప్పండి. మీ సంగతి వాడికి చెప్పం లెండి --" అన్నాడు శర్మ. నరసరాజు అయిష్టం గానే వాళ్ళకు కొన్ని వివరాలు చెప్పి తన ప్రసక్తి తీసుకురావద్దని వాళ్ళకు మరీమరీచేప్పాడు. మనిషి బాగా బెదిరినట్లుగా కనపడ్డాడు.

                                   5

    అదొక చిన్నపెంకు టిల్లు, శాస్త్రి వెళ్ళి తలుపు తట్టి "పోతురాజు గారూ!" అని పిలిచాడు.
    కొద్ది నిముషాల్లో యింటి తలుపులు తెరచుకున్నాయి. సన్నగా పొట్టిగా వున్న ఓ మనిషి తలుపు తీసి శాస్త్రి వంక పొగరుగా చూసి -- "ఎవర్నువ్వు?" అనడిగాడు.
    "నా పేరు శాస్త్రి. నాకు పోతురాజు గారితో పని వుంది-" అన్నాడు శాస్త్రి.
    "లోపలకు రా-- నేనే పోతురాజును--" అన్నాడా వ్యక్తీ.
    శాస్త్రి ఆశ్చర్యంగా లోపలకు వెళ్ళాడు. నరసరాజు వంటి మనిషినే గడగడలాడించిన ఆ పోతురాజు చాలా గొప్పగా వుంటాడనుకున్న అతడికి ఆశా భంగమయింది. నరాసరాజింట్లో భంగపాటయ్యాక శాస్త్రి, శర్మ ఇద్దరూ ఒకేసారి కలిసి అనుమానాస్పదమైనచోట్ల చొరబడకూడదనుకున్నారు. అందుకే దూరాన్నుంచి శర్మ కాపలా వున్నాడు.
    ఇల్లు చాలా చిన్నది. వంటగది కాక రెండు గదులున్నాయి. బాత్రూం లేదు. దొడ్లో నుయ్యి ఒకటి వున్నది.
    "చాలా చిన్నయిల్లు!" అన్నాడు శాస్త్రి.
    "నువ్వు వచ్చిన పనేమిటి?" అన్నాడు పోతురాజు.
    "నాకో లక్ష రూపాయలు అర్జంటుగా కావాలి--" అన్నాడు శాస్త్రి.
    పోతురాజు తీక్షణంగా శాస్త్రి వంక చూసి -- 'అప్పుగానా?" అన్నాడు.
    "అప్పనుకున్నా సరే -- బాకీ తీరుస్తున్నాననుకున్నా సరే-- " అన్నాడు శాస్త్రి.
    "నేను బాకీలు తీర్చను. కావాలంటే డబ్బు అప్పుగానే ఇస్తాను--" అన్నాడు పోతురాజు.
    "నాక్కావలసింది ఒకటీ రెండూ కాదు, లక్ష రూపాయలు --" అన్నాడు శాస్త్రి నొక్కిస్తూ.
    "ఒక లక్షేగా అన్నావు!" అన్నాడు పోతురాజు తేలిగ్గా తీసిపారేస్తూ-- "నా దగ్గర చాలామంది సినిమా వాళ్ళు అయిదు, పదికీ తక్కువ కాకుండా తీసుకు వెడుతుంటారు. ఇంత తక్కువ మొత్తం అడిగిన వాడ్ని నిన్నే చూశాను--"
    "నా ప్రాణానికి లక్షే ఎక్కువ. త్వరగా ఇయ్యి"- అన్నాడు శాస్త్రి.
    "నెలకు పది వేలు వడ్డీ కడుతుండాలి -- అప్పు తీర్చేదాకా --" అన్నాడు పోతురాజు.
    "చాలా దారుణంగా వుందీ నీ వడ్డీ రేటు -" అన్నాడు శాస్త్రి.
    "ఇష్టమైతే నే తీసుకో - రెడీ క్యాష్ ఇస్తాను. అన్నీ అసలు నోట్లే !" అన్నాడు పోతురాజు.
    "నువ్వు నన్నేరుగవు కదా-- బాకీ ఎలా వసూలు చేస్తావ్?" అన్నాడు శాస్త్రి ఆశ్చర్యంగా.
    "పోతురాజు కు బాకీపడ్డాక ఇంక తెలియనివాడి వేలగౌతావు ? సప్త సముద్రాల అవతల దాగున్నా వెతికి తీసుకురాగలను. నా వసూలు బెంగ లేదు. నా పద్దతులు నాకున్నాయి. ప్రతి నెలా ఇదే తేదీకి వడ్డీ మాత్రం నిఖార్సు గా కట్టేయాలి...." అన్నాడు పోతురాజు.
    'అలాగే -- " అన్నాడు శాస్త్రి.
    పోతురాజు అతణ్ణి ఓ గదిలో కూర్చోపెట్టి తను పక్క గదిలోకి వెళ్ళి తలుపులు వేసుకున్నాడు. ఓ అయిదు నిముషాల్లో అతను వంద రూపాయల నోట్ల కట్టలు తీసుకుని వచ్చి శాస్త్రిని లెక్క పెట్టమన్నాడు. అవి సరిగ్గా పది వున్నాయి. శాస్త్రి ఆనందంగా ఆ డబ్బు తీసుకుని జేబులో పెట్టుకున్నాడు.
    అప్పుడు పోతురాజు శాస్త్రికి ఒక ఫోటో తీశాడు. తర్వాత అతడి వేలిముద్ర తీసుకున్నాడు. ఆతర్వాత చటుక్కున అతడి భుజం మీద ఏదో గుచ్చాడు. శాస్త్రికి చురుక్కుమంది. "ఏమిటది?" అని అతడు అడిగాడు.
    "నా జాగ్రత్తలై పోయాయి. ఇంక నువ్వు  ఎక్కడికైనా పోవచ్చు--"అన్నాడు పోతురాజు.
    శాస్త్రి బైటకు వచ్చాడు. కొంతదూరం పోయాక శర్మ అతణ్ణి కలుసుకున్నాడు. శాస్త్రి అతడికి జరిగింది చెప్పి -- "పోతురాజు వ్యవహారం చాలా తమాషాగా వుంది. చూస్తుండగా మనం లక్షాధికారులమైపోయాం" అన్నాడు.
    "ఇప్పుడెం చేద్దాం?"అన్నాడు శర్మ.
    "ఈ లక్షా తీసుకుని వెళ్ళి నరసరాజు కిచ్చేద్దాం. అందులోంచి యాభయి వేలు తీసుకుని అప్పారావుకీ -- అందులోంచి పాతిక వేలు తీసుకుని మన ఇంటాయనకు ఇచ్చి మన వాటా అయిదు వేలూ పుచ్చుకుందాం --"
    "బాగానే వుంది . మరి నెలనెలా పోతురాజుకు పదివేలు యిచ్చుకోవద్దూ?" అన్నాడు శర్మ.
    "లక్షంటే అంత నిర్లక్ష్యంగా వున్నవాడికి అంతే కావాలి. మనం మళ్ళీ వాడికి కనబడోద్దు--"
    "కానీ ఒకవేళ మనం పోతురాజు నించి తప్పించుకోలేక పొతే --" అన్నాడు శర్మ.
    "ఇది అనుమానించదగ్గ విషయమే - అయితే పోతురాజు శక్తి సామర్ధ్యాలు మనం తెలుసుకునే ఉపాయం ఒకటి వున్నది-- అదేమిటంటే-- ఇప్పుడే వెనక్కు వెళ్ళి - అయ్యా పోతురాజు గారూ - నేను కాస్త మతిమరుపు మనిషిని ప్రతిరోజూ ఏదో సమయం లో ఎన్నిరోజులయ్యాయో మీరు నాకు కాస్త హెచ్చరిక ఇచ్చే ఏర్పాట్లు చేయండి-- అని అడుగుతాను. ఆ తర్వాత ఓ వారం రోజులు మనమతన్ని తప్పించుకు తిరుగుదాం-- మన్ని పట్టుకోలేకపోతే అప్పుడు దర్జాగా లక్ష రూపాయలు తీసుకుని నరసరాజు దగ్గరకు వెళ్ళొచ్చు--" అన్నాడు శాస్త్రి.
    అతను మళ్ళీ పోతురాజు దగ్గరకు వెళ్ళాడు. పోతురాజు అంతా విని -- "రోజూ ఎన్నింటికి గుర్తు చేయామంటావ్ చెప్పు -- బాగా ఆలోచించుకుని మరీ టైము చెప్పు. ఎందుకంటె ఆ టైముకి నువ్వు నిద్రపోతున్నాసరే లేపి మరీ గుర్తు చేయడం జరుగుతుంది. తర్వాత విసుక్కుని లాభం లేదు--" అన్నాడు.
    "రాత్రి ఎనిమిది గంటలకు -" అన్నాడు శాస్త్రి.
    
                                     6
    జేబులో డబ్బు చేరింది. అందులో బాకీ వసూలు క్రింద పదిహేను వేలు తమ స్వంతం . శాస్త్రి , శర్మ హుషారుగా ఓ హోటల్లో మకాం పెట్టారు. అక్కడ గదిలో పూర్తిగా తమ వేషాలు మార్చుకున్నారు. ఇద్దరూ నడి వయస్కులైన ముస్లీం లా తయారయ్యారు. తర్వాత హోటల్లోంచి బయటపడ్డారు.
    ఆ వేషాల్లో వాళ్ళకి ఒకర్నొకరు గుర్తించుకోవడమే కష్టంగా వుంది. కాబట్టి పోతురాజు మనుషులు గుర్తిస్తారన్న బాధ లేదు. అదీకాక పోతురాజు ఇల్లు వదిలినప్పట్నించి జాగ్రత్తగా వున్నారు. ఎక్కడా ఎవ్వరూ తమ ననుసరించిన జాడ లేదు. అందుకని ఇద్దరూ ధైర్యంగా హోటల్లోంచి బైటపడి మురికివాడ వైపు వెళ్ళారు. ఆ ప్రాంతాల తాముంటామని ఎవ్వరూ ఊహించలేరని ఇద్దరూ అభిప్రాయపడ్డారు.
    వాల్తేరులో మురికివాడల కేం లోటు లేదు. అయితే ఈ మురికి వాడల ప్రత్యేకత ఏమిటంటే -- అవీ మధ్యతరగతి ఇళ్ళలాగే వుంటాయి. ఒకవిధంగా చెప్పాలంటే అదీ సరైన మాటకాదు. వాల్తేరు లో కొన్ని కొన్ని ప్రాంతాల మధ్యతరగతి ఇళ్లనీ, మురికి వాడల్ని వేర్వేరుగా గుర్తించడం అసాధ్యం. ఆ గొప్పతనం మురికివాడలదో, మధ్య తరగతి ఇళ్ళదో చెప్పడం కష్టం.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS