Previous Page Next Page 
వసుంధర కధలు-5 పేజి 27

 

    "గాంధీగారు అన్నేసి రోజులు నిరాహారదీక్ష ఎలా చేసేవాడో కానీ నాకు మాత్రం ఈ రెండు రోజులకే ప్రాణం కడంటిపోయింది. చచ్చిపోతున్నానెమో నాన్న అనుభూతి కల్గుతుంది--..." అన్నాడు శాస్త్రి.
    "ఒకవేళ మనం చచ్చిపోయామేమో...." అన్నాడు శర్మ.
    "చచ్చిపోతే మనం శవాలమ యుండాలి. ఆత్మల మైతే ఏ సంకెళ్ళు బంధించలేవు. ఒకవేళ బంధించినా సంకల్ప మాత్రాన విడిపోతాయి . పోనీ మనం అత్మలమే అనుకుందాం-- ఈ సంకెళ్ళు విడిపోవు గాక..." అన్నాడు శాస్త్రి. అతడి నోటంట ఆ మాటలు రావడమే తడవుగా ఇద్దరికీ హటాత్తుగా సంకెళ్ళు విదిపడ్డాయి. మిత్రులిద్దరూ టకీమని కుర్చీల్లోంచి లేచిపోయారు.
    "గురూ-- కొంపతీసి మనం నిజంగానే అత్మలమై పోయామా?" అన్నాడు శర్మ.
    శాస్త్రికి అంతా అయోమయంగా వుంది. ముందు కాళ్ళూ, చేతులూ నొప్పి పెడుతున్నాయి. వళ్ళంతా నీరసం. ఇక్కడ్నించి పారిపోవాలంటే వంట్లో శక్తి కావాలి. శక్తి కావాలంటే భోజనం కావాలి. ముందు మంచినీళ్ళు.
    "మంచినీళ్ళు కావాలి!" అన్నాడు శాస్త్రి.
    సరిగ్గా అప్పుడే శర్మ కళ్ళకు గది మూలగా వున్న వాష్ బేసిన్ కనబడింది. అందులో కుళాయి వుంది. కుళాయి లోంచి నీళ్ళు వస్తున్నాయి. ఇద్దరూ ముందు కడుపు నిండా నీళ్ళు పట్టించారు. కొంత శక్తి వచ్చినట్లయింది. అప్పుడు శర్మ -- "మనం అనుకున్నవన్నీ జరుగుతున్నాయి. కాబట్టి ఆత్మలమనుకోవాలా? ఆకలి దప్పికలు బాధిస్తున్నాయి కాబట్టి మనుషులమనుకోవాలా?" అన్నాడు.
    "పిచ్చి పిచ్చి ఆలోచనలు పెట్టుకోకు. మనం మనుషులమే. ముందా తలుపు దగ్గరకు వెళ్లి ప్రయత్నిద్దాం. అత్మలమైతే తలుపులడ్డగించవు. కానీ మానని అడ్డగించవచ్చు--' అంటూ శాస్త్రి మిత్రుడితో గుమ్మం వైపు నడిచాడు. వాళ్ళు గుమ్మాన్ని సమీపించడమేమిటి ? రెండు తలుపులు బార్లా తెరుచుకున్నాయి.
    శర్మ ఆశ్చర్యంతో నోరావలించాడు. ఎవరో అక్కడే వుండి తమను కనిపెడుతున్నారు. తమతో ఆడుకుంటున్నారు. మిత్రులిద్దరూ తటపటాయిస్తూ ముందడుగు వేశారు. ప్రమాదం పొంచి వున్నదని ఏ క్షణాన్నయినా అది మీద పడవచ్చునని ఇద్దరికీ అనిపిస్తోంది -" అయినా చేయగలిగినదేముంది? ఇద్దరూ గుమ్మం లోకి వచ్చారు.
    అప్పుడు చూశారు వాళ్ళు - పక్కనే వున్న వ్యక్తిని..... ఆ వ్యక్తీ పదేళ్ళ బాలుడు౧    "ఎవరు మీరు?' అన్నాడు ఆ అబ్బాయి వీళ్ళిద్దరి వంకా ఆశ్చర్యంగా చూస్తూ.
    మిత్రులిద్దరికీ ఏం చెప్పాలో తెలియలేదు-- "నువ్వెవరు?" అన్నాడు శాస్త్రి.
    "నాపేరు రాము. నరసరాజు గారి మనవణ్ణి . మా తాత నన్నెప్పుడూ ఇటువైపు రానివ్వడు. ఈ గది కున్న స్వేచ్ లు ముట్టుకొనివ్వడు. నాకిక్కడ ఆడుకోవడం సరదా. ఇప్పుడాయన ఇంట్లో లేడు. ఇలా అడుకుందుకు వచ్చాను. ఒకో స్వేచ్ నే నొక్కుతున్నాను. ఓ స్విచ్ నొక్కేసరికి ఈ గది తలుపులు తెరుచుకున్నాయి. మీరు బైటకు వచ్చారు --"
    శాస్త్రి బుర్ర చురుగ్గా పనిచేసింది. భగవంతుడు రాము రూపంలో తమకు సాయం వచ్చాడు. ఈ సాయం ఉపయోగించుకోవాలి . అతను రాము వంక చూసి - "నరసరాజు గారి స్నేహితులం. మేము ఇప్పుడే ఇక్కడికి వచ్చాం. పదినిముషాల క్రితం దాకా అయన ఇక్కడే వున్నారు. ఇప్పుడే వస్తామని బయటకు వెళ్ళారు.
    నువ్వేమో అయన ఇంట్లో లేరంటున్నావు...." అన్నాడు.
    రాము బుర్ర గోక్కుని -- "ఇంట్లోంచి బయల్దేరి గంటయింది. అయితే నాకు తెలీకుండా ఇలా వచ్చాడన్న మాట తాతయ్య. తాతయ్య కు నేనిటు వైపు రావడం ఇష్టముండదు. ఎప్పుడూ ఇటు వైపు రాకుండా ఎవరో ఒకరు కాపలా వుంటారు. ఇన్నాళ్ళ కీ వేళ నాకు అవకాశం దొరికింది. తాతయ్య ఇక్కడ్నించే అలా బైటకి వెళ్ళిపోయుంటాడు...." అన్నాడు.
    నరసరాజుది చాలా పెద్ద యిల్లు. వీధి వైపు ఇంట్లో వాళ్ళెవరూ మసలరు. వీధిలోంచి బాగా లోపాలకు వేదితేనే -- ఆడవాళ్ళు, పిల్లలు మసిలే ఆవరణ వస్తుంది. శాస్త్రి, శర్మ బంధించవలసిన ప్రాంతం వీధి గదిలోంచి కుడిపక్కగా వుంది. అది నరసరాజు ప్రత్యేకమైన ఆవరణ. అక్కడ ఇంట్లో వాళ్ళెవ్వరూ మసలరు.
    "మీ తాతయ్య ఎక్కడి కెళ్ళాడో నాకు తెలుసు. అక్కడ పిల్లలు చూడ్డానికి మంచి తమాషాలున్నాయి" మాతో వస్తావేమిటి?" అన్నాడు శర్మ.
    రామును ఒప్పించడానికి వాళ్ళకు ఎంతో సేపు పట్టలేదు. ఇంట్లో ఎవ్వరూ చూడకుండా వీధి దారినే వాళ్ళు బయటకు వచ్చేశారు.
    
                                      4
    నరసరాజు , తమ్ముడు కలిసి ఇంటి గుమ్మం మెట్లెక్కుతూ --"నమస్కారమండీ -- " అన్న పిలుపు వినబడి ఉలిక్కిపడి వెనక్కు తిరిగారు. వెంటనే వాళ్ళ ఉలికిపాటు ఆశ్చర్యంగా మారిపోయింది.
    "మీరా?' అన్నాడు నరసరాజు ఆశ్చర్యంగా.
    "చాలాసేపట్నించి మీ యింటి ముందు కాపు కాశం. మీరు ఇప్పటికి వచ్చారు. త్వరగా యాభై వేలూ తెచ్చిచ్చేయండి. అవతల మాకు చాలా పనులున్నాయి--"అన్నాడు శర్మ.
    "మీకింకా బుద్ది రాలేదూ?" అన్నాడు నరసరాజు ఆశ్చర్యంగా.
    "సినిమాల్లోనూ, కధల్లోనూ కూడా మొదట్లో కష్టపడ్డా చివర్లో బుద్ది తెచ్చుకునేది విలన్లే! మనసినిమాల్లోనూ, కధల్లోనూ వాస్తవికత ఎంతో చక్కగా ప్రతిబింబించబడుతున్నదని మేము నమ్ముతాం. కాబట్టి బుద్దంటూ వస్తే అది మీకే రావాలి. మాకు కాదు --" అన్నాడు శర్మ.
    "బాగా అలోచించి మంచి డైలాగే చెప్పావు గానీ నా శిక్షల డోసు అలా అలా పెరుగుతుంటుంది. రెండో సారిమీచేత సర్కస్ చేయించానంటే మీరింకా బ్రతికి బట్టకట్టలేరు--" అన్నాడు నరసరాజు.
    "మీకింకా బుద్ది రాలేదా?" అన్నాడు శాస్త్రి.
    నరసరాజు  పులిలా గాండ్రించాడు.
    'అయ్యా -- నరసరాజు గారూ -- అప్పుడే మీ స్టేటస్ దిగిపోతోంది. ఇదివరలో సింహం లా గర్జించారు. ఇప్పుడు పులిలా గాండ్రిస్తున్నారు. ఇంకా స్సేపు పొతే  కుక్కలా మొరిగి ఆఖరికి పిల్లిలా మ్యావంటావు. లోపలకు వెళ్ళేక ఇంకా యాభై వేలూ తెచ్చి మాకివాలనిపించకపోతే ఒక్కసారి మీ కోడలి గారిని -- అమ్మా-- రాము ఏడి అని అడిగి చూడండి. వాళ్ళ సమాధానం విని అప్పుడు పరుగున వచ్చి యాభై వేలు తెచ్చి ఇచ్చేయండి" అన్నాడు శాస్త్రి.
    "ఏమన్నావ్?" నరసరాజు చేతులు వణికాయి. అప్పటికి శాస్త్రి , శర్మ అరుగుల మీద స్థిరపడ్డారు. "తమ్ముడూ, నువ్వు లోపలకు వెళ్ళి రాము గురించి అడిగిరా -- నాకేదో భయంగా వుంది-" అన్నాడు.
    తమ్ముడు అయిదు నిమిషాల్లో బయటకు వచ్చి -- "రామూ ఇంట్లో లేడు-- ఎక్కడికైనా అడుకుందుకు వెళ్ళాడేమో -- అన్నాడు నరసరాజుతో.
    "ఎక్కడికీ వెళ్ళలేదు. మా దగ్గర క్షేమంగా వున్నాడు. మీరు యాభై వేలు ఇచ్చేస్తే క్షేమంగా మీ దగ్గరకు చేరుకుంటాడు. లేదా ఎక్కడో సర్కస్ చేస్తుంటాడు--"అన్నాడు శాస్త్రి.
    "అభం శుభం ఎరుగని పసివాడ్ని తీసుకుపోవడానికి మీకు చేతులెలా వచ్చాయి? వెంటనే వాడ్ని తీసుకురండి. లేకపోతే నేనేం చేస్తానో నాకే తెలియదు...."అన్నాడు నరసరాజు.
    "మీరేం చేస్తారో మీకు తెలియదు. కానీ నేనేం చేస్తానో నాకు తెలుసు. మీకు తెలుసు. ఆ విషయం గుర్తుంచుకుని యాభై వేల విషయంలో తొందరగా ఓ నిర్ణయం తీసుకోండి--" అన్నాడు శర్మ.
    కాసేపు వారి నలుగురి మధ్యా నిశ్శబ్దం రాజ్యమేలింది.
    "మిస్టర్ మీ పేర్లేమిటి?" అన్నాడు నరసరాజు.
    "ఇప్పటికి మా పేర్లడగాలని తెలిసింది మీకు--" అంటూ శాస్త్రి , శర్మ తమ పేర్లు చెప్పారు.
    "మిస్టర్ శాస్త్రి! ఒక్కసారిగా యాభై వేలు తేగల గొప్పవాడిని కాను నేను. నీకు రెండు చేతులూ జోడించి నమస్కరిస్తాను. మా మనుమడ్ని నాకు తెచ్చి యివ్వు. ఆ పసివాడు ఏం అగచాట్లు పడుతున్నాడోనని నా మనసు గిలగిలలాడిపోతున్నది. ప్లీజ్ మిస్టర్ శాస్త్రి! నా మనుమడ్ని నాకు తెచ్చి యివ్వు ...." అన్నాడు నరసరాజు.
    ఆయన మాటలు ఆపి ఎడ్వ నారంభించాడు . శాస్త్రి ఆశ్చర్యపోయాడు.
    "అయ్యా-- నరసరాజు గారూ -- చాకులాంటి కుర్రాళ్ళు ఇద్దరినీ మోసం చేసి బంధించి కుర్చీలో కూర్చోబెట్టి గిరగిరా తిప్పి రెండు రోజులు తిండీ , నీళ్ళు లేకుండా చేశారు. అప్పుడు మీ కంట ఒక నీటి చుక్కయినా చూడలేదు. నేను.  పదేళ్ళ మీమనమడికోసం కంటికి మంటికీ ఏకధారగా ఎడ్చేస్తున్నారు. మేము మీవంటి రాక్షసులం కాదు. కాబట్టి మీ మనుమడి కి ఎలాంటి ఆపదా వుండదు. అయితే మీ కల్లబొల్లి ఎడ్పులకు కరిగిపోయి వచ్చిన పని మర్చిపోతామనుకోకండి. యాభై వేలు ఇచ్చి తీరాల్సిందే --" ఇంట్లోంచి తెచ్చిచ్చినా సరే-- లేదా బ్యాంకు కెళ్ళి తెచ్చిచ్చినా సరే --" అని వాచీ చూసి "ఇంక బ్యాంకుకు అరగంట మాత్రమే వుంది. త్వరపడండి--" అన్నాడు శాస్త్రి.
    "బ్యాంకుకు వెళ్ళి యాభయి వేలు తేవాలంటే ఇప్పుడు లాభం లేదు. రాత్రి దాకా ఆగాలి. అదీ నా పరిస్థితి -- " అన్నాడు నరసరాజు. అయన చూపులు దీనంగా వున్నాయి. మీసాలు క్రిందకు వ్రాలి వున్నాయి.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS