"ఎక్కడో ఏదో తిరకాసుంది, నాకు అర్ధం కావటం లేదు. నువ్వేదయినా ప్రమాదంలో ఇరుక్కున్నావేమో నని నా అనుమానం. నీ కేప్పుడే కష్టం కలిగినా రాజమండ్రిలో సునీతా హోటల్ మేనేజర్ని కలుసుకుని భుజంగం కావాలని చెప్పు. అతడు మనం కలుసుకునే ఏర్పాటు చేస్తాడు. ఇంతకూ మించి నేనేమీ చెప్పలేను. నేను గొప్పవాళ్ళకు నేరాలు చేసే మేనేజర్ని కావచ్చు, కానీ నాకూ హృదయముంది. అది నిన్ను కోరుతోంది. ఈ విషయం గుర్తుంచుకుంటే చాలు" అంటూ అతనక్కడ్నించి వెళ్ళిపోయాడు.
కాసేపటికి శేషారావును భుజం మీద వేసుకుని జయరాజు వచ్చాడు. రాధ కంగారుగా "ఏమయింది?' అని అడిగింది.
"వాణ్ని ప్రక్కనే వున్న ఏట్లో కి తోసేశాను. వాడికి ఈదే ఓపిక కూడా వున్నట్లు లేదు. బహుశా శవమై తేల్తాడు. మీ ఆయనకి మాత్రం చాలా గట్టిగా దెబ్బలు తగిలాయి. నా రాధతో అమానుషంగా ప్రవర్తిస్తావుట్రా అంటూ వాడి మీద పడి ఒళ్ళేరాకుండా యుద్ధం చేశాడు. ఇప్పుడు అర్జంటుగా ఏదో నర్సింగ్ హోమ్ కి పరుగెత్తాలి" అన్నాడు జయరాజు.
12
"నేనెక్కడున్నాను?" అన్నాడు శేషారావు కళ్ళు తెరిచి.
"ఏమండీ -- ' అంది రాధ . సంతోషంతో ఆమెకు నోట ,మాట రాలేదు.
"రాధా -- నా రాధా -- ఎలా వున్నావు రాధా?" అన్నాడు శేషారావు ఆత్రంగా.
"నాకేమండీ- నిక్షేపంగా వున్నాను. మీకెలాగుంది?" అంది రాధ.
"నువ్వు కళ్ళ కెదురుగా కనబడుతుంటే నాకే బాధా తెలియటం లేదు రాధా -- నువ్విక్కడే ఇలాగే కుర్చుండి పో రాధా! నాకిప్పుడెంతో హాయిగా వుంది రాధా" అన్నాడు శేషారావు.
"ఆయన్నాట్టే మాట్లాడించకండి .విశ్రాంతి అవసరం" అంది నర్స్.
మాట్లాడుతూనే మగతలోకి వెళ్ళిపోయాడు శేషారావు. అతడి వంక చూస్తూ బాధగా నిట్టూర్చింది రాధ. అతడి పై ప్రేమ పొంగి పొరలి పోగా ఆప్రయట్నంగా అతడి నుదుటి పై ముద్దు పెట్టుకుంది -- అక్కడ నర్స్ వున్న విషయం కూడా గమనించక.
"మిమ్మల్ని డాక్టర్ పిలుస్తున్నారు" అంది ఓ నర్స్ లోపలకు వచ్చి.
రాధ ;లేచింది. డాక్టర్ గదికి వెళ్ళింది.
"అయన కేలా వుంది డాక్టర్ ?' అంది రాధ.
"ప్రమాదం గడిచినట్లే -- అయితే అతను కోలుకోవటం నీలో వుందమ్మా !" అన్నాడు డాక్టర్.
"నాలోనా? నేనేం చేయగలను డాక్టర్?" అంది రాధ.
"నీకు కొత్తగా పెళ్ళయిందని నీ పసుపు బట్టల్ని చూస్తేనే తెలుస్తోంది. అలాంటప్పుడు ఇలాంటి వార్త చెప్పటం ఏ డాక్టరు కయినా బాధగానే వుంటుంది. అయినా చెప్పక తప్పదు. నువ్వు నీ ప్రవర్తనతో అతడికి జీవితం పై ఉత్సాహం కలిగించాలి. ఎట్టి పరిస్థితుల్లోనూ వైరాగ్యం కలగ నివ్వకూడదు. అప్పుడే అతను త్వరగా కోలుకోగల్గుతాడు" అన్నాడు డాక్టర్.
"దానికేముంది డాక్టర్, అది భార్యగా నా విద్యుక్త ధర్మం" అంది రాధ.
"భార్యగా నీ విద్యుక్త ధర్మం నిర్వర్తించవలదనే నే చెప్పేది!" అన్నాడు డాక్టర్.
"అంటే?"
"నువ్వు నీ భర్తని ఆవేశ పర్చకూడదు. ఉద్రేకం కలిగించకూడదు. స్త్రీ పురుషుల కలయిక గురించిన ప్రసక్తి అతడి వద్ద రానివ్వకూడదు-"
రాధ సిగ్గుతో ముడుచుకుపోయింది.
"డాక్టర్ల దగ్గర సిగ్గు పడగూడదు. నీకు అన్నలాంటి వాణ్ణి. గుండె రాయి చేసుకుని నా మాటలు విను. నీ భర్త బహుశా ఇక ముందు సంసార జీవితానికి పనికి రాడు. అతడికి తగిలిన దెబ్బలలాంటివి. అది నీ దురదృష్టం. కానీ ఆ విషయం నీకు తెలిసినట్లు అతనికి తెలియకూడదు. అతనే ఒకవేళ నిన్ను ప్రోత్సహించినా నీ అనాసక్తతను ప్రదర్శించు. సృష్టి కార్యం పట్ల నీకు గల జుగుప్సాభావాన్ని అతనికి తెలియజేయి. అతను సంతోషిస్తాడు. నీ అనాసక్తకు కారణాల గురించి అతను మరీ మరీ నొక్కించి అడిగితె -- మానభంగం జరిగిందని, అప్పట్నించి ఈ జుగుప్స ప్రారంభమయిందని అబద్ద మాడేయ్. అతనికి జీవితం పై విరక్తి కలగనివ్వకు. హాయిగా బ్రతకనివ్వు" అన్నాడు డాక్టర్.
రాధ డాక్టర్ మాటలకు మ్రాన్పడి పోయింది. కాసేపటికి తమాయించుకుంది.
'అంతా అర్ధమైంది డాక్టర్!'అంది రాధ.
ఆమెకు అర్ధమైన దేమిటో డాక్టర్ కు తెలియదు.
13
రిక్షాలో కూర్చుని రాధ అలోచిస్తోంది.
శేషారావు తన్ను దారుణంగా మోసగించాడు.
అతడు తన పేదరికాన్ని ఆసరాగా చేసుకున్నాడు. తండ్రితో పోరాటాన్నీ, ఓ ప్రేమ కధనూ సృష్టించి అందులో తను ఆదర్శ ప్రేమకుడుగా నటించాడు. తన బంధువు చేత తనకు మానభంగం చేయించి ఫలితం గా ఏ బిడ్డయినా పుట్టినా ఆ బిడ్డకు తను తండ్రి నవుదామనుకున్నాడు. మానభంగం జరిగినాక కూడా తను పెళ్ళి చేసుకుంటానని విశాల హృదయాన్ని నటించాడు. నిజానికది విశాల హృదయం కాదు. ఇరుకు గృహము. తన స్వార్ధం కోసం ఓ అమాయకురాలి జీవితాన్ని బలిపెట్టే పధకాలు విశాల హృదయాల్లో ఉండవు. తనకొక భార్య కావాలి. ఆమె తన అసమర్ధతను నిందించగూడదు. తన పరువు జ=బజారు పాలు చేయగూడదు.
అందుకోసం ఎన్నో కధలల్లాడు. ఎన్నో పాత్రలతో ఒక నాటకం ఆడించాడు. తన్ను పెళ్ళి చేసుకున్నాడు.
నకిలీ జయరాజుగా నటించిన భుజంగం తన పట్ల జాలి పూని ఈ కధ చెప్పకపోతే తను తప్పకుండా జీవితాంతం శేషారావు కాళ్ళ దగ్గరే పడి వుండేది.
భుజంగం తనకు మానభంగం చేసి మహోపకారం చేశాడు. అదే కొండల్రావు మనిషి వల్ల జరిగి వుంటే ఈ జన్మలో తను ఈ ట్రాప్ నుంచి బయట పడ గల్గి వుండేది కాదు.
శేషారావు తనమెడలో తాళి కట్టి వుండవచ్చమో కానీ భుజంగానికీ తనకూ అంతకుముందే వివాహమై పోయింది. అది రాక్షసమా, గాంధర్వమా -- శాస్త్ర కారులేదో పేరు పెట్టుకోవచ్చు. అదే నిజమైన వివాహం. ఈమాత్రం తను అర్ధం చేసుకోలేక శేషారావు చేత మెడలో తాళి కట్టించుకుంది. అయితే వచ్చేటప్పుడు మంచి పని చేసింది. తాళి తీసి అతడి తలగడ క్రింద పెట్టింది.
"ఇదేనమ్మా సునితా హోటల్ !' అన్నాడు రిక్షావాడు.
రాధ రిక్షా దిగి డబ్బులిచ్చి హోటల్ మేనేజర్ దగ్గరకి వెళ్ళి భుజంగం కావాలని అడగబోయి ఆగిపోయింది .
అతడే భుజంగం!
"నువ్వు వస్తావని నాకు తెలుసు. వచ్చేది నాకోసమనీ తెలుసు. నువ్వు చెప్పబోయే కధ మాత్రం నాకు తెలియదు. అదొక్కటే చెప్పు!" అన్నాడతను.
అతడి కళ్ళలో ఆమె పట్ల ప్రేమ కనిపిస్తోంది.
వివాహాలు రాక్షసమనీ, గాంధర్వమనీ వున్నాయి కానీ అవి వధువు ఇష్టం మీద జరిగేవి . అందువల్ల శాస్త్ర కారులు వీరి వివాహానికి బహుశా మానభంగ వివాహమని పేరు పెట్టారేమో! ఎందుకంటె భుజంగమామెను మానభంగం కావించడం వల్లనే వారి వివాహం జరిగింది. అప్పట్లో ఆమోదించకపోయినా ఇప్పుడది తనకు మహోపకారంగా రాధ భావించనూ భావిస్తోంది.
-----అయిపొయింది -----
