"యిప్పుడు నాకెవ్వరున్నారు బాబూ- నన్ను నేనే పోషించుకోవాలి ."
"అయితే యిలా పనిచేసుకుని బ్రతకడమేం కర్మ నీకు. వయసులో వున్నావు. ఆరోగ్యంగా వున్నావు. నువ్వు తలచుకుంటే యింకో రకంగా కూడా సంపాదించుకోవచ్చు."
రత్తమ్మ నిట్టూర్చి -- "వ్యభిచారం నాకు సరిపడదు బాబూ ! నేనలాంటి దాన్ని కాదు" అంది.
సీతన్న పంతులు అనుమానంగా "మరైతే మా యింట్లో పని చేయగలవా ?' అన్నాడు.
"అది వేరు యిది వేరు" అంది రత్తమ్మ "నా కిష్టమై నేను వ్యభిచారం చేస్తే అది తప్పు. కష్టపడి వళ్ళు వంచి పనిచేసుకోవాలని న కోరిక. అందుక్కూడా ఏదైనా నా మనసుకు నచ్చని పనిచేస్తే అ తప్పు నాది కాదు. మీదే అవుతుంది."
"చాలా తెలివిగా మాట్లాడుతున్నావు." అన్నాడు సీతన్న పంతులు. "ఏమైతేనేం ఆ తెలివితేటలే నీకీ యింట్లో పనిప్పిస్తున్నాయి."
5
రత్తమ్మ మళ్ళీ సీతన్న పంతులింట్లో పనికి జేరింది. అందరూ అయన ఔదార్యాన్ని మెచ్చుకున్నారు. సీతన్న పంతులికి రత్తమ్మతో అన్ని రకాల సరదాలూ తీరుతున్నాయి. తన సరదాల కోసం అయన అప్పుడప్పుడు భార్యకు నిద్ర మాత్రలిచ్చి పడుకో బెట్టేసేవాడు కూడా. రత్తమ్మ మకాం తనింటికే మార్చాలని కూడా ఆయననుకున్నాడు. కానీ అలాగ జనాన్నింట్లో చేరనిస్తే అలుసని గౌరీ దేవి అందుకొప్పు కోలేదు.
రత్తమ్మ కిప్పుడు రోజులు బాగానే గడిచిపోతున్నాయి. ఆమెకు సీతన్న పంతులంటే కోపం పెరిగిపోతోంది కానీ గౌరీ దేవంత దగ్గరగానూ వెళ్ళిన మూలాన ఏ మూలో అభిమానమూ చేరుకుంటోంది.
అలా కొంతకాలం గడిచేక ఒకరోజున రత్తమ్మ తనకు నెల తప్పిందని సీతన్న పంతులికి చెప్పింది.
'అలాగా -- తండ్రి ఎవరు ?' అన్నాడాయన.
"మీరే?"
"సీతన్నపంతులులిక్కిపడలేదు. 'చాలా మంచివార్త చెప్పావే" అన్నాడు. "నువ్వు బిడ్డ తండ్రి ఫలానా అని చెప్పకుండా ఉన్నావంటే నీ బిడ్డ నా బిడ్డలా పెరుగుతాడు."
రత్తమ్మ ఆశ్చర్యంగా - 'అంటే?' అంది.
"వాడికి మంచి బట్టలు కుట్టిస్తాను. మంచి చదువులు చెప్పిస్తాను. వాడు గొప్పవాడవుతాడు. అప్పుడు నువ్వూ గోప్పదానివి కావచ్చు.
"బాబూ! అప్పటి దాకా ఎందుకు? ఇప్పుడే నేను గొప్పదాన్ని కాకూడదా - నిజానికి నేను మీ రెండో పెళ్ళాన్ని కదా!' అంది రత్తమ్మ.
"చూడు నువ్వు నా బిడ్డకు తల్లివి కాగలవు. కానీ నాకు భార్యవు కాలేవు. ఇదీ ఈ సమాజం పద్దతి ." అన్నాడు సీతన్న పంతులు. అయన దానికి నెమ్మదిగా నచ్చజెప్పి తన మాటలకు ఒప్పించాడు.
ఆ తర్వాత సీతన్న పంతులు బుర్ర చకచకా పనిచేసింది. రత్తమ్మ వల్ల తన కేప్పటికైనా ప్రమాదమేనని అయన గ్రహించాడు. గర్బిణీ స్త్రీ కి జాగ్రత్తలు అంటూ అయన ఆమె చేత రోజూ ఓ టాబ్లెట్ మిగించేవాడు. అది స్లో పాయిజన్ అని దానికి తెలియదు.
సరిగ్గా నెల రోజుల తర్వాత ఏదో తెలియని రోగంతో ఆమె చచ్చిపోయింది. అది హత్య అయ్యే అవకాశముంటుందని కూడా ఎవ్వరూ ఆలోచించలేదు.
రత్తమ్మ శవానికి దగ్గరుండి సీతన్న పంతులు యధావిధిగా దహన సంస్కారాలు జరిపించాడు. ఒక పనిమనిషి పట్ల అయన చూపించిన శ్రద్ధ చూసి అంతా మెచ్చుకున్నారు.
"పాపభీతి లేని మనుషులు వాళ్ళు. అందుకే అలా అనుభవిస్తుంటారు. లేకపోతె యింత చిన్నవయసులో చావు రావలసింది కాదు దానికి...." అంది గౌరీదేవి బాధగా.
"అంటే ఏమంటావ్?" అన్నాడు సీతన్న పంతులు.
"మనిషి పాపాలు చేయకూడదు. ఎవరు చేసిన పాపాలు చివరికి వాళ్ళనే కట్టి కుదుపుతాయి...."అంది గౌరీ దేవి.
"అలాగనకే బాబూ - మనమూ బోలెడు సంపాదించు కుంటున్నాం. ఎక్కడా ఏ పాపం లేకుండానే అంతా సంపాదించుకుంటున్నామా?" అన్నాడు సీతన్న పంతులు.
"మన మనసులో పాపచింతన లేకపోతే ఏ పాపమూ మన నంటదు. మనం పచ్చగా ఉన్నామంటే దానర్ధం మనమే పాపాలు చేయడం లేదనే! తెలిసి చేసిన పాపాలే కానీ తెలియక చేసిన పాపాలు మన నంటవు...."
అప్పుడు సీతన్న పంతులుకి రత్తమ్మ మాటలు గుర్తు కొచ్చాయి. అది తప్పు చేసినా ఆ తప్పు దాని కిష్టం లేనప్పుడు- అది సీతన్న పంతులుదే అవుతుందంది రత్తమ్మ. అంటే తను పాపం చేశాడు. తెలివి చేశాడు. రత్తమ్మ ను కోరడం మొదటి పాపం. దాన్ని స్లో పాయిజనింగు తో చంపడం రెండో పాపం.
"తెలిసి చేసిన పాపాలు కట్టి కుదుపుతాయి ." అంది గౌరీదేవి.
తన పాపాలు తననేం చేస్తాయో!
6
"హలో!" అన్నాడు సీతన్న పంతులు.
"నేను - పోలీస్ స్టేషన్నించి మాట్లాడుతున్నారు. మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. గవరయ్య జైల్నించి తప్పించుకున్నాడు. వాడికి మీమీద బాగా పగ ఉంది. మీ జాగ్రత్తలో మీరుండడం మంచిది. పోలీసులు కూడా మీకు తగినంత రక్షణ ఇవ్వగలరు..." అంది అవతల గొంతు.
అప్పుడు సీతన్న పంతులి శరీరంలో సన్నని వణుకు ప్రారంభమైంది.
గవరయ్య నాయన ఆరోజు చూశాడు. వాడి భార్య తన పక్కలో ఉంటె వాడు చూసిన చూపు మరిచి పోడాయన.
అయితే గవరయ్య లో ఇంకో గొప్పతనముంది. వాడు భార్యను తిట్టలేదు. ఆమె నసహ్యించుకోలేదు. తనతో వచ్చేయమన్నాడు. ఆమెను పని మనిషిగా చేయడం తప్పు తనదే నన్నాడు. జరిమానాగా డబ్బు, నగలు తీసుకొని వేడతానన్నాడు.
అప్పుడు తనూరుకుని ఉంటె!
రత్తమ్మ , గవరయ్య కలిసి సుఖంగా కీవించేవారు. ఆనందంగా బ్రతికేవారు. తను చేసిన తప్పుకు గవరయ్య జరిమానా వేశాడు. అది గవరయ్య జడ్జిగా వ్యవహరించిన విశేషం. తన తీర్పుకు సీతన్న పంతులు విలువ నిస్తాడని వాడనుకున్నాడు.
రత్తమ్మకు సీతన్న పంతులి సాంగత్య మిష్టం లేదు. అయన ఆమెను మానభంగం చేసినట్లే లెక్క!
మానభంగానికి కోర్టులో శిక్ష ఏమిటి?
జరిమానా, జైలుశిక్ష , ఒకోసారి ఉరికంబం.....
గవరయ్య తనను జరిమానా తో వదిలిపెట్టాడు. కాని తను గవరయ్య ను వదిలిపెట్టలేదు. వాడికి జైలుశిక్ష పడేలా చేశాడు. అప్పుడు కూడా గవరయ్య తన భార్యను నేరం నుండి తప్పించాడు.
తనకు భార్య అయిందని, తనతో కాపురం చేసిందని గవరయ్య తన భార్య తప్పుల్ని క్షమించడమే కాక - ఆమెను జైలు పాలవకుండా రక్షించాడు.
సీతన్న పంతులెం చేశాడు?
అనుభవించినంత కాలం అనుభవించి అటుపైన ఆమెను చంపేశాడు.
చాలా దారుణమైన పాపాలివి. వీటికి శిక్ష తప్పదు.
ఇప్పుడు గవరయ్య జైల్నించి పారిపోయి వస్తున్నాడు వాడికి తనమీద పగ.
"నేను పాపం చేశాను. నా పాపానికి ప్రాయశ్చిత్తం చేసుకోవాలి...."అనుకున్నాడు సీతన్న పంతులు.
"ఎలా?"
ముందాయన గవరయ్య కు డబ్బివ్వాలను కున్నాడు. తనకు తానై వాడి ఎదుట పడలేడు. అందుకే అయన భీమేంద్రకు కబురు పెట్టాడు.
భీమేంద్ర గురించి ఎక్కువగా ఎవరూ చెప్పనవసరం లేదు. ఊళ్ళో గొప్ప గొప్పవాళ్ళందరూ గొప్పగా చెలామణీ అవడానికి అతడు సహకరిస్తుంటాడు.
భీమెంద్రకు గవరయ్య గురించి క్లుప్తంగా చెప్పి - "నాకు వాడంటే భయం లేదు. జాలి ఉంది. వాడి భార్య కూడా పోయింది. ఎలాగో అలా వాడు సుఖంగా బ్రతకాలి. మళ్ళీ మంచి మనిషి కావాలి. వాడు పోలీసులకు దొరక్కుండా సాయం చేద్దాం. వాడింకో ఊళ్ళో ఎక్కడైనా చిన్న వ్యాపారం చేసుకుంటానంటే పది పదిహేను వేలదాకా సాయం చేస్తాను" అన్నాడు.
గవరయ్య నందు కొప్పించడానికి భీమెంద్రకు వేరే ఫీజుంటుంది.
"మీరు చెప్పింది బాగానే ఉంది. వాడోప్పుకోకపోతే ఏం చేయమంటారు-- ఫినిష్ చేసేయోచ్చా?"
"మనిషిని ఫినిష్ చేసేయడమా?" అదేదో తనకు కొత్తయినట్లు ఆశ్చర్య పడ్డాడు సీతన్న పంతులు.
"అంటే వాణ్ణి ఫినిష్ చేయకపోతే మీరు ఫినిషయ్యే ప్రమాద ముంటే...' అన్నాడు భీమేంద్ర.
"చూడు భీమ్! నాకు పాపభీతి ఎక్కువ. ఏదో విధంగా వాడిని నిలబెట్టాలన్నది నా కోరిక...." అన్నాడు సీతన్న పంతులు.
'అలాగే ప్రయత్నిస్తాను. కానీ మీ మంచితనాన్ని వాడు నిలబెట్టాలన్నది నా కోరిక ...." అన్నాడు సీతన్న పంతులు.
"అలాగే ప్రయత్నిస్తాను. కానీ మీ మంచితనాన్ని వాడు నిలబెట్టుకోవాలి గదా సార్!" అన్నాడు భీమేంద్ర.
సరిగ్గా నాలుగు రోజుల అనంతరం పాము కాటుకు గురై మరణించాడు గవరయ్య . బీమేంద్ర తను స్వయంగా సీతన్న పంతుల్ని కలుసుకుని -- "నన్ను క్షమించాలి సార్! ఇందులో మనం చేసేందేమీ లేదు. అంతా దేవుడే చేశాడు. గవరయ్య పాము కరఛి మరణించడం దేవుడు వాడికి విధించిన శిక్ష అనుకుంటాను" అన్నాడు.
'అలాగని ఎందుకు చెబుతున్నావు?" అన్నాడు సీతన్న పంతులు.
'అసలే మీకు పాపభీతి ఎక్కువ. ఇది మీ కారణంగా జరిగిన హత్య అనుకుంటే ఏ గుండైనా ఆగిపోతుందని భయపడి నిజం చెప్పేస్తున్నాను. ఇందులో మీరూ, నేనూ చేసిందేమీ లేదు"అన్నాడు భీమేంద్ర.
"ఇంత మంచి వార్త చెప్పినందుకు నిన్నభినందించాలి. సత్కరించాలి. గవరయ్య చావాలన్నది నా కోరిక కాదు. కానీ దేవుడతడికి అదే శిక్ష విధించాలను కుంటే మనం చేయగలిగిందేమీ లేదు. మనం ఏమీ చేయకుండా గవరయ్య మన దారి నుంచి తప్పుకున్నప్పటికీ నీ కివ్వాల్సిన డబ్బు నీకిస్తాను..." అన్నాడు సీతన్న పంతులు.
"మీరుదార స్వభావులు ...." అన్నాడు భీమేంద్ర.
సీతన్న పంతులతడికి పదిహేనువే లిచ్చాడు.
బీమేంద్ర తెలివిగా హత్య చేశాడని సీతన్న పంతులికి తెలుసు. ఆ విషయం ఆయనకు తెలుసునని భీమేంద్ర కూ తెలుసు.
తమకు తెలిసిన నిజాలు తెలియనట్లు నటిస్తూ జీవించడం లోనే గొప్పతనం ఉంది.
సీతన్న పంతులు గొప్పవాడు. భీమేంద్ర గొప్పవాళ్ళు గొప్పగా చెలామణీ కావడానికి సహకరించేవాడు.
అయితే సీతన్న పంతులుకు పాపభీతి లేదనుకోవాలా.
అయన ఓ అతివకు మానభంగం చేసి, ప్రాణాలు తీశాడు. ఓ మనిషి ప్రాణాలు తీయించాడు.
ఇన్ని చేసినా ఆయనలో పాపభీతి లేదనడానికి లేదు.
ఎందుకంటె ....ఒకటి కాదు.... రెండు కాదు.... మొత్తం మూడు లక్షల రూపాయలనాయన తిరుపతిలో శ్రీ వెంకటేశ్వరస్వామి హుండీలో వేశాడు.
the end
***
