ఇంటి తలుపులు వేసి వున్నాయి.
కాలింగ్ బెల్ కొట్టాలన్న ఊహ వాడికి రాలేదు. బలంగా తలుపు నొక్క తోపు తోశాడు. ఆవేశంలో వున్నప్పుడు వాడి బుర్ర సరిగ్గా పనిచేయదు.
వాడు తలుపు తోసీ తోయగానే వేయబడిన నేల గడియ సరిగా పడలేదో ఏమో - భళ్ళున తెరుచుకుంది. అప్పుడు వాడక్కడ అటూ యిటూ చూశాడు. ఓ పక్కగది లోంచి అలికిడవు తోంది. ఆటే నడిచి గదిలో అడుగుపెట్టాడు.
గదిలో మంచం. మంచం మీద ఇద్దరు స్త్రీ పురుషులు. వారిలో స్త్రీ ని రత్తమ్మగా గుర్తుపట్టాడు గవరయ్య.
అలికిడి కిద్దరూ గురవయ్య వైపు తిరిగారు.
తప్పు చేస్తున్నారని ఏమాత్రమూ అనుమానించ నవసరం లేని స్థితిలో వాళ్ళిద్దరూ గవరయ్య కు దొరికిపోయారు.
రత్తమ్మకు కళ్ళు తిరిగినట్లయింది.
సీతన్న పంతులు ఉత్సాహమంతా చల్లారి పోగా నోటమాట రాలేదు.
గవరయ్య వారి వంక ఓ క్షణం తీక్షణంగా చూశాడు. తర్వాత గదంతా కలయజూశాడు.
తెరచి వున్న బీరువా , నేల మీద యాభై నోటు, దాని మీద మనీ పర్సు.
గవరయ్య బీరువా దగ్గరకు నడిచాడు. అందులో అయిదారు నగలు కనిపిస్తే వాటిని జేబులో వేసుకున్నాడు. నేల మీద డబ్బునూ, పర్సు నూ జేబులో పెట్టుకున్నాడు. తర్వాత సీతన్న పంతులు దగ్గరకు వెళ్ళాడు. ఎడా పెదా రెండు చెంపలూ వాయించాడు. రత్తమ్మ చేయి పట్టుకున్నాడు.
"తప్పై పోయింది ...." అంది రత్తమ్మ భయంగా.
"తప్పు నీదెందుకవుతుందే....పెద్దోళ్ళీంట్లో ఆడదానికే అన్యాయం జరిగినా ఆ తప్పు అడదానిది. మనిళ్ళలో అడదానిది తప్పుండదు. తప్పంతా మగాడిది. నిన్ను పనికి పంపడం నా తప్పు. ఆపైన నీమీద మనసవడం వీడి తప్పు...." అని "నాతొ వచ్చేస్తావా ?" అన్నాడు గవరయ్య.
"ఊ" అంది రత్తమ్మ.
గవరయ్య జేబులో నగలున్నాయి. డబ్బుంది అంతా సీతన్న పంతులుకు చెందినదే! వాడు రత్తమ్మను తీసుకుని ఇంట్లోంచి వెళ్ళిపోతూ . "ఇది నీతప్పుకి జరిమానా. ఇంకెప్పుడూ ఇలాంటి తప్పులు చేయకు. అస్తమానూ యిలాగే జరిమనాలతో వదిలిపెట్టను నేను...." అన్నాడు.
సీతన్న పంతులు కిక్కురుమనలేదు.
గవరయ్య , రత్తమ్మ ఇంట్లోంచి వెళ్ళిపోగానే అయన వీధి తలుపులు జాగ్రత్తగా వేసి వచ్చి టెలిఫోన్ దగ్గరకు వెళ్ళాడు. పోలీసులకు ఫోన్ చేసి తన పనిమనిషీ, ఆమె భర్తా వచ్చి తనను బెదిరించి దోచుకుపోయారానీ -- పోలీసులకు చెబితే అయన శీలనికే చెడ్డపేరు తెస్తామని హెచ్చరించారని చెప్పాడాయన.
"నాకు చెడ్డ పేరు వచ్చినా ఫరవాలేదు. నేరస్థులు తప్పించుకు పోవడానికి వీల్లేదు" అంటూ సీతన్న పంతులు పోయిన నగల వివరాలు, డబ్బు మొత్తం అన్నీ పోలీసు లకు చెప్పాడు.
"మీరేమీ వర్రీ కాకండి. వెంటనే వాళ్ళ నరేస్టు చేస్తాం?" అన్నాడు అవతల్నించి పోలీసు ఇన్ స్పెక్టర్.
3
రాత్రి ఎనిమిది గంటలకు సీతన్న పంతులుకు పోలీస్ స్టేషన్నించి ఫోన్ వచ్చింది. దొంగలు పట్టుబడ్డారు. పోలీసు ఆయన్ని రమ్మంటున్నారు. భార్య కూడా వస్తానన్నప్పటికీ ఆయనొక్కడే స్టేషను కు వెళ్ళాడు.
ఇన్ స్పెక్టర్ ఆయన్ను పోయిన నగల వివరాలడిగాడు. సీతన్న పంతులు నగలు డబ్బు మనీపర్సు వర్ణనతో సహా అద్భుతంగా చెప్పాడు. దొరికిన వస్తువులు అయన వర్ణనకు సరిపోయాయి.
ఇప్పుడాయన ముందు గవరయ్య, రత్తమ్మ ప్రవేశపెట్టబడ్డారు. గవరయ్యాయన్ను చూస్తూనే "నువ్వింత పని చేస్తావా? ఆ వెధవ పని చేస్తున్నప్పుడే నిన్ను నిలువునా నరికేసి ఉండాల్సింది" అన్నాడు.
"వెధవ పని చేసింది నువ్వూ ....పైగా నరకడం కూడానా....నోటికి వచ్చినట్లు పేలకు. శిక్ష పెరగ్గలదు." అన్నాడు సీతన్న పంతులు.
రత్తమ్మ అయన వంక చీత్కారంగా చూసి - "మాకన్యాయం చేశావు. ఇంతకింతా నాశనమై పోతావు ...." అంది.
'[న్యాయాన్యాయాలు భగవంతుడికే తెలుసు. అన్యాయాన్ని అప్పుడే శిక్షించాడు కూడా ..." అన్నాడు సీతన్న పంతులు.
"జైల్నుంచి తిరిగి రాగానే నీ అంతు చూస్తాను.." అన్నాడు గవరయ్య ఉద్రేకంతో రొప్పుతూ.
ఇన్ స్పెక్టర్ సీతన్న పంతులు వంక వినయంగా చూసి -- వాళ్ళ సంస్కారమే అంత .. మీరేమీ అనుకోకండి. మూడ్రోజులు లాకప్ లో వున్నారంటే గౌరవంగా మాట్లాడ్డం నేర్చుకుంటారు" అన్నాడు.
'అదేం నాకు బాధగా లేదు ఇన్ స్పెక్టర్. ఈ రత్తమ్మ మా యింట్లో చాలా నమ్మకంగా పనిచేస్తోంది. దీనికి లాంటి బుద్ది పుడుతుందనుకోలేదు" అన్నాడు సీతన్న పంతులు నిట్టుర్చుతూ.
"అందుకే వీళ్ళ బ్రతుకులిలా తగలడ్డాయి సార్. వీళ్ళకు బొత్తిగా పాపభీతి లేదు" అన్నాడు ఇన్ స్పెక్టర్.
"ఇన్ స్పెక్టర్ గారూ -- అలా మాట్లాడకండి. తాళి కట్టించుకుని తనతో కాపురం చేయడాని కొచ్చిన పెళ్ళానికి పంతులుగారు అన్యాయం చేయబోతే తప్పులేదా - నేను చేసింది అంత కంటే పెద్ద తప్పా?' అంది రత్తమ్మ ఆవేశంగా.
చాలాసేపు రత్తమ్మ, గవరయ్య కూడా సీతన్న పంతులును తూలనాడారు. అయన అంతా శాంతంగా సహించి ఇన్ స్పెక్టర్ తో 'అయ్యా! ఇందులో నేను మిమ్మల్ని కోరే దొక్కటే ఈ దేశంలో ఆడదాని సంగతి మీకు తెలియందేముంది భర్త కోసం ఏమైనా చేస్తుంది. తప్పంతా ఆ గవరయ్య గాడిదే. మీరు దీన్ని వదిలిపెట్టండి. దాని మాటల్ని పెద్దగా పట్టున్చుకోకండి." అని గవరయ్య తో "జైల్నించి తిరిగోచ్చేక నన్నేం చేయాలో జైల్లో కూర్చుని తీరికగా అలోచించుకుందువు గాని , ముందు నీ భార్య జైల్లో పడకుండా మార్గం చూడు. ఇందులో నేను చేయగల సాయం చేస్తాను"అన్నాడు.
అప్పటికా దంపతులిద్దరూ మంచి ఆవేశంలో వున్నారు. అంచేత సీతన్న పంతులింకేమీ చెప్పకుండా వెళ్ళిపోయాడు.
ఇన్ స్పెక్టర్ కి కూడా రత్తమ్మ ను లాకప్ లో ఎక్కువ రోజులుంచుకోవడం ఇష్టం లేదు. ఆయనకు కొన్ని ఆదర్శాలున్నాయి. అసలే యిప్పుడు పోలీసులకు చెడ్డ పేరు వచ్చింది. రత్తమ్మేమో మనిషి బాగుంది. వయసులో వుంది. ఏ కానిస్తేబులో ఎవరో ఒకరు దానితో మోటుగా ప్రవర్తించవచ్చు. తమ వృత్తి అలాంటిది. కానీ జనమది అర్ధం చేసుకోరు. నేరస్తులతో వ్యవహరించే వాళ్ళని యూనివర్శిటీ ప్రోఫేసరులా ,మసలా లంటారు. యూనివర్శిటీ ప్రోఫేసర్లెలా మసలుతున్నారో ఎంతమందికి తెలుసు?
రెండు రోజుల్లో గవరయ్య , రత్తమ్మ కూడా దిగి వచ్చారు. తప్పంతా తనదేనని గవరయ్య ఒప్పేసుకున్నాడు. రత్తమ్మను వదిలి పెట్టేశారు.
4
"నిన్నా - మళ్ళీ పనిలో పెట్టుకోవడమా- అమ్మ బాబోయ్ అయ్యగారోప్పుకోరు ." అంది సీతన్న పంతులు భార్య గౌరీ దేవి.
"మీ కిష్టమైతే అయ్యగారోప్పుకుంటారమ్మ ..." అంది రత్తమ్మ.
"వెళ్ళి ఆయన్నే అడుగు. నిప్పులాంటి మనిషి మీద నింద మోపావు. ఆ పాపమే నిన్ను కట్టి కుదుపుతోంది" అంది గౌరీదేవి.
"మీరూ రండమ్మ" అంది రత్తమ్మ.
"నేను రాను. నేనొస్తే నిన్ను తనదాకా రానిచ్చానని మండిపడతారాయన" అంది గౌరీ దేవి . తను స్నానాల గది లోకి వెడుతూ.
అప్పుడు రత్తమ్మ సీతన్న పంతులు గదిలోకి వెళ్ళింది. అయన పద్దు పుస్తకాలు చూసుకుంటుండగా - "బాబూ!" అంది.
"ఊ" అన్నడాయన తలెత్తి చూడకుండా.
"నేను రత్తమ్మ ని బాబూ!" దీనంగా అంది రత్తమ్మ.
సీతన్న పంతులు తలెత్తి చూసి "నువ్వా - ఇక్కడి కేందుకొచ్చావ్ ?" అన్నాడు కోపంగా.
"మీ యింట్లో పనిప్పించండి బాబూ " అంది రత్తమ్మ.
"మళ్ళీ మాయింటి గడప తోక్కనన్నావ్ కదా-"
"ఏదో ఆవేశంలో అలాగన్నాను బాబూ! ఎక్కడి కెళ్ళినా నాకు పనివ్వనంటున్నారు. అంతా నేను నా మొగుడు చేత దొంగతనం చేయించానను కుంటున్నారు . వాళ్ళెవ్వరూ న మాట వినడం లేదు."
"ఎవరింట్లో నో దొంగతనం జరిగిందనే నీకు పనిమంటున్నారంతా మరి నా యింట్లోనే దొంగతనం జరిగితే మేము నీకెలా పనిస్తామను కున్నావ్?"
"వాళ్ళకు నిజం తెలియదు . మీకైతే తెలుసు."
సీతన్న పంతులదోలా నవ్వి- "నేను పైకి బుద్ధిగా కనపడ్డా- కనబడ్డ ఆడదాని చేయల్లా పట్టుకుంటానని చెప్పావు అన్నాడు.
"తప్పై పోయిందండి"
"తప్పు కాదు నువ్వు నిజమే చెప్పావు. ఇప్పటికి నేనలాంటి వాడినే. మరి మా యింట్లో ఎలా పని చేస్తావు అన్నాడు సీతన్న పంతులు.
"లేదు బాబూ! మీరలాంటి వారు కాదు ."
సీతన్న పంతులు చటుక్కున లేచి నిలబడి దాన్ని సమీపించి ఓసారి దగ్గరగా తీసుకుని వదిలి "నేనిప్పుడు చెడ్డగా ప్రవర్తించానా?' అన్నాడు.
"లేదు బాబూ!" అంది రత్తమ్మ అసహ్యంగా. కానీ దాని కళ్ళలో ఆశ్చర్యం ప్రతిఫలిస్తోంది. ఇంత జరిగినా కూడా యింకా ఆయనిలా ప్రవర్తిస్తాడనుకోలేదది.
సీతన్న పంతులు దాని వంక అనుమానంగా చూసి, "చాలా మర్పులోచ్చినట్లు కనబడుతోంది " అన్నాడు.
