Previous Page Next Page 
ఆచరణ లో అభ్యుదయం పేజి 27

                  
                                      11
    విలాసాలకి , వినోదాలకీ మితిమీరిన ఖర్చులు పెడుతుంటే ఎంత ఆస్తి మాత్రం ఎన్నాళ్ళు నిలుస్తుంది/ రోజులు గడుస్తున్న కొద్దీ అటు ఆస్తి తరిగిపోవటం, ఇటు అప్పులు పెరగటం మొదలయింది. తాయారు వంటి మీద నగలు కూడా ఒక్కొక్కటే మాయం కావటం మొదలు పెట్టాయి.
    ఒకరోజు-- ఉదయమే లక్ష్మీపతి భార్యతో ఘర్షణ పడటం ప్రారంభించాడు. తరచూ ఎందుకో అందుకు అలాంటివి మామూలే అయిపోయినా ఆ దృశ్యం కంటబడితే మాత్రం పిల్లలు బిక్క చచ్చినట్లే అయిపోయారు. ఆ సమయం లో తండ్రి ఒక రాక్షసుడి లాగే కనిపించేవాడు వాళ్ళ కళ్ళకి. అవాళా అలాగే -- చిన్నపిల్లలు నలుగురూ దూరంగా ఎక్కడో వున్నారు కాని ఆ గది ప్రక్కనే వున్న వరండా లో కూర్చుని చదువు కుంటున్న పద్నాలుగేళ్ళ మోహన్, పన్నెండేళ్ళ సుబ్బులు, తండ్రి పెద్దగా నోరు చేసుకుని అరవటం వినిపించటంతో వులిక్కి పడి, మొహమొహాలు చూసుకుని దిగులుగా పుస్తకాలు ఒళ్లో పెట్టుకు కూర్చుండి పోయారు.
    'ఇప్పుడు నేనేమన్నానని అంతంత కేకలు వేస్తున్నారు.' అంటోంది తాయారు.
    'మరి మెల్లిగా అడిగితె ఇచ్చావా నువ్వు?...త్వరగా బీరువా తాళం తీసి ఆ నెక్లేసు తీసి ఇయ్యి....లేకపోతె తాళం ఎక్కడ దాచేశావో చెప్పు నేనే తీసుకుంటాను.' లక్ష్మీపతి గొంతు కర్కశంగా అజ్ఞాపిస్తోంది.
    'ఇటు చూడండి. మీకు మాత్రం తెలీదా -- నా వంటి మీద వుండే ఏభై తులాల బంగారం అప్పుడూ అప్పుడూ వలిచి మీ చేతిలోనే పెట్టాను-- మీ అవసరాలకి సరదాలకే అదంతా వాడుకున్నారు-- నాకోసం ఏమీ నేను మిగుల్చుకోలేదు. ఆడపిల్లలు ముచ్చట పడతారు అని ఆ రెండు చిన్న గొలుసులూ, నేక్లెసూ దాచి వుంచాను. సుబ్బులు కీ, ఆ నెక్లేసు అంటే ఎంతో ఇష్టం.... నాకు లేకపోయినా పిల్లలకైనా ముద్దుగా పెట్టుకోవాలనీ వాళ్ళు సంతోషంగా వుంటే చూసుకోవాలని....'
    'అబ్బబ్బ--ఆ పురాణం కాస్సేపు చాలిస్తావా?-- పిల్లలకి నేను తరువాతే ప్పుడైనా చేయిస్తాను-- వాళ్లతో పాటు నువ్వూ చేయిన్చుకుందువు గాని-- ఇవాళ మాత్రం అది ఇచ్చేసేయి-- ఇవాళ రత్నం  పుట్టిన రోజు-- నెక్లేసు ఇస్తానని చెప్పాను. ప్రస్తుతం చేతిలో డబ్బు లేదు-- ఉత్తి చేతులతో వెళ్లాలంటే స్నేహితుల ముందు నా పరువు పోతుంది.
    'ఉహు-- నేనివ్వను.' ఎన్నడూ లేనిది మొండిగా జవాబు చెప్పింది తాయారు.
    'ఇవ్వవూ?' అన్న గద్దింపు వెంటనే దభేలు మన్న చప్పుడు వినిపించాయి.
    'అమ్మని కొట్టి చంపేస్తున్నారు రా అన్నయ్యా --' అంటూ అన్నగారి వడిలో తల దాచుకుని బావురుమంది సుబ్బులు.
    మోహన్ ఒంట్లో రక్తం ఉడికి పోతోంది-- అసలు పిల్లలందరికీ తండ్రి అంటే వో విధమైన బెదురు, అసహ్యం తప్పితే, గౌరవం , అభిమానం లేనే లేవు-- ఈ సంఘటనతో ఆ అయిష్టత మరీ అణుచుకోలేనంతగా పొంగి వచ్చింది.
    'పెద్దవాళ్ళ వ్యవహారాల్లో చిన్నపిల్లలు మీరు కలుగ జేసుకోటం బాగుండదు. నాన్నగారి ఎదుట ఈ విషయాలని గురించి ఎప్పుడూ ఎలాంటి ప్రస్తావన తీసుకు రాకండి.' అని అమ్మ ఎన్నో విధాల చెప్పటం వల్ల కేవలం ఆవిడ మొహం చూసి ఇన్నాళ్ళూ నోరు మూసుకుని కూర్చున్నాం. లాభం లేదు -- ఈయన ఆగడాలు అంతకంత కి మితిమీరి పోతున్నాయి-- ఏమయినా సరే-- గదిలోకి వెళ్తాను-- ఈసారి మా అమ్మ ఒంటి మీద దెబ్బ పడిందీ అంటే మర్యాద దక్కదు అని నిర్భయంగా చెప్పేస్తాను' అనుకుంటూ చెల్లెల్ని లేవదీసి కూర్చో పెట్టి తనూ లేవబోయాడు మోహన్.
    అంతలోనే లక్ష్మీపతి విసురుగా గదిలోంచి బయటికి వచ్చి, అక్కడే వున్న పిల్లల వంక 'ఛీ-- శని వెధవల్లారా అన్నట్లు ఒక్క చూపు పారేసి గబగబా బయటికి వెళ్ళిపోయాడు -- మోహన్ సుబ్బులు గదిలోకి పరుగెత్తారు. మంచానికి అనుకుని కూలబడి నీరసంగా నిస్త్రాణ గా ఎటో చూస్తోంది తాయారు-- ఇందాకా లక్ష్మీ పతి తోసేసినప్పుడు విసురుగా మంచం మీద పడటంతో మంచం కొడు కొట్టుకుని నుదురు ఎర్రగా బొప్పి కట్టింది-- మొహం అంతా కన్నీటి చారికలతో కరడు కట్టిపోయింది-- చేతిని వుండే మట్టి గాజులు పగిలిపోయి ముక్కలన్నీ చెల్లాచెదరయి పోయి తాయారు ముంజేతులు రక్తం చిమ్మి వున్నాయి. ఆ దృశ్యం హృదయ విదారకంగా వుంది-- ఒక్కసారిగా, 'అమ్మా' అంటూ పిల్లలిద్దరూ చెరో వేపు నుంచి తాయారు ఒడిలో వాలిపోయి వెక్కివెక్కి ఏడవటం మొదలు పెట్టారు.
    'ఏడవకండి-- ఏం చేస్తాం . ఇలా వుంది మన రాత' అంటూ వాళ్ళిద్దర్నీ గుండెల కడుముకుని వాళ్ళని వోదారుస్తూ తను కడివెడు కన్నీళ్లు వోడ్చి హృదయ భారం తీర్చుకుంది.
    ఆ తరువాత మరో సంవత్సరం పైనే గడిచింది. లక్ష్మీ పతి ఏమిటో కృంగి పోయినట్లు , అదివరకు కంటే చిరాగ్గా, దిగులుగా అనిపించసాగాడు---
    'అలా వున్నారేం ' అని అడిగే ధైర్యం చనువూ తాయారు కి లేవు-- దానికి తోడు,
    'ఎదవ -- నాకంట పడకుండా తప్పించుకు తిరుగుతున్నాడు-- కానీ-- ఎప్పటి కయినా దొరక్కపోతాడా-- వాడి ప్రాణం తీయక పోతానా' అని లక్ష్మీ పతి తనలో తను గోనుక్కోటం ఒకటి రెండు సార్లు ఆమె చెవిని పడటం కూడా తటస్థించింది-- అలాంటప్పుడు,
    'సానిదాన్ని నమ్మమని ఎక్కడైనా వుందా? అది ఇతను డబ్బు పెట్టి నన్నాళ్లు చేరనిస్తుంది. ఆ తరువాత మెడబట్టి గెంటిస్తుంది-- బోగంది ఒలకబోసే ప్రేమా అభిమానమూ అంతా నూటికి నూరు పాళ్ళు నటన మోసం అనే సంగతి తెలిసి కూడా దీపం చుట్టూ తిరిగి ఆ వేడికి మాడి మసి అయిపోయే శలభాల్లా వాళ్ళ వలలో పడిపోతారు మన లక్ష్మీ పతి లాంటి వాళ్ళు-- ఈ రాజరత్నానికి అప్పుడే యితని మీద మోజు తీరిపోయినట్లుంది-- మరో గ్రహం దాని చుట్టూ తిరుగుతోంది.'
    అని ఆనోటా, ఆ నోటా విన్న మాటలు గుర్తు వచ్చి తాయారు పై ప్రాణాలు పైనే పోయేవి. 'ఇదేం ఖర్మ-- భగవంతుడా -- అయింది అంతా చాలక ఈయన చివరికి ఖూనీ కూడా చేసి జైలు కి వెళ్తారా-- అయ్యో నాకేమిటి దారి?' అని కుమిలిపోయి సమయం చూసి భర్తకి నచ్చ చెప్పాలనీ, ఆ రాజరత్నం తో మరే జోక్యం పెట్టుకోవద్ద ని బ్రతిమాలుకో వాలనీ ఆరాటపడి పోయింది-- అయితే తాయారు కి ఆ తగిన సమయం దొరకనే లేదు. ఈ లోగానే జరగవలసింది జరిగి పోయింది.
    వో రోజు , ఇంకా చీకట్లు విడి తెల్లవార కుండానే పదిమందీ విడ్డూరంగా చెప్పుకునే విషయం పనిమనిషి ద్వారా తాయారుకి అందింది.
    'రాజరత్నం వూరు విడిచి వెళ్లి పోయిందిట.' అన్నది ఆ వార్తా సారాంశం.
    ఒక్క క్షణం తను వింటున్నది నిజం అవునా కాదా అన్న తడబాటు కలిగినా పోనీలే శని వదిలి పోయింది అనుకుంది మరుక్షణం లోనే.
    ఒంట్లో నలతగా వుండటం వల్ల లక్ల్ష్మీపతి క్రితం రోజు నుంచీ ఇంట్లోనే వుంటున్నాడు. బయటికి ఎక్కడికీ వెళ్ళలేదు.
    'అతనికీ విషయం చూచాయగానైనా తెలియకుండా వుంటుందా'' అని కాస్సేపు తర్జన భర్జన పడి ఏదయితేనేం నేను మాత్రం చెప్పను-- అనుకుంది తాయారు.
    నిజానికి అప్పటికి లక్ష్మీపతి కేమీ తెలియదు కాని, మధ్యాహ్నం కొంతమంది స్నేహితులు అతని అంతరంగికులు వచ్చి విషయం అంతా వెల్లడి చేశారు.
    'రాజరత్నం నగలూ, డబ్బూ అన్నీ తీసుకుని మరొకడితో వెళ్ళిపోయింది. ఇల్లు కూడా రెండో కంటి వాడికి తెలియకుండా అమ్మేసింది. దాని తాలూకు వాళ్ళే ఎవరో కొనుక్కున్నారు .'-- ఇదీ వార్త.
    వింటున్న లక్ష్మీ పతి మొహం కత్తి వాటుకి నెత్తురు చుక్క లేనట్లు పాలిపోయింది మొదట. ఆ తరువాత ఒక్క క్షణం లోనే వంట్లో వున్న రక్తం అంతా వచ్చి మొహం లో పేరుకు పోయినట్లు మొహం ఎర్ర కందగడ్డ లా తయారయింది. పిడికిళ్ళు రెండూ బిగించి , కళ్ళల్లో నిప్పులు కురిపిస్తూ-- 'అది ఎక్కడికి పోతుందో చూస్తాను. దాని అంతు తెల్చుకోనిదే వూరుకుంటా ననుకుందేమో -- నా తడాఖా రుచి చూపిస్తాను' అంటూ ఎగరటం మొదలు పెట్టాడు.
    'ఎంత డబ్బు పెట్టావు, ఎంత అభిమానంగా చూసుకున్నావు?ఎన్ని చేస్తే ఏం దాని బుద్ది పొనిచ్చుకుంది కాదు....అసలా కులమే అంత....అయినా లక్ష్మీ పతి తలుచుకుంటే వదిలి పెడతాడా ఏమిటి? ప్రపంచంలో ఏ మూల వున్నా దాన్ని వాడినీ వెతికించి పట్టుకుని వాళ్ళ మీద తన కసి తీర్చుకుంటాడు....అసలు అలా చెయ్యాలిసిందే.. ఇంత ద్రోహం చేసిన డానికి బుద్ది చెప్పకుండా వదల కూడదు' అంటూ రకరకాలుగా వ్యాఖ్యానిస్తూ అతనితో కాస్సేపు ఖబుర్లు చెప్పి అ స్నేహితులు ఎవరి దారిన వారు వెళ్ళిపోయారు.
    'అదే ధ్యాసగా అదే ధోరణి గా ఆ రోజంతా గడిపాడు లక్ష్మీపతి. తాయారు బలవంతం మీద నాలుగు మెతుకులు తిన్నాననిపించాడు-- ఏ క్షణంలో అతడు వీధి లోకి వెళ్తాడో, అలా వెళ్లి ఏం వుపద్రవం తెచ్చి పెడతాడో అని తాయారూ పిల్లలూ హడలిపోతూ క్షణాలు లెక్కపెట్టుకుంటూ గడపసాగారు. లక్ష్మీ పతి తలుపులు వేసుకుని అలా ఒంటరిగానే గదిలో వుండి పోయాడు కాని, ఇంట్లో కూడా ఎక్కడా తిరగలేదు. ఎవ్వరితోనూ మాట్లాడలేదు.
    'మామూలుగా లేచి తిరగాలన్నా పదిమంది మొహం చూడాలన్నా అతనికి చచ్చే మొహమాటంగా వుంది-- అందుకే ఇల్లు విడిచి బయటికి కూడా వెళ్ళటం లేదు.' అనుకుంది తాయారు.
    అలా నాలుగు రోజులు గడిచాయి-- అయిదో నాడు మామూలుగానే తెల్లవారింది. తాయారు పిల్లలూ ఎప్పటి లానే లేచి మొహాలు కడుక్కుని కాఫీలు త్రాగారు. లక్ష్మీపతి కోసం విడిగా ఫిల్టరు లో డికక్షను వేసి పాలు మూత పెట్టి వుంచింది తాయారు-- ఉదయం పూట మామూలుగా ఇంట్లో జరిగే పనులన్నీ జరిగిపోతూన్నాయి-- అయినా లక్ష్మీ పతి లేచి మొహం కడుక్కోడానికి గదిలోంచి ఇవతలికి రాలేదు-- ఒక్కొక్కసారి ఉదయం ఎనిమిది దాటినా నిద్ర లేవకపోవటం అతనికి అలవాటే కనక తాయారు కి ఎలాంటి అనుమానం రాలేదు. పైగా, 'నాన్నగారు నిద్ర పోతున్నారు. మెళుకువ వచ్చేస్తుంది గోల చెయ్యకండి.' అని పిల్లల్ని హెచ్చరించింది-- అలాంటప్పుడు నిద్రా భంగం అయితే తండ్రి ఏం చేస్తాడో , తోలు బెల్టు తో తమ వీపుల మీద తాట రేగిపోతుందో వాళ్ళకి బాగానే తెలుసు కనక వాళ్ళూ కిక్కురు మనకుండా పెరటి వరండాలోకి వచ్చేశారు.
    మరి కాస్సేపు గడిచింది-- బీరువాలోంచి చీర తీసుకుందామని తాయారు మెల్లిగా తలుపులు తెరుచుకుని గదిలోకి వెళ్ళింది-- లక్ష్మీపతి నిద్దట్లో గురక పెడతాడు -- ఇప్పుడు గురక వినిపించటం లేదు-- పైగా అతని మొహం ఆ పడుకున్న తీరు ఆమెకేదో భయం కలిగించాయి---దగ్గరి కెళ్ళి అతని వంటి మీద చెయ్యి వేసింది.అంతే --


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS