Previous Page Next Page 
వసుంధర కథలు-1 పేజి 28


    భార్య పుట్టింటికి వెళ్ళినప్పట్నించీ ప్రతాప్ కొంచెం దిగులుగా కనిపించేవాడు. అప్పుడప్పుడు మోహనరావు అతని మీద విసుర్లు కూడా విసురుతూండేవాడు "అక్కయ్య గారు వేల్లిపోఎక బెంగపడిపోయారు మీరు....." అని. అందుకు ప్రతాప్ వెంటనే అంగీకరించేసేవాడు "అవును వివాహమయ్యేక ఇంతవరకూ మేమిద్దరమూ ఒకరి నొకరు వదిలి వుండలేదు" అని.
    మోహనరావు తెలిసినంతవరకూ ఆ విషయం నిజమే. ఇద్దరూ కలిసి కాలేజీలో మూడేళ్ళుగా లెక్చరర్స్ గా పనిచేస్తున్నారేమో ప్రతాప్ గురించిన ప్రతి విషయమూ మోహనరావుకు తెలుసుకుని చెప్పవచ్చును.
    ప్రతాప్ దంపతుల దాంపత్యం మోహనరావుకు ముచ్చటగా ఉండేది. ప్రతాప్ భార్య కమల కూడా అరమరికలు లేని మనిషి. అతిదులను నిండు మనస్సుతో ఆప్యాయంగా ఆహ్వానించే ఆమెలో చెప్పుకోదగ్గ కలుపుగోరుతనం వుంది. స్త్రీ పవిత్రతను గుర్తు చేసే ప్రవర్తన ఆమెది. చలాకీగా కబుర్లు చెబుతూండే ఆమెను చూస్తూంటే ఏ అతిధికైనా వెంటనే తన సోదరి గుర్తుకు వచ్చేది.
    ఆ దంపతులిద్దరిదీ ఒక్కటే మాట. ఎన్నడూ దెబ్బలాడుకున్నట్లు కనిపించరు. ఎప్పుడైనా దెబ్బలాడుకున్నాఅందులో సీరియస్ నెస్ వుండదు. ఏదో చేంజ్ కోసం సరదాగా దెబ్బలాడుకుంటున్నట్లుంటుంది. వాళ్ళ దెబ్బలాట చూడటానికీ, వినడానికీ కూడా సరదాగా ఉంటుంది.
    మొదట్లో మోహనరావుకు దాంపత్యమంటే ఒక రకమైన జుగుప్సా భావ ముండేది. పెళ్ళంటే అదో రకమైన భయం కూడా ఉండేది.
    అయితే ప్రతాప్ దంపతులతో పరిచయమైన ఆర్నెల్ల లోనే అతనికి వివాహం మీద మనసు పుట్టింది. దాంపత్య జీవితంలో ఏదో ఆనందముందనీ, వివాహం మనిషిలో ఏదో తెలియని లోటును భర్తీ చేస్తుందనీ అప్పుడే అతనికి అనిపించింది. అదే అతను మంజులను ప్రేమించడానికి దారి తీసింది.
    అప్పుడు మంజుల బియ్యే ఫైనలియ్యర్ చదువుతూండేది. మోహనరావుకి శిష్యురాలే ఆమె. క్లాసులో ఆమె చాలా తెలివైనది మాత్రమే కాక క్లాసుతో పరీక్ష ప్యాసవ్వాలన్న దీక్ష గల అమ్మాయి. అందుకే తరచుగా లెక్చరర్స్ ని కలుసుకుని చాలా విషయాలు తెలుసుకుంటూండేది.
    చదువు విషయంలో ఆమెకు గల శ్రద్దకు ముగ్దుడైన మోహనరావు ఆమెకు సహాయం చేయడంలో చాలా శ్రద్ధ వహించేవాడు. ఆమె కోసం అతను బోలెడు ఎస్సేలు ప్రిపేర్ చేశాడు.
    ఇటువంటి విషయాలు ఇతరులు గుర్తించరనుకుంటే అది తెలివి తక్కువే. మోహనరావు మంజులల గురించి కాలేజీలో పుకార్లు కూడా బయల్దేరాయి.
    పరీక్షలింక పదిరోజులున్నాయనగా ఓరోజు మంజుల సుడిగాలిలా వచ్చి మోహనరావుని కలుసుకుంది.
    "మేస్టారూ! ఇలా అడుగుతున్నందుకు మరోలా అనుకోకండి. నేను కొంచెం సూటిగా మాట్లాడే మనిషిని. మీరు నా గురించి చాలా శ్రమ పడుతున్నారు. ఆ శ్రమకు అర్ధం ఆపాదించడానికి చాలామంది కుర్రాళ్ళు శ్రమపడుతున్నారు. వాళ్ళ శ్రమ కొత్త వార్తలను సృష్టించింది. అనవసరంగా ఒక  విద్యార్ధినికి సహాయం చేయడానికి శ్రమపడ్డానని-ఇప్పుడు మీరు బాధపడుతున్నారా!"
    మోహనరావు నవ్వేసి "ఈ రోజు నీకు సాయం చేశాను. రేపు ఇంకో పద్మినికో, పద్మరాజుకో సాయం చేస్తాను. అందువల్ల ఇప్పుడు నాకేమీ బాధగా లేదు. కానీ నీ పరీక్షా ఫలితాలు బాగుండకపోతే మాత్రం - నువ్వన్న విధంగానే బాధ పడాల్సి వుంటుంది" అన్నాడు.
    మంజుల కళ్ళల్లో నీళ్ళు తిరగ్గా "ఇంత మంచివారు మిమ్మల్ని ..... ...." అని మాటలు మింగేసింది.
    "అవన్నీ ఆలోచించడానికిది సమయం కాదు. చెడ్డ పేరు నన్నేమీ చేయలేదు. నీకే ఎక్కువ చెరుపు. నువ్వు నా మీద జాలి పడడం అనవసరం. అసంబద్దంకూడాను. పరీక్షలయ్యేవరకూ ఈ ఆలోచనలు మాత్రం రానీయకు" అన్నాడు మోహనరావు.
    అప్పుడు మంజుల వెళ్ళిపోయింది. అప్పుడే అతను మంజులను ప్రేమించడం కూడా ఆరంభమయింది. పరీక్షలైన వెంటనే అతనా విషయం ఆమెకు తెలియబర్చి "నీకు ఇష్టమైతే మీ పెద్దలతో సంప్రదిస్తాను....." అన్నాడు.
    అందమూ, ఉద్యోగమూ వున్న మోహనరావు మంజులకు నచ్చాడు. అయితే ఆమె వెంటనే అతన్ని వివాహం చేసుకునేందుకు వీలు లేకపోయింది. ఆమెకు పెళ్ళికాని అక్కలు ముగ్గురున్నారు. వాళ్ళ వివాహం అయితేగానీ తను వివాహం చేసుకోవడం ఆమెకూ, ఆమె తల్లిదండ్రులకూ కూడా ఇష్టం లేదు.
    అందువల్ల మోహనరావు తన పవిత్రప్రేమ వివాహానికిదారితీయడానికి కొన్ని ఏళ్ళు ఎదురుచూడవలసి వచ్చింది. ఇప్పుడు అక్కలందరికీ పెళ్ళిళ్ళయిపోయి మంజుల వివాహానికి సిద్దంగా ఉంది. ఆమె ఆఖరి అక్కకి రెండునెలల క్రితమే వివాహమని తెలిసినప్పుడు మోహనరావు ఎగిరి గంతువేసినంత పని చేయగా-మనోదౌర్భల్యమంటూ ప్రతాప్ ఎగతాళి కూడా చేశాడు.
    
                                      3

    ఆ రోజు మోహనరావుకి ఉత్తరం వచ్చింది. రెండ్రోజుల్లో మంజుల వాల్తేర్ వస్తోంది. ఒక ప్రయివేట్ కంపెనీలో ఇంటర్వ్యూ వచ్చిందామెకు. తన ట్రయిన్ అర్ధరాత్రి వస్తుంది కాబట్టి. అతన్ని వచ్చి రిసీవ్ చేసుకోవలసిందని కోరుతూ రాసిందామె.
    అప్పటికి మోహనరావు మంజులను చూసి చాలా కాలమయిందేమో-ఆ ఉత్తరం అపరిమితానందాన్ని కలిగించిందతనికి. మంజులను చూడాలని బాగా ఇదిగా వుందతనికి. ఈ ఉత్సాహాన్ని ఒక్కడూ భరించలేక ప్రతాప్ ఇంటికి బయల్దేరాడతను
    అయితే ఇంటికివెళ్ళి ప్రతాప్ ని చూసేసరికి అతని వుత్సాహమంతా దిగజారిపోయింది.
    ప్రతాప్ ముఖం దీనంగావుంది. కళ్ళు ఎర్రగా వున్నాయి. గెడ్డం మాసివుంది. మూర్తీభవించిన విషాదంలా వున్నాడతను. అతన్ని చూడగానే మోహనరావు మనసు కీడు శంకించింది- "కొంపదీసి అక్కయ్యగారికి ఏమన్నా....." అనుకున్నాడతను.
    "అలా కూర్చోండి-" అన్నాడు ప్రతాప్ తాపీగా.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS