మరుపురాని పందెం!
ఉన్నట్లుండి అన్నాడు ప్రతాప్ "నాకు కొంచెం కళ్ళు తిరుగుతున్నట్లుగా ఉంది. ఇంటికి వెళ్ళిపోతాను....."
శ్యామలరావు ఆశ్చర్యంగా చూశాడు ప్రతాప్ వంక.
అనుమతికోసం ఎదురుచూడకుండానే ప్రతాప్ హడావుడిగా వెనక్కు తిరిగి వెళ్ళిపోతున్నాడు.
మోహనరావు నెమ్మదిగా శ్యామలరావు చెయ్యి నొక్కి "అతను వెళ్ళిపోవడానిక్కారణం నాకు తెలుసు. ఆ ఎదుటి గదిలోని దృశ్యమే-" అన్నాడు.
ఆ ఎదుటి గదిలో ఓ రోగికి ఆక్సిజన్ పెడుతున్నారు.
"ఆ రోగి అతనికి బంధువా-" అని శ్యామలరావు అడిగాడు.
"అబ్బే అదేం కాదు. శ్వాస పీల్చుకోవడానికి ఆ రోగి ఎంత అవస్థపడుతున్నాడో చూడండి. అతని డొక్కలెలా ఎగిరిపడుతున్నాయొ చూడండి. అటువంటి దృశ్యాలను ప్రతాప్ చూడలేడు. అందుకే అతను సాధారణంగా ఈ కేజీ హాస్పిటల్లో అడుగెట్టడు-చాలా బలహీనమైన హృదయ మతనిది-" అంటూ మోహనరావు నవ్వాడు. అతని నువ్వు పూర్తయ్యేసరికి ఆ బలహీనహృదయుడు ప్రతాప్ రోడ్డుమీదకు వచ్చేశాడు. అతని హృదయం ఇంకా వేగంగా కొట్టుకుంటూనే ఉంది. అతని కళ్ళముందు ఆ దృశ్యమింకా మెదుల్తూనే ఉంది అతని శరీరమింకా జలదరిస్తూనే ఉంది.
ఏమిటో ఈ సృష్టి? ఎన్నోరకాల ప్రాణులు-జీవగతిలో ఎన్ని అవస్థలు పడుతున్నదో? రోగాలు, పేదరికం, ఆహారపు కొరత, మరణం-ఇవి ప్రాణులకు భయంకర బాహ్య శత్రువులు కానీ అవికూడా సృష్టిలోని భాగమే మరి-! సృష్టిలోని ఆ భాగాన్ని చూసి తట్టుకోగల మనోబలం సృష్టికర్త తనకెందుకివ్వలేదు?
అతను సిద్దార్దుడిలా బయటి ప్రపంచంతో సంబంధం లేకుండా పెరగలేదు. వృద్ధాప్యం, రోగం, మరణం-చిన్ననాటినుంచీ అతను చూస్తూనే ఉన్నాడు. చూసి నప్పుడల్లా అతను చలించిపోతూనూ వున్నాడు. ఎటొచ్చీ ద్ధుడు కాగలగడానికి సిద్దార్ధుడు కాడు-ప్రతాప్!
అతని ఈ బలహీనపు మనస్తత్వం ఎన్నోసార్లు విమర్శలకు గురయింది. అందరికంటే ఎక్కువగా అతన్ని విమర్శించేవాడు మోహనరావు అని చెప్పవచ్చు.
మోహనరావుకూడా ప్రతాప్ పని చేస్తున్న కాలేజిలోనే లెక్చరర్ గా పనిచేస్తున్నాడు. ప్రతాప్ తో పోలిస్తే అతనికి మనోనిబ్బరం ఎక్కువనే చెప్పాలి. అతను సాధారణంగా దేనికీ చలించడు. ఈ విషయంలోనే వాళ్ళిద్దరకూ తరచుగా వాదోపవాదాలు జరుగుతూండేవి.
"మనోదౌర్భల్యం మనిషిని అధఃపాతాళానికి తోసేస్తుంది. జీవితంలో సుఖమన్నది లేకుండా చేస్తుంది. ప్రతి పేరయ్య కష్టానికీ జాలిపడుతూ కూర్చుంటే మనం బ్రతికేదెలా?" అంటాడు మోహనరావు.
అయితే ప్రతాప్ వాదన వేరు.
"బ్రిటిష్ సామ్రాజ్యాన్ని గడగడలాడించిన మన నిబ్బరం కలిగిన మహాత్ముడు-హరిజనుల కష్టాలు చూస్తూ చలించిపోయాడు. అసలు భారతీయుల బానిసత్వం ఆయన్ను కదలించడంవల్లనే కదా-స్వాతంత్ర్య పోరటాని కాయన నాయకత్వం వహించాడు. కాబట్టి మన దౌర్భల్యమే ప్రగతికి మూలకారణం. ఎటొచ్చీ మీరు చెప్పినట్లు అది మనిషిని అధఃపాతాళానికి పంపకుండా మాత్రం చూసుకోవాలి-"
"మీరు వాదనను తప్పుదారి పట్టిస్తున్నారు. మనమిప్పుడు మహాత్ముల గురించి మాట్లాడడంలేదు. సామాన్యుల సంగతి మాట్లాడుతున్నాం. మహాత్ముల విషయం వేరు. వాళ్ళు తమ కష్టాలకు చలించరు. ఇతరుల కష్టాలు వాళ్ళను బాధిస్తూంటాయి. అందుకు వాళ్ళ దుర్బల మనస్తత్వమే కారణమనుకుందాము అయినా ఇతరుల కష్టాలను తొలగించడానికి వాళ్ళు చేసే ప్రయత్నాలకు ఎంత మనోనిబ్బరం అవసరం. అటువంటప్పుడు వాళ్ళని దుర్భర మనస్కులని ఎలా అనగలం?"
"కరెక్టు-" ఆనందు ప్రతాప్-"మీరు ఆ పాయింటుకొచ్చారు. ఇతరుల కష్టాలు చూసి చలించేవారందరూ దుర్బల మనస్కులు కారని దీన్నిబట్టి తేలింది...."
తర్వాత ఏం మాట్లాడాలో తెలియక "వాదనలో మీరు తెలివైనవారని ఒప్పుకొంటాను కానీ మీరు దుర్భల మనస్కులు కాదని మాత్రం ఒప్పుకోను" అని ఊరుకునే వాడు మోహనరావు.
"దుర్భల మనస్కులు వాదనలో నెగ్గలేరండీ"అని నవ్వి "మీరు అనుకునేటంత దుర్బల మనస్కున్ని నేను కాదని మీరు తెలుసుకునే రోజెలాగూ వస్తుంది. కానీ మీరు కోపగించుకోనంటే ఒక విషయం చెబుతాను. మీరు చాలా దుర్భల మనస్కు లనిపిస్తోంది నాకు-" అన్నాడు ప్రతాప్.
మోహనరావుకి కోపం వచ్చింది. ముఖం ఎర్రబడింది. "పచ్చకామెర్ల రోగికి లోకమంతా పచ్చగా కనిపిస్తుందటారే-ఆ సామెత నిజం చేస్తున్నారు-"
ప్రతాప్ నవ్వి "నేను మామూలుగానే నవ్వుతున్నాను. నన్ను మీరు దుర్బల మనస్కుడన్నా నా నవ్వు మారలేదు. కానీ నేను మిమ్మల్నలా అనేసరికి మీ ముఖం ఎర్రబడిపోయింది. మామూలుగా నవ్వలేకపోతున్నారు. మీకు కలిగిన ఆవేశమే అందుక్కారణం. ఆవేశం మనోదౌర్భల్యం వల్ల కలుగుతుంది-ఏమంటారు?" అన్నాడు.
మోహనరావు ఈసారి తమాయించుకున్నాడు. ప్రతాప్ చమత్కారానికి అతనికి నవ్వు కూడా వచ్చింది. అయినా పట్టుదలకోద్దీ "నేను మీకంటే దుర్భలమనస్తత్వం గల వాడినని ఋజువు చేయగలిగినప్పుడు వెంటనే వంద రూపాయలిస్తాను" అన్నాడు మోహనరావు.
"పందెం వేశారు. గుర్తుంచుకోవాలి మరి....." అన్నాడు ప్రతాప్.
2
ఆ విధంగా ఆర్నెల్ల క్రితం పందెం వేసుకున్నారు మిత్రులిద్దరూ.
ఈ ఆర్నెల్లలో మోహనరావు విషయంలో ఏమీ మార్పు లేదు-అతను బ్రహ్మచారి కాబట్టి.
అయితే ప్రతాప్ విషయంలో మాత్రం ఒక చిన్న మార్పు ఉంది. రెండు నెలల క్రితం అతని భార్య పురిటికి పుట్టింటికి వెళ్ళింది- అతని జీవితంలోకి కొత్త వెలుగును తీసుకురావడానికి.
