Previous Page Next Page 
వసుంధర కథలు-1 పేజి 29


    "ఏమయింది-అలా వున్నారు?" ఆదుర్దాగా అడిగాడతను.
    "ఇంటివాళ్ళబ్బాయి రామం-కారుక్రిందపడి చచ్చిపోయాడు-" అన్నాడు ప్రతాప్. అంటూండగానే అతని కళ్ళలో నీళ్ళు తిరిగాయి. మాట గాద్గదికమయింది.
    "ఓస్ ఇంతేగదా-ఇంకా ఏమో అనుకున్నాను...." అని చటుక్కున నాలిక్కరుచుకున్నాడు మోహనరావు. రామానికీ, ప్రతాప్ కీ వున్న అనుబంధం అతనికి తెలియనిదికాదు. రామానికి పదేళ్ళుంటాయి. అతనికి ప్రతాప్ వద్ద విపరీతమైన చనువు. ఎప్పుడూ వీళ్ళింట్లోనే వుండేవాడు. చాలామంది రామం, ప్రతాప్ తమ్ముడనుకుని పొరబడే వారు కూడా.
    రామంతో మోహనరావు కూడా చెప్పుకోదగ్గ చనువూ, పరిచయమూ వున్నాయి. అయినా అతనికి హృదయం కదిలిపోలేదు. అన్యాయంగా యాక్సిడెంట్లో చనిపోయాడే అని బాధమాత్రం కలిగింది. అయినా ప్రతాప్ కింత విచారమెందుకు; వారిద్దరికీ అనుబంధమే కానీ-బంధుత్వమేమీలేదే?
    ప్రతాప్ చాలా విచారంలో వున్నాడని గ్రహించిన మోహనరావు నెమ్మదిగా అనునయ వాక్యాలు చెబుతూ-"అయినా అతను మనకేమవుతాడని ఇంత విచారం చెప్పండి-పుట్టినవారైవరైనా చనిపోవలసిందేగదా-కాస్త ముందూ వెనకా తేడా-అంతే!" అన్నాడు.
    ప్రతాప్ కళ్ళు తుడుచుకుంటూ-"అదికాదండీ-ఆ తల్లీ తండ్రీ ఇప్పుడు హాస్పిటల్లో వున్నారు. వాళ్ళ దుఃఖం చూస్తూంటే ఎలాంటి వాళ్ళకైనా గుండె నీరైపోతుంది. రామానికి యాక్సిడెంటయిందనీ, హాస్పిటల్లో వున్నాడనీ విన్నప్పుడు నాకూ అంత దుఃఖం కలగలేదు. ఏదో తెలియని బాధ మాత్రం కలిగింది. అయితే హాస్పిటల్ కి నేను వెళ్ళేసరికే రామం చనిపోయాడు. రామం శవాన్నీ, అతని తల్లిదండ్రుల దుఃఖాన్నీ, అక్కడి వాతావరణాన్నీ, చూస్తూంటే నా గుండె బ్రద్దలైపోయింది. వెంటనే ఇంటి కొచ్చేశాను. ఆ ప్రభావమింకా నామీదనుంచిపోలేదు....." అన్నాడు.
    మోహనరావుక్కూడా బాధకలిగింది. తమ కళ్ళముందు తిరిగిన రామం అనే పేరుగల చలాకీ కుర్రవాడు ఇకలేడు. ఏమైపోయాడో, ఎక్కడికిపోయాడో తెలియదు. అసలీ చావు అనేదేమిటో?
    తెలిసినవాళ్ళెవరైనా చనిపోయినపుడు-ఇటువంటి వేదాంతం మనస్సులో మెదలడం చాలామందికి మామూలే! మితిమీరిన వుత్సాహంతో వచ్చిన మోహనరావు మనస్సు లోని వుత్సాహం చప్పగా చల్లారిపోయింది. అతను ఎంతోసేపు అక్కడ వుండలేదనడంకంటే-వుండలేక పోయాడంటేనే బాగుంటుంది.
    ప్రతాప్ ఇంటిదగ్గర్నుంచి బయటకువచ్చేక రోడ్డుమీద అతనికి అనుకోకుండా రమేష్ కనిపించాడు.
    రమేష్, మోహనరావు ఒకే కాలేజీలో చదువుకున్నారు. అప్పట్లో స్నేహితులు. ఆ తర్వాత మళ్ళీ ఇదే కలవడం.
    ముందుగా రమేష్ మోహనరావుని గుర్తుపట్టాడు. పరస్పరం గుర్తుపట్టడం జరిగేక-ఓ రెండు నిముషాలసేపు చిన్నతనాన్ని నెమరువేసుకుని-ఆ తర్వాత ప్రస్తుతానికి వచ్చారు.
    "నేను మూడు నాలుగేళ్ళుగా-ఈ ఊళ్ళో కాలేజీలో లెక్చరర్ గా వుంటున్నాను. నువ్వేం చేస్తున్నావ్? ఈ ఊరొచ్చి ఎన్నాళ్ళయింది?" అన్నాడు మోహనరావు.
    "మనది కంపెనీ వుద్యోగం నాలుగు నెల్లయిందీ ఊరొచ్చి-" అన్నాడు రమేష్.
    "ఐసీ - అలాగా - పెళ్ళయిందా, పిల్లలా?" అన్నాడు మోహనరావు.
    అందుకు సమాధానంగా రమేష్ పెద్ద నువ్వు నవ్వేశాడు. -"ఆ ప్రశ్న నాకు చాలా అవమానంగురూ-పెళ్ళంటే నీబోటిగాళ్ళకిగానీ-నాలాంటివాళ్ళకెందుకూ? అందులోనూ ఈ ఇండియాలో-" అన్నాడు.
    మోహనరావుకి అర్ధంకాక మాట్లాడలేదు.
    ఆ విషయం పసిగట్టిన రమేష్ "నా భాష నీ కర్ధం కాలేదనుకుంటాను. మీలాంటివాళ్ళ దృష్టిలో నేను చెడ్డ వాణ్ణి అఫ్ కోర్స్-నా దృష్టిలో నేను రైటేననుకో-వయసూ, డబ్బూ వున్నప్పుడు అందినంతవరకూ ఆనందించడం మన ప్రిన్సిపుల్. ఆ ప్రిన్సిపుల్ తూ చా తప్పకుండా ఆచరిస్తున్నాను. పెళ్ళి చేసుకుందామంటే ఒకరూ ఇద్దరూ సరిపోరు. శ్రీకృష్ణుడిలా రోజుకొకరు కొత్తవాళ్ళు కావాలి" అంటూ ఓసారి మోహనరావుకి కన్ను కొట్టాడు.
    ఇద్దరూ దార్లో వున్న హోటల్లో అడుగెట్టారు. బిల్లివ్వబోతుండగా మోహనరావు జేబులోంచి మంజుల ఫోటో జారి పడింది. ఆ ఫోటోను చూస్తూనే "వాట్-మంజుల ఫోటో నీ దగ్గర కెలా వచ్చిందీ?" అన్నాడు రమేష్ ఆశ్చర్యంగా.
    మోహనరావు అదిరిపడ్డాడు. అక్కడింకేం మాట్లాడకుండా బిల్లు ఇచ్చేసి రోడ్డుమీదకు వచ్చేడు. అక్కడ రమేష్ అతని భుజం తట్టి-"ఏదో అనుకున్నాను. నీదీ పెద్ద చెయ్యేనన్నమాట" అన్నాడు.
    "నీ మాటలు నా కర్ధం కావడం లేదు. కానీ ఈ ఫోటోలో అమ్మాయి నీకెలా తెలుసు?" అనడిగాడు మోహనరావు. జవాబుగా రమేష్ ఏం చెబుతాడోనని అతనికి భయంగానే ఉంది.
    రమేష్ నవ్వేసి-"మా కంపెనీలో ఉద్యోగానికి అప్లై చేసింది. పాత పరిచయముంది కాబట్టి నేను స్పెషలింట్రస్టు తీసుకుని ఇంటర్వ్యూ వచ్చేలా చేశాను. రెండు మూడ్రోజుల్లో మంజుల ఇక్కడకు రావొచ్చు" అన్నాడు.
    "పాతపరిచయమంటే?" సందేహంగా అడిగాడు మోహనరావు.
    "ఏమీ తెలియకుండానే ఫోటో జేబులో కొచ్చిందా గురూ" అంటూ రమేష్ ఓసారి నవ్వి "వాళ్ళది మా ఊరేలే-దానికి ముగ్గురక్కలున్నారు. ఒక్కళ్ళదీ గుణం మంచిది కాదు. అందుకే ఓ పట్టాన వాళ్ళకు పెళ్ళి సంబంధాలు కుదర్లేదు. ఇంక మంజుల సంగతంటావా? నాకు బాగా డబ్బుంది కదా-రాత్రి పన్నెండు గంటలకు ఎవరికీ తెలియకుండా మా ఇంటికొచ్చి, నా దగ్గర్నుంచీ చాలా డబ్బు సంపాదించింది. అయితేయేంలే-అదిచ్చే ఆనందం ముందు నేనిచ్చిన డబ్బొక లెక్కలోది కాదు...." అని ఆగి "ఇంతకీ దాన్నే లాడ్జిలో కలుసుకున్నావ్? అప్పుడప్పుడు లాడ్జీల క్కూడా వెడుతూంటుందిలే అది" అన్నాడు.
    కాలికింద భూమి అదిరినట్లయింది మోహనరావుకి.
    అతనిలో ఆలోచనాశక్తి నశించింది. జ్ఞానేంద్రియాలు పనిచేయడం మానేశాయి. ఎలాగో తమాయించుకోడానికి ప్రయత్నించాడతను. ఆ సంభాషణ తన కిష్టం లేదన్నట్లుగా మాట మార్చేశాడతను.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS