Previous Page Next Page 
శంఖారావం పేజి 27


    "అందుకే నిన్ను నీవు దైవానికంకితం చేసుకోమంటున్నాను. అప్పుడు నీ సమస్యలు నీవి కాదు. నావి" - అన్నాడు స్వామి.
    జలజ ఉన్న చోటు నించి కదలలేదు.
    స్వామి ఓ అడుగు ముందుకు వేసి ఆమె చెయ్యి పట్టుకుని తనకు దగ్గరగా లాక్కున్నాడు.
    అప్పుడు జలజకు స్వామిలో దైవానికి బదులు మగాడు కనిపించాడు.
    అదీ ఇష్టం లేని మగాడు!
    స్వామి తెరవెనుక ప్రవర్తన ఇదా - ఎంత ధైర్యం?
    అప్రయత్నంగా పెనుగులాడింది జలజ.
    స్వామి తన పట్టు బిగి చేస్తున్నాడు. ఆమెను తనలో ఐక్యం చేసుకునేందుకా అన్నంత బలంగా హత్తుకుంటున్నాడు.
    జలజ సర్వ శక్తులు క్రోడీకరించి ప్రతి ఘటిస్తోంది.
    చటుక్కున తెర విడింది.
    తొలిసారిగా భక్త కోటి స్వామి శృంగార లీలను వేదిక పై చూశారు.
    భక్తీ గీతాలాగి పోయాయి.
    ఒక్కసారిగా చాలామందిలో ఆవేశం కలిగింది.
    కొందరు వృద్ద భక్తులు స్వామీ లీలకు పరవశిస్తున్నారు.
    స్వామి మాత్రం జలజను విడిచి పెట్టాడు. ఆమె ముందు నించే వేదిక దిగిపోయింది.
    ప్రజల్లో ఒక్కసారిగా సంచలనం కలిగింది. ఆ సంచలనం వెనుక అవేశముంది.
    కొందరు జలజ చుట్టూ మూగారు.
    "స్వామి దేవుడు కాడు . కాముకుడు --' అంటోందామె.
    ఆమె మాటలు ప్రజల ఆవేశాన్ని పెంచుతున్నాయి.
    జనంలో ఆవేశం పెరిగే లోగా స్వామి బిగ్గరగా --" భక్తులారా!" అని అరిచాడు.
    ఎవరూ అయన మాటలు వినే స్థితిలో లేరు. చాలామంది ఆవేశంగా వేదిక వైపు పరుగెడుతున్నారు.
    "ఆగండి! ఈ వేదిక మీదకు నా అనుమతి లేందే ఎవ్వరూ రాలేరు. ముందు నేను చెప్పే మాటలు వినండి -' అన్నాడు స్వామి.
    జనంలో కలకలం కొంత తగ్గింది కానీ ఇంకా పరిస్థితి అదుపులో లేదు.
    "మీరు నా మీదకు వచ్చి నన్నేదో చేస్తే ఏమీ సాధించలేరు. నా మాటలు సావధానంగా వినండి. ప్రపంచానికే మేలు జరుగుతుంది -' అన్నాడు స్వామి.
    అప్పుడే ప్రజలు రెండు వర్గాలుగా విడిపోతున్నారు.
    స్వామి శృంగార లీల కేదో అర్ధముంటుందన్న ఆశ ఇంకా కొందరు భక్తుల కుంది వారిది మైనారిటీ.
    స్వామికి వ్యతిరేకంగా మెజారిటీ బలం పుంజు కుంటోంది.
    "పదిమంది ఎదుట వేదిక పై నా మనసెప్పుడూ ఇంతలా చలించలేదు. చలించినా ఏ మగువా నన్ను ప్రతిఘటించ లేదు. ఈరోజుతో నా పాపం పండింది. దైవం పేరుతొ నేనిక్కడ చేస్తున్న ఘోర కార్యాలన్నీ ఒక్కొక్కటిగా చెబుతాను. తర్వాత నాకై నేనే పోలీసుల స్వాధీనమై పోతాను. నా వల్ల పోలీసులు తెలుసుకోవలసిన రహస్యాలెన్నో ఉన్నాయి.' అన్నాడు అలౌకికానందస్వామి.
    ఆశ్రమంలో సంచలన వార్త ప్రారంభమయింది.
    అప్పుడక్కడ పత్రిక విలేకరులన్నారు. ప్రజా నాయకులున్నారు. పోలీసుల ప్రతినిదులున్నారు.
    స్వామి తన గురించి చెప్పుకుంటున్నారు.
    అయన యోగాభ్యాసంతో కొన్ని దివ్య శక్తులు సాధించాడు. మానవాళికి మంచి చేయాలనుకుని ఈ మైదానంలో ఆశ్రమం ఏర్పాటు చేసుకున్నాడు. కాని అక్కడ సమాజ విద్రోహ శక్తులు స్థావరం ఏర్పరచుకున్నాయి. అవి స్వామినే వశ పర్చుకుని స్వప్రయోజనాలకు ఉపయోగించుకోసాగాయి. స్వామి వారికీ లొంగి పోయాడు. ఆయనకు విపరీతమైన ప్రచారం లభించింది. క్రమంగా స్వామిలో దైవ చింతన నశించి విషయ లోలత పెరిగింది. ముఖ్యంగా స్త్రీలాయనకు పెద్ద వ్యసనంగా మారారు,
    అందమైన యువతులను పట్టి తెచ్చి -- అరబ్బు దేశాల కెగుమతి చేయడం, యువతును పాడు చేసే మాదక ద్రవ్యాలను సరఫరా కేంద్రంగా ఉండడం, నేరస్తులకు రక్షణ కల్పించడం, దేశానికి సంబంధించిన కీలక రహస్యాలను తెలుసుకుని విదేశాలకంద జేయడం, బంగారం వగైరాల స్మగ్లింగ్ ఇలా ఒకటేమిటి ఎన్నో నేరాలకు కేంద్రంగా ఉన్నదా ఆశ్రమం.
    స్వామి అప్పటికప్పుడు నగరంలో తన సమాజ విద్రోహ కార్యకలాపాల బ్రాంచి ఆఫీసుల గురించి కూడా చెప్పాడు. ఆశ్రమంలో ఎక్కడెక్కడ ఏయే రహస్యలున్నవీ కూడా వివరించాడు.
    ప్రజల్లో ఆవేశం పెరిగి పోతోంది.
    "ఈరోజు నా పాపం పండింది. నా తప్పులన్నీ ఒప్పుకున్నాను. నేను పట్టుబడ్డానన్న బాధ కంటే -- నా దేశానికి వ్యతిరేకంగా నేను చేస్తున్న పాపాలకీ రోజుతో అంతం లభించిందన్న సంతోషమే ఎక్కువగా ఉంది నాలో ...." అన్నాడు స్వామి.
    ఆ వెనువెంటనే వేదిక పై తెరలు మూసుకున్నాయి.
    అప్పుడు జనాన్నదుపు చేయడం కష్ట మయినది. అంతా వేదిక మీదకు దూసుకు పోవాలని యత్నిస్తున్నారు.
    స్వామికి తమ రాజకీయ సమస్యలను చెప్పుకుని పరిష్కారమార్గామడిగిన ప్రజానాయకులు తెల్లబోతున్నారు.
    స్వామిని ఏకాంతంలో కలుసుకున్న స్త్రీలు సిగ్గుపడుతున్నారు.
    స్వామి కోసం ఏమైనా చేసిన వారందరూ బాధపడుతున్నారు.
    ఇప్పుడు వేదిక ముందు మెట్లు లేవు.
    వేదిక చాలా ఎత్తుగా ఉంది.
    చాలా మంది వేదిక పైకి ఎగ బ్రాకాలని ప్రయత్నిస్తున్నారు.
    సన్నని ఎనిమిది రాటల పై నిలబడి వుందా వేదిక.
    రాటలు నున్నగా వుండి పైకెగ బ్రాకడానికి వీలుగా లేవు.
    అక్కడ చేరిన ఓ పోలీసాఫీసరు అరుస్తున్నాడు-- "స్వామిని ప్రాణాలతో పట్టుకోవడం అవసరం, ఎవరూ ఆవేశపడకండి ...."
    ఈలోగా మరోసారి వేదిక మీంచి మాటలు వినబడ్డాయి.
    "నాపై నమ్మకమున్న శిష్యులందరూ ప్రతిఘటించకుండా లొంగి పొండి. నేను కూడా పోలీసులకు లొంగి పోతున్నాను. ఇక్కడ ఎవరి వల్ల తప్పు జరిగినా ఆ తప్పులన్నీ నావి. నన్ను దైవంగా నమ్మిన నా శిష్యులు తప్పు చేస్తే ఆ బాధ్యత నాదే! నేనేమై పోయినా నా శిష్యులూ , అనుచరులూ సుఖంగా ఉండాలి. అందుకే నా మాట విని పోలీసులకు లొంగి పొండి...."
    మరు నిముషంలో వేదిక పై తెర విడింది.
    తెరపై పద్మం లేదు.
    అలౌకికానంద స్వామి వేదిక పై నిలబడి ఉన్నాడు.
    అయన కాళ్ళు రెండూ దగ్గరగా బంధించి వున్నాయి.
    చేతులు వెనక్కు విరిచి కట్టబడ్డాయి.
    నోటికి టేపు.....
    'ఆహా -- లొంగి పోతూ కూడా స్వామి తన మహిమ చూపించాడు ...." అన్నదో వృద్ద భక్తురాలు పరవశంగా.
    "మహాత్ములు ఆశ్రమాలు నిర్మించి ప్రజా సేవ చేయాలను కుంటారు. స్వార్ధ పరులు వారి చుట్టూ చేసి వారి ఆశయాలను భంగం కలుగ జేస్తారు. అలనాడు యేసు క్రీస్తు శిలువ నెక్కాడు. ఈనాడు స్వామి పోలీసుల వశమవుతున్నాడు" అన్నాడో వృద్ద భక్తుడు.
    సీతమ్మ కంతా కలలా ఉంది.
    తాను నమ్మిన దైవం దోషిలా ఎదుట నిలబడ్డాడు.
    "ఇలా జరుగుతుందని ఎప్పుడూ అనుకోలేదు --' అందామె.
    "కానీ వేదాంతానికిది ముందే తెలుసు ...." అంది ఉదయ. ఆమెకు చాలా ఆశ్చర్యంగా ఉంది.
    వేదాంతం ఏం చేస్తున్నాడు? స్వామి ఇలా తన నిజ స్వరూపం బైట పెడతాడని అతడు ముందే ఎలా ఊహించాడు ?
    "నువ్వు జలజ నెందుకిలా ఉపయోగించుకోగలిగావు? స్వామిని జలజ ఆకర్షిస్తుందని ఊహించినా -- ఆ తర్వాత స్వామి నిజస్వరూపం బైట పడుతుందని -- ఆమెను వెంటనే అయన తన తప్పిలన్నీ ఒప్పుకుంటాడనీ నీకెలా తెలుసు ? వేదా - ఏం చేశావురా నువ్వు?" అన్నాడు కులభూషణ్.
    అప్పటికి కొందరు వేదిక నెక్కి స్వామిని క్రిందికి దింపారు. మరి కొందరాయన చుట్టూ రక్షణ వలంగా ఏర్పడ్డారు.
    స్వామి బయటకు తరలించబడుతున్నాడు.
    "ఇందులో జలజ చేసినదేమీ లేదు. ఆమె లేకున్నా స్వామి తన నేరాలన్నీ ఒప్పుకునేవాడు .." అన్నాడు వేదాంతం.
    'అయితే జలజ నెందుకు రాప్పించావు ?"
    'ఆమెతోనే స్వామి బండారం బైట పడింది! అంటే స్వామి బండారం బైట పెట్టడంలో నా పాత్ర ఉన్నదని నువ్వు, అమ్మ, ఉదయ నమ్మాలిగా...."
    వాళ్ళు ముగ్గురూ తెల్లబోయి చూస్తుండగా జలజ వచ్చి వారిని కలుసుకుంది.
    "జనంలో కలిసిపోయి ఎలాగో మిమ్మల్ని కలుసుకున్నాను" అందామె ఆయాసపడుతూ.
    'అంతా వచ్చేశారు. మన విస్సీ గాడు మాత్రం...." అంది సీతమ్మ కంగారుపడుతూ.   


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS