"ఏమంటావ్, శాంతమ్మా?"
తన్ను పరాయివాళ్ళ వద్ద, ఇరుకులో పెట్టి తిరగబడేటట్లు చేస్తూన్నట్లు తట్టింది శాంతకు. గుండెలు ఆగటం లేదు. నెమ్మదిగానే "అత్తయ్యా?" అంది.
తను అంతవరకూ దృష్టిలోలేని తనకు ఓ విలువ వచ్చింది కోడలు పిలుపులో. లేచి వెళ్ళి పొదివి పుచ్చుకున్నట్లే కూర్చుంది శాంత ప్రక్కగా.
అవధానులుకు గుండె గుబగుబలాడింది. ఇంత మౌనంలో వాళ్ళిద్దరూ ఉండడమే చితాగ్ని రేగినట్లయ్యింది. ఏమవుతుంది? జవాబు ఏం వస్తుంది?
రామశాస్త్రికి పరిస్థితి అవగాహన అయినా, లోతుపాతులు ఆమ దొరకలేదు. కాని చర్చించ బడి, ఇప్పుడు తీర్పుకు నించున్నది తన కొడుకు వెంకటశాస్త్రి భావి అనిమాత్రం రూఢి. దారి పొడుగునా తను ఏమవుతుంది అన్న బెంగటింపులో ఊగిపోయేడు. చూచాయగా భార్యతో అన్నాడు. కళ్ళమ్మట నీళ్ళు తిరుగుతుంటేనే 'శుభం! వెళ్ళిరండి' అంది. అంతకన్న ఏమీ అనలేదు. ఇప్పుడు ఇక్కడ ఆమాత్రం మాటకు వేచి ఉన్నట్లే తల వంచుకున్నాడు. తనేం మాట్లాడినా, తొందర కన్పడి పోతుందేమో అన్న పై కప్పు కప్పుకునే కూచున్నాడు.
"ఏదో నిక్కచ్చిగా చెప్పకపోతే ప్రయోజనం లేదమ్మా." చౌదరయ్యే.
పార్వతమ్మ కోడలు గవదల్ని చేతులతో పట్టుకునే సూటిగా ఓసారి కళ్ళల్లోకి చూచింది. అందులో, 'ఒప్పుకో' అన్న ఆదేశింపు లేదు. 'నీ అభిప్రాయం చెప్పెయ్యి' అన్న ప్రార్దనే చూచింది. ఇది ధైర్యం తెప్పించింది. క్షణికం కళ్ళు మగత పడి 'ఆఅమ్మే' తనకు ఏనుగంత ధైర్యం ఉగ్గు పాలతో పోసిందన్నట్లే, "చౌదరయ్యా!" అంది శాంతమ్మ.
అందరి కళ్ళూ మిలమిలలాడేయి. పిలుపులో శబ్దం గుండెల్ని కంచీ పుచ్చుకు తోలినట్లే ప్రతి ధ్వనించింది. రామశాస్త్రి మాత్రం తట్టుకో లేనట్లు కుంచించుకుని, బల్లమీద ముడుచుకున్నాడు.
"నువ్వు చెప్పింది సబబుగానే వుంది. పరిస్థితులను బట్టి, లోకం దృష్ట్యా అంతకంటే గత్యంతరం లేదు. అది నిజమున్నూ. శాస్త్ర సమ్మత మున్నూ. పైగా మావయ్యకు ఇష్టమున్నూకూడ అయివుంది."
రొట్టె విరిగి నేతిలో పడుతూంది అన్నట్లుగా చౌదరయ్య మీసంమీద చెయ్యిపోనిచ్చి, గర్వంగా అవధానివైపు ఓసారి, రామశాస్త్రి మీద ఇంకోసారి 'చూడు నా తడాఖా' అన్నట్లు దృష్టి పారేసేడు. చిరునవ్వూ నవ్వేడు. వెను వెనుక 'మా నాయనను మించిపోయే' అన్న గర్వం ఛాయలు.
"మా ఇలవేల్పు ఆ జగదంబ. ఆవిడ ఆశయం, ఆదేశింపు ఇదే అయితే అది జరుగుతుంది. అది తథ్యం కూడాను.
"ఒక్కటి. అటువంటి అమ్మ పాదపద్మాల పూజార్పణే, నాకు తిలకం అయ్యింది పునహ; పద్ధెనిమిది వత్సరాల వైధవ్య అనుభవం తర్వాత. మావయ్య గాఢంగా నమ్మి, ఆ ప్రసాదం నాకు స్వహస్తాలతోనే నుదుటని పెట్టేడు. అది మానవత్వంలో ఆశీర్వచనం కాదు. అతీతశక్తి ఆ అంబ కటాక్షం. ప్రేమ. అది నా ఆత్మకి సుమంగళీత్వం. భౌతికం మమతలో, నా తృప్తి కోసం మళ్ళీ అది పెట్టుకుంటున్నా......" ఆగింది. పార్వతమ్మకు గుండెలు తరుక్కుపోయేయి. అవధానికి దారీ, తెన్నూ కన్పడలేదు.
ఈ అవధానిలో శాస్త్ర విరుద్ధ చైతన్యం ఇంత ఉందా అన్న ఆశ్చర్యంలో కళ్ళు తేలవేసేడు చౌదరయ్య. మ్రింగలేని తెమడ.
"ఇప్పుడు ఇక దానికి విలువలేదు. అందువల్ల ప్రయోజనమున్నూ లేదు. తాత్కాలిక మమత అయ్యింది. అందువల్ల వుంచుకుని వుండడంలో ఔచిత్యం లేదు. కనుక....." చీరకొంగుతో తుడిచి వేసుకుంది. గాజులున్నూ తీసేసింది. పువ్వులు విరిసికొట్టింది.
"ఆ!" అన్నారు సంయుక్తంగా చౌదరి, శాస్త్రిన్నీ.
పార్వతమ్మ అగ్నిలోనే మండిపోయింది. 'ఇదీ మీ పురుష సంప్రదాయం' అన్నట్లే ఉరిమి నట్లు కళ్ళు.
అవధానికి కళ్ళు చెమర్చి చూపు అనలేదు. ఈ లోకంలో లేనట్లే.
"ఇక మిగిలింది నేను. ఈ ఇంటి కోడలుగా. విధవలా. ఇప్పుడు లోకం మెచ్చవచ్చు. మీ ప్రతిష్ఠకు భంగం వాటిల్లదు. పేరుకు మలినం పుయ్యబడదు.
"మావయ్య ఈ తాత్కాలిక వ్యామోహానికి క్షమిస్తాడనే అనుకుంటాను. అత్తయ్యా, నువ్వేనా చెప్పు."
ఇక కొలిమిలో తీసి ఎర్రగా వాతలు పెట్టవలసిన అవసరం లేదు అన్నట్లు గాలి, గదుల్లో మరిగింది.
"మీ నిర్ణీత అభిప్రాయం, దత్తతే చేసుకో మంటే, అది, మావయ్యా, ఈ కట్టెకు చెయ్యి. అదెప్పుడూ వసంతం నోచుకోలేదు. నోచుకున్నా మిధ్య అయ్యింది అది. అందువల్ల అది తిరగ బడదు.
"కాని ఒక్కటి గుర్తుంచుకొ. ఈ కట్టుకు మాతృత్వం అన్న భ్రమలో ఆశలు రేగించాలని, దాన్ని వంశంకోసం అన్న పరదాలో పెట్టడం, నేను దిగమ్రింగుకుని, మళ్ళీ శాంతలామాత్రం తిరగలేను.
"అది జరిగితే... నా తదనంతరం మీరు పీటల మీద కూర్చుంటారు. కాని ఈ దగ్ధ, క్షుభిత, పిశాచిమాత్రం కూర్చోలేదు............" లోపలికి వెళ్ళిపోయింది. వెళ్ళుతూనే "ఎందుకో కావాలంటే, నాకు తెలుసు-ఈ కట్టె దహన కాలం చాలా దగ్గరలో ఉందని" అనేసింది.
విపరీతమైన భయం ఆవురించింది. ఎవరి గుండెలు వాళ్ళ దగ్గర లేవు. కవాచీబల్ల చీమలూ, జెర్రులూ అయినట్లే అయ్యింది. హృదయం ఆవేదనలో పిడచకట్టింది. అవధాని లేచి, ఒక్క అంగలోనే పార్వతమ్మ వద్దకు వచ్చి, చతికిల పడ్డాడు.
మిగతా వాళ్ళు ద్రష్టలే అయ్యేరు. దానితో బొమ్మలూ అయ్యేరు.
వేడిగా, రెండు కన్నీటి బొట్లు తిరిగి, కలుపు కుని నాసికాక్షోణాల ప్రక్కనుంచి, పార్వతమ్మ పాదాలమీదనే పడ్డాయి; ప్రణామం అన్నట్లు.
వెనువెనుక రామశాస్త్రి గుండెల్లో "తద్వి జ్ఞానార్ధం స గురు మేవాభిగచ్చే త్పమీత్పాణిః శ్రోత్రీయం బ్రహ్మనిష్ఠమ్" అన్న చరణం ఋంజ వాయిద్యమే అయ్యింది.
కాలువనుండి నీళ్ళు తెచ్చిన వెంకటశాస్త్రి సావిట్లోకి వచ్చేసరికి, ఆగమ్యగోచరం అయి పోయేడు. ఏమిటో అర్ధం కానట్లే అయి శూన్యంలోకి వెళ్ళినట్లే, తలుపుకు చేర్లాబడి, మడినీళ్ళు ఎక్కడ పెట్టాలా అన్న సంకులంలో పడి, బిత్తర బిత్తర చూపులతో, కొలువు కూటంలో కోమటి బొమ్మే అయ్యేడు.
ఆరోజు ఆ ఇంట్లో ఏకాదశే అయ్యింది,
తలతీసి ఎక్కడ పెట్టుకోవాలి అన్నట్లు చౌదరయ్య జారేడు. వెనకాల లక్ష్మయ్య కిర్రు చెప్పులు.
అంత పెద్ద కవాచీకి రామశాస్త్రి మాత్రం మిగిలేడు.
* * *
18

ఆకాశం అంతా మబ్బు లావరించడం, తెరపినీయ్యడం తథ్యం అనే అనుకున్నా, ముసురు పడుతుందేమో అని, లేక గాలివాన సూచనేమో అని అనుకోవడం సహజం. ఇది లోక సహజమే. అల్లాగే అగ్నిపర్వతమున్నూ. సముద్రపు పౌర్ణమి పొంగున్నూ. ఇవి కొంత సహజ, అసహజాలతో ఉన్నా, దాగి ఉన్న ఓ నిర్ణీతమైన నమ్మకం.
ఇది గుర్తించింది రుక్మిణి. రాజు తిరిగి ఇంటికి రావడంలో సహజత్వం గుర్తుకు రావటం లేదు. ఎంతగా ఇది పుట్టి, పెరిగి, స్వంతం అనుకునేది అయినా, తను ఎవరో పరాయి వాడైనట్లు, తన ఉనికి తాత్కాలికం అనుకునే భావన ప్రతి విషయంలోనూ కన్పడింది. కొంత బరువు - ఈ వయస్సులో - వ్యవహార పరిష్కారాలకు రాజామీద పెట్టాలని ఆయన ఆయత్తపడడం, అవన్నీ విని, ఉట్టినే కూర్చో వడం అన్నది అర్ధం కాలేదు.
కొంతవరకూ తను క్రొత్త చిన్న భార్య అయి, ఇంటిపెత్తనం సర్వస్వం వహించడం, ఆఖరుకు ఆయన గదిలో ఉన్న వ్యవహార కాగితాల బీరువాలు, ప్రక్క ఉన్న నగల ఇనప్పెట్టి తాళాలు తన చేతుల్లో పెట్టుకోవడం అన్న దానికి బాధ పడుతున్నాడేమో అనుకుంది. అది మనస్సులో పెట్టుకుని, వ్యక్తీకరించలేని కుమిలింపులో ఉన్నాడా? అన్నది నిరుకుచేసుకోలేక పోయింది.
ఏ కోశంలోనైనా తన తండ్రి ఇంతగా ద్రోహం చేసేడన్న ద్వేషం, పగ లోలోపల పని చేస్తూన్నాయని క్షణికం ఊగినా, అది చాలా ఓటి పునాదులతో ఉన్న స్వకల్పితంలా ఉండేది. తను ఆ మర్నాడు చూచింది.
"పిన్నీ, నాన్నారు ఇదెప్పటినుండి ప్రారంభించేరు" అని బాధతో తన్ను అడిగేడు.
"పెండ్లయిన దగ్గరినుండి" అంది తల వంచుకుంటూ.
"మన ఇంటా వంటా లేదు. ఎల్లాగైనా మాన్పించాలి."
సమాధానం చెప్పలేక పోయింది. దాని వెనుక తను ఒక్కతే కాదు ఏ స్త్రీకూడా, చెప్పని రహస్యం దాగి ఉంది. ఆ మత్తు కైపులో ఉద్రిక్తత చెంది, తన్ను భార్యగా కాల్చుకు తినడం, వెర్రితలలు వెయ్యడం ఇవన్నీ తెర మరుగు.
"నా గీత, రాజా" అంది దుఃఖం వస్తూంటే.
"ఎందుకు దుఃఖిస్తావ్" నేను మాని పిస్తాను" అనే ఆ తర్వాత రోజుల్లో ఆయనకు కంచుగోడ అయ్యేడు. ఆ మందులు అన్నీ దాచి పారేసేడు. ఉరిమి, వెర్రెత్తినట్లు ఉంటే, తను వాళ్ళమ్మ ప్రస్తావన తెచ్చేవాడు. రెండు మూడుసార్లు బుడి బుడి ఏడ్పులు కూడా సాగించేడు.
ఆవిడ తలంపు నిషా చేసేవాడు. నరనరాల్లోనూ పట్టిన భయం ఆవిడంటే. అదెల్లా తెలుసుకున్నాడా అన్నదే తనకు ఆశ్చర్యం కలిగించింది.
వారం తిరిగేసరికి పాలల్లో కుంకుమపువ్వు వేసుకుని త్రాగడంతో తృప్తిచెందడంతో తను చాటుగా నమస్కరించుకుంది. ఆ పని నిర్వహణలో మాత్రం అంతర్గతంగా ఓ తొందర కన్పించింది రాజులో. తనేదో ఓ నిర్ణీత కర్తవ్య నిర్వహణకే వచ్చేను, అది ఎంత త్వరలో పూర్తి చేసుకుంటే అంత మేలు, స్వేచ్చ వస్తుందన్నదే ప్రతిబింబించింది.
అదే మథు, రావు రాకలో గడిపిన ఇరవై నాలుగు ఘంటలూ నిండుకున్నది. వాళ్ళు ఎన్నో అడిగేరు. అన్నిటికీ నవ్వి ఊరుకునేవాడు. వాళ్ళు విసివి వేసారి 'కరక్కాయ' అనుకున్నంత వరకూ పొడిగించేడు.
ఆఖరుకు రావు ఉండబట్టలేక కోపంలోనే "ఓరే, ప్రతి ప్రశ్నకీ మూగ ముత్తయిదువు అవుతున్నావు. అదేదో గొప్ప అనుకుంటున్నా వేమో!" అన్నాడు.
"లోకం నేర్పిందిరా."
"అయితే అదే లోకం, పుస్తకాల చాటున పెట్టుకున్న డైరీలో, రావినూతలపాడుకు, నీకు సంబంధం ఉందనీ. శాంత ఆ జన్మలో నీ భార్య అనీ చెప్పమందా?"
రువ్వున తగిలింది. అది తనకు కాదు; తనలో ఉన్న వ్యక్తికి. దినదినం, ఘడియ ఘడియలోనూ, వెన్నంటి ఊపిరి సల్పనియ్య కుండా, స్మరణచేసే ఓంకారానికి.
"లేదు" అన్నాడు చిన్నగా.
"అయితే ఆ వూళ్ళో ఒక్క రాత్రి ఉండి, నానారభసా చేసి, శాంతలో ఆశలు కల్పించి, పారిపోయి రమ్మందా?"
కిటికీల్లోంచి రాళ్ళు విసరబడుతున్నాయి. ఎక్కడుంది ఈ కిటికీ? ఉందన్నా ఎక్కడో అన్నదే.
"దానికి నేనెల్లా బాధ్యున్ని? అది ఆవిడ వ్యక్తిగత విషయం."
"అందుకేనా సత్యని, మాలని దగాచేసి రమ్మందా?"
"వాళ్ళు నా శరీరాన్ని, డబ్బుని కోరేరు."
"మరి శాంత ఆత్మని కోరిందా?"
జవాబు చెప్పలేదు. కళ్ళు మూసుకుని పరధ్యానంలో పడ్డాడు.
"అయితే శ్మశానంలో రామం సమాధి దగ్గర కొన్ని ఘంటలు గడిపిరావడంలో అర్ధం?" ఈసారి మధు అడిగేడు.
తన శరీరపు విలువల్లో, ఆత్మను కాలు స్తున్నారు వాళ్ళు ఉలకలేదు. లోపల డమరుకం మ్రోగుతూంది.
"ఒక్కటి-అతని మరణ తేదీ, నీ పుట్టిన తేదీ ఒక్కటే అని గుర్తించేవా?"
రుక్మిణి ఎగిరిపడింది. ఏమిటి వింటూంది? ఈ చరిత్ర తుదీ మొదలూ ఏమిటీ? ఆనాడు రాజు రహస్యంగా తన్ను కలుసుకున్నప్పుడే తనభార్యను చూసినట్లు చెప్పడం, ఆవిడ చాలా పెద్దావిడ అనడంలో అంతర్లీనమైన భావన ఏమిటి? వీళ్ళు ఇద్దరూ రాజును అడిగే ప్రశ్నల లోతు? వింటూంటే తనకే భయం వేసింది. లోపల్లోపల రాజు ప్రవృత్తి, ఆశయం ఏమిటి? ఈ ఎవరూ నమ్మలేని కట్టుకథతో జీవితం ఎల్లా మారుతుంది? ఏమైనాసరే, తను రాజును విడవకూడదు. ఎక్కడికీ వెళ్ళనివ్వకూడదు. ఇదే క్రమ్ముకుంది.
"అవును." రహస్యం అన్నట్లే.
"ఆ అపోహమీదనే ఈ నాటకం ఆడేవన్న మాట." రావు ఛర్రుమన్నాడు.
