కొంతసేపటికి - "మన విషయం తెలిసి నప్పుడైనా మీవాళ్ళు గురించి నీకేం జంకులేదా కృష్ణవేణి?" అన్నాడు.
"జంకుదేనికి? ఎవరిష్టం వాళ్ళది .... సరే గానీ నాకు టైమైపోతూంది. పోదాం." అన్నాను. క్రిందికొచ్చేసరికి ఇద్దరికీ వదిన కాఫీ టిఫిన్లు తెచ్చి ఇచ్చింది. అన్నయ్య పాప హాల్లో ఆడుకుంటూంటే మాధవ్ ఎత్తుకు ముద్దుపెట్టుకున్నాడు-"ఎవరే పాపా నిన్నెత్తుకున్నారు అంటే "మామ - మామ" అంటూ అల్లరి చేసింది పాప. అన్నయ్య ఫ్రెండ్స్ నందర్నీ పాప అలానే పిలవటం అలవాటు. పాప అలా అనటంతోనే మాధవ్ మొహంలో అంతులేని సంతోషం వెల్లివిరిసింది. నా కేసి ఓరగా చూస్తూ -"అత్తా కోడళ్ళకన్నా మామ కోడళ్ళకే పొత్తు లెక్కువట కదూ?" అన్నాడు.
"అది అందర్నీ అలానే అంటుంది" అన్నాను నవ్వి.
"బాలవాక్కు బ్రహ్మవాక్కేట కదూ?" "నయమే. అలా అయితే దానికి మామయ్యలు చాలా మంది వుండాలి. ఇంతకీ కోడలితో కబుర్లాడుతూ కూర్చుంటారా?' వెళ్తాను."అయ్యో! శ్రీమతిని విడిచా?" అంటూ లేచాడు.
క్లాస్ లో మాధవ్ రాకగురించి రేణుకి చెప్తే విస్తుబోయింది. "నిన్న దాచుకున్నావ్. ఇవ్వాళ మాత్రం దేనికీ చెప్పటం?" అంది. "దాచుకున్న దేమీ లేదు. నిన్నివాళే తీసికెళ్దామనుకున్నాను."
"నీ అనుకోటాలకేంగానీ నేను రాను. నాకా మాధవ్ ని చూడాల్సిన అవసరాలేమీ లేవు."
"నీకు చూడాల్సిన అవసరం లేకపోయినా నాకు చూపించాల్సిన అవసరం వుంది..... నీ పెళ్ళికి నేను వచ్చి చూడొద్దేమిటే మరి మీ "ఆయన్ని?" రేణుక్షణం ఆగి-"ఊఁ చాలా వరకూ వచ్చిందన్నమాట." అని వూరుకుంది.
ఆ సాయంత్రం ఇద్దరం కలిసి పార్క్ కెళ్ళాం. రేణుని మాధవ్ కీ, మాధవ్ ని రేణుకీ పరిచయం చేశాను.
"మిమ్మల్ని లాంఛనం కోసమే పరిచయం చెయ్యటం గానీ, మీరిద్దరూ పరోక్షంగా పరిచితులే కదా?" అన్నాను నవ్వుతూ.
"మీరు ఫోటోలు చాల చక్కగా తీస్తారు. ఆ ఆర్ట్ ని ఇంప్రూవ్ చేసుకుంటున్నారా? అశ్రద్దగా వదిలేశారా?" అంటూ సంభాషణకుపక్రమించాడు మాధవ్,
"ఏదో ఆ టైం అలా కుదిరింది. నానేర్పేమీ లేదండీ." అంది రేణు - రేణు ఏదో మాట్లాడుతూనే వుందిగానీ ముభావగానే వున్నట్టు నాకు తోచింది. గుంభనంగా మాధవ్ ని స్టడీ చేస్తోంది కాబోలు.
"కృష్ణవేణి ఫ్రెండ్స్ లో మిమ్మల్ని చూశాను. శాంతాదేవిని కూడా చూడగలిగితే బావుండేది" అన్నాడు మాధవ్. రేణు ఏదో అనబోతూ వుండగానే - "కాని నేనంటే మీకు సదభిప్రాయం లేదనుకుంటాను." అన్నాడు నవ్వుతూ.
"ఎందుకలా అనుకుంటున్నారు?"
"మాస్నేహం మీకిష్టం లేదు కదా?"
"అవును. నేనేగాదు. మీఇద్దరి స్నేహాన్నీ ఎవ్వరూ ఇష్టపడరు." మాధవ్ నవ్వాడు - "మీరే మా స్థితిలో వుంటే ఎవరి ఇష్టాల కోసమో పాకులాడరు రేణుకా దేవీ!"
"నేను ఎన్నడూ మీవంటి పరిస్థితులు కలిగించుకోనండీ". "పోనివ్వండి రేణుకాదేవీ! నాకూ, కృష్ణవేణికీ అభ్యంతరం లేనివాడు ఏదీ మా స్నేహానికి అడ్డురాదు-పరిస్థితులనే వాటిని మనమే కల్పించుకుంటామని మీరనుకోవటం మాత్రం నాకు కొంత ఆశ్చర్యంగానే వుంది"
"మనం కల్పించుకున్నా-కాకపోయినా ఎటువంటి పరిస్థితులలోనైనా కొన్ని నియమాలు పాటించాలనే అంటాను రావు గారూ! అంతేగాని వ్యక్తిగతంగా మీపట్ల నేనెన్నడూ దురభిప్రాయపడలేదు". వాళ్ళిద్దరి సంభాషణ వింటూ కూర్చున్నానుగాని నేనేం కలగజేసుకోలేదు. రేణు అభిప్రాయాలు నాకీనాడు కొత్తకాదు.
కొంతసేపు కూర్చుని రేణు వెళ్తానని లేచింది. రేణుని కొంతదూరం సాగనంపి వచ్చి మాధవ్ పక్కన కూర్చున్నాను.
"ఇంకా ఏమైనా అందా?" అన్నాడు మాధవ్. "అదేం స్నేహితుడమ్మా! నల్లగా మసిబొగ్గులా వున్నాడు అంది" అన్నాను నవ్వి.
"అలా అందా? పోనీలే. నావేణు కళ్ళకి మాణిక్యంలా కనిపిస్తున్నప్పుడు ఇక ఎవరికెలా కన్పించినా ...." అంటూ దగ్గిరకి లాక్కుని నుదురు ముద్దుపెట్టుకున్నాడు.
"ఇదే ఒద్దంటాను." అంటూ చెదిరిన కుంకుమ సరిజేసుకోబోయాను-" నువ్వు ఒద్దన్నదేదైనా సరే కావాలనే అర్ధం." అంటూ తానే గడ్డం పట్టుకు కుంకుమ దిద్దాడు.
ఫౌంటెన్ కటువైపుగా చేతులు కలుపుకు నవ్వుకుంటూ వెళ్ళిపోతూన్న సిక్కు జంట ని మాధవ్ కి చూపించి నవ్వాను గుంభనంగా. "ఎందుకలా నవ్వుతావ్? నీకు తెలీదూ? మగువలు మీసం చూసి ముద్దిస్తారటా!" అన్నాడు.
"అలాగా? ఎవరన్నారటా?"
"నువ్వే కలలల్లో చాలాసార్లు. చెపుదూ".
"కాదులే. భయపడతారటా. నీవన్నీ దొంగ కలలు."
"మరి ఆసిక్కుఅమ్మాయి?" "ఏం చేస్తుంది? అలానే భయపడుతుంది. "ఫక్కుమని నవ్వాను.
"కాని మాధవ్! చిన్ని సందేహం. ముద్దు ఎందుకు పెట్టుకుంటారు?" అమాయకత అభినయించాను.
"ముద్దువస్తే పెట్టుకుంటారు."
"ఎందుకు వస్తుంది?" "బావుంది. ది నాకేం తెలుస్తుంది? ముద్దు వచ్చేదానివీ-ఇచ్చే దానివీ నీకు తెలియాలి-చెప్పు మరి." నేను నవ్వి వూరుకున్నాను.
చీకటి మసకమసకగా పరుచుకుంటోంది. పూలవాసనలు నలుమూలలా అలుముకుంటున్నాయి. పౌంటెన్ లోని నీటిధారలు పూసల తోరణాల్లా మారిపోయాయి.
"మసక చీకటిలో
మల్లె పందిటిలో
ప్రియుని సందిటిలో" అంటూ దూరం నుంచి ప్రశాంతంగా వినవస్తున్నది మధురమైన రాగం. నా మనసు మత్తెక్కింది. మాధవ్ గుండెల్లో మొహం దాచుకున్నాను. "ఆమాటలె ఇక్కడ రూపు దాల్చాయి సుమా!. ఎవరో మనని దీవిస్తున్నారు కదూ?"
అవును కాబోలు అనుకున్నాను నేను కూడా అనురాగమయి అనార్కలి తనవేదన వెళ్ళబోసుకొంటూంది.
మనసు నిలువనీదు-రా!
మమత మాసిపోదు-రా!
మధురమైన బాధ-రా!
మరపు-రాదు -రా!
రాజశేఖరా-నీపై మోజుతీరలేదురా!
కానిదానకాసురా! కనులవైన గానరా
పాటవింటూన్న మాధవ్ మరీ దగ్గిర చేర్చుకున్నాడు. "మనసులు కలుపుకుని తనువులు దూరం చేసుకోవటం పాపం కృష్ణవేణీ!" కళ్ళలో ఏదో వెతుక్కోబోయాడు.
నా ఒళ్ళు జల్లుమంది. హృదయం ఏదో భయంతో దడదడలాడింది. ఒక్కసారి మాధవ్ కళ్ళలోకి అయోమయంగా చూసి తలదించుకున్నాను మాధవ్ వెనక్కి వాలి నక్షత్రాలు చూస్తూన్నట్టు కూర్చున్నాడు-అనార్కలీ అంటే నాకు సానుభూతి వుంది. ప్రేమ వుంది. అటువంటి ఆవేదనే మాధవ్ దీనూ. అంత మాత్రానికే నేను పొరపడటం ...... సంమజసమా?
"మాధవ్!" మాధవ్ కళ్ళుదించేసరికి నీళ్ళు జారిపడ్డాయి. "ఛ! ఏమిటిది? తప్పుకదూ? ఇప్పుడు నేనేమన్నాననీ?" మాధవ్ చెంపలు నిమురుతూ బుజ్జగించాను.
"నన్ను క్షమించు కృష్ణా! ఆవేశపడ్డాను. నిన్ను బాధపెట్టాను. నన్ను ఏమీ అనుకోవుకదూ?"
"ఏమీ అనుకోను. ఇంకా నీకు దూరంగా వుండి పోతున్నందుకు నన్ను నేనే నిందించుకొంటున్నాను."
కొన్ని క్షణాలు మవునంలో గడిచిపోయాయి.
"వెళ్ళిపోదాం కృష్ణవేణీ!"
"అప్పుడేనా! మరికాస్సేపు ...."
"ఒద్దు వేణూ! ఈప్రదేశం నన్ను బాధిస్తోంది." ఇద్దరం మవునంగానే నడిచాము. మాధవ్ చేతిని ముద్దాడి సెలవు తీసుకున్నాను.
* * *

మూడవ సాయంత్రం మాధవ్ అనురాగంతో చేతులు చాచాడు ఆత్రంగా వెళ్ళి ఆ చేతుల్లో యిమిడిపోయాను. మాధవ్ గాఢంగా హృదయానికి హత్తుకున్నాడు.
"నీకోసం స్నేహ బాహువులు జాపుతున్నాను అందుకుంటావనే ఆశిస్తాను" ఏనాడో మాధవ్ అన్నమాటలు గుండెల్లో మెదిలాయి. "అవును మాధవ్! నీ చేతులు అందుకున్నాను. ఎప్పుడూ విడిచి పెట్టను." యీనాడు మరొకసారి నాలో నేనే అనుకున్నాను. మాధవ్ ఒడిలో తలవుంచుకు పడుకున్న ఆక్షణాల్లో నన్నేదో సంతృప్తి సంతోషం ఆవరించుకున్నాయి. మైమరచినట్టు కళ్ళు మూసుకున్నాను. గడచిన రెండు రోజుల్లో మాధవ్ చురుకుగా వున్నట్టు తోచలేదు. మవునంగా జుట్టు నిమురుతూ తదేకంగా మొహంలోకి చూస్తూ కూర్చున్నాడు.
కొన్ని క్షణాలు మవునంగానే గడిచాయి. 'కొద్ది సేపట్లో నిన్ను విడిచి వెళ్తానను కుంటే బాధగా వుంది కృష్ణవేణీ!" మాధవ్ ఉదాసీనతకి కారణం అదే అని అనిపించినప్పుడు మాత్రం నామనస్సు తేలికైంది. తేలికగా నవ్వాను- "మరి కొన్ని నెలలే కదా? తర్వాత ఎవర్నీ ఎవరూ విడిచి వుండాల్సిన అవసరం వుండదు."
"నాకా కొన్ని నెలలే కొన్ని యుగాలౌతాయి 'నువ్వు వస్తావు' అనే ధ్యాస ఒక్కటే ఎలాగో నన్ను నిలుపుతుంది."
"మళ్ళా నేను రావాల్సిందెప్పుడు?" అన్నాడు.
నేను చాలాసేపు మవునంగా వుండిపోయాను.
"పరీక్షలు కాగానే నీవుత్తరం చూసుకొని"
"ఎందుకో నాకు భయంగా వుంది మాధవ్! నాగొంతు ఒణికింది. హృదయం దడదడలాడింది. కళ్ళు చెమ్మగిల్లాయి.
మాధవ్ కళ్ళు తుడుస్తూ అన్నాడు-"ఎందుకో ఏమిటి? ఇంత సాహసం చేస్తున్నామనుకొంటే భయాలు కలగటం సహజమే. నిజానికి నువ్వీ విషయాన్నింత తేలికగా ఎలా భావిస్తున్నావా? అని నేను ఆశ్చర్యపోతూ వుంటాను. నీ వాళ్ళందర్నీ విడిచి నాతో రావాలంటే చాలా ధైర్యవంతురాలివై వుండాలి కానీ నామీద నీకు పరిపూర్ణమైన విశ్వాసం వున్ననాడు ...... నిజం చెప్పు కృష్ణవేణీ! నన్ను నువ్వు మనస్పూర్తిగా నమ్ముతున్నావా? నామీద నీకేమైనా అనుమానాలున్నాయా?
